మై డియర్ రోమియో - 34

Listen Audio File :

Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

 

మై డియర్ రోమియో - 34

 

స్వప్న కంఠంనేని

 

టైమ్ సరిగ్గా ఆరవుతోంది.
హనిత డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని ఉంది. రకరకాల మేకప్ సామాగ్రి, విగ్గులు ఉన్నాయామె ముందు. వాటిల్లో నుంచి తనకు కావలసిన వాటి కోసం వెతుక్కుంటూ అనుకుంది హనిత.
"ఛీ ... ఛీ ... ఏం ఆడపిల్లలో ఏమో. సరదాగా మనం కూడా చందనా బార్ అండ్ రెస్టారెంట్ కు వెళ్దామంటే ఒక్కతీ విని ఛావదే. లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేయాలో వీళ్ళకి జన్మలో అర్థం కాదు. వెళ్ళోస్తే వాళ్ళతో పాటు నేను కూడా మామూలుగానే డ్రెస్సయి వెళ్ళేదాన్ని. వాలు రాకపోవటం తోనే నాకిన్ని తిప్పలు. మగవాడిలా డ్రెస్ అవ్వాల్సి వస్తుంది. ఖర్మండీ ఖర్మ. ఏం చేస్తాం''
ఇంతలో హనితకి తనకి కావలసింది దొరికింది. "అ! ఇదయితే సరిగ్గా సరిపోతుంది'' అనుకుంది. సన్నటి ఆ ఆర్టిఫిషియల్ మీసాన్ని అతికించుకుంది.
"వెరీ గుడ్'' సంతృప్తిగా అనుకుంది తన అవతారాన్ని చూసుకుని. క్రీమ్ కలర్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ వేసుకుని ఉందామె.
ఆమెది బాయ్ కట్ క్రాఫ్ అవ్వటంతో జుట్టు గురించి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేకపోయింది.
"అమ్మో మర్చిపోయాను'' అనుకుంటూ చెవిపోగుల్ని తీసి డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో పడేసింది.
మళ్ళీ అంతలోనే "ఆ. అయినా ఏముందిలే. ఇవ్వాళ రేపు మగపిల్లలు కూడా చ చెవులకి రింగులు, లోలాకులు తగిలించి గొలుసులేసుకుని తిరుగుతున్నారుగా'' అనుకుని నవ్వుకుంది.
"మిమిక్రీ వొచ్చు కాబట్టి  గొంతుదేమీ ప్రాబ్లమ్ లేదు'' అనుకుంది.
తర్వాత మేకప్ సామాగ్రినంతా ఎక్కడిదక్కడ సర్దేసి, తలుపు తీసుకుని గదిలోనుంచి బయటికి నడిచింది.
ఎవ్వరూ చూడకుండా బయట పదాలనుకుంది. కానీ అప్పుడే మెట్లెక్కి పైకి వస్తున్నా వొదిన రాధ ఆమెను చూడనే చూసింది.
"ఎవరు బాబూ నువ్వు?'' అడిగింది రాధ. హనితకి ఎగిరి గంతేయాలనిపించింది.
"హనిత క్లాస్ మేట్ నండీ. ఆమెకోసం వచ్చాను. మాట్లాడి వెళ్తున్నాను'' మగ గొంతుతో చెప్పింది హనిత.
"మంచిది, వెళ్ళిరా బాబూ!'' అంది రాధ. హనిత వడివడిగా బయటికి నడిచింది.
"వావ్! వదినె నన్ను గుర్తుపట్టలేదు. ఇక బయటి వాళ్ళెం గుర్తు పడతార్లే. నా ప్లాన్ సక్సెస్'' అనుకుంది.
హనిత గబగబా వెళ్ళి కాంపౌండ్ లోపల షేడ్ లో పార్క్ చేసి ఉన్న కైనెటిక్ హోండాని స్టార్ట్ చేసింది. లోపల్నుంచి హనితనే గమనిస్తున్న రాధ కన్ ఫ్యూజ్ అయింది.
"అరె. ఆ పిల్లాడేంటి? మా హనీ బైక్ తీసుకుపోతున్నాడు. కొంపతీసి దొంగ కాదు కదా'' అనుకుంది.
గబగబా బైక్ స్టార్ చేస్తున్న హనిత దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్ళబోయింది. కానీ హనిత అప్పటికే బైక్ మీద కూర్చుని బాణంలా బయటికి దూసుకుపోయింది.
"అమ్మో! అమ్మో వీడు ఖచ్చితంగా దొంగే వీడ్నెక్కడో చూసినట్లే ఉంది. అసలింతకీ హనితేం చేస్తుందబ్బా'' అనుకుంటూ హనిత రూమ్ లోకి పరిగెత్తిందామె. రూమ్ లో ఎక్కడా హనిత కనిపించలేదు.
"సాయంత్రం హనీ కాలేజ్ నుంచి వచ్చి రూమ్ లో కెళ్ళింది. మళ్ళీ ఆ రూమ్ లో నుంచి ఆ అబ్బాయి మాత్రమే బయటికొచ్చాడు. మరింతకీ హనీ ఏమయినట్లు?'' ఆలోచించసాగింది.
అప్పుడు స్ఫురించిందామెకి ఆ అబ్బాయెవరో. "అమ్మో హనీ!'' అనుకుని ఆశ్చర్యపోయింది.