మై డియర్ రోమియో - 35

Listen Audio File :

Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

 

మై డియర్ రోమియో - 35

 

స్వప్న కంఠంనేని

 

హనిత హిమాయత్ నగర్ లో ఉన్న ఆ బార్ కి వెళ్ళేసరికి టైం ఏడు ఏడుంపావయింది.
"ఈ పాటికి అందరూ వచ్చేసి ఉంటారు'' అనుకుంటూ బైక్ ని పార్కింగ్ ప్లేస్ లో ఆపి అద్దాల తలుపును తెరుచుకుని లోపలికి అడుగుపెట్టింది.
అక్కడ గచ్చు అద్దంలా తళతళా మెరిసిపోతోంది. బ్లూ కలర్ లైట్స్ వెలుగుతూ ఆరుతూ ఆ ప్రదేశమంతా మసక వెలుతురులో ఉంది. దాదాపు అక్కడున్న టేబుల్స్ అన్నీ జనాలతో నిండి వున్నాయి.
హనిత అక్కడికి రావటం వరకూ హుశారుగానే వచ్చింది గాని లోపలికి ప్రవేశించాక మాత్రం బెరుకు మొదలయింది.
"ఎందుకొచ్చాన్రా దేవుడా!'' అనుకుంది లోలోపల.
సురేష్ వాళ్ళెక్కడ కూర్చున్నారోనని టేబుల్స్ నీ పరికించి చూస్తూ ముందుకు నడిచింది. ఓ మూలనున్న పెద్ద టేబుల్ చుట్టూ కూర్చుని ఉన్నారు సురేష్ వాళ్ళు.
నిజానికామె ఆ టేబుల్ ని వైభవ్ మూలంగానే గుర్తు పట్టింది. అంతమందిలోనూ చుక్కల్లో చంద్రుడిలా మెరిసిపోతున్నాడతను. అంట చీకట్లోనూ తెల్లగా మిడిసిపడుతున్నాడు.
"ఇడ్లీ. అందుకే నిన్ను ఇడ్లీ అనేది. వీడేంట్రా బాబూ! ఇంత తెల్లగా ఉన్నాడు. అసలు మగపిల్లలు ఎక్కడైనా ఇంత తెలుపుంటారా. యాక్!'' తనలో తను మురిపెంగానో అసహ్యంగానో అనుకుంది.
సురేష్ వాళ్ళందరూ కూర్చున్న టేబుల్ దగ్గరికి నడిచిందామె. "హాయ్!''అంది మగగొంతుతో.
వాళ్ళంతా ఆశ్చర్యంగా చూడసాగారు. "ఎవరబ్బా ఇతను?'' ఒకరినొకరు ప్రశ్నార్థకంగా చూసుకున్నారు.
"మీకో చిన్న క్విజ్. నేనెవరో చెప్పుకోండి చూద్దాం''అంది హనిత స్టయిల్ గా.
"నువ్వేమన్నా జాన్ మేజర్ వా, బిల్ క్లింటన్ వా లేక అక్షయ్ కుమార్ వా? నువ్వెవరో మాకెట్లా తెలుస్తుంది?'' అన్నాడు వైభవ్ చిరాగ్గా.
"అందుకే నిన్ను ఇడ్లీ అనేది'' గభాల్న నోరుజారింది హనిత.
"హనితా!''  సంభ్రమంగా చూస్తూ అన్నాడు వైభవ్.
"ఎస్. హనితా ది గ్రేట్'' అంది హనిత కాలరెగరేస్తూ బడాయిగా గర్వంగా.
"ఈ వేషమేమిటి?''చెయిర్ ఆఫర్ చేస్తూ అన్నాడు సురేష్.
"హిహ్హిహ్హి! బావుందా? గాళ్స్ ఎవరన్నా వస్తే నేనూ మామూలుగానే డ్రెస్సయ్యేదాన్ని. కానీ మరీ నేనొక్కదాన్నయేసరికి ఎవరైనా చూస్తే బాగోదని ఇలా డ్రెస్సయ్యానన్నమాట'' కుర్చీలో స్టయిల్ గా వెనక్కి చేరగిలబడుతూ అంది హనిత.
