అందరూ దొంగలే - 83

Listen Audio File :

డిటెక్టివ్ పాండు, అతని అసిస్టెంట్ రాజు రోడ్డుమీద కాళ్ళీడ్చుకుంటూ నడవసాగారు.

“ఏంటో.. మనం దీపని వెతికి పట్టుకుంటాం అని గొప్పగా చెప్పంగానీ...... ఈ వెతుకులాట ఏ పాయింట్ దగ్గర స్టార్ట్ చేయాలో నాకర్థంకావడం లేదు" అన్నాడు డిటెక్టివ్ పాండు బుర్ర గోక్కుంటూ.

“ఓ పనిచేస్తే మంచిదనిపిస్తుంది సార్!” అన్నాడు రాజు.

“ఏంటది?!”

“ఆ కమీషనర్ గాడు ఎలాగూ మనకి అడ్వాన్స్ గా మూడొందలే ఇచ్చాడు కాబట్టి ఆ డబ్బు వాడి మొహాన కొట్టి మనదార్న మనం పోదాం.”

“షటప్.... ఈ డిటెక్టివ్ పాండు ఒకసారి కేసు టేకప్ చేస్తే దాన్ని మధ్యలో డ్రాప్ చెయ్యడు" అన్నాడు పాండు సీరియస్ గా.

“కానీ మొన్నీమధ్య ఒకావిడ తన భర్త ప్రవర్తన మీద అనుమానం వచ్చి ఆయనమీద నిఘా పెట్టమని మీకు కేసు అప్పగించింది కదండీ... అప్పుడు సదరు భర్తకి ఆ విషయం తెలిసి మీ మక్కెలిరక్కొడ్తానని వార్నింగ్ ఇస్తే మీరా కేసుని డ్రాప్ చేసేశారు కదండీ" గుర్తు చేశాడు రాజు.

డిటెక్టివ్ పాండు నాలుక కర్చుకున్నాడు. “ఆహా రాజూ! నీ జ్ఞాపకశక్తికి నా జోహార్లు. నువ్వు అవసరం లేని విషయాల్ని మరీ ఇంతిదిగా గుర్తుపెట్టుకుంటే నేను నీ మక్కెలిరగ్గొట్టాల్సి వస్తుంది" అన్నాడు ఇబ్బందిగా నవ్వుతూ.

అప్పుడే ఓ పాప గోలగోలగా ఏడవడం ఆ ఇద్దరి చెవిన పడింది. ఇద్దరూ తలలు పక్కకి తిప్పి చూశారు. ఒక వ్యక్తి సుమారు ఆరు సంవత్సరాల వయసున్న పాపని చెయ్యిపట్టుకుని బరబరా లాక్కెళ్తున్నాడు.

ఆ పాప "నేను రాను.... నేను... రాను....” అంది గోలగోలగా ఏడుస్తూ.

ఆ వ్యక్తి పాప వీపుమీద ఛళ్ మని వాయించాడు. “పదవే" అంటూ చెయ్యి వదిలి జడపట్టి లాగాడు.

డిటెక్టివ్ పాండు, అసిస్టెంట్ రాజు మొహమొహాలు చూస్కున్నారు. ఇద్దరి మొహాల్లో సందేహం. కెవ్వుమని పాప కేక వినిపించింది. కంగారుగా అటూ చూశారు డిటెక్టివ్ పాండు, అసిస్టెంట్ రాజు, ఆ వ్యక్తి పాపమీద కత్తిపెట్టి "ఇప్పుడు పదవే... పద....” అంటున్నాడు పాపవంక క్రూరంగా చూస్తూ.

పాండు, రాజు ఏకకాలంలో ఒకే నిర్ణయానికి వచ్చారు. ఇద్దరూ ఆ వ్యక్తి దగ్గరికి రివ్వున పరిగెత్తుకు వెళ్ళారు. రాజు ఆ వ్యక్తిని వెనుక నుండి పొట్టచుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకున్నాడు. డిటెక్టివ్ పాండు పిడికిలి బిగించి అతని మొహం మీద బలంగా గుద్దాడు.

“అబ్బా!” బాధగా అరుస్తూ అతను కత్తిని వదిలేశాడు.

డిటెక్టివ్ పాండు కోటు జేబులోంచి రివాల్వర్ తీసి అతనికి గురిపెట్టాడు. “హ్యాండ్స్ అప్.”

అతను రెండు చేతులూ పైకెత్తుతూ "మీరెవరు?” అన్నాడు భయంగా చూస్తూ.

“పాండ్... జేమ్స్ పాండ్! నెంబర్ వన్ ప్రయివేట్ డిటెక్టివ్ ని...... పోలీసు కమీషనర్ కూతుర్ని కిడ్నాప్ చేసి తీస్కెళ్తున్న నేరానికి నిన్ను అరెస్టు చేస్తున్నాం" అన్నాడు పాండు.

“పోలీసు కమీషనర్ కూతురా? బాబోయ్ నాకేం పాపం తెలీదు" అన్నాడా వ్యక్తి.

“మరి ఈ పాపెవరు?”

“ఇది నా కూతురు.”

"నీ కూతురైతే కత్తి చూపించి బెదిరించి ఎందుకు లాక్కేళ్తున్నావ్?” అడిగాడు పాండు.

ఆ వ్యక్తి ఎత్తిన చేతులు దింపేశాడు. “ఈ లెవెల్లో బెదిరిస్తూ లాక్కెళ్తే తప్ప ఇది స్కూల్ కి రాదయ్యా బాబూ.... చెప్పవే చెప్పు, నేనెవరో చెప్పు" అంటూ ఆ పాపకి టెంకి జల్ల ఇచ్చాడు అతను.

“ఈయన మా డాడీయే అంకుల్..ఒక్కోసారి అయితే నానెత్తిన నాటు బాంబులు కూడా పెట్టి స్కూల్ కి తీస్కెళతారు మా డాడీ" ముద్దు ముద్దుగా చెప్పింది ఆ పాప.

అప్పుడు గమనించారు వాళ్ళు. అతని భుజానికి స్కూల్ బ్యాగ్ తగిలించి వుండడం. రాజు కూడా జేబులోంచి దీప ఫోటో తీసి చూశాడు.

“నిజమే బాస్.. ఈ పాప దీప కాదు" అన్నాడు.

“ఓ ఆయామ్ వెరీ వెరీ సారీ... పిల్లల్ని స్కూలుకి ఈ టైపులో టీస్కెళ్ళడం మొదటిసారి చూడ్డంవల్ల నేను కన్ప్యూజ్ అయ్యాను" అంటూ రివాల్వర్ కోటు జేబులో పడేశాడు డిటెక్టివ్ పాండు.

అతను డిటెక్టివ్ పాండు మొహంమీద బలంగా గుద్ది "నేను కూడా సారీ....” అని చెప్పి అతని కూతుర్ని "రావే.... రా...” అంటూ లాక్కెళ్ళాడు. రాజు

కిసుక్కున నవ్వాడు. డిటెక్టివ్ పాండు రాజు మొహంమీద గుద్ది "దీప ఫోటో నువ్వు ముందుగానే చూసుండాల్సింది" అన్నాడు.