అందరూ దొంగలే - 78

Listen Audio File :

రాంబాబు, చిన్నారావ్ లు ఆయాసపడ్తూ పరుగుతీస్తూ... ఇంకా పరిగెత్తే ఓపికలేక, ఓ ఇంటి కాంపౌండ్ లో దూరి గుబురుగా వున్న క్రోటన్స్ వెనకాల నక్కి నిలబడ్డారు. ఎంతోసేపటి నుండి పరిగెత్తడంవల్ల వాళ్ళకి బాగా ఆయాసం వస్తోంది. కాస్సేపు కదలకుండా నిశ్శబ్దంగా అలాగే నిలబడ్డారు.

ఆయాసం తగ్గాక "మనం ఇంక బయలు దేర్దామా....?” అన్నాడు రాంబాబు.

“పద....” అన్నాడు చిన్నారావ్.

వాళ్ళిద్దరూ క్రోటన్స్ వెనుకనుండి బయటికి వచ్చి రెండడుగులు గేటువైపు వేశారో లేదో, రాంబాబుని వెనుకనుండి ఓ వ్యక్తి గట్టిగా పట్టుకున్నాడు.

“ఒరేయ్... నేను పట్టుబడిపోయా. నువ్వు పారిపో...” అంటూ గావుకేక పెట్టాడు రాంబాబు.

చిన్నారావ్ తలతిప్పి రాంబాబుని చూశాడు, అతన్ని వెనుకనుండి ఓ వ్యక్తి ఉడుం పట్టులా పట్టుకుని వున్నాడు. “బాబోయ్...” అని అరుస్తూ కాంపౌండ్ వాల్ గేటువైపు పరుగులు తీశాడు చిన్నారావ్.

“ఏయ్... ఆగవయ్యా మగడా... నేనేమీ మీకు కీడుచేసే మనిషిని కాదు. నేను ఈ రాంబాబు వాళ్ళ నాన్న ఫ్రెండుని!” అంటూ అరిచాడు ఆ వ్యక్తి.

చిన్నారావ్ ఆగి వెనక్కి చూశాడు. ఆ వ్యక్తి రాంబాబుని వదిలిపెట్టేశాడు.. చిన్నారావ్ వాళ్ళవైపు భయం భయంగా అడుగులు వేశాడు.

“ఆ... ఏంటోయ్... ఎలా వున్నావ్?!” అన్నాడు ఆ వ్యక్తి రాంబాబు భుజాల మీద చేతులు వేసి చిరునవ్వు నవ్వుతూ.

రాంబాబు ఆ వ్యక్తి మొహంలోకి అయోమయంగా చూశాడు. “మీరూ?!..”

“నేనోయ్.. మీ నాన్న బెస్ట్ ఫ్రెండ్ విల్సన్ని...” అన్నాడతను.

రాంబాబు చటుక్కున వెనక్కి జరిగాడు. “నో...మీరు విల్సన్ కాదు!” అన్నాడు.

“నేను విల్సన్ నేనయ్య బాబూ! అతను నవ్వుతూ అన్నాడు.

“మీరు విల్సన్ అయితే కావొచ్చుగానీ... నాన్నగారి ఫ్రెండ్ విల్సన్ మాత్రం కాదు!” అన్నాడు. అతను పకపకా నవ్వాడు.

“ఆయన మీ నాన్నగారి ఫ్రెండ్ విల్సనే బాబూ!” ఓ స్త్రీ కంఠం పలికింది. రాంబాబు వెనక్కి తిరిగి చూశాడు. ఆ ఇంటి వరండాలో ఓ స్త్రీ నిలబడి వుంది.

“నో...... విల్సన్ అంకుల్ నాకు బాగా తెల్సు. మా నాన్నగారు బతికున్న రోజుల్లో ఆయన ఎప్పుడూ మా ఇంటికి వస్తుండేవారు. ఈయనకి, ఆయనకీ వన్ పర్సెంట్ కూడా పోలికలేదు!” అన్నాడు రాంబాబు.

“ఆయన్ని నేనే గుర్తుపట్టలేను. నువ్వేం గుర్తుపడ్తావ్ లే ...” అంది ఆమె.

రాంబాబు అయోమయంగా ఆమెవంక చూశాడు.

“ఆవిడ మా ఆవిడ మార్గరెట్ లే రాంబాబూ...” అన్నాడు అతను.

రాంబాబు ఉలిక్కిపడ్డాడు.

“నా పేరు మీకెలా తెల్సు?”

“చెప్పాను కదయ్యా నేను విల్సన్నని!” నవ్వాడు అతను.

“ఆయన మొహాన్ని ప్లాస్టిక్ సర్జరీ తో మార్చేసుకున్నార్లే బాబూ" అంది మార్గరెట్.

రాంబాబు ఆశ్చర్యంగా విల్సన్ వంక చూశాడు. విల్సన్ చిరునవ్వు నవ్వాడు.

“పదండి... మనం లోపలికెళ్ళి మాట్లాడుకుందా....” అన్నాడు విల్సన్. అందరూ ఇంట్లోకి వెళ్ళారు.