అందరూ దొంగలే - 79

Listen Audio File :

 రాంబాబు, చిన్నారావ్ లు చెప్పినదంతా విని దీర్ఘంగా నిట్టూర్చాడు విల్సన్. “అయితే అదన్నమాట కథ.... ఇప్పుడు పోలీసులు మిమ్మల్ని వెంటాడుతున్నారు! ఒ.కే?”

“అవునంకుల్....” అన్నాడు రాంబాబు.

“మీరీ రూపాల్లో వుంటే పోలీసులు మిమ్మల్ని పట్టుకుంటారు. మీరు రూపాలు మార్చేస్కోడమే దీనికి మార్గం!”

“అంటే. మారువేషాలు వేస్కోమంటారా?” అడిగాడు చిన్నారావ్.

“మారువేషాలు కాదు. ప్లాస్టిక్ సర్జరీ చేసి పర్మెనెంట్ గా మీ రూపాలు మార్చేస్తా!” అన్నాడు విల్సన్ నవ్వుతూ.

 

“అమ్మో... పర్మెనెంట్ గా మా రూపాలు మారిపోతే ఎలా.....?” భయంగా అన్నాడు రాంబాబు.

“డోంట్ వర్రీ... మళ్ళీ మైనర్ సర్జరీ చేసి మీ రూపాలు మీకు తెప్పించేస్తా. అయిదారేళ్ళక్రితం మీ నాన్నగార్ని కలవడానికొచ్చేప్పుడు నేను ప్లాస్టిక్ సర్జరీ గురించి మాట్లాడ్తూ వుండేవాడిని గుర్తుందా?” అడిగాడు విల్సన్.

గుర్తుందన్నట్లు తలూపాడు రాంబాబు.

“నాకు ఈ సబ్జెక్టులో విపరీతమైన ఇంటరెస్ట్ వుంది. ఈ అయిదేళ్ళలో దే అండ్ నైట్ దీనిమీద చాలా ఎక్స్ పెరిమెంట్స్ చేశా.... ఈ రోజు నేను కొద్దిగంటల సమయంలోనే ఒక మనిషి రూపురేఖల్ని పూర్తిగా మార్చెయ్యగల అనుభవాన్ని సంపాదించాను. సర్దాకోసం, ప్రాక్టీస్ కోసం నా రూపాన్ని నేను రకరకాలుగా మార్చేస్కుంటుంటా......” నవ్వాడు విల్సన్.

“అవును! అది నాకు చచ్చే చావయిపోయింది....! రోజుకొకడితో కాపురం చేస్తున్నట్టుంది" విసుక్కుంటూ అంది మార్గరెట్.

రాంబాబు, చిన్నారావ్ లు వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకున్నారు.

“మీకు రేపే సర్జరీ చేస్తా" అన్నాడు విల్సన్ గంభీరంగా.

మూడు రోజుల తర్వాత.... రాంబాబు, చిన్నారావ్ లు అద్దంలో మొహాలు చూసుకుని "కెవ్వు"మని అరిచారు.

“అయ్యబాబోయ్... అద్దంలో మా మొహాలు కాకుండా వేరే మొహాలు కనిపిస్తున్నాయేంటి ?” అన్నాడు రాంబాబు కంగారుగా.

“అవి మీ మొహాలే...” అన్నాడు విల్సన్ చిరునవ్వు నవ్వుతూ.

“మా మొహాలు మరీ ఇంతగా మర్చేశారా?” అన్నాడు చిన్నారావ్ ఆశ్చర్యంగా చూస్తూ.

“మరి ఇలా మారిస్తేనే పోలీసులు మిమ్మల్ని గుర్తుపట్టలేరు.”

“కానీ... మా మొహాలు మళ్ళీ కావాలనుకుంటే మీరు తెప్పించగలరా?” సందేహంగా అడిగాడు రాంబాబు.

“ఆ విషయంలో మీరేం వర్రీ కాకండి!” అన్నాడు విల్సన్.

“ప్రస్తుతం మీకు ఫీజేం ఇచ్చుకోలేం సార్...” అన్నాడు చిన్నారావ్ చేతులు నలుపుకుంటూ.

“ఫీజు గురించి మీరేం వర్రీ కాకండి... ఉన్నప్పుడే ఇవ్వండి.... లేకపోతే లేదు.”

“మేం కోరినప్పుడల్లా మా రూపాలు మారుస్తూ వుండండి అంకుల్. మేము దీపని ట్రేస్ చేసి, కమీషనర్ గారికి అప్పగిస్తాం... ఆయన మొన్న పేపర్లో ప్రకటించిన బహుమతి మాకిస్తే, ఆ మొత్తాన్ని మీకే ఇచ్చేస్తాం!” అన్నాడు రాంబాబు.

“డబ్బు గురించి వర్రీ అవ్వొద్దని చెప్పానుకదా... మీకెలా తోస్తే అలానే చెయ్యండి.. ఒకే...?” అన్నాడు విల్సన్ రాంబాబు భుజం తడ్తూ.

“థాంక్యూ సార్!” అన్నాడు రాంబాబు, చిన్నారావ్ లు కోరస్ గా.

“మేమింక వెళ్ళొస్తాం అంకుల్...” అన్నాడు రాంబాబు.

“ఒకే... మీకు ఇంకా ఏం సాయం కావాలన్నా నన్నడగండి. బెస్ట్ ఆఫ్ లక్....” అన్నాడు విల్సన్.