అందరూ దొంగలే - 82

Listen Audio File :

సరిగ్గా పావుగంటకి డిటెక్టివ్ పాండు, అతని అసిస్టెంట్ రాజు కమీషనర్ దగ్గర వున్నారు. “విషయం ఏంటో చెప్పండి?” అన్నాడు డిటెక్టివ్ పాండు.

“అదే... మా దీప కిడ్నాప్ విషయం గురించి మీరు పేపర్లలో చదివే వుంటారు కదా! దీపని వెతికి తెచ్చే బాధ్యత మీకు అప్పగించుదామని రమ్మన్నా...”

“వ్వాట్... దీప ఇంకా దొరకలేదా? ఇన్ని రోజులు పట్టకూడదే?!” నోరు తెరిచి ఆశ్చర్యంగా చూశాడు డిటెక్టివ్ పాండు.

“కానీ పట్టింది.... అందుకనే మిమ్మల్ని పిలిచాను. కేసు బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే...” అని గజదొంగ గంగులుని ఎన్ కౌంటర్లో చంపడం, వాడి తమ్ముడు గజదొంగ మంగులు పగబట్టడం, రాంబాబు, చిన్నారావ్ లు నాగరాజుని పరిచయం చేయడం, నాగరాజు దీపని కిడ్నాప్ చేసి మంగులుకి ఇవ్వడం, మంగులు పదిలక్షలు డిమాండ్ చేయడం... అంతా వివరంగా డిటెక్టివ్ పాండుకి చెప్పాడు కమీషనర్ లింగారావ్.

“ఇప్పుడు దీప మంగులు చేతిలోంచి రాకా చేతిలోకి వెళ్ళింది, ఎలా వెళ్ళిందో మనకి తెలీదు. వాడిప్పుడు డబ్బులివ్వమని డిమాండ్ చేస్తున్నాడు" అని చెప్పి ముగించాడు కమీషనర్ లింగారావ్.

దీపతోపాటు రాంబాబు, చిన్నారావ్ ల ఫోటోలను కూడా డిటెక్టివ్ పాండుకి యిచ్చి, “వీళ్ళిద్దరూ జైలోంచి తప్పించుకుని పారిపోయారు. కిడ్నాప్ వ్యవహారంలో వీళ్ళపాత్ర కూడా వుందని నాకనుమానంగా వుంది" అని చెప్పాడు కమీషనర్.

“సరే - మీ పాపని క్షేమంగా అప్పగించే బాధ్యత నేను తీస్కుంటాగానీ, నా ఫీజు విషయం.....” అంటూ నసిగాడు డిటెక్టివ్ పాండు.

“రెండు లక్షలిస్తాను. ఒక్కేనా?” అడిగాడు కమీషనర్ లింగారావ్.

డిటెక్టివ్ పాండు కళ్ళు మెరిశాయ్. “ఒక్కేనేగానీ.. అడ్వాన్స్?” మళ్ళీ నసిగాడు పాండు.

జేబులోంచి పర్స్ తీసి రెండొందలు ఇచ్చాడు కమీషనర్ లింగారావ్.

"ఏంటీ... రెండొందలా....?” అయోమయంగా చూస్తూ అడిగాడు డిటెక్టివ్ పాండు.

“సరేనయ్యా... మరో వంద తీస్కో.... హప్పీనే కదా?!” అంటూ మరో వంద తీసి డిటెక్టివ్ చేతిలో పెట్టాడు.

ఇంకేం మాట్లాడాలో తెలీక వెర్రిమొహం వేశాడు పాండు. అంతవరకూ వారి మాటల్ని చాటుగా వుండి వింటున్న శ్రీలక్ష్మి వాళ్ళ ముందుకి వచ్చి, రెండు చేతులూ జోడించి దణ్ణం పెడ్తూ, “స్వామీ! మా దీప మాకు క్షేమంగా దొరికితే, డిటెక్టివ్ పాండు కుడికాలూ, అతని అసిస్టెంట్ రాజుది ఎడమకాలూ నీకు సమర్పించుకుంటా...” అని మొక్కుకుంది.

అది విన్న పాండూ, రాజూ "బాబోయ్" అన్నారు భయంగా వణికిపోతూ.

“ఓసి నీ యమ్మాకడుపూ మాడా... నేను కాకుండా ఇప్పుడు ఊళ్ళో వాళ్ళమీద కూడా పడ్డావా?” అన్నాడు కమీషనర్ లింగారావ్

శ్రీలక్ష్మి మీద మండిపడ్తూ. మరేం చెయ్యనూ? ఇప్పటికే మీ అవయవాలన్నీ సమర్పించుకుంటానని స్వామివారికి మొక్కేశాను!” అంది శ్రీలక్ష్మి చికాకుగా.

అక్కడ ఉంటే ఏమేం మొక్కులు మొక్కుతుందోనని భయంగా బయటికి పరుగులు తీశారు జేమ్స్ పాండు, రాజు.