మై డియర్ రోమియో - 18

Listen Audio File :

Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

 

మై డియర్ రోమియో - 18

 

స్వప్న కంఠంనేని


హనిత ఇంటిముందు బైక్ దిగాడు వైభవ్.
బైక్ పార్క్ చేసి మీనా, వైభవ్ లిద్దరూ లోపలికి నడిచారు.
హాల్లో హనిత తల్లిదండ్రులు, అన్నలూ దిగులుగా కూర్చుని వున్నారు.
వాళ్ళనాలా చూసేసరికి వైభవ్ గిల్టీగా ఫీలయ్యాడు.
మీనా అతన్ని హనిత తల్లిదండ్రులకి పరిచయం చేసింది.
"హనిత లోపలుంది వెళ్ళండి'' చెప్పాడు హనిత తండ్రి సత్యం.
హనిత రూమ్ లోకి వెళ్ళారు వైభవ్, మీనాలు.
మంచం మీద పడుకుని వుంది హనిత.
ఆమె తల దగ్గర వుంది హనిత వదిన రాధ.
"హనీకి ఎలా వుంది వదినా?'' అడిగింది మీనా.
"ఇప్పటిదాకా ఏదేదో కలవరించింది. ఇప్పుడే కాస్త నిద్ర పట్టినట్టుంది'' చెప్పింది రాధ.
రాధ అడిగింది "ఎవరీ అబ్బాయి?''
"ఇతను వైభవ్ అని మా క్లాస్ మేట్ వదినా! హనితని చూడడానికి వచ్చాడు'' చెప్పింది మీనా.
పక్కనే వున్న కుర్చీలో కూర్చున్నారు మీనా, వైభవ్ లు.
హనితవైపే పరిశీలనగా చూసాడు వైభవ్.
హనిత బాగా చిక్కిపోయింది. కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు.
"చక్కనమ్మ చిక్కినా అందమే'' అన్న సామెత గుర్తుకు వచ్చింది వైభవ్ కి.
నలిగిన గులాబీపువ్వులా వుంది హనిత. మూసుకున్న హనిత కళ్ళు గులాబీ రేకుల్లా వున్నాయి.
'జానపదాల్లో రాకుమారిలా, సిండ్రెల్లాలా ఎంత సుకుమారంగా, అందంగా, ఠీవీగా వుంది హనిత'' అనుకున్నాడు వైభవ్.
వైభవ్ చూస్తుండగానే రెండు మూడుసార్లు భయంతో నిద్రలో ఉలిక్కిపడింది హనిత.
"నేనలా చేయకుండా వుండాల్సింది?'' తనను తనే నిందించుకున్నాడు వైభవ్.
ఈలోగా హనిత వదిన రాధ వైభవ్ ని ఎగాదిగా చూసి మనస్సులోనే మెచ్చుకుంది. 'కుర్రాడు చూడముచ్చటగా ఉన్నాడు' అనుకుంది.
కాసేపయ్యాక "ఇంకా నేను వెళ్తాను మీనా'' అన్నాడు వైభవ్. తర్వాత హనిత వదినతో చెప్పాడు "వస్తానండీ''
"మంచిది బాబూ'' చెప్పింది రాధ.
"పద నేనూ గేట్ వరకు వస్తాను'' అంది మీనా.
వైభవ్ మీనాలు వెనక్కు తిరుగుతున్న సమయానికి హనిత నిద్రనుంచి మేల్కొంది.
"ఎవరొచ్చారు వదినా?''
"మీనా, మీనాతో పాటు ఎవరో వైభవ్ అని నీ క్లాస్ మేట్ అట, అతను వచ్చాడు'' చెప్పింది రాధ.
హనిత మోహంలో రంగులు మారాయి గబగబా.
"అతడ్ని పిలువు'' దాదాపు అరిచినట్లుగానే అంది హనిత.
రాధ వెళ్ళి మెట్లు దిగుతున్న వైభవ్ నీ, మీనాని కేకేసి "హనిత పిలుస్తోంది''అని చెప్పింది.
లోపలికి నడిచారు మీనా, వైభవ్ లు.
వైభవ్ ని చూస్తూనే హనిత కళ్ళు కోపంతో మండిపడ్డాయి.
"ఒరేయ్'' అంత జ్వరంలోనూ తూలుతూ లేచి వెళ్ళి అతడి షర్టు కాలర్ పట్టుకుంది.
మీనా, రాధలు హనితని వారించబోయారు.
ఎడమ చేత్తో హనిత వాళ్ళని అవతలకు నెట్టేసింది.
"ఎంత ధైర్యంరా. నా చెయిర్ కి పాముని అటాచ్ చేస్తావా? నిన్ను ... నిన్ను ... ఇవాళ చంపేస్తాను. ఇప్పుడే చంపేస్తాను. ఎందుకులే అని ఊరుకుంటుంటే మరీ టూమచ్ చేస్తున్నావ్'' మతి పోతున్నట్లు అరవసాగింది.
అతడి షర్టు కాలర్ ని పట్టుకున్న చేతి గుప్పిటను ఆమె గట్టిగా బిగించి పూనకం వచ్చిన దానిలా కసిగా కిందకు గుంజసాగింది.
బలహీనంగా వున్న ఆమె చేతికి అంత బలం ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు. ఆ తాకిడికి వైభవ్ శరీరం ఒక్క క్షణంపాటు అటూ ఇటూ ఊగిసలాడింది.
ఫ్యాషన్ కోసం ఆమె పెంచుకున్న పొడవాటి గోళ్ళు అతని ఎడమచేయి షర్టు భాగంలో దిగబడ్డాయి కసితో ఆమె వేళ్ళను కిందకి లాగుతున్న కొద్దీ అక్కడి షర్టు భాగం చిరిగి పీలికలా కిందకి జారసాగింది. షర్టు చిరిగినంతమేరా అతని ఛాతీ ఆచ్చాదన తొలగి నగ్నంగా కనిపించసాగింది.
అక్కడ ...
సరిగ్గా అతడి హృదయభాగాన ...
పైనొక అర్థ చంద్రాకారం. కింద ఒక అర్థచంద్రాకారంలో పళ్ళగాట్ల తాలూకు గుర్తులు కనిపిస్తున్నాయి.
ఆ గుర్తుల్ని చూడగానే షాక్ తగిలినట్లుగా హనిత వెనక్కి జరిగింది.
కొద్ది క్షణాలపాటు జలదరిస్తున్నట్లుగా ఆమె మెదడు డిస్టర్బ్ అయింది.
జ్ఞాపకాల కాంతి వెనక్కు వెనక్కు వెళ్ళి సరిగ్గా పన్నెండేళ్ళ క్రితం ఫోకస్ అయింది.
అక్కడ ... అక్కడ ...
ఒక పల్లెటూరు. చుట్టూ పొలాలు, పొదలు, తోటలు, దాపరికాలు లేని హృదయాలు. ఎండ, వెన్నెల, గాలి, సీతాకోక చిలుకలు, కిలకిలారావాలతో చెట్టు నుంచి చెట్టుకు గీతల్ని గీస్తూ ఎగిరే పిట్టలు, చెంగు చెంగున దూకే లేగదూడలు. దేవతలకు కిందకి దిగివచ్చి ఆదుకోవాలనిపించే ప్రకృతి వొడిలాంటి పల్లెటూరు.
ఒకనాడు ఆ ఊళ్ళో జరిగిన ఒకానొక దృశ్యం ఆమె కళ్ళముందు రూపాన్ని దాల్చింది.