Rating:             Avg Rating:       364 Ratings (Avg 2.96)

తాతా ధిత్తై తరిగిణతోం 27

తాతా ధిత్తై తరిగిణతోం 27

 

జీడిగుంట రామచంద్రమూర్తి

 

Get latest telugu famous comedy serials, telugu serial comics and latest jokes online

 

"త్వరగా భోజనం వడ్డింపుడు. ఇప్పటికే కాలాతీతమైనది." వంటింట్లో వున్న భార్యను ఆదేశిస్తున్నాడు.

పార్వతమ్మ వడ్డన పూర్తిచేసేసరికి వీరభద్రం. చిదంబరం బట్టలు మార్చుకుని డైనింగ్ టేబులు దగ్గర వచ్చారు.

"నాక్కూడా వడ్డించు!" అంటూనే, కంచం తెచ్చుకుని తండ్రికి ఎదురుగా కూర్చున్నాడు శ్రీరామ్.

పార్వతమ్మ తృటికాలం నివ్వెరపోయింది. అంతకుముందు ఇవాళ నాన్నగారితో కలిసి తింటాన్లే అని శ్రీరామ్ అన్నప్పుడు ఏదో యదాలాపంగా అని వుంటాడులే అనుకుంది కానీ ఇప్పుడు అన్నంతపని చేసేసరికి ఆవిడకు మతిపోయినంత పనైంది.

పిల్లలు తండ్రితో కలిసి భోజనం చేయటం ఆ ఇంట్లో విడ్డూరమే మరి.

అంతేకాదు

ఆ తండ్రికి 'ఎదురుగా' కూర్చోవటం అంటే 'పాతాళభైరవి'లో తోటరాముడు చేసినంత సాహసం కూడానూ.

అయితే వీరభద్రం అదేమీ అంతగా పట్టించుకున్నట్టు కనిపించలేదు.

మిత్రునితో ఏవో వ్యవహారాలూ మాట్లాడుతున్నాడు.

"ఏమోయ్ శ్రీరామ్! పరీక్షలు బాగా రాశావా?" భోంచేస్తూ అడిగాడు చిదంబరం.

"బాగానే రాశానంకుల్. క్లాసురావచ్చు." చెప్పాడు శ్రీరామ్.

"వెరీగుడ్ జవాబు చెప్పెలోగానే...వీరభద్రం కల్పించుకున్నాడు.

"ఏమున్నదీ? వచ్చే మాసమున మంచి ముహూర్తములుండును కదా!...వివాహము చేయ నిశ్చయించితిని."

కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చినట్టు తాను చెప్పదల్చుకున్న విషయాన్ని తన తండ్రే ప్రసావించటం వల్ల శ్రీరామ్ ఊపిరి పీల్చుకున్నాడు. కుడిచేతి దండకు కట్టుకున్న తాయేత్తును ఎవరూ చూడకుండా ఓసారి కళ్ళకు అద్దుకున్నాడు.

"అప్పుడే పెళ్ళేమిట్రా?...పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయించు." అంతలో చిదంబరం సలహా ఇచ్చాడు.

"ఏ వయసుకా ముచ్చట తీరవలెను గదా. మా సుపుత్రుడికి మేనరికము కూడా వున్నదాయే.

"అవుననుకో. కానీ మరీ ఇంత చిన్న వయసులో" అంటూ ఏదో చెప్పబోతున్న చిదంబరం మాటలకు మధ్యలోనే అడ్డం పడుతూ చెప్పాడు వీరభద్రం.

"నన్నడిగితే ఇదే సరైన వయసు. నా వివాహం ఏ వయసున జరిగెనో నీకు తెలియును కదా. అప్పుడు నాకు కేవలం ఇరువది రెండు సంవత్సరాలు. మరి వీనికి అప్పుడే ఇరువది రెండు దాటినది. అనారోగ్యము వల్ల ఒక సంవత్సరమూ, కాలేజీ నందు సీటు లభించక మరియొక సంవత్సరమూ వృధా అయినందువల్ల ఇంకానూ దిగ్రీయంటే ఉండిపోయాడు. లేకున్న నీవన్నట్టు ఇప్పటకీ పోస్టు గ్రాడ్యుయేషన్ సైతము పూర్తయి వుండేడిది. అయినా మనసున్నచో మార్గమదియే లభిస్తుందనీ మా 'కుంక'కి ఇంకా చదువుకోవాలయునన్న అభిలాషే వుంటే ఓపెన్ విశ్వ విద్యాలయములుండనే వున్నవి. ప్రయివేటుగా అఘోరించవచ్చు."

'కుంక' అఘోరింపు అనే పదాల్ని ప్రయోగించినందుకు తండ్రి వైపు గుర్రుగా చూశాడు శ్రీరామ్.

