మై డియర్ రోమియో - 30

Listen Audio File :

Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

 

మై డియర్ రోమియో - 30

 

స్వప్న కంఠంనేని

 

"భలేగా చేశాను కదూ'' సంబరంగా అంది హనిత బయటికి వచ్చాక.
"అవుననుకో. కానీ అతనా క్లాక్ విరగ్గొట్టడం నువ్వెప్పుడు చూశావ్?'' అడిగింది మీనా.
"అతను విరగోట్టాడని నేను నీతో చెప్పానా?''
"మరీ?'' సంభ్రమంగా అంది మీనా.
"అంతకు మునుపు నేను తీసేసరికి కూడా ఇలాగే విరిగిపోయి ఉంది. అతనిలాగే నేను కూడా ఏమీ ఎరగనట్టు అక్కడ పెట్టేశాను'' తాపీగా చెప్పింది హనిత.
"అవునా?'' కాసేపటివరకూ తెలుకోలేకపోయింది మీనా.
తర్వాత అంది హుషారుగా "నువ్వు వైభవ్ తో గొడవ పడుతున్నప్పుడు నేను ఆరు పెన్ను సెట్టులు కొట్టేశానొచ్''
"ఒసినీ!'' ఈసారి ఆశ్చర్యపోవటం హనిత వంతయింది.
తర్వాత హనిత అంది "సరే కానీ, మన కాలేజీలో చదువుతున్న వాసంతి - అదేనే మా అన్నయ్య గాళ్ ఫ్రెండ్. వెళ్ళి ఆ అమ్మాయిని కలుద్దామా?
"ఓయస్. పదపద. కానీ ఆ అమ్మాయి ఏ క్లాసో మనకి తెలీదు కదా!'' సందేహాస్పదంగా చూస్తూ అంది మీనా.
"ఆ అమ్మాయి 'లాఖోంమే ఏక్' లాంటిది. వెయ్యిమందిలో ఉన్నా గుర్తుపట్టేయోచ్చు'' చెప్పింది హనిత.
"ఎలా?''
"నువ్వే చూస్తావుగా!''
హనిత, మీనాలు క్లాస్ లో కెళ్తుండగా వినిపించాయా మాటలు పక్క రూమ్ లోంచి -
"నిన్న నేను రాలెగదా. ఏమేం క్లాసులు జరిగినయ్''
"యురేకా! వెతకబోయిన తీగ కాలికే తగిలింది. వాసంతి అనుకుంటా'' అంది హనిత.
హనిత, మీనాలిద్దరూ ఆ మాటలు వినిపించిన రూమ్ వైపు పరుగెత్తారు.
రూమ్ లోకి వెళ్ళాక అడిగింది హనిత.
"మీలో వాసంతి ఎవరు?''
గభాల్న ఇద్దరమ్మాయిలు లేచి నిలబడ్డారు.
"ఏ వాసంతి? ఎ వాసంతి గావాల్నా? బి. వాసంతి గావాల్నా?'' అడిగింది.
మీనా వెక్కి వెక్కి ఏడవటం మొదలెట్టింది.
"నువ్వే. నేను హేమంత్ చెల్లెల్ని. నీతోనే మాట్లాడాలి'' అంది హనిత సంభాళించుకుని.
ఆ అమ్మాయి బయటికి నడుస్తూ మీనాని చూపించి హనితతో అంది -
"ఏందీమె? ఏడ్సుడు షురూ జేసింది?''
మీనా కన్నీళ్ళు తుడుచుకుంటూ చెప్పింది.
"ఇవి కన్నీళ్ళు కావమ్మా ఆనంద భాష్పాలు'' తర్వాత కీచుగొంతుతో అంది "హేమంతన్నయ్య సెలక్షన్ చూసి ఆనందంతో ...''
"అట్లనా?'' అని బోల్డు సిగ్గుపడిపోతూ నేలమీద సున్నాలు చుడుతూ అడిగింది.
"నాకేమన్న చెప్పమన్నాడా?''
"నిన్ను ఈవెనింగ్ కలుస్తానన్నాడు. బైదిబై మీదే ఊరు వాసంతీ?''
"నిజామాబాద్'' గర్వంగా చెప్పింది వాసంతి.
"బైబై వాసంతి'' చెప్పి హనిత మీనాలు కదలబోతుండగా అన్నది వాసంతి.
"మీ ఇంట్లో పనిచేసే ఆయా మస్తు గలీజుంది. ఆమెని పన్లో నుంచి తీసేయండ్రి''
"ఎవరూ మైసమ్మేనా?'' అంది హనిత నవ్వాపుకుంటూ.
"ఔను. మస్తు నకరాల్ జేస్తుంది''
"అదంతే. ఎంత పోగారో. నేను కూడా ఇంతకు ముందెన్ని సార్లో చెప్పాను దాన్ని తీసేయమని, కానీ హేమంతన్నయ్యే ఒప్పుకోవట్లేదు. నువ్వు చెప్పి చూడు. వింటాడేమో?'' చెప్పి తన క్లాస్ లోకి నడిచింది హనిత.
హనిత కాలేజ్ నుంచి బయటికి వచ్చి బైక్ స్టార్ట్ చేయబోతుండగా వైభవ్ బైక్ ఆమె ముందు ఆగింది.
"థాంక్యూ హనితా!'' చెప్పి జేబులోంచి రెండు వందల రూపాయలు తీసి హనిత చేతిలో పెట్టాడు వైభవ్.
ఆశ్చర్యపోయి చూస్తున్న హనిత, మీనాలను పట్టించుకోకుండా బైక్ పార్క్ చేసి తలొంచుకుని కాలేజ్ లోకి నడిచాడు.
"గుండు బాస్. అందుకే ఇడ్లీ అనేది'' నవ్వుతూ అంది హనిత.
మీనాకి నవ్వు రాలేదు.
"పాపం'' అని ముభావంగా ఊరుకుంది.