మై డియర్ రోమియో - 6

Listen Audio File :

Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

 

మై డియర్ రోమియో - 6

 

స్వప్న కంఠంనేని

 

బైక్ ని తోసుకుంటూ ఇంటికి చేరుకున్నాడు వైభవ్.
ఇంటికి చేరుకోగానే "బాబాయ్'' అంటూ అతనికి ఎదురొచ్చింది పింకీ.
వైభవ్ వాళ్ళది ఉమ్మడి కుటుంబం. అతనికి ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరికీ పెళ్ళిళ్ళయిపోయాయి. వైభవ్ తండ్రి పెద్ద మోతుబరి రైతు.
సిటీ అవుత స్కర్ట్స్ లో పొలాలు కొని వాళ్ళీ మధ్యే పల్లెటూరు నుంచి సిటీకి మకాం మార్చారు.
వైభవ్ చిన్నన్నయ్యకింకా పిల్లలు లేరు. పెద్దన్నయ్య కూతురే పింకీ.
వైభవ్ కి పింకీ అంటే ప్రాణంతో సమానం.
పింకీనెత్తుకుని లోపలికి నడిచాడు.
సోఫాలో కూర్చుని షూస్ విప్పుతుండగా తల్లి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది.
"నాన్నగారు లేరా అమ్మా?'' అడిగాడు వైభవ్.
"లేరురా. ఏదో పని మీద బయటకెళ్ళారు'' అని చెప్పిందామె.
ఇంతలో వైభవ్ పెద్దన్నయ్య మహేష్ బయటనుండి వచ్చాడు. వైభవ్ కి మహేష్ అంటే విపరీతమైన గౌరవం.
లేవబోతున్న వైభవ్ ని కూర్చోమంటూ అడిగాడు మహేష్.
"ఎరా కొత్త కాలేజీ ఎలా వుంది?''
"బానే వుంది అన్నయ్యా ...'' అన్నాడు వైభవ్. క్షణంపాటు అతని కళ్ళముందు హానిత, మీనా, రాజాలు మెదిలారు.
"ఊ! బాగా చదువుకో'' అని చెప్పేసి లోపలికెళ్ళిపోయాడు మహేష్.
వైభవ్ తన రూమ్ కెళ్ళి స్నానం చేసి బయటకొచ్చేసరికి హాల్లో పెద్ద వదిన మాధవి చిన్నాన్న అనిల్, చిన్న వదిన సుధలు క్యారమ్స్ ఆడుతూ కనిపించారు.
వైభవ్ కూడా వెళ్ళి ఆటలో కూర్చున్నాడు.
వున్నట్టుంది అనిల్ అడిగాడు.
"కాలేజీ ఎలా వుందిరా? ఎవరూ ఏడిపించడం లేదు కదా?''
వైభవ్ చిరాగా అన్నాడు "ఎందుకేడిపించడం లేదు? బాగానే విసిగిస్తున్నారు. కాకపొతే మరీ అతిగా టీజ్ చేస్తున్నారు''
"ఎందుకు? ఏమైంది?'' ఆసక్తిగా అడిగింది సుధ.
"ఆడపిల్లలు కదా ఎందుకులే అని ఊరుకుంటుంటే మరీ నెత్తికెక్కి విసిగిస్తున్నారు. ఛీఛీ'' పైకి వినబడేట్లే గొణుక్కున్నాడు వైభవ్.
"ఏమిట్రా? ఆడపిల్లలు ఏడిపిస్తున్నారా?'' అడిగాడు అనిల్.
"అవును'' బుంగమూతి పెడుతూ అన్నాడు వైభవ్.
ముసిముసిగా నవ్వుకున్నారు వదినలిద్దరూ.
వాళ్ళ నవ్వుచూసి ఉక్రోషంగా అన్నాడు వైభవ్.
"రేపట్నుంచీ చెప్తాను వాళ్ళ పని! ఎందుకొచ్చిన గోడవలే అని ఊరుకుంటుంటే బైక్ లో గాలి కూడా తీసేశారు.''ఆటయ్యాక అందరూ భోజనాలు చేశారు.
