TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
.png)
ఆ రాత్రి గడిచింది. ఉదయం రాంబాబు, చిన్నారావ్ లు బెడ్ మీద కళ్ళు తెరిచారు. వాళ్ళ ఎదురుగా సరోజ, సునీతలు....! ఇద్దరి మొహాల్లో ఆందోళన! వాళ్ళని చూడగానే రాంబాబు, చిన్నారావ్ లకి ఆనందంతో “కెవ్వు” మని కేక పెట్టాలనిపించింది. కానీ అంత పెద్ద దెబ్బలు తగిలి, అంత రక్తం కారిన వాళ్ళు అంత ఆనందంగా కేకలుపెడ్తే బాగుండదేమోనని సీరసంగా ఓ నవ్వు నవ్వి వూర్కున్నారు. “ఇప్పుడెలా వుంది?” అడిగింది సరోజ చిన్నారావ్ ని.
“మీరు అడగాల్సింది అక్కడ కాదు.... ఇక్కడ.....” అన్నాడు రాంబాబు సరోజతో. సరోజ రాంబాబు వంక వింతగా చూసి తర్వాత అడిగింది.
“ఇప్పుడెలా వుంది?” అని. “చాలా నీరస్సంగా వుంది” అన్నాడు లేని నీర్సాన్ని నటిస్తూ.
“నొప్పిగా కూడా వుందా?” సునీత రాంబాబుని అడిగింది.
“ఇప్పుడు మీరడగాల్సింది ఇక్కడ.....” అన్నాడు చిన్నారావ్ సునీతతో.
“ఎందుకూ?” ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది సునీత.
“అదంతే... ఇప్పుడు అడగండి” అన్నాడు చిన్నారావ్.
“సరే చెప్పండి.... నొప్పిగా వుందా?”
“మామూలు నొప్పా? భయంకరమైన నొప్పిగా వుంది” అన్నాడు చిన్నారావ్. అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్ సింగినాధం విసుక్కుంటూ అన్నాడు. బుర్రమీద కాసింత తొక్క రేగింది... దానికి భయంకరమైననొప్పా? నమ్మదగ్గ విషయంలా లేదు!”
“అవును... మానొప్పి మీకెలా తెలుస్తుంది?” అన్నాడు రాంబాబు మరింత విస్కుంటూ.
“మా ఒళ్ళంతా రక్తంతో తడిచిపోయింది..... అది మీరు కూడా చూశారుగా?!” అన్నాడు చిన్నారావ్. డాక్టర్ సింగినాధం వెర్రిమొహం వేస్కుని తల వూపాడు అవునన్నట్టు..... కానీ పాపం అతని మనసులో అనేక సందేహాలు....
“అసలు ఇదెలా జరిగింది?” సరోజ రాంబాబుని అడిగింది.
“మమ్మల్ని చంపడానికి గజదొంగ మంగులు మనుషులు ఎటాక్ చేశారు” గంభీరంగా చెప్పాడు రాంబాబు. అదే సమయానికి అక్కడికి వార్డుబాయ్ హడావిడిగా వచ్చాడు.
“సార్.... ఈ వార్డులోనూ, ప్రక్క వార్డులోనూ పేషంట్స్ కి అమర్చిన బ్లడ్ బాటిల్స్ ఎవరో కొట్టేశారు సార్!” అన్నాడు డాక్టర్ సింగినాధంతో.
సింగినాధం మొహం మరింత అయోమయంగా మారింది. రాంబాబు, చిన్నారావ్ ల మీద ఎటాక్ జరిగినట్టు పత్రికావిలేఖరులకి కూడా తెల్సిపోయింది. వాళ్ళు మధ్యాహ్నం రాంబాబు, చిన్నారావ్ ల దగ్గరికొచ్చి ఇంటర్వ్యూ చేసి వెళ్ళిపోయారు. కమీషనర్ లింగారావ్ రాంబాబు, చిన్నారావ్ లని పరామర్శించి వెళ్ళిపోయాడు. హాస్పిటల్ దగ్గర టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేయమని మిగతా అధికారులకు ఫోన్ లో ఆదేశాలు జారీ చేశాడు.
“ఆ............” బాధతో పెట్టిన ఆ కేకతో గజదొంగ మంగులు డెన్ దద్దరిల్లిపోయింది. గజదొంగ మంగులు ఎవరినో టార్చర్ చేస్తుంటే వాళ్ళు బాధతో అలా కేక పెట్టారనుకుంటే అది పొరబాటే! ఆ కేక పెట్టింది ఎవరోకాదు! స్వయంగా గజదొంగ మంగులే! ఇక డెన్ లో సీన్ కొస్తే........
