మై డియర్ రోమియో - 15

Listen Audio File :

Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

 

మై డియర్ రోమియో - 15

 

స్వప్న కంఠంనేని

 

విక్రమ్ మొహం చూడగానే అందరికీ అర్థమైపోయింది. అతను మంచి దూకుడు మీద ఉన్నాడనీ, ఏదో దుడుకుతానం చేయబోతున్నాడనీ, ఎం జరగబోతోందోనని అంతా ఊపిరి బిగపట్టి ఉత్కంఠగా చూడసాగారు. హనిత, మీనా, రాజాలు మరీ.
"చూశావా మిస్టర్? నేనొకసారి ఒకతన్ని మురుగుకాలవలో ముంచి ఊపిరాడకుండా చేసి హాస్పిటల్ కి పంపాను. ఎందుకో తెలుసా?''
"తెలీదు ఎందుకు?'' అమాయకంగా అడిగాడు వైభవ్.
"వాడు నా గాళ్ ఫ్రెండ్ హరిణికి కన్నుకొట్టాడు. అందుకు!'' చెప్పాడు విక్రమ్.
"ఓహో!'' అర్థమైనట్టుగా తలూపాడు వైభవ్.
"ఇంకొకసారేం చేశానో తెలుసా? ఒకడి కనుగుడ్డు మీద గుండుసూదిని గుచ్చాను. ఎందుకంటే వాడు హరిణికి లవ్ లెటర్ రాశాడు!''
"దారుణం'' అన్నట్టుగా చూశాడు వైభవ్.
"మరోసారేమో మన కాలేజీ ఆవరణలో పొన్నచెట్టుంది చూశావా దానికి ఒకడ్ని ఉరిపెట్టాను. వాళ్ళూ వీళ్ళూ వచ్చి రక్షించబట్టి బతికి పోయాడనుకో. ఈ పనెందుకు చేశానో తెలుసా? వాడు హరిణిని ఓణీ పట్టుకుని లాగాడు. అందుకని!''
అతడు చెబుతున్న మాటలన్నీ నిజమే. అవి వింటున్న మీనాకి ఆ దృశ్యాలు ఒకటొకటిగా కళ్ళముందు మెదిలేసరికి బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిపోయి కళ్ళు తిరిగి దబ్ మంటూ నేలమీద పడిపోయింది.
ఆ శబ్దానికి ఉలిక్కిపడుతూ గభాల్న జేబులోంచి చాకును బయటికి తీశాడు విక్రమ్. "ఏమిటా చప్పుడు?'' కంగారుగా అడిగాడు.
"ముందా చాకును లోపలపెట్టు. నీ మాటలకు మా బేబీ ఎలిఫెంట్ జడుసుకుని పడిపోయింది!'' మీనా సంగతి తెలిసిన హనిత తాపీగా అంది.
"ఇంకెప్పుడూ అంత శబ్దం చేస్తూ పడొద్దని చెప్పు'' చాకును తిరిగి జేబులో పెట్టుకుంటూ అన్నాడు విక్రమ్.
తర్వాత వైభవ్ వైపు చూశాడు. "ఎం నేను చెబుతోంది అర్థం అవుతున్నాయా?''
"అర్థం అవుతోంది కానీ ఇవన్నీ నువ్వు నాకెందుకు చెపుతున్నావో అర్థం కావటం లేదు'' అయోమయంగా అన్నాడు వైభవ్.
"నేను నిన్నిప్పుడేం చేయబోతున్నానో ముందే తెలుసుకుంటావని'' క్రూరంగా అన్నాడు విక్రమ్.
"సిల్లీ! నువ్వు నన్నేం చేస్తావ్? నేను నీకేమన్నా అపకారం చేస్తే కదా?''
"ఏం చేయలేదా? మరి ఇదేమిటి?'' తన చేతిలో లెటర్ ని వైభవ్ మొహానికేసి కొడుతూ అన్నాడు విక్రమ్. వైభవ్ ఆ లెటర్ తీసి చదివాడు. అతని మొహంలో రంగులు గబగబా మారిపోయాయి.
"నేనీ లెటర్ రాయలేదు. ఈ రైటింగ్ నాది కాదు. అసలు హరిణి ఎవరో కూడా నాకు తెలియదు'' అన్నాడు.
"ఇది నువ్వు రాయలేదా?''
"లేదు. కావాలంటే నా నోట్ బుక్స్ లో హాండ్ రైటింగ్ చూడు'' తన బుక్స్ అన్నీ చూపించాడు వైభవ్.
"మరైతే ఈ పనెవరు చేసుంటారబ్బా?'' సాలోచనగా అన్నాడు విక్రమ్. అప్పటికి అతని కోపం సగం దిగిపోయింది. అయితే తననెవరో ఆట పట్టించారని అనిపించేసరికి ఆ కోపమంతా వాళ్ళమీదకి మళ్ళింది. వైభవ్ కి చప్పున హనిత కళ్ళముందు మెదిలింది. వెంటనే అన్నాడు.
