అందరూ దొంగలే - 45

Listen Audio File :

రెండు మోపెడ్ ఓ డాబా ముందు ఆగాయి. నలుగురూ డాబాలో ఓ మూలగా వున్న టేబుల్ దగ్గర కూర్చున్నారు.

“చెప్పు... మీరు ఎందుకు సడెన్ గా మాయమైపోయారు? కనీసం ఫోనైనా చెయ్యలేదేం?” అంటూ రాంబాబుని నిలదీసి అడిగింది సరోజ.

రాంబాబు సడెన్ గా పోలీస్ కమీషనర్ తమకి అప్పగించిన దీప సెక్యూరిటీ డ్యూటీ గురించి చెప్పాడు. రెండు రోజులుగా అదే బిజీలో వున్నట్టు చెప్పాడు. “అప్పటికీ మధ్యలో మేం నర్సింగ్ హోంకి రెండు సార్లు ఫోన్ చేశాం... ఒకసారి ఇంకా డ్యూటీకీ రాలేదని చెప్పారు. ఇంకోసారి రౌండ్స్ లో వున్నారని చెప్పారు... తర్వాత ఎన్నిసార్లు చేసినా ఎంగేజ్డ్ గా వుంది... దొరకలేదు” అన్నాడు చిన్నారావ్.

“మేం కూడా పోలీస్ స్టేషన్ కిఫోన్ చేశాం... వాడెవడో మీ గురించి ఇన్ఫర్ మేషన్ ఇవ్వకుండా “ఏమో... ఎక్కడుంటారో మాకేం తెల్సు” అంటూ రెక్ లెస్ గా సమధానం చెప్పి పెట్టేశాడు....” అంది సునీత.

“అలా సమాధానం చెప్పాడంటే వాడు తప్పకుండా ఇన్స్ పెక్టర్ అప్పారావ్ గాడే అయి వుంటాడు... వాడి సంగతి మేం చూస్కుంటాంగా” అన్నాడు రాంబాబు పళ్ళు కొరుకుతూ.

“వాడు ఇన్స్ పెక్టర్... నువ్వేమో కానిస్టేబుల్. వాడి సంగతి నువ్వెలా చూస్తావ్?” అంది సరోజ.

“కమీషనర్ మా ఇద్దర్నీ చాలా లైక్ చేస్తున్నాడు.. మేం ఇద్దరం ఏం చేసినా చెల్లుతుంది... కాబట్టి ఆ కుక్క కిడ్నీ నాయాల్ని ఎలా ఏడిపిస్తానో చూడు”

“అదెలా సాధ్యం? నువ్వు దీప సెక్యూరిటీ డ్యూటీ లో వుంటావ్ గా వాడినెలా ఏడిపిస్తావ్?”

“దీపకి స్కూలు లేనప్పుడు మేమిద్దరం పోలీస్ స్టేషన్లోనే డ్యూటీ చెయ్యాలి... అప్పుడు వాడిని నంజుకుతింటా.”

“సరే... ముందు ఇక్కడేమైనా తిందాం” అంది సరోజ.

ఆ డైలాగ్ కి నలుగురూ నవ్వారు. ఆ డాబాలో బటర్ నాన్, దాన్లోకి పనీర్ బటర్ మసాలా తెప్పించుకుని తిన్నారు నలుగురూ.

మరో మూడు రోజులపాటు రాంబాబు, చిన్నారావ్ లు దీపని స్కూల్ కి తీస్కెళ్ళి, తీస్కొచ్చే డ్యూటీ చేశారు. నాలుగో రోజు దీప స్కూలు కి శెలవు. ఏ రాజకీయ నాయకుడి జయంతో, వర్ధంతో వచ్చింది ఆ రోజు. అంటే ఆ రోజు రాంబాబుకి, చిన్నారావ్ లకి పోలీస్ స్టేషన్ లో డ్యూటీ అన్నమాట.

ఆ రోజునుండి తన చరిత్ర మారిపోబోతున్నదని ఉదయానే లేచి అద్దంలో మొహం చూస్కుంటున్న ఇన్స్ పెక్టర్ అప్పారావ్ కి తెలీదు. పోలీస్ స్టేషన్ ముందు జీపు ఆగింది. అందులోంచి ఇన్స్ పెక్టర్ అప్పారావ్ ఠీవిగా కిందికి దిగాడు. బూట్లు టకటకలాడించుకుంటూ లోపలికి వెళ్ళాడు. అక్కడి దృశ్యం చూసి అప్పారావ్ ఖంగుతిన్నాడు.

తను చూసింది నిజమేనా అని కళ్ళు నులుముకుని చూశాడు. కానీ తను చూసింది నిజమే... రాంబాబు తన సీట్లో కూర్చుని వున్నాడు. ఎదురుగా చిన్నారావ్ కూర్చున్నాడు మిగతా ముగ్గురు కానిస్టేబుల్స్ చోద్యం చూస్తూ నిల్చున్నారు.

ఆఫ్టరాల్ ఒక హెడ్ కానిస్టేబుల్ తన సీట్లో కూర్చోడమా? “ఏంటది?” గర్జిస్తూ అడిగాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

“కిడ్నీ...” అన్నాడు ఎటో చూస్తూ.

