మై డియర్ రోమియో - 38

Listen Audio File :

Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

 

మై డియర్ రోమియో - 38

 

స్వప్న కంఠంనేని

 

క్లాస్ రూమ్ లోకి అడుగు పెట్టగానే హనిత కళ్ళు వైభవ్ కోసం వెతికాయి. ఎక్కడా వైభవ్ కనిపించలేదు. వెళ్ళి మీనా పక్కన కూర్చుంటూ అడిగింది హనిత.
"వైభవ్ రాలేదా?''
"ఏమిటి రాగానే అతని గురించి అడుగుతున్నావ్?'' అంది మీనా.
"అదో పెద్ద కథలే కానీ పిచ్చి జోకులెయ్యకుండా అడిగిన దానికి సమాధానం చెప్పు'' విసుక్కుంది హనిత.
"నిన్న సురేష్ పార్టీ ఇచ్చాడు కదా. అప్పుడు బార్లో ఏదో గొడవ జరిగిందట. ఒకతను వైభవ్ తలమీద బీర్ బాటిల్ పగలగొట్టాడట. ఇప్పుడు వైభవ్ హాస్పిటల్ లో ఉన్నాడు'' చెప్పింది మీనా.
హనిత నివ్వెర బోయింది. "ఏ హాస్పిటల్?'' మీనాని కుదుపుతూ అడిగింది.
మీనా చెప్పింది. హనిత రివ్వున లేచి బయటికి పరిగెత్తింది. మీనా ఆశ్చర్యంగా చూడసాగింది.
హాస్పిటల్ ముందు ఆటో దిగింది హనిత.
హడావిడిగా మెట్లు ఎక్కుతుండగా డాక్టర్ రమ కన్పించింది. హనిత కళ్ళు ఒక్క క్షణంపాటు మెరిశాయి.
డాక్టర్ రమవాళ్ళు, హనిత వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్. అందంగా, అమాయకంగా, మూర్తీభవించిన మంచితనంలా ఉండే రమ అంటే హనితకెంతో అభిమానం.
"రమక్కా!'' ఆనందంగా అంది హనిత.
"హనీ! ఇక్కడున్నావేంటి?'' అడిగింది రమ."అక్కా! నాకో చిన్న హెల్ప్ చేయవూ. మా క్లాస్ మేట్ వైభవ్ అనీ హెడ్ ఇంజ్యూరీతో ఇదే హాస్పిటల్ లో జాయినయ్యాడు. వార్డ్ నెంబర్, అవన్నీ తెలీవు. కొంచెం కనుక్కొని చెబుతావా? ప్లీజ్'' అంది హనిత.
"సరే! నాతో రా. కనుక్కుందాం''
హనిత రమని అనుసరించింది. రెండు నిముషాల్లో వైభవ్ గురించి వివరాలు సేకరించింది. తర్వాత రమ హనితని వైభవ్ ఉన్న రూమ్ దగ్గరికి తీసుకెళ్ళింది. రూమ్ బయట సురేష్, వైభవ్ తల్లిదండ్రులూ, అన్నలూ ఉన్నారు.
"వైభవ్ కి ఎలా ఉంది సురేష్?'' అడిగింది హనిత. వైభవ్ అన్నలూ, తల్లిదండ్రులూ హనితని వింతగా చూశారు.
"ఎవరీమె?'' అడిగింది వైభవ్ తల్లి సుజాత.
"హనిత'' నిర్లిప్తంగా అన్నాడు సురేష్.
వెంటనే వైభవ్ తల్లి హనిత మీద విరుచుకుపడింది.
"ఏం తల్లీ! మళ్ళీ ఇక్కడికి కూడా తగలడ్డావ్. ఒక సారేమో మీ అన్నయ్యలతో కొట్టించావ్. నిన్న మరోసారి నీ మూలంగానే వాడికి దెబ్బలు తగిలాయ్. అసలు నువ్వు చిన్నప్పటినుంచీ ఇంతేలే. ముందుక్కడ్నుంచి వెళ్ళిపో. నిన్ను చూస్తే నాకు ఒళ్ళు మండిపోతోంది''
డాక్టర్ రమ ఈ తతంగాన్నంతా విచిత్రంగా చూడసాగింది. హనిత ఏదో అనబోయింది. కానీ సురేష్ ఆమెని వారించి బయటికి తీసుకెళ్ళాడు.
"హనితా! నిన్న నిన్ను పంపించేశాక వైభవ్ మా దగ్గరకు వస్తుంటే నిన్ను ఎత్తి విరిరేసినతను వెనుకనుంచి వైభవ్ తలమీద బీర్ బాటిల్ పెట్టి కొట్టాడు. ఇప్పుడు వైభవ్ కి ఫర్వాలేదు. బాగానే ఉన్నాడు. వాళ్ళ పేరెంట్స్ మాత్రం నిన్ను చూస్తేనే ఇరిటేట్ అయిపోతున్నారు. కాబట్టి నువ్వు ఇక్కడ్నుంచి వెళ్ళిపో'' చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు సురేష్.