"అయితే త్వరలోనే మాకు పెళ్ళి భోజనాలున్నాయన్నమాట." చిదంబరం చిరునవ్వుతో అన్నాడు.

"ఆహా. నేను రేపే ఏలూరు వెళ్లి మా బావ గారితో ముచ్చటించి ముహూర్తం నిశ్చయించ దలిచాను.! చెప్పాడు వీరభద్రం.

"మీరు 'ఏలూరు' వెళ్ళక్కర్లేదు మావయ్య గారమ్మాయిని నేను చేసుకోవటం లేదు" మంచి నీళ్ళు తాగుతున్న శ్రీరామ్ మధ్యలోనే ఆపి చేతిలో వున్న గాజుగ్లాసుని బల్లమీద కొట్టి మరీ చెప్పాడు. ఆ గ్లాసు రెండు ముక్కలై అందులో వున్న నీళ్లన్నీ ఒలికిపోయాయి.

శ్రీరామ్ తండ్రిని అలా ఎదిరించి సమాధానం చెప్పేసరికి వడ్డన చేస్తున్న పార్వతమ్మ టర్కీలో వచ్చిన భూకంపం తమ ఇంట్లో కూడా సంభవించినట్టుగా హడలిపోయి చేతిలో వున్న పులుసు గరిటె చిదంబరం విస్తట్లో వదిలేసింది. ఆమెకు వెనుకగా గోడమీద పాకుతున్న బల్లీ ఆ పక్కనే గడియారంలో 'టిక్కు టిక్కు' మణి శబ్దం చేస్తూ తిరుగుతున్న సెకండ్లముల్లూ హఠాత్తుగా ఆగిపోయాయి.

వీరభద్రం చివ్వున తలెత్తి శ్రీరామ్ వైపు చూశాడు.

"ఏదీ? నీ హెడ్డు పైకెత్తి నాఫేసులోకి చూసి ఆ మాట మళ్ళీ చెప్పు" ఉగ్రనేత్రుడై అడిగాడు.

"నాకేమన్నాభయమా?...నీమొహంలోకి చూస్తూ  ఒకసారి కాదు...వందసార్లు చెప్పగలను. శ్రద్ధగావిను. నేను శ్యామసుందర్నీ చేసుకునేది 'లేదుగాకలేదు' మా క్లాస్ మేట్ అశ్వినిని నేను గాఢంగా ప్రేమించాను. పెళ్ళంటూ చేసుకుంటే ఆ పిల్లనే చేసుకుంటాను. కాదంటే ఏ హిమాలయాలకో పోయి తపస్సు చేసుకుంటాను." చిదంబరం కంచం పక్కనే వున్న మరో గాజుగ్లాసు తీసి బల్లమీద కొట్టబోయాడు శ్రీరామ్.

కానీ అతని ప్రయత్నాన్ని చిదంబరం వారించి,ఆ గ్లాసు లాగేసుకున్నాడు. "ఆమాట చెప్పటానికి బంగారంలాంటి గ్లాసులెందుకయ్యా పగలగొట్టడం?" అడిగాడు.

"మాఇంట్లో కుండలు లేవు కనుక."

"నోరుమూయుము. తన కుమార్తెను ఈ ఇంటి కోడలుగా చేసుకుందునని చనిపోయిన నా సోదరికి తన మరణశయ్యపై మాట నిచ్చితిని. మాట తప్పుట మన రావుబహుద్దర్ల వంశమున లేనేలేదు." తీవ్ర స్వరంతో చెప్పాడు వీరభద్రం.

"పెళ్లనేది నూరేళ్ళ పంట. పైగా నా జీవితానికి సంబంధించిన విషయం పెళ్లి చేసుకుంటానని అశ్వినికి నేను కూడా మాట ఇచ్చాను. ఇచ్చిన మాట తప్పటం మన వంశంలోనేలేదని ఇప్పుడు నువ్వే చెప్పావు. అయినా నువ్ అత్తయ్యకి 'చనిపోయేముందు' మాటిచ్చానంటున్నావ్. ఇప్పుడు ఆమాట తప్పితే ఆవిడగారు బతికొచ్చి నిన్ను నిలదియ్యదు.కానీ, నేను 'బ్రతికున్న' అశ్వినికి మాట ఇచ్చాను. అది నేను తప్పితే నా అశ్విని ఆత్మహత్య చేసుకుంటుంది. అప్పుడు ఆ పాపం నీడవుతుంది" కంచంలో ఇంకా అన్నం వుండగానే, అందులో చేయి కదిగేసుకుంటూ ఆవేశంగా అన్నాడు శ్రీరామ్.

వీరభద్రానికి నరనరాల్లోనూ రక్తానికి బదులు కోపమే ప్రవహిస్తోంది.