తరువాత వైభవ్ తన గదిలోకి వెళ్లాడు.
వైభవ్ వెనుకే వెళ్ళారు వదినలిద్దరూ.
"ఆ అమ్మాయిల పేర్లేంటి?'' అడిగింది మాధవి.
"ఏ అమ్మాయిలూ?'' ఆశ్చర్యంగా అడిగాడు వైభవ్.
"నిన్నేడిపిస్తున్నారే వాళ్ళు'' అంది సుధ.
"ఓ! మీరింకా ఆ విషయం మర్చిపోలేదా?వాళ్ళ పేర్లు హానిత, మీనా'' అన్నాడు వైభవ్.
"హనితా! పేరు భలే విచిత్రంగా వుందే'' అంది మాధవి.
ఒక్క క్షణం వైభవ్ కి హానిత గుర్తుకొచ్చింది.
ఆమె వాలుకళ్ళు, సంపెంగలాంటి ముక్కు, గులాబీ పెదవులు, సన్నగా, పొడుగ్గా, హూ కేర్స్ అన్నట్లుగా వుండే ఆమె నిర్లక్ష్యపు అవతారం.
"సర్లే! మేం వెళ్తున్నాం. నువ్వు పడుకో'' అంటూ అక్కడ్నుంచి నిష్క్రమించారు మాధవి, సుధలు.
ఆ రాత్రి వైభవ్ పడుకోబోయే ముందు తన డైరీలో రాసుకున్నాడు.
"హానిత! పేరే కాదు మనిషి కూడా విచిత్రంగా వుంది. అందమైన విచిత్రం''
హానిత తలెత్తి చూసింది.
ఎదురుగా నీలిరంగులో సముద్రం.
తెల్లటి నురగతో అలలు ఎగిసి పడుతున్నాయి.
వైట్ షర్టు, జీన్స్ వేసుకుని వుందామె.
ఆకాశానికేసి చూసింది.
ఆకాశమంతా నల్లగా, చిక్కటి చీకటితో నిండివుంది.
ఆ చీకట్లోంచి హానిత చూస్తుండగానే మిణుకుమిణుకుమంటూ నక్షత్రాలు పుట్టుకొచ్చి మెరవసాగాయి.
ఆ నక్షత్రాల్ని చూస్తూనే హానిత సంబరంగా ...
"ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యూ ఆర్'' అని అరుచుకుంటూ నక్షత్రాల్ని లెక్కపెట్టసాగింది.
పదో అంకె లెక్కపెట్టగానే సడెన్ గా ఆకాశంలో పెద్ద మెరుపు మెరిసింది.
నక్షత్రాలన్నీ గబగబా అటూ ఇటూ మారిపోసాగాయి.
క్రమంగా నక్షత్రాలన్నీ ఒక చోటికి చేరుకొని ఏదో రూపాన్ని సంతరించుకున్నాయి.
మొదట్లో హనితకు ఆ రూపం ఏమిటో అర్థం కాలేదుగానీ కొంతసేపటికి ఆ రూపానికి ఒక స్పష్టత ఏర్పడింది.
అది ఒక గుర్రం!
హానిత నోరు తెరుచుకుని ఆశ్చర్యంగా చూస్తూ గుర్రాన్ని చెయ్యూపుతూ పిలిచింది.
చుక్కల గుర్రం కిందికి దిగి హానిత ముందు ఆగింది.
గుర్రం మీద బంగారు కళ్ళెం, బంగారపు జీను వేసి వున్నాయి.
హానిత ఎగిరి గుర్రం మీద కూర్చుంది.
గుర్రం ఎక్కగానే హానిత చేతిలో ఒక బంగారు కొరడా ప్రత్యక్షమైంది.
హానిత కొరడా ఝుళిపించగానే గుర్రం పరిగెత్తడం ప్రారంభించింది.
సముద్రం ప్రక్కన ఇసుకలోంచి నురగల మీద కదం తొక్కుతూ పరుగెత్తుతున్న గుర్రం కాస్తా సడెన్ గా సముద్రం మీదుగా ఆకాశంలోకి లేచింది.
