అందరూ దొంగలే - 81

Listen Audio File :

చిన్నారావ్ ఎత్తిన ఆమె చేతిని టక్కున పట్టుకున్నాడు. “నేను రాంబాబుని.... వాడేమో చిన్నారావ్!” సరోజతో చెప్పాడు రాంబాబు.

“మీ ఇద్దరికీ పైత్యం బాగా ముదిరినట్టుంది. ఉండండి... మొత్తం దించుతా...” అంటూ సరోజ ప్రక్కనే టీపాయ్ మీద వున్న ఇంజక్షన్ సిరెంజ్ తీసి దాంట్లోకి మందు ఎక్కించింది.

“దాంట్లోకి మత్తు మందు ఎక్కించావ్ కదూ? ఇప్పుడు మా ఇద్దరికీ దాన్ని గుచ్చి, మమల్ని మూర్చపోగొట్టాలని నీ ప్లాను. నాకంతా తెల్సులే" అన్నాడు రాంబాబు.

“అంతేకాదు... మీరు మూర్చపోయాక మా డాక్టర్ తో మీ ఇద్దరికీ ఫామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించేస్తా" అంటూ మీది మీదికి వచ్చింది సరోజ.

“అమ్మో.. అంతపని చెయ్యకు సరూ! పెళ్ళయ్యాక మనిద్దరికీ పిల్లలు పుట్టరు!” అన్నాడు రాంబాబు.

ఆ మాట వింటూనే "రేయ్....” అంటూ సరోజ సిరెంజి వున్న చేతిని పైకెత్తింది.

రాంబాబు ఆమె చేతిని చట్టుక్కున పట్టుకున్నాడు. “సరోజా.... నేను రాంబాబుని....” అన్నాడు రాంబాబు.

“నేను చిన్నారావ్ ని!!” అన్నాడు చిన్నారావ్ ఇంకా తన చేతిని విడిపించుకోవాలని గింజుకుంటున్న సునీతతో.

అంతదాకా చోద్యం చూస్తున్న పేషంట్ల వైపు తిరిగి సరోజ అంది “మీరు వెంటనే మెంటల్ హాస్పిటల్ కి ఫోన్ చేసి ఇక్కడ ఇద్దరు పిచ్చోళ్ళు వున్నారని చెప్పి అర్జంట్ గా రమ్మని చెప్పండి...”

“అబ్బా సరోజా... నా మాట విను నేను రాంబాబుని, వాడు చిన్నారావ్. మా గొంతులు గుర్తుపట్టలేదా!” అన్నాడు రాంబాబు.

సరోజ, సునీతలు బిత్తరపోయారు. అవును నిజమే... వాళ్ళ గొంతులు రాంబాబు, చిన్నారావ్ ల గొంతుల్లా వున్నాయ్! పర్సినాల్టీలు కూడా అవే! కానీ మొహాలేంటి పూర్తిగా వేరేగా వున్నాయ్?! ఆ మొహాలు మారువేషాలేస్కున్న మొహాల్లా కూడా లేవు! చాలా నాచురల్ గా వున్నాయ్!

“మీరేం అనుకుంటున్నారో మాకు తెల్సు.. మేం మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని, మా రూపు మార్చేసుకున్నాం...” అన్నాడు రాంబాబు.

“ఆ!...” అంటూ సరోజ, సునీత నోళ్ళు తెరిచారు.

“పద.... మీ డ్యూటీ రూంలోకి వెళ్ళి మాట్లాడుకుందాం" అన్నాడు రాంబాబు.

అందరూ గదిలోకి వెళ్ళారు. అక్కడ రాంబాబు, చిన్నారావ్ లు జరిగినదంతా వివరంగా చెప్పారు. తర్వాత గంటపాటు కబుర్లు చెప్పుకున్నారు.

“ఇంకా మేం వస్తాం" అంటూ రాంబాబు లేచి నిలబడ్డాడు.

చిన్నారావ్ కూడా లేచాడు.

