అందరూ దొంగలే - 34

Listen Audio File :

వేరే వార్డులో వున్న రాంబాబు, చిన్నారావ్ లకి ఇన్స్ పెక్టర్ అప్పారావ్ కిడ్నీ ఆపరేషన్ గురించి తెల్సి పగలబడి నవ్వారు. “వాడికి మంచి శాస్తి అయ్యింది... లేకపోతే మనమీద ఎటాక్ జరిందని అన్ని పేపర్లలో వచ్చింది. పోలీస్ కమీషనర్ మనల్ని పలకరించడానికి వచ్చాడు... ఏం... వీడికేం దొబ్బుడాయని మనల్ని పలకరించడానికి రాలేదు. వీడి లెవెల్ అంత గొప్పదా?” అన్నాడు.

“ఏడ్చాడు... ఒంటి కిడ్నీగాడు!” అన్నాడు రాంబాబు. ఓ క్షణం ఆగి “మనం సర్దాగా వాడిని ఏడిపిద్దామా?” అని చిన్నారావు ని అడిగాడు.

“ఎలా?” అడిగాడు చిన్నారావ్.

“పరామర్శించే నెపంతో వెళ్ళి ఏడిపిద్దాం... పద... వాడుండే వార్డ్ కి వెళదాం” అన్నాడు బెడ్ మీంచి కిందకి దిగుతూ...

*** **** **** ***

ఇన్స్ పెక్టర్ అప్పారావ్ కి పరిస్థితి మొత్తం గందర గోళంగా వుంది. వార్డ్ లో తన బెడ్ మీద పడుకుని తీవ్రంగా ఆలోచించసాగాడు. పొరపాటున తన కిడ్నీ ఒకటి తీసేశారు. ఓక్కే.... కానీ దాని బదులుగా కుక్క కిడ్నీ ఎందుకు పెట్టారసలు? నా కిడ్నీకి సబ్స్ టిట్యూట్ గా నాకేదో ఒకిటి చెయ్యండి. అతనేమైనా గోలపెట్టాడా? లేదే... మరి ఆ డాక్టర్ గాడు ఎందుకిలా చేశాడు? వాడు ఇదివరకేమైనా పశువుల డాక్టరా?! “హే భగవాన్!” అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

“హే భగవాన్!!” అంటూ అతనికి నాలుగు గొంతులు విని వినిపించాయి.

“ఏంటీ...నేనింత చిన్నగా హే భగవాన్ అని అంటే ఈ వార్డ్ లో అంత పెద్దగా ప్రతిధ్వనించాలా?” మనసులోని మాటని ఆశ్చర్యంతో పైకే అనేశాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

“అది ప్రతిధ్వని కాదు సార్! హే భగవాన్ అని మే నలుగురం కోరస్ గా అన్నాం” మంచం చుట్టూ వున్న నలుగురు కానిస్టేబుల్స్ లో ఒకడు అన్నాడు.

“ఏం ఎందుకలా అన్నారు? మీకేం పోయేకాలం వచ్చిందని?! చికాకుపడుతూ అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

“మాకేం రాలేదు సార్... మీకే వచ్చాయ్.”

“ఏంటి వచ్చాయ్?” అనుమానంగా చూస్తూ అన్నాడు.

“కుక్క లక్షణాలు సార్.... మీరు సీలింగ్ వైపు చూస్తూ, ఏదో ఆలోచిస్తూ నాలుక కుక్కలా బయటపెట్టి హస్-హస్-హస్.... అంటున్నారు సార్!”

“ఆ....” బాధగా అరుస్తూ జుట్టు పీక్కున్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

“అయినా మీరు నా చుట్టూ ఇంకా ఎందుకు నిలబడ్డారు? పొండి... రాంబాబు, చిన్నారావ్ లకి సెక్యూరిటీగా వుండండి” కోపంతో అన్నాడు.

“సెక్యూరిటీ వాళ్ళకంటే మీకే ఎక్కువ అవసరం సార్” అన్నాడు ఓ కానిస్టేబుల్.

“నాకా... ఎందుకు? గజదొంగ మంగులు వల్ల నాకు డేంజర్ వుందని మీరు భావిస్తున్నారా?” అడిగాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

“కాద్సార్... డాక్టర్ శ్రీనివాస్ వల్లే మీకు డేంజర్ అని భావిస్తున్నాం సార్! మేం ఇక్కడ లేకపోతే మీ రెండో కిడ్నీ కూడా పీకేసి ఈసారి దాని ప్లేస్ లో పంది కిడ్నీ పెడ్తాడేమోనని మాకు భయంగా వుంది సార్” అన్నాడు ఇంకో కానిస్టేబుల్.

“అప్పుడు మీరు పందిలా బురాలో పొర్లుతుంటే మేం చూళ్ళెం సార్” అన్నాడు ఇంకో కానిస్టేబుల్.

“ఈసారి ఆ డాక్టర్ నాయాలు అలాంటి పిచ్చి వేషాలేస్తే నేను వాడిని రివాల్వర్ తో షూట్ చేస్తా! అయినా మీరు నా చుట్టూ చేరి మీ దరిద్రపు కబుర్లతో నా బుర్ర పాడుచేయాలా? వెళ్ళండి.... లేలేకపోతే మిమ్మల్ని షూట్ చెయ్యాల్సి వస్తుంది” అంటూ గట్టిగా అరిచి “హబ్బా!” అని బాధగా పొట్టకింద కుట్ల దగ్గర చేతులు పెట్టుకున్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

కానిస్టేబుల్స్ నలుగురూ అక్కడినుండి నిష్క్రమించారు. వాళ్ళు అలా వెళ్ళగానే అక్కడికి రాంబాబు, చిన్నారావ్ లు వచ్చారు. వాళ్ళని చూడగానే ఇన్స్ పెక్టర్ అప్పారావ్ పై ప్రాణాలు పైనే పోయాయ్. ఇప్పుడు వాళ్ళతో ఏం ఇబ్బంది పడాలో అని లోలోపల భయపడ్డాడు.

“గుడ్ ఈవినింగ్ సార్!” అన్నారు ఇద్దరూ కోరస్ గా.

“గుడ్ ఈవినింగ్!” అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్ నవ్వడానికి ప్రయత్నిస్తూ.

“ఏంటి సార్ ఇలా హాస్పిటల్ లో ఎడ్మిట్ అయ్యారు?!” అమాయకంగా అడిగాడు రాంబాబు.

“ఏం లేదు... ఈ చిటికెన వేలు గోరు నెప్పెడుతుందని ఆస్పత్రికొస్తే వీళ్ళు ఏకంగా సీరియస్ కేసు... అడ్మిట్ అయిపోండి అంటూ కంగారు పెట్టేశారు. ఇప్పుడు ఈ గోరు ఎక్స్ రే తీశారు. స్కానింగ్ తీశారు. బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టు కూడా చేశారు. ఇంకాస్సేపయ్యాక ఇ.సి.జి. కూడా తీస్తారట. ఇంకా రిపోర్ట్స్ రాలేదు... ఏంటోనయ్యా.... ఈ ప్రయివేట్ నర్సింగ్ హోం లన్నీ ప్రతీదానికీ ఇంత హంగామా చేసి మనతో బోల్డంత ఖర్చు పెట్టిస్తారు... ఆ...హహహ...” బలవంతంగా నవ్వుతూ అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

అది విన్న రాంబాబు, చిన్నారావ్ లు పొట్టలు పట్టుకుని అయిదు నిమిషాల పాటు ఘోల్లున నవ్వారు.

ఇన్స్ పెక్టర్ అప్పారావ్ బిత్తరపోయాడు.