మై డియర్ రోమియో 27

Listen Audio File :

Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

 

మై డియర్ రోమియో - 27

 

స్వప్న కంఠంనేని

 

వెకిలి నవ్వు నవ్వుతున్న గేట్ కీపర్ ని మింగేసేలా చూశారు హనిత, మీనాలు.
తర్వాత లోపలికి నడుస్తూ అడిగింది హనిత.
"మీనా! లాస్ట్ అంటే చివర అనే కదా అర్థం?''
"అవును. నీకెందుకొచ్చిందా దౌత్?'' అడిగింది మీనా.
"అది కాదు, మన ప్రిన్సిపాల్ నాకెన్ని సార్లు చివరి వార్నింగులిస్తాడు?'' అంది హనిత.
మీనా నవ్వి చెప్పింది "లాస్ట్ వార్నింగులివ్వటం తప్ప ఏ ప్రిన్సిపాలూ ఏ స్టూడెంట్ ని ఏం చేయలేడు''
క్లాస్ లోకి వెళ్తుంటే వైభవ్ కనిపించాడు.
"హాయ్ వైభవ్'' అంది మీనా.
"హలో'' చెప్పాడు వైభవ్.
హనిత చూడనట్లుగా తలదించుకొని మూతి తిప్పుకుంటూ వెళ్ళి కూర్చుంది.
ఇంతలో క్లాస్ రూంలోకి ఒక ఎనిమిదేళ్ళ పిల్ల ప్రవేశించింది.
వస్తూనే ఆ పిల్ల వైభవ్ ని చూసి "డాడీ'' అంది.
ముందు వైభవ్ తనని కాదనుకున్నాడు.
కానీ మళ్ళీ ఆ పిల్ల వైభవ్ దగ్గరకెళ్ళి ప్యాంట్ పట్టుకుని లాగుతూ "డాడీ'' అంది.
తననే అని తెలిసేసరికి ఉలిక్కిపడ్డాడు వైభవ్.
అప్రయత్నంగానే "ఛీ! ఇంకోసారలా పిలిస్తే చంపేస్తాను'' అన్నాడు.
వైభవ్ క్లాస్ మేట్స్ అంతాఅప్రతిభులై చూడసాగారు.
హనిత మరీ అవాక్కయి చూడసాగింది. లోపల్నుంచి సంతోషం తన్నుకు రాసాగిందామెకు. వైభవ్ ఎటువంటి వాడో ఆమెకు బాగా తెలుసు. అలాంటిది ఎవరో కావాలనే వైభవ్ ని ఆటపట్టించడానికిలా చేశారని పించిందామెకు. డాన్స్ చేయాలనిపించింది హనితకు.
ఆ పిల్ల మళ్ళీ "డాడీ! మమ్మీ కూడా వచ్చింది. బయటుంది. రా పోదాం'' అంది.
వైభవ్ హనిత వైపు అనుమానంగా చూశాడు.
హనితే ఆ పిల్లను పంపించిందని అతని అనుమానం.
వైభవ్ తననలా అనుమానంగా చూసేసరికి హనితకి కోపం వచ్చింది.
కావాలని "మీ అమ్మాయికి అన్నీ నీ పోలికలే వైభవ్. కానీ నీకింత కూతురుందనుకోలేదు నేను'' అంది.
వైభవ్ మొహం మాడ్చుకున్నాడు.
సరిగ్గా అదే సమయంలో ఆ పిల్ల రాజాని చూసింది.
సంబరంతో ఆమె మొహం వెలిగిపోయింది.
"డాడీ! నువ్వికడున్నావా?'' అంది.
రాజా గుండె గుభేలుమంది.
"పిల్లలూ, దేవుడూ చల్లనివారే. అసలు దేవుడు ప్రపంచమంతటికీ కలిపి ఆకాశంలోనే ఒక పెద్ద ఫ్యాన్ పెట్టేస్తే ఇంత చెమటలు పోయవు కదా'' అన్నాడు అదుపు తప్పి గబగబా.
"కంట్రోల్ యువర్ సెల్ఫ్ రాజా!'' హనిత చెప్పింది. తర్వాత ఆ పిల్ల వైపు తిరిగి "ఇతను కాదమ్మా మీ డాడీ. అదుగో వైట్ షర్ట్ వేసుకున్నాడే అతను'' వైభవ్ ని చూపించింది.
"ఏం కాదు'' ఆ పిల్ల నిరాశగా తలొంచుకుని బయటికి నడిచింది.
అప్పుడే క్లాస్ లోకి అడుగుపెట్టబోతున్న మాత్స్ లెక్చరర్ ని చూసి "డాడీ!'' అంది.
"మీరేం వర్రీ అవకండి సార్. ఆ పిల్ల పిచ్చిదనుకుంటా. అందర్నీ అలాగే పిలుస్తోంది'' అన్నాడు సురేష్.
తర్వాత కాసేపటికి సర్దుకుని క్లాస్ మొదలుపెట్టాడాయన.
ఆ పిల్ల బయటికి వెళ్ళగానే అప్పటి వరకూ అక్కడే ఉండి అదంతా గమనిస్తూ నవ్వుకుంటున్న బి.ఎస్సీ. ఫస్టియర్ స్టూడెంట్స్ ఆ పిల్లకి షేక్ హాండ్స్ ఇచ్చి అభినందనలతో ముంచెత్తారు.
"బ్రహ్మాండంగా యాక్ట్ చేశావ్. లేకపోతే మమ్మల్ని రాగింగ్ చేస్తారా ఈ సెకండియర్ వాళ్ళు'' వాళ్ళలో ఒకమ్మాయి అంది.
దాంతో ఆ పిల్ల రెచ్చిపోయి కారిడార్ లో నడుస్తున్న విక్రమ్ ని చూసి "డాడీ'' అంది.
విక్రమ్ ఉలిక్కిపడి గభాల్న జేబులోంచి సైకిల్ చెయిన్ తీశాడు.
విక్రమ్ ని చూసేసరికి అంతా కకావికలై ఎక్కడి వాళ్ళక్కడికి జారుకున్నారు.