అప్పుడే అరడజను మండే కొవ్వొత్తుల్ని ఆర్పిన మంగులు చెయ్యి కాలి, పిచ్చి గంతులు వేస్తూ చెయ్యి వూదుకోసాగాడు. “బాస్! ఈవేళ చెయ్యి ఎందుకు కాల్చుకున్నారు?” అప్పుడే లోపలికి ఎంటర్ అయిన ఓ దొంగ అడిగాడు.
“ఎందుకంటే ఏం చెప్తాం – మాయదారి రోగం. న్యూస్ పేపర్లో రాంబాబు, చిన్నారావ్ లు హాస్పిటల్ లో కోలుకుంటుండగా మనం ఎటాక్ చేసి వాళ్ళ బుర్రలు బద్దలుకొట్టినట్టు రాశారు. ఈ విషయం రాంబాబు, చిన్నారావ్ లే పేపర్ వాళ్ళతో చెప్పారు....” సమాధానం చెప్పాడు మరో దొంగ.
“అదేంటి? మనవాళ్ళకి ఆ నర్సింగ్ హోమ్ వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసి పంపించాక మళ్ళీ బాస్ ఎవరికీ వాళ్ళని చంపే డ్యూటీ వెయ్యలేదుకదా!” అడిగాడు మొదటి దొంగ.
“చూశావా! అందుకే మన బాస్ కి కోపం వచ్చింది. ఎవరో ఎటాక్ చేస్తే ఆ రాంబాబు, చిన్నారావ్ లు మనమీద తోసేస్తున్నారు. అందుకే వాళ్ళని చంపుతానని ఇప్పుడు కొవ్వొత్తులు ఆర్పి శపథం చేసింది......” చెప్పాడు రెండో దొంగ.
“అనవసరంగా చేతులు కాల్చుకోడం కాకపొతే వాళ్ళని చంపుతానని ఇదివరకే చాలా సార్లు శపథం చేశాడు కదా! మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా చెయ్యడం ఎందుకూ?” అడిగాడు మొదటి దొంగ.
రెండో దొంగ బుర్రకాయ్ పట్టుకున్నాడు. “అబ్బ.... నువ్వు నా మెదడు తినేస్తున్నావ్ కదరానాయనా......” అన్నాడు. డెన్ మధ్యలో మంగులు కాలిన చెయ్యి ఊదుకుంటూ ఇంకా చిందులు వేస్తూనే వున్నాడు.
మొదటి దొంగకి మరో సందేహం వచ్చింది. “అవునుగానీ..... మనం ఎటాక్ చెయ్యకపోయినా, వాళ్ళు మనమే చేశామని న్యూస్ పేపర్ వాళ్ళకి చెప్పారంటే మనకే మంచిది కదా.....!” బుర్ర గోక్కుంటూ అడిగాడు మొదటి దొంగ.
మొదటి దొంగ ప్రశ్న అప్పుడే గెంతడం ఆపిన మంగులు చెవిన పడింది. “ఏం..... ఎందుకు మంచిది?” క్రూరంగా చూస్తూ వాడిని అడిగాడు.
“ఎందుకంటే బాస్! అది మనకి ఫ్రీ పబ్లిసిటీ కాదా?” సంబరంగా అన్నాడు మొదటి దొంగ.
గజదొంగ మంగులుకి తిక్క రేగి వాడి టెంకమీద జెల్లకాయ్ ఫాట్ మని కొట్టాడు. ఆ దెబ్బకి వాడు నేలమీద బోర్లా పడిపోయాడు. “ఫ్రీ పబ్లిసిటీ ఏంట్రా తింగరి నాయాలా! అది మన చేతకానితనాన్ని చూపిస్తుంది. మనం ఎటాక్ చేసినవాళ్ళు బతికున్నారంటే అది మన ముఠాకి ఎంత నామోషీ! ఈ ముఠా నాయకుడిగా నాకెంత అప్రతిష్ట?” హుంకరిస్తూ అన్నాడు గజదొంగ మంగులు.
అంతలోనే తనకి చెయ్యి కాలిన విషయం గుర్తొచ్చి “వామ్మో...... ఉఫ్ ష్..... ఓర్నాయనో..... ఉఫ్....ఉఫ్....” గోలెడుతూ చెయ్యి వూదుకోసాగాడు.
|
|