మై డియర్ రోమియో - 24

Listen Audio File :

Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

 

మై డియర్ రోమియో - 24

 

స్వప్న కంఠంనేని

 

అంతా ఎవరి సీట్లలోకి వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు.
వైభవ్ సురేష్ తో పాటు బయటికెళ్తూ హనితని మింగేసేలా చూశాడు.
చేతుల్లో కళ్ళు నులుముకుంటూ ఎదుస్తున్నట్టుగా నటిస్తున్న హానిత, వైభవ్ తనని చూడగానే కన్నుకొట్టి నీలుక బయటపెట్టి వెక్కిరించింది.
"హు!'' కాలిని నేలకేసి కొడుతూ ఉక్రోషంగా అన్నాడు వైభవ్.
"డాడీ! ఇవ్వాళేమయిందో తెలుసా?'' తండ్రితో అంది హానిత.
"అవునూ! బాబిగాడు అదే వైభవ్ వస్తున్నాడా కాలేజీకి. ఒకసారి మనింటికి రామ్మనలేకపోయావా అమ్మా'' అన్నాడాయన.
ఒళ్ళు మండిపోయింది హనితకి. 'ఏంటీయన? ఎంత చెప్పినా వినిపించుకోడేం? వైభవ్ పేరు వినగానే పులకరించిపోతున్నాడు. ఎలాగైనా సరే. ఇవాళ డాడీని వైభవ్ కి వ్యతిరేకంగా తయారుచేసి తీరాలి' అనుకుంది.
"అలాగే పిలుస్తాను. బూర్ల మూకుడు నిన్ను మా ఇంటికి రమ్మన్నాడు అని చెప్తాను సరేనా?''
"బూర్ల మూకుడేంటి?''
"నువ్వు అచ్చం బూర్ల మూకుడులాగా ఉన్నావంట. వైభవ్ ఇవ్వాళ మా క్లాస్ మేట్స్ తో చెపుతున్నాడు. పిలవమంటావా?'' వ్యంగ్యంగా అడిగింది హానిత.అప్పుడే ఆ రూం లోకి వచ్చిన గిరిజకి ఆనందంతో ఒళ్లూపై తెలీలేదు.
"మొత్తానికి కుర్రాడు నిజాయితీ పరుడేనమ్మాయి'' అంది సంబరంగా.
మూతి ముడుచుకున్నాడు సత్యం.
"మమ్మీ! నువ్వేం రెచ్చిపోనక్కరలేదు. నీకు ఇంకా భయంకరమైన పేరుపెట్టాడు తెలుసా?\'' అంది హానిత.
సత్యం మొహం వికసించింది.
"ఏమని పెట్టాడేం?'' అన్నాడు.
"మమ్మీని చిన్నప్పుడు వాళ్ళమ్మ మొహం మీద ఒక గుడ్డు గుద్దిందట అందుకే మమ్మీకసలు ఫీచర్సే లేకుండా ముఖం దిబ్బరొట్టేలాగా తయారైంది అంటున్నాడు''
గిరిజ మొహం మాడిపోయింది.
భార్యను అంత లావు ఎద్దేవా చేస్తూ పేరు పెట్టాడని తెలిసేసరికి సత్యానికి 'హుర్రే!' అంటూ కేకపెట్టి గంతేయాలనిపించింది.
భార్య మొహం చూసి ఎందుకొచ్చిన గొడవలే అనుకుని ఊరుకున్నాడు.
"ఎందుకలా సంబరపడతారు. మిమ్మల్ని బూర్ల మూకుడన్నాడుగా'' అంది గిరిజ కోపంగా.
సత్యం గిరిజలిద్దరూ మొహాన గంటుపెట్టుకుని ఎడమొహం పెడమొహంగా కూర్చున్నారు.
హానిత బుర్ర గోక్కుంది.