హానిత పైప్రాణం పైనే పోయినట్లనిపించింది.
ఒకవేళ నక్షత్రాలు కనుక విడిపోతేనో? అనుకుంది మనసులో.
ఆలోచన రాగానే ఆమె గుండె గుభేలుమంది.
కిందకి చూసింది.
గుర్రం సముద్రం మీదుగా పోతోంది.
సముద్రంలోకి చూసిన హానిత కళ్ళు తిరిగినట్లనిపించింది.
గుర్రాన్ని వాటేసుకుని కళ్ళు గట్టిగా మూసుకుంది.
అలా ఎంతసేపో ప్రయాణించింది గుర్రం.
గుర్రం నేలమీద నడుస్తున్నట్లనిపించి కళ్ళు తెరచి చూసింది.
పర్వతాల మీదుగా పరుగెడ్తోంది గుర్రం.
ఆఉపచ్చతి చెట్లు, లోయలతో నిండివున్న పర్వతం.
హానితకక్కడ రాజా, వైభవ్, సురేష్ మరికొందరు క్లాస్ మేట్స్ కనిపించారు.
"హలో హనీ!'' అంటూ ఎదురొచ్చాడు రాజా.
"హాయ్'' అంది హానిత గుర్రం దిగకుండానే.
అలాగే గుర్రాన్ని వాళ్ళవైపుకు నడిపించిందామె.
హనితని చూస్తూ వైభవ్, సురేష్ టో అన్నాడు.
"ఎవరీ అర్థనారి? ఆ హెయిర్ కట్ ఏమిటో? ఆ స్కర్టు ఏమిటో? ఆ ప్రవర్తన ఏమిటో? పాయింట్ ఫైవ్ లా వుందే!''
హానిత కోపంగా చూసింది వైభవ్ వైపు.
వైభవ్ చిరునవ్వుతో చూస్తున్నాడు తననే.
గుర్రాన్ని వైభవ్ దగ్గరకు నడిపించింది. గుర్రాన్ని వెనక్కి తిప్పి దాని వెనుకకాళ్ళ దగ్గర డొక్కలో ఒక్క పోతూ పొడిచింది. గుర్రం ఎగిరి వెనుక కాళ్ళతో ఒక్క తాపు తన్నింది.
"తిక్క కుదిరిందా? లేకపొతే నన్నాట పట్టిస్తావా?'' అంటూ గర్వంగా గుర్రం దిగింది హానిత.
వెనక్కి తిరిగి చూసేసరికి రాజా కిందపడి పొట్టని చేత్తో పట్టుకుని ఏడుస్తున్నాడు.
వైభవ్ అక్కడే నిలబడి ఈ చోద్యాన్నంతా చిద్విలాసంగా చూస్తున్నాడు. గుర్రం తన్నింది వైభవ్ ని కాదని, రాజానని అప్పుడర్థమయింది హనితకి.
కోపంగా కొరడా ఝుళిపిస్తూ గుర్రం దగ్గరకెళ్ళింది హానిత.
"నేనొకళ్ళని తన్నమంటే నువ్వు ఒకళ్ళని తంతావా? అంతా నీ ఇష్టమేనా? నువ్వు గుర్రానివికావు, గాడిదవే'' అంటూ కోరడాని పైకెత్తింది.
హఠాత్తుగా చుక్కల గుర్రంలో నక్షత్రాలన్నీ అటూ ఇటూ పరుగులు తీసాయి.
గుర్రం మీద పర్వతంలాంటి మనిషి ఆకారం కింద మారింది.
ఆ మనిషిని చూసి హానిత ఆశ్చర్యపోయింది.
"గుర్రం మీనా ఎలా అయిందబ్బా?'' అనుకుంది.
మీనా హనితని చూస్తూ 'చచ్చిపోవా ప్లీజ్'' అంది.
సడెన్ గా హనితకు మెలకువ వచ్చింది.
"బాబోయ్ ఇది కలా?'' అనుకుంది.
టైం చూసుకుంది.
ఏడయింది.
"కాలేజీకి వెళ్ళాలి'' అనుకుంటూ లేచి తయారవడం మొదలుపెట్టింది.