"నువ్విక్కడికి ఎందుకొచ్చావసలు?'' కోపంగా అన్నాడు వైభవ్.
"అవును హనీ, నువ్విక్కడికి రాకుండా ఉండాల్సింది'' సురేష్ కూడా అన్నాడు.
హనితకి ఛర్రున కోపం వచ్చింది.
"నా ఇష్టం. అయినా నేనేమీ మీకోసం రాలేదు. ఇది మీ బారేం కాదుగా. నన్ను ఇన్సల్ట్ చేస్తారా? నాకేమన్నా భయమనుకుంటున్నారా? నేనొక్కదాన్నే పోయి వేరే చోట కూర్చుంటాను'' అంటూ లేచింది.
"హనీ, హనీ!'' సురేష్ పిలుస్తున్నా వినకుండా వెళ్ళి సింగిల్ సీట్ ఉన్న టీపాయ్ దగ్గర కూర్చుంది. ఇంతలో అక్కడున్న చిన్న స్టేజ్ లాంటి దాని మీదకు వచ్చింది క్యాబరే ఆర్టిస్ట్. డాన్సర్ రాగానే అందరూ కళ్ళప్పగించి ఆమెనే చూడసాగారు. మ్యూజిక్ మంద్రస్వరంలో మొదలైంది.
మ్యూజిక్ కి అనుగుణంగా లయబద్ధంగా శరీరాన్ని కదుపుతూ డాన్స్ చేయసాగిందామె. హనిత అంతకు ముందు ఎన్నో సినిమాల్లో క్యాబరే సీన్స్ చూసింది. ఆమెకు బోర్ కొట్టడం మొదలయింది. వెళ్ళిపోతే సురేష్ వాళ్ళు, ముఖ్యంగా వైభవ్ - తను భయపడి వెళ్ళిపోయాననుకుంటారేమోనని అలాగే కూర్చుంది.
మధ్యలో ఒకసారి సురేష్ వాళ్ళ వేపు చూసింది. వాళ్ళంతా గుడ్లప్పగించి డాన్సర్ వేపే చూస్తున్నారు. వైభవ్ మాత్రం టేబుల్ మీదున్న గ్లాస్ ని గుండ్రంగా తిప్పుతూ గ్లాస్ లోపలికి చూస్తున్నాడు. "పప్పుముద్ద'' అనుకుంటూ హనిత ఎదమవేపుకు చూసింది. ఆమె కళ్ళు తళుక్కుమన్నాయి.
ఆ పక్క టేబుల్ వద్ద ఓ పహిల్వాన్ లాంటి వ్యక్తి. ఒక స్త్రీ కూర్చుని ఉన్నారు. దాదాపు ముప్పయి ఐదేళ్ళు ఉంటాయావిడకు.
"బహుశా ఆమె అతని భార్య అయి ఉంటుంది'' అనుకుంది హనిత.ఆవిడ మగవేషంలో ఉన్న హనితని తినేలా చూస్తోంది.
హనితకి ఆవిడని ఒక ఆట పట్టించాలనిపించింది. ఆమెని చూస్తూ విజిలేస్తూ పెదిమల్ని గుండ్రంగా ఉంచింది. ఆవిడ మెలికలు తిరగటం మొదలెట్టింది. ఆమె భర్త హనితని కోపంగా చోశాడు.
"నీ ఫోన్ నెంబర్ ఎంత?'' సైగ చేస్తూ అడిగింది హనిత. ఆవిడ ఆనందంగా చెప్పబోయింది.
భర్త కొట్టినంత పని చేయడంతో ఊరుకుంది. తర్వాత భర్తని కూడా లెక్క చేయకుండా హనితనే చూడసాగిందామె. హనిత పోకిరీల ఫోజులు గుర్తుకు తెచ్చుకుంటూ తలడువ్వుకోవడం, కాలరెగరేయటం లాంటి చేష్టలు చేయసాగింది