మొద్దు మోహన్

వీక్ పీడియా

మొద్దు మోహన్

వి. నాగరత్న

పెళ్ళాం తెచ్చే కట్నంతో జీవితాన్ని చాలించేద్దాం అనుకునే సగటు మొగుళ్ళకి ప్రతినిధి మొద్దు మోహన్. అవసరమైనచోట తెలివి లేకుండా, అక్కర్లేనిచోట అతి తెలివి ప్రదర్శించడంతో అతనికా పేరు స్థిరపడింది..

ప్రొఫెషనల్ లైఫ్ లో పనికిమాలిన మొద్దుమొహం అనిపించుకునే మోహన్ పర్సనల్ లైఫ్ లో యమా ఘటికుడుగా, యమ కింకరుడుగా పేరు తెచ్చుకుంటున్నాడు. మొద్దు మోహన్ ఉండే ఇల్లు అత్తగారిచ్చింది. అతను నడుపుతున్న కిరాణా కొట్టుకు పెట్టుబడి పెట్టిందీ వాళ్ళే. అతని ద్విచక్ర వాహనమూ అత్తమామల చలవే. ఏడాదికి రెండుసార్లు పంట రూపంలో ధాన్య రాసులు వచ్చిపడుతున్నాయంటే వాళ్ళ దయా దాక్షిణ్యమే, కరుణా కటాక్షమే. పండగలకీ, పబ్బాలకీ అదనపు లాంఛనాలు వుండనే వుంటాయి. అంతెందుకు, మోహన్ తుడుచుకునే టవలు, వేసుకునే షర్టు, జేబులో పెన్ను, చేతికున్న వాచీ.. ఆఖరికి వేసుకున్న చెప్పులు కూడా భార్య పుట్టింటివాళ్ళు కొనిచ్చినవే. గుర్రంమీద స్వారీ చేస్తూ, దాన్నే అదిలించినట్లు, పెళ్ళాం దయాదాక్షిణ్యాల మీద బతుకుతూ, ఆమెని చీపురుపుల్ల, చింతకాయ తొక్కు, కొబ్బరి పీచు, నీళ్ళల్లో నాచు కంటే హీనంగా తీసిపారేస్తాడు.

బయట ఊడిగమూ, ఇంట్లో చాకిరీ చేసే భార్యను ఇచ్చింది చాలక, వాచీ దగ్గర్నుంచి గోచీ వరకూ అందిస్తున్న అత్తమామల పట్ల కృతజ్ఞత, అంతకు మించిన ఆరాధనా భావం ఉండాలా వద్దా మీరే చెప్పండి?!. అబ్బే, అలా అయితే అతను మొగుడెలా అవుతాడు? ప్రతిదీ వాళ్ళ దగ్గర దానం పుచ్చుకుంటూనే, ఇవ్వక చస్తారా అన్నట్లు హుకుం చేస్తాడు. అధికారం చలాయిస్తూ, బందిపోటులా కనిపిస్తాడు. కూతురిమీద ప్రేమతో కాదనకుండా తన మొహాన పడేస్తున్నారని చస్తే అనుకోడు, వాళ్ళేదో వెయ్యిన్నొక్క విధాలుగా బాకీ పడ్డట్టు, మార్వాడీలా ముక్కు పిండి వసూలు చేస్తుంటాడు.

మోహన్ గొంతెమ్మ కోరికలకు కామాలే తప్ప ఫుల్ స్టాప్ లేదంటే నమ్మండి. తమ దగ్గర అల్లా ఉద్దీన్ అద్భుత దీపం లాంటిది లేకున్నా, తాతల ఆస్తులు, లంకెబిందెల్లాంటివి లేకున్న తల తాకట్టు పెట్టి అయినా దశమగ్రహం లేదా దుష్టగ్రహం లాంటి మోహన్ విపరీత కోరికలు తీరుస్తూనే ఉంటారు అత్తమామలు. అతన్ని ఎత్తికెళ్లి అరేబియా సముద్రంలోకి గిరాటు కొట్టాలన్న కోరికను బలవంతాన గుండె గదిలో వేసి గొళ్లెమెట్టి, పిచ్చి నవ్వులు నవ్వుతుంటారు.. లేకుంటే కూతురి కళ్ళల్లో కృష్ణా, కావేరీ నదులెక్కడ కాలవ కడతాయోనని వాళ్ళ భయం.

మోహన్, డిగ్రీ డిస్ కంటిన్యూ అని చెప్పుకుంటాడు. నిజానికి పదయినా పాసయ్యాడా అనేది చాలామంది డౌటు. అన్నిటిలో వీకు, వేస్టూ అయితేనేం, భార్య, ఆమె పుట్టింటివాళ్ళ మీద దర్జా, దర్పం వెలగబెడ్తూ, అధికారం చెలాయిస్తూ సగటు మొగుడిగా సక్సెస్ సాధిస్తూ స్టేట్ ఫస్ట్ లెవెల్లో ఉన్నాడు. అన్నిటిలో జీరో అయినా, మొగుడి పాత్రలో మాత్రం హీరో. అతనికి ఫుల్ హాపీసే. వైఫ్ అండ్ పార్టీయే సో శాడ్..