"మీరు త్వరగా దీపని వెతికి పట్టుకుని, మీ సొంత రూపాల్లోకి రండి. మాకేంటో మీతో మాట్లాడ్తుంటే పరాయి మగాళ్ళతో మాట్లాడ్తున్నట్టు వుంది" అంది సరోజ.

రాంబాబు, చిన్నారావ్ లు వాళ్ళిద్దరికీ టాటా చెప్పి బయటికి అడుగుపెట్టారు.

కమీషనర్ లింగారావ్ ఇల్లు! ఫోన్ మోగింది రిసీవర్ తీసి కమీషనర్ లింగారావ్ "హలో...” అన్నాడు.

అవతలనుండి ఓ వికటాట్టహాసం వినిపించింది.

“ఎవరూ?.... కాకాయేనా?” అడిగాడు కమీషనర్ లింగారావ్.

“కాకా కాదు... నా పేరు రాకా!.....” అవతలినుండి అరిచాడు రాకా.

కమీషనర్ లింగారావ్ నాలిక కర్చుకున్నాడు. “సారీ.... ఏంటి చెప్పు రాకా!” అడిగాడు కమీషనర్ లింగారావ్.

“నా ఇరవై లక్షల సంగతి ఏం చేశావ్!: అడిగాడు రాకా.

“అదే... డబ్బుకోసం ప్రయత్నిస్తున్నా!” అన్నాడు కమీషనర్ లింగారావ్ నసుగుతూ.

“త్వరగా ప్రయత్నించు" అన్నాడు రాకా కోపంగా.

“మా దీప ఎలా వుంది?”

“దానికేం... నా గుండెల మీద తబలా వాయిస్తూ హాయిగా వుంది. నేనే చస్తున్నా...” అని ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు రాకా.

కమీషనర్ లింగారావ్ కొన్ని క్షణాలు ఆలోచించి, డైరీ తీసి ఓ నెంబర్ డయల్ చేశాడు.

అవతలనుండి ఓ కంఠం "హలో...” అంది.

“హలో... పాండుగారు ఉన్నారా?” అడిగాడు కమీషనర్ లింగారావ్.

“పాండు కాదు.. డిటెక్టివ్ పాండు! జేమ్స్ పాండ్!!” కొంచెం చికాకుగా అంది అవతలి కంఠం.

“అదే... జేమ్స్ పాండ్ గారే... ఉన్నారా?” అడిగాడు కమీషనర్ లింగారావ్.

“నేనే.... జేమ్స్ పాండ్ నే మాట్లడ్తున్నా" అంది అవతలి కంఠం.

“జేమ్స్ పాండ్ గారూ! నేను... పోలీస్ కమీషనర్ లింగారావ్ ని మాట్లడ్తున్నా.”

“ఓ.. మీరా సార్! చెప్పండి సార్!” అన్నాడు డిటెక్టివ్ పాండు.

“మీతో మాట్లాడాలి. ఓసారి వస్తారా?”

“ఏం? ఏదైనా ప్రాబ్లెమా?” అడిగాడు డిటెక్టివ్ పాండు.

"మీరు మా ఇంటికి వస్తే చెప్తా" అన్నాడు కమీషనర్ లింగారావ్.

“అలాగే! ఓ పావుగంటలో మీ దగ్గర వుంటా" అన్నాడు పాండు.

కమీషనర్ రిసీవర్ క్రెడిల్ చేశాడు. అప్పుడే అక్కడికి శ్రీలక్ష్మి వచ్చింది. “ఎవరికీ రమ్మని ఫోన్ చేస్తున్నారు?” అని అడిగింది.

“ప్రయివేట్ డిటెక్టివ్ పాండుని రమ్మన్నాను. దీపని వెతకడం వాళ్ళకి అప్పగిస్తా! మనవాళ్ళమీద నాకు నమ్మకం పోయింది....” అన్నాడు కమీషనర్ లింగారావ్.