“కుక్క...” అన్నాడు చిన్నారావ్ మరోవైపు చూస్తూ.

“ఆపరేషన్” అన్నాడు రాంబాబు.

అంతే ఇన్స్ పెక్టర్ అప్పారావ్ కి చెమట్లు పట్టాయ్. తనకి కుక్క కిడ్నీ వుందని పోలీస్ డిపార్ట్ మెంట్ లో వీళ్ళిద్దరికీ తప్ప ఇంకెవరికి తెలీదు. ఇప్పుడు వీళ్ళనేం అన్నా రహస్యం గురించి అందరికీ చెప్తారు. అంతేకాదు! వీళ్ళిద్దరూ పోలీస్ కమీషనర్ కాండిడేట్స్... తను వీళ్లనేం చెయ్యలేడు “హి.....హిహిహి...” ఏం చెయ్యలేక నవ్వాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

“అవును ఇందాక దేని గురించి ఏంటది అంటూ అడిగావ్?” రాంబాబు అడిగాడు.

“అంటే మరి.. ఇది పోలీస్ స్టేషన్ కాదా అని అనుమానం వచ్చి అడిగాను. కానీ మీ అందర్నీ చూడగానే డౌట్ తీరిపోయింది.

"అవును ఇది పోలీస్ స్టేషనే!” అన్నాడు చిన్నారావ్.

“మరి నేనెవరి?” అడిగాడు రాంబాబు.

“హెడ్ కానిస్టేబుల్!” చెప్పాడు అప్పారావ్.

“కాదు... ఇన్స్ పెక్టర్! ఇన్స్ పెక్టర్ రాంబాబు!! ఎవరూ?”

“ఇన్స్ పెక్టర్ రాంబాబు!” గుటకలు మింగుతూ అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

“మరి నువ్వు?” అడిగాడు రాంబాబు.

“ఇన్స్ పెక్టర్!” చెప్పాడు అప్పారావ్.

“కాదు... కానిస్టేబుల్ అప్పారావ్... ఎవరూ?”

“కానిస్టేబుల్ అప్పారావ్!!” ఏడుపు మొహంపెట్టి అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

“సరేగానీ.. నాకు చాలా ఆకలిగా ఉంది. ఇరానీ హోటల్ కెళ్ళి బిర్యానీ తీసుకురా.. తెస్తావ్ గా?” అడిగాడు రాంబాబు.

“అలాగే తెస్తాను” అన్నాడు అప్పారావ్.

“తెస్తాను గాదు.. తెస్తాను సార్ అనాలి.”

“అలాగే సార్!”

రాంబాబు జేబులోంచి పది రూపాయలు తీసి అప్పారావ్ కి ఇచ్చాడు.

“రెండు మటన్ బిర్యానీ, రెండు చికెన్ సిక్స్ టీ ఫైవ్, ఆరు బటర్ నాన్, రెండు చిల్లీ చికెన్ తీసుకురా.”

ఇన్స్ పెక్టర్ అప్పారావ్ అయోమయంగా చూశాడు.

“ఏం... ఏం తేవాలో అర్థం కాలేదా?” అడిగాడు రాంబాబు.

“అర్థం అయ్యిందిగానీ పది రూపాయలకి ఇన్ని ఎలా వస్తాయ్?” అడిగాడు అప్పారావ్.

“నువ్వు వేరే వాళ్ళకి పది రూపాయలుచ్చి ఇంతకంటే ఎక్కువ తెప్పిస్తావేమో కదా? కాబట్టి నా ఉద్దేశ్యంలో పది రూపాయల్లో ఇంకా చిల్లర మిగుల్తుంది... ఆ చిల్లర నువ్వు వుంచేస్కో.”

అక్కడున్న కానిస్టేబుల్స్ అందరికీ చచ్చేంత నవ్వొచ్చింది జరుగుతున్నదంతా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇన్స్ పెక్టర్ అప్పారావ్ తనకింద పనిచేసే అందర్తో అలానే ప్రవర్తిస్తాడు. కానీ అప్పారావ్, రాంబాబుకి ఎందుకు భయపడుతున్నాడో వాళ్ళకి అర్థం కావడం లేదు.

“ఇంకా నిల్చున్నావేం.. వెళ్ళి తీస్కురా..” అన్నాడు రాంబాబు.

అప్పారావ్ ఇరానీ హోటల్ నుండి రాంబాబు చెప్పినవన్నీతెచ్చాడు.

అవన్నీ అక్కడున్న కానిస్టేబుల్స్ తో కలిసి పంచుకుని తిన్నారు. రాంబాబు, చిన్నారావ్ లు.

“ఇహ మనింటికి పోదాం పద” అన్నాడు రాంబాబు.

“ఎందుకూ?” భయంగా అడిగాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

"ఏం లేదు... అమ్మగారికి సేవలు చెయ్యాలి కదా?” అన్నాడు రాంబాబు వంకరగా నవ్వుతూ.

ఇన్స్ పెక్టర్ అప్పారావ్ గుండెల్లో రాయి పడింది.