"ఇంకెవరు. వీళ్ళే అయి ఉంటారు'' హనిత, రాజాలని చూపిస్తూ అన్నాడు.
విక్రమ్ హనిత వాళ్ళ ముందుకు నడిచాడు.
"ఇది మీ పనేనా?'' ఉత్తరాన్ని చూపించుతూ కఠినంగా అడిగాడు. అప్పటికి మీనాకి ఇంకా స్పృహ రాలేదు. అలాగే నేలమీద పడివుంది.
"వీడినెందుకు కదిల్చానురా దేవుడా?'' క్షణంలో అంతా రివర్స్ అయ్యేసరికి హనిత మనసులో గింజుకుంది. ఉత్తరాన్ని రాసే సమయాన తనకు హాండ్ రైటింగ్ విషయం తట్టనందుకు తనను తానూ తిట్టుకుంది. అంతలోనే తమాయించుకుని బింకంగా అంది.
"మాకు తెలీదు. అతనే చేసుంటాడు. ఇలాంటి పనులు చేయటంలో అతనే ఫస్ట్'' వైభవ్ ని చూపిస్తూ అంది హనిత.
"అవును. ఫాన్ గిరగిరా తిరుగుతుంది కానీ మనుషులెందుకో పాపం నడుస్తారు'' విక్రమ్ వైపు భయంగా చూస్తూ అన్నాడు రాజా.
ఖంగుతిన్నాడు విక్రమ్. "ఏంటి ? ఇతనిట్లా అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు'' అన్నాడు.
"పాపం! రాజా నిన్ను చూస్తేనే ఇంతగా భయపడిపోయి అర్థంపర్థం లేకుండా వాగుతున్నాడు. ఇక మేమా ఆడపిల్లలం. తోటి ఆడవాళ్ళకు అలా రాస్తామా?'' సెంటిమెంట్ మీద కొట్టింది హనిత.
"అవును. మీరలా రాయరు'' చెప్పాడు విక్రమ్.
"వైభవే వేరే ఎవరితోనో రాయించి ఉంటాడు'' అంది హనిత.
"సరే! ఎఅవ్రు రాశారన్నది తేలకపోతుందా? అప్పుడు చెప్తాను'' క్లాస్ లో అందర్నీ కలియజూస్తూ వార్నింగ్ ఇచ్చాడు విక్రమ్. అప్పుడే మీనాకి స్పృహ వచ్చింది. స్పృహ వచ్చే సమయానికి ఆమె సరిగ్గా విక్రమ్ కాళ్ళ వద్ద వుంది. తన భారీకాయాన్ని మడతలు పెడుతూ ఆపసోపాలు పడుతూ లేచి నిలబడింది.
లేచేసరికి ఎదురుగా విక్రమ్ కనిపించేసరికి "చచ్చిపోవూ ప్లీజ్'' అంది. ఆమె మాటలకు అదిరిపడ్డాడు విక్రమ్.
"ఓరి నాయనోయ్ ఎరక్క ఇదేదో పిచ్చాసుపత్రిలోకి వచ్చినట్టున్నాను'' అనుకుంటూ పైకి మాత్రం బింకంగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ అక్కడినుంచి నడిచి పోయాడు.
"హమ్మయ్య!'' అతను వెళ్ళగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వైభవ్ కి ఇదంతా చాలా చిరాగ్గా అనిపించింది. హనిత ఎవరో అమ్మాయికి తనలా ఫోన్ చేయటం, ఇంకెవరో అమ్మాయికి తను రాసినట్టుగా లెటర్ రాయటం అతనికి చాలా అనీజీని కల్పించింది. ఆ క్షణాన అతనికి తాను హనితకి అనవసరంగా సారీ చెప్పానేమోనని కూడా అనిపించింది. బుక్స్ తీసుకుని క్లాస్ బయటికి నడిచాడు.
క్లాస్ లో నుంచి బయటికొచ్చి గేట్ వైపు నడవసాగాడు. వెనకనుంచి "హలో గురూ!'' అంటూ హనిత గొంతు విన్పించింది. విననట్లుగా ముందుకు నడిచాడు వైభవ్. పరిగెత్తుతూ వచ్చి అతనితో పాటు నడుస్తూ అంది హనిత. "ఆ లెటర్ నేనే రాశాను. ఏం చేసుకుంటావో చేసుకో ఫో!''
"నువ్వంతటి గుంటనక్కవని నాకు తెలుసులే'' అన్నాడు వైభవ్.
"నన్ను గుంటనక్కంటావా? నీటి కుక్కా!'' తిట్టింది హనిత.
"పోవే బోదురుకప్పా!''
"వేవ్వేవ్వెవ్వే'' అక్కడ్నుంచి పరిగెత్తింది హనిత.