మై డియర్ రోమియో - 39

Listen Audio File :

Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

 

మై డియర్ రోమియో - 39

 

స్వప్న కంఠంనేని

 

"ఏమిటి ఇలా అయింది?'' అంటూ హనిత నిస్సహాయంగా మీనావేపు చూసింది.
"నాకిప్పుడర్థమైంది'' సమాధానంగా అంది మీనా.
అర్థమైంది కదా. సంతోషం ఇంక నోరు మూసుకో'' చిరాగ్గా అంది హనిత.
"సరే అయితే, ఇప్పుడే నేను వైభవ్ దగరకెళ్ళి వచ్చాను. కానీ నీకేమీ చెప్పను. నన్ను నోరు మూసుకోమన్నావుగా!''
"అయ్యో! సారీ.వైభవ్ కేలాఉందో చెప్పు ప్లీజ్''
"సరే. క్షమించేశాను వైభవ్ కిప్పుడు ఏం ఫర్వాలేదు. బాగానే ఉన్నాడు''
"నా గురించి అడిగాడా?'' దొంగ జూపు చూస్తూ అడిగింది హనిత.
మీనాకి హనితని ఎదిపించాలని అనిపించింది. "నీ గురించేమీ అడగలేదు. కానీ నాతోనే ఐ లవ్ యు మీనా అని చెప్పాడు''
సడన్ గా హనిత మొహాన్ని దిగులుగా పెట్టింది. "ఏమిటే మొహం అలా పెట్టావ్?'' గాభరాగా అడిగింది మీనా.
"నాకెందుకో భయంగా ఉందే!''
"భయమా, ఎందుకు?''
"వైభవ్ కు నిన్న తలకు తగిలిన దెబ్బకు మతిపోయిందేమోనే!''
"ఎందుకలా అంటున్నావ్?''
"లేకపోతే ఏమిటే! వైభవ్ నిన్ను ప్రేమిస్తున్నాననటం ఏమిటి? జోక్ ఆఫ్ ది ఇయర్ కాకపొతే ...'' అని గభాల్న నవ్వసాగింది హనిత.
ఆ మాటలకు బిక్క చచ్చిపోయింది మీనా.
రెండు రోజులు గడిచాయి.
వైభవ్ ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇంట్లో బోర్ కొడుతుండటంతో ఈవినింగ్ వాక్ కి బయలుదేరాడు వైభవ్.
పదినిముషాలు నడిచేసరికి అతనికి అలసటగా అనిపించింది. సన్నగా తలనొప్పి మొదలైంది. ఎక్కడైనా కాసేపు కూర్చోవాలనిపించింది.
కూర్చోవటానికి అనువైన స్థలం కోసం అటూ ఇటూ చూశాడు. మురిక్కావలవ ఉన్న బ్రిడ్జిలాంటి ఒక నిర్మాణం కనిపించింది. చేసేది లేక వెళ్ళి దాని మీద కూర్చున్నాడు.
"ఖర్మ నాలుగువందల ఏళ్ళ చరిత్ర ఉన్న నగరం. చార్ సౌ షహర్, పేరుకే గానీ కూర్చోవటానికి కూడా చెట్టు నీడన్నా లేదు'' గొణుక్కున్నాడు.
నడిచే ఓపిక లేక మురిక్కాలవలో నుంచి వస్తున్న దుర్గంధాన్నితిట్టుకుంటూ కొద్దిసేపు అక్కడే కూర్చున్నాడు.
తోచక అటూ ఇటూ దిక్కులు చూడసాగాడు. ఇంతలో ఇద్దరు టీనేజ్ అమ్మాయిలూ అటువైపు వెళ్తూ వైభవ్ ని చూశారు. సరిగ్గా అప్పుడే వైభవ్ కూడా వాళ్ళవైపు చూశాడు. గభాల్న వాళ్ళలో ఒకమ్మాయి రెండో అమ్మాయితో అంది,
"ఏయ్! వాడు చూడవే. ఆవైపు ఎలా చూస్తున్నాడో?''
తనని చూస్తున్నాడనుకుని మురుసుకుంటుండగా 'కాదు. నన్ను చూస్తున్నాడు' అని ఫ్రెండ్ డిక్లేర్ చేసేసరికి ఒళ్ళుమండిపోయింది.
 మొదటమ్మాయిని మింగేసేలా చూసింది.
"నిన్ను చూడటం కాదులే. వాడు రోజూ అంతే. నేనొచ్చే టైమ్ కి నా కోసం ఇక్కడ కాపు కాస్తుంటాడు.''
లీలగా ఈ మాటలు వినిపిస్తున్న వైభవ్ కి జుట్టు పీక్కోవాలనిపించింది. రాళ్ళు విసిరి ఆ అమ్మాయిలిద్దరినీ చంపేయాలనిపించింది. అయినా చేసేది లేక ఇంకా నీరసం తగ్గకపోవటంతో తల వంచేసుకుని అలాగే కూర్చుండిపోయాడు.
సరిగ్గా ఆ సమయాన వైభవ్ ముందు నుంచి వేగంగా వెళ్తున్న ఒక కారు అతనికి కాస్త దూరంలో సడెన్ గా ఆగింది.
గిర్రున శబ్దం చేస్తూ వెనక్కొచ్చి అతనిముందు ఆగిందా కారు. ఆ శబ్దానికి తలెత్తి చూశాడు వైభవ్. కార్లోంచి దిగుతున్న హనిత! లైట్ పింక్ కలర్ చుడీదార్ వేసుకుని ఉంది.
