Oka Yuvakudu Love Parody

Oka Yuvakudu Love Parody

*****************

కలర్ పుల్ బట్టలు బట్టల్లో రైల్వే ప్లాట్ ఫారం బెంచీ మీద కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తూ వుంటాడు సిద్దార్థ. అలాసిద్దార్థని కొందరు కవులు, రచయితలు వారి వారి ధోరణిలో ఇలా అనుకుంటున్నారు.

 ***************************

శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్

రైల్వే ప్లాట్ ఫారం అంతా చేపల మార్కెట్లా వుంది. ఆ యువకున్ని చూస్తుంటే జాలేస్తుంది. భగ్న ప్రేమికుడేమో! అనిపించింది. దేవదాసునిచదివాను. చివరికి మరణించాడు. మధువు కోసం కాదు...మగువ కోసం! అలాగే లైలా మజ్ను, సలీం అనార్కలీ, రోమియో జూలియెట్!అందరిదీ ఒకే బండి. అందరిదీ ఒకే బాట! ఇతన్ని ఎందుకిలా చేశావని ఆ దేవుణ్ణి అడగను. ఒక చల్లని అమృతం కురిసే రాత్రి భరించలేని ఆవేదనతో గుండె పగిలి చచ్చిపోతాడేమో? అనిపించింది నాకు. చెమ్మగిలినా నా కళ్ళను ఎవరైనా చూస్తారేమోనని మౌనంగాశూన్యంలోకి చూశాను.

********************

శ్రీ యండమూరి వీరేంద్రనాధ్

ప్లాట్ ఫారం బెంచీ మీద కూర్చుని ఆ యువకుడు సుమారు గంట నుంచి అదే పనిగా ఆలోచిస్తున్నాడు. అతని కళ్ళలో దృఢ నిర్ణయం,కార్యదీక్ష కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఆ నిర్ణయం తిన్నగా గుండె లోతుల్లోకి 90 డిగ్రీల కోణంలోకి వెళ్లి ఎడమ ప్రక్కకు మెలితిరిగి హృదయ కవాటాల్ని తెరచి వెచ్చటి ఎర్రని చిక్కని రక్తాన్ని, అల్లిబిల్లిగా ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయిన సిరలు, ధమనులు గుండా ప్రవహింపజేసి, తిరిగి తిన్నగా కేంద్రం వద్దకు చేర్చే శక్తిలా అనిపిస్తుంది.

************************

శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ

జనంతో రైల్వే ప్లాట్ ఫారం పెళ్లివారిల్లులా కళకళలాడుతుంది. హడావిడిగా రిలీజ్ చేసిన తెలుగు సినిమాలా రైలు దూసుకువచ్చి ఆగింది.కట్నం పూర్తిగా ఇవ్వని కారణంగా పెళ్లి ఆగిపోయిన అమ్మాయి తండ్రిలా ఉన్నాడతను. చేసిన చేబదుళ్ళలా చిందరవందరగా వున్నాయి అతని ఆలోచనలు. కళ్ళు విచ్చురూపాయల్లా వున్నాయి. సమస్యలతో సతమతమవుతూ, మాసిపోయిన రూపాయి కాగితంలా వున్నాడతను! పరిస్థితులు అనుకూలిస్తే, కొత్త డాలరు నోటులా ఫెల ఫెల లాడుతూ వుంటాడనడంలో సందేహం లేదు.