అలివేలు చదువు, ఉద్యోగం, పనీపాట, వ్యవహార దక్షత – ఎనీ టైం, ఎనీ వేర్, మోహన్ని తలదన్నేలా ఉంటుంది. అవేమీ గుర్తించకపోగా, తనను పనిమినిషి కంటే హీనంగా చూస్తూ, దాస్యం చేయించుకునే అతనంటే ఆమెకు తగని ఒళ్ళుమంట. తానే కాకుండా, తన వాళ్ళు కూడా ఒంగొంగి సలాములు చేస్తూ, గులాముల్లా పడి ఉండమనే చెత్త మొగుణ్ణి, ఎవరెస్ట్ ఎక్కించి ఒక్క తోపు తోయాలనిపిస్తుంది.

మోహన్ చేసే నసని, పెట్టె హింసని ఎన్నోసార్లు భరించింది. ఎంతో సహించింది. అగ్ని పర్వతాలే బద్దలౌతాయి, అలాంటిది అతి సున్నితమైన ఆమె గుండె ఛిద్రమవదా? ఎందుకవదూ?! తూట్లు పడుతుంటుంది. చందమామ కధల్లో గనుక తప్పు చేసినవాడిని కోట గుమ్మానికి తల కిందులుగా వేళ్ళాడదీస్తారని రాసినట్లు మోహన్ని ఆ భంగిమలో ఊహించుకుంటుంది. అతనిచేత ఓ రోజంతా గోడకుర్చీ వేయించినట్లు, నీల్ డౌన్ చేయించినట్లు, అడ్డంగా చాకిరేవు పెట్టినట్లు - జరగడానికి వీల్లేని పగటి కలలేవో కంటుంది.

“మళ్ళీ జన్మలో మనిద్దరి పాత్రలూ తిరగబడాలి.. అప్పుడు చెప్తా నీ పని.. నీచాత పూటకి యాభై మందికి వంట చేయించి, ఆ అంట్లన్నీ తోమిస్తా.. డబ్బంతా తరిగిపోనీగాక, సంపదలన్నీ కరిగిపోనీగాక... నిన్ను టెన్షన్ పెట్టడం, తల తిరిగిపోయేలా చేయడమే నా ధ్యేయం. నీతో గొడ్డు చాకిరీ చేయిస్తా....” ఈ తరహాలో తిట్లూ, శాపనార్ధాలు పెట్టడం అలివేలుకి మామూలే. గుండె రగిలితే, మనసు తూట్లు పడితే అంతే మరి. హెల్ప్ లెస్ కనుక పైకి కిమ్మనదు కానీ, లోపల మాత్రం భీబత్సంగా తిట్టేసుకుంటుంది.

మోహన్ మరీ వికృత రూపం దాల్చకపోతే, పరిస్థితి అదుపు తప్పకపోతే, సమాధానాలూ చెప్తుంది, సెటైర్లూ వేస్తుంది.

ఆవేళ భోజనం వడ్డించగానే మోహన్ ఎప్పటిలాగే అదనపు కట్నం ఊసెత్తాడు.

అరికాలి మంట నెత్తికెక్కిన అలివేలు నెమ్మదిగానే అయినా బేఫికరుగా జవాబులు చెప్పింది. సీతారాముల కళ్యాణం చూతము రారండి టైపులో ఒకసారి ఆ సన్నివేశాన్ని తిలకిద్దాం రండి...

+++ +++ +++ +++ +++

“ఇదిగో, నీకిదే చెప్తున్నా, వెంటనే బయల్దేరు.. నీ బాబునడిగి డబ్బు పట్రా.. సాయింత్రం నేను ఇంటికొచ్చేసరికి పదివేలు రెడీగా ఉండాలి..” అంటూ హెచ్చరించాడు మోహన్. “పదివేలేం చాల్తుంది?” అంది అలివేలు.

“ఏంటీ?”

“కనీసం పాతికవేలు కావాలి”

ఎప్పుడూ ‘నేనెళ్ళను, డబ్బడగను’ అని మొరాయించే వైఫు ఇంత మంచిగా మారిందేమిటా అని ఆశ్చర్యంగా చూశాడు.

“వెరీ గుడ్, ఈమాత్రం కోపరేట్ చేస్తీ నిన్నెందుకు కొడతాను చెప్పు? అయితే పాతిక వేలు తెస్తున్నావన్నమాట..”

“తేవాలిగా మరి.. గంగులు పాతిక లేనిదే ఏ పనీ చేయడట..”

“ఏంటీ?”

“గంగులు తెలీదా, కిరాయి రౌడీ.. పక్కింటి సీతమ్మ పాతిక వేలిచ్చి మొగుణ్ణి చితక్కొట్టించిందట.. నాకు మాత్రం రేటు తగ్గిస్తాడా?!” అంది అలివేలు.

నోరు తెరవడం మోహన్ వంతయింది.