దుస్తుల రంగులో కలిసిపోయి ఆమె మొహం కూడా గులాబీ రంగులో మెరిసిపోతోంది. చేవులకున్న బ్లాక్ కలర్ స్టడ్స్ ఆమె ముఖానికి వింత శోభను చేకూరుస్తున్నాయి.
వైభవ్ కి ఆమెను చూస్తూ యుగాల తరబడీ అలా ఉండిపోవాలని అనిపించింది. కానీ బింకంగా తల పక్కకు తిప్పుకున్నాడు.
హనిత అతని ముందుకొచ్చి నిలబడింది. పలకరింపుగా సన్నగా హసించింది. తలను మరోవేపుకు తిప్పుకున్నాడు వైభవ్. మళ్ళీ అతని ముందుకెళ్ళి నిలబడింది హనిత. కోపంగా చూశాడు వైభవ్.
"హాయ్'' అంది హనిత.
వైభవ్ ఏం మాట్లాడలేదు, అతని పక్కనే కూర్చుందామె.దూరంగా జరిగాడు వైభవ్.
"నిన్నేమీ తాకనులే. సరిగ్గా కూర్చో'' రోషంగా అంది హనిత. వైభవ్ కి నవ్వొచ్చింది. "నువ్విక్కడికెందుకు చేరావు?'' పైకి చిరాకును కనబరుస్తూ అన్నాడు.
"నిన్ను కలుద్దామని ఎంత ప్రయత్నించినా కుదరలేదు. సడన్ గా ఇక్కడ దొరికావ్. అయినా ఇక నుంచి ఎక్కడ వైభవ్ ఉండునో అక్కడ హనిత ఉండును'' తమాషాగా నవ్వింది హనిత.
"కానీ హనిత ఉన్నచోట వైభవ్ పొరబాటున కూడా ఉండడు'' చివ్వున లేచి అన్నాడు వైభవ్.
బిక్కమొహం పెట్టి తను కూడా లేచి నిలబడింది హనిత. వైభవ్ చరచరా ముందుకు నడవసాగాడు. హనిత అతడ్ని వెంబడించింది.
"నా వెంటెందుకు పడ్డావ్? నాతో రాకు'' కసురుకున్నాడతను.
"నేను నీతోనో వస్తాను. నువ్వెక్కడికెళ్తే అక్కడికొస్తాను'' మొండిగా సమాధానం చెప్పింది హనిత.
జేబుల్లో చేతులు పెట్టుకుని మౌనంగా నడవసాగాడు వైభవ్. కాసేపయ్యాక హనిత మెల్లగా అంది వైభవ్ తో
"వైభవ్! ఇవాళ వెదర్ ఎంత బావుందో కదూ. గాలి ఎంత చల్లగా వీస్తోందో''
"నీకు గుడ్డితనం, చెవుడు రెండే ఉన్నాయనుకున్నాను. నీ స్కిన్ టిష్యూస్ కూడా పనిచేయటం లేదనమాట. లేకపోతే ఒక పక్కన చెమటలు పోసి చస్తుంటే గాలి చల్లగా వీస్తోందట చల్లగా'' విసుక్కుంటూ అన్నాడు వైభవ్.
హనిత చిన్నబుచ్చుకుంది.
"ఏదో పొయెటిక్ గా మాట్లాడదామని అలా అంటే ప్రతిదాన్నీ సీరియస్ గా తీసుకుంటాడెందుకో?'' అనుకుంది మనసులో.
"ఎందుకు నా వెంట పడతావ్? వెనక్కెళ్ళు. నీ కారుని దార్లోనే వదిలేశావ్. పోతుందేమో వెళ్ళి చూడు'' అన్నాడు వైభవ్.
"పొతే పోనీ''
"మీ కారే కదా. పొతే పోనీ అంటావేం?''
"మా డాడీదే కదా. నాది కాదుగా. ఇకనుంచీ నీకారే నా కార్. నీ బైకే నా బైక్. నువ్వేనేను''
"ఏం తల్లీ. మళ్ళీ కొత్త నాటకాలాడుతున్నావా?'' వింతగా చూస్తూ అన్నాడు వైభవ్.
సమాధానంగా ఒక చిలిపి నవ్వుని విసిరింది హనిత.
"ఏంటబ్బా! ఇవాళ ఎన్నన్నా పట్టించుకోవడం లేదేమిటి? కొంపదీసి గభాల్న నన్ను ఏ లారీ కిందకో తోసేయదు కదా'' భయంగా అనుకున్నాడు.
"నువ్వు సురేష్ వాళ్ళ పెళ్ళికి వెళ్తున్నావా వైభవ్?''
"ఆ! నువ్వు వెళ్ళకపోతే వెళ్తాను. నువ్వు వెళ్ళేటట్లయితే ముంచే చెప్పు. నేను రావటం మానేస్తాను''
"ఫో! నువ్వెప్పుడూ ఇంతే. చిన్నప్పట్నుంచీ ఇలాగే పుచ్చు జోకులే వేస్తావ్. ఇలా చెత్త జోకులేయటం నీ హాబీనా వైభవ్!'' కళ్ళు టపటపలాడిస్తూ అడిగింది హనిత.
"షట్ యువర్ మౌత్''' నిదానంగానే అయినా స్వరాన్ని కటువుగా ధ్వనించేట్లుగా అన్నాడు వైభవ్.
"ఓకే ... ఓకే ... నన్ను క్షమించు ...'' రెండు చెవులూ పట్టుకుని అంది హనిత.