హనిత రమని పట్టించుకోకుండా చరచరా మెట్టు దిగేసి హాస్పిటల్ నుంచి బయటి కొచ్చింది.
ఆటో కూడా ఎక్కాలనిపించాలేదామెకు. అలాగే నడుచుకుంటూ ఇంటికి చేరుకుంది. ఇంటికెళ్ళాక తన రూమ్ లోకెళ్ళి మంచం మీద వాలిపోయింది.
పుట్టి బుద్దెరిగాక ఏనాడూ హనిత కంట తడి పెట్టలేదు. అంత వైల్డ్ గా పెరిగిన హనితకి ఆ సమయాన చెప్పలేనంత ఏడుపొచ్చింది.
బోర్లా పడుకుని ఏడవకుండా ఉండడానికి తనని ఆను కంట్రోల్ చేసుకోసాగింది. ఉన్నట్లుండి ఆమెకో ఆలోచన తట్టింది.
"వైభవ్ నాకోసమే దెబ్బలు తిన్నాడుగా!'' అనుకుంది. ఆ ఆలోచన ఆమెకి ఎంతో సంతోషాన్ని కలిగించింది. అలా ఆలోచిస్తుండగానే ఆమె నిద్రలోకి జారుకుంది. సాయంత్రం ఐదవుతుండగా మీనా లేపుతుంటే మెలకువ వచ్చింది హనితకి.
"ఏంటలా కాలేజీ మధ్యలో వేల్లిపోయావ్?'' మీనా అడిగింది.
"వైభవ్ ని చూడటానికి''
"డూ యూ లవ్ హిమ్?''
"యస్! ఐ లవ్ హిమ్''హనిత దరయంగా చెప్పింది.
మీనా బ్లాంక్ ఫేస్ పెట్టింది. ఈలోగా హనిత తల్లి, అన్నలిద్దరూ రూమ్ లోకి దూసుకుంటూ వచ్చారు.
"ఇందాక రమక్క ఫోన్ చేసింది. అసలు నువ్వు హాస్పిటల్ కెందుకెళ్ళావ్?'' నిప్పులు కురుస్తున్న కళ్ళతో కోపంగా చూస్తూ అడిగింది తల్లి.
"వైభవ్ ని చూడ ...'' హనిత మాటలని సగంలోనే కట్ చేశాడు హేమంత్.
"ఏంటి వాడిని చూసేది. వాడెంత దగుల్బాజీ వెధవో మొన్న సినిమాహాల్లో తెలిసిందిగా. ఇంకా నీకు సిగ్గులేదా?''
"అన్నయ్యా! మీరు పొరబడుతున్నారు .వైభవ్ అలాంటి వాడు కాదు. నాకతను చిన్నప్పటినుంచీ తెలుసు. మీరతన్ని కొడుతున్నా అతను ఎదురు తిరగకుండా ఊరుకున్నాడంటే అది నాకోసమే. ఎస్. నా కోసమే. అతను నిన్న కూడా దెబ్బల్ని తిన్నాడు''
"చిన్నప్పటికీ, ఇప్పటికీ చాలా తేడా ఉంది. నువ్వా విషయం తెలుసుకుంటే మంచిది. లేకపోతే నిన్ను కాలేజీ మాన్పించి ఇంట్లో కూర్చోబెట్టాల్సి వస్తుంది జాగ్రత్త'' వార్నింగ్ ఇచ్చాడు హేమంత్.
"నీకు మాత్రం గాళ్ ఫ్రెండ్స్ లేరేమిటి?' 'పెద్దన్నన్నయితే తిడుతున్నావు'' రోషంగా అంది హనిత.
"నోరెత్తావంటే చంపేస్తాను. ఆడపిల్లవి. ఆడపిల్లలా ప్రవర్తించు. నువ్వు రాజాతో మాట్లాడితే ఏమైనా అన్నానా? అసలు ఆ వైభవ్ వాళ్ళ మూలంగానే కాదే మనం ఊరొదిలి వచ్చేశాము'' నెత్తి బాదుకుంటూ అంది తల్లి.
"దానికి మాటలతో చెప్తే లాభంలేదు. నిన్నూ ...'' చేయెత్తాడు సురేష్.
"నువ్వుండన్నయ్యా. నేను చెప్తాను ... చూడు హనీ ! ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇలాంటి విషయాల్ని మొదట్లోనే తుంచేయటం మంచిది. చెప్పేది అర్థం చేసుకో, లేకపోతే మాత్రం చాలా గొడవలయిపోతాయి'' హరీస్ ని వారించి హనితవేవేపు సీరియస్ గా చూస్తూ అన్నాడు హేమంత్.
తర్వాత హేమంత్ బయటికి నడిచాడు. హరీష్, గిరిజలు కూడా హేమంత్ తో పాటే బయటికి వెళ్ళిపోయారు.