"అవునూ, ఇంతకీ నేను వీళ్ళకి వైభవ్ మీద కోపం తెప్పించానా? లేకపోతే వీళ్ళిద్దరికీ గొడవపెట్టానా?''  అనుకుంది.
"ఏదో ఒకటి. నేను చేయాల్సింది చేశాను. ప్రయత్నలోపం లేకుండా'' అనుకుని స్టయిల్ గా భుజాలెగరేసి వేరే గదిలోకి వెళ్ళిపోయింది హానిత.
హానిత కాలేజీకి వెళ్తుండగా చూసిందా దృశ్యం.
చౌరస్తా వద్ద రెడ్ లైట్ వెలగడంతో హానిత బైక్ నాపి వెనక కూర్చున్న మీనాతో మాట్లాడుతోంది.
అప్పుడే ఒక యమహా బిడ్ దూసుకుంటూ వచ్చి వాళ్ళ ప్రక్కన ఆగింది. హానిత మీనాలు ఠక్కున మాటలాపేసి ఆ బైక్ వంకే నోరు తెరుచుకుని ఆశ్చర్యంగా చూడసాగారు.
బైక్ ని హానిత చిన్నన్నయ్య హేమంత్ డ్రయివ్ చేస్తున్నాడు. వెనక ఒక అందమైన అమ్మాయి కూర్చుని వుంది. ఆమె దాదాపు హేమంత్ భుజాలమీద వాలిపోయి కబుర్లు చెబుతోంది. ఆగివున్న వాహనాలు చేస్తున్న శబ్దాల కారణంగా ఆ అమ్మాయి ఏం మాట్లాడుతోందో హానిత, మీనాలకు వినిపించడం లేదు. కానీ చూస్తున్న వాళ్ళందరికీ వాళ్ళు ప్రేమికులని అర్థమైపోతోంది. హేమంత్, ఆ అమ్మాయి కబుర్లలో మునిగిపోయి లోకాన్ని పట్టించుకోవడంలేదు. దాంతో హేమంత్ హనితని గమనించలేదు.
రెడ్ లైట్స్ ఆరిపోయి గ్రీన్ లైట్స్ వెలగటంతో హేమంత్ బైక్ ని ముందుకు పోనిచ్చాడు.
ఆశ్చర్యంగా చూస్తున్న హానిత గాభాల్న అటెన్షన్ లోకి వచ్చేసి హేమంత్ ని ఫాలో చేయడం మొదలుపెట్టింది.
హేమంత్ బైక్ దార్లో ఆగినప్పుడల్లా హానిత కూడా కాస్త దూరంలో తన బైక్ ని ఆపుతూ అతన్ని ఛేజ్ చేసింది. హేమంత్ ఆ అమ్మాయిని బ్యాంగిల్ స్టోర్స్ కి, గ్రీటింగ్ కార్డ్స్ షాప్ కి, ఐస్ క్రీం పార్లర్ కి తిప్పటం చూసిన హానిత, మీనాతో అంది.
"చూడవే, హేమంత్ అన్నయ్య నన్నెప్పుడన్నా బైటికి తీసుకెళ్ళాడా? ఇప్పుడీ అమ్మాయిని ఊరంతా తిప్పుతున్నాడు ఎంత పార్షియాలిటీనో చూడు''
"ప్రేమ గుడ్డిది హనీ'' మీనా చెప్పింది.
"సరే కాని నువ్వు కాస్త సందర్భసహితంగా సామెతలు చెప్పటం నేర్చుకో. నేను అన్నదానికీ నువ్వు చెప్తున్న సామెతకీఏమాత్రం పొంతన కుదరట్లేదు'' హానిత విసుగ్గా అంది.
దాదాపు ఓ గంటపాటు వాళ్ళని ఫాలో చేశాక హనితకి బోర్ కొట్టి బైక్ వెనక్కు తిప్పుతూ చెప్పింది "తర్వాత ఇంటికెళ్ళాక చెప్తాను వీడి పని'
కానీ హేమంత్ అదే రోజు మధ్యాహ్నం ఆఫీస్ పనిమీద క్యాంప్ కెళ్ళటంతో మరో రెండ్రోజుల వరకూ హనితకి హేమంత్ ని బనాయించే ఛాన్స్ దొరకలేదు''