అందరూ దొంగలే - 76

Listen Audio File :

అడ్డెడ్డెడ్డె... ఆహాహా....” అంటూ డెన్ లో మంగులు ఏడవసాగాడు.

"ఏంటి బాస్ అంత ఘోరంగా ఏడుస్తున్నారు? చచ్చిపోయిన మీ అన్నయ్య గంగులు గుర్తుకు వచ్చాడా బాస్?” అడిగాడు డేవిడ్.

"కాదురోరేయ్..... ఆహా హా హా.......” గుండెలు బాదుకున్నాడు గజదొంగ మంగులు.

“మరి ఎందులు బాస్ అలా గుండెలు బద్దలయ్యేలా ఏడుస్తున్నారు?” జాలిగా చూస్తూ అడిగాడు జాకబ్.

“ఎందుకేంట్రా నీయబ్బ! ఒరేయ్ ఇంత మట్టిబుర్రలున్న మీరెక్కడ దొరికార్రా నాకు?” మండిపడుతూ అన్నాడు మంగులు.

“మేం మీకు దొరకలేదు బాస్! మీ అన్న గంగులుకి దొరికాం బాస్" హుషారుగా అన్నాడు డేవిడ్.

“అందుకే తొట్టి అన్నయ్య ఎన్ కౌంటర్ లో పోయాడు. ఒరేయ్" బాధగా నెత్తికొట్టుకుంటూ అన్నాడు మంగులు.

“మరి మీ బాధకి కారణం ఏంటి బాస్?” అడిగాడు డేవిడ్.

“బాధపడక ఏం చేయ్యన్రా నీయబ్బ....! దీపని ఆ రాకా గాడు తీస్కెళ్ళిపోయాడు. దానితోపాటు మనకి రావలసిన పదిపక్షలూ పోయాయ్. పది లక్షలు లాస్!”

“ఎందుకు లాస్ బాస్? మీరు కమీషనర్ కి ఫోన్ చేసి పదిలక్షలు కాకపొతే కాస్త తగ్గించి ఎంతోకొంత ఇవ్వమని అడగండి బాస్....” అన్నాడు జాకబ్.

“అప్పుడుగానీ కమీషనర్ లింగారావ్ నన్ను బండబూతులు తిట్టడు. మనదగ్గర దీప లేనప్పుడు డబ్బులు ఇవ్వడానికి ఆ కమీషనర్ గాడేమైనా వెర్ర్రిబాగులోడా?” అన్నాడు మంగులు చికాకుపడుతూ.

“దీప మన దగ్గర లేదని మనకి తెల్సు గానీ కమీషనర్ కి తెలీదు కద బాస్?” ఉత్సాహంగా అన్నాడు జాకబ్.

గజదొంగ మంగులు జాకబ్ వంక మెచ్చుకోలుగా చూశాడు. “జీవితంలో మొదటిసారిగా నువ్వు నీ బుర్రకాయ్ ని ఉపయోగించావ్ రా జాకబ్.” మంగులు కమీషనర్ లింగారావ్ నెంబర్ డయల్ చేశాడు.

అవతల నుండి కమీషనర్ లింగారావ్ "హలో" అన్నాడు.

“హలో..... నేనే మంగుల్ని మాట్లాడుతున్నా...” గంభీరంగా అన్నాడు మంగులు.

“మాట్లాడు...” అన్నాడు కమీషనర్.

“దీపని అప్పగించడానికి నువ్వు పదిలక్షలు ఇవ్వలేనని అన్నావ్ కదా.... పోనీ ఎనిమిది లక్షలు ఇవ్వు" అన్నాడు మంగులు.

“ఉహు...” అన్నాడు కమీషనర్.

“పోనీ ఆరులక్షలు?” అడిగాడు మంగులు.

“ఎబ్బే....” అన్నాడు కమీషనర్.

“పోనీ అయిదు లక్షలైనా ఇస్తావా?”

“లేదు... అయిదు లక్షలుకాదు కదా అయిదు రూపాయలు కూడా ఇవ్వను.”

“అయితే దీపని చంపేస్తా!”

“చంపేస్కో!”

“అదేంటయ్యా బాబూ.... దీప నీ కూతురయ్యా బాబూ! కొంపదీసి మీ ఆవిడని అనుమానిస్తున్నావా ఏంటీ?” కంగారుగా అడిగాడు గజదొంగ మంగులు.

“దీప నా కూతురని నాకు తెల్సు.... ప్రస్తుతం దీప నీ దగ్గర లేదని కూడా నాకు తెల్సు" అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేసేశాడు కమీషనర్ లింగారావ్.

గజదొంగ మంగులు రిసీవర్ పెట్టి జాకబ్ వంక కౄరంగా చూశాడు. తర్వాత జాకబ్ ని వీపుమీద గుభీ గుభీమని గుద్దాడు మంగులు.

కమీషనర్ లింగారావ్ హాల్లో అటూ ఇటూ తిరుగుతూ వున్నాడు. అప్పుడే శ్రీలక్ష్మి అక్కడికి వచ్చింది. “ఏంటండీ.... అంత సీరియస్ గా ఆలోచిస్తున్నారు?” అని అడిగింది,

“ఏం లేదు... నేను దీపని వెతికి మనకి అప్పగించిన వాళ్ళకి 10 లక్షల బహుమతిని ప్రకటిస్తున్నా" చెప్పాడు కమీషనర్ లింగారావ్.

“అంత డబ్బు ఎలాగిస్తారండీ?” కంగారుగా అడిగింది శ్రీలక్ష్మి.

“ఓసి నీ తెలివిమండా... పోలీసోడి మాట ఎవరు నమ్మమన్నారే! బహుమతి నిజంగా ఇస్తానని అనుకుంటున్నావా? ఎగ్గొట్టేస్తా" అన్నాడు కమీషనర్ లింగారావ్.