అందరూ దొంగలే - 29

Listen Audio File :

డిప్పల్లో నర్సింగ్ హోం లో ఆ అర్ధరాత్రి పరుగులు మొదలయ్యాయ్...  నర్సులూ, హెడ్ నర్సులూ, డ్యూటీ డాక్టర్లూ అందరూ ఆ వార్డు వైపు పరుగులు తీస్తున్నారు.

రక్తంతో తడిచిన రాంబాబు, చిన్నారావ్ లని చూసి వార్డులోని జనాలు కెవ్వు కెవ్వుమని అరుస్తున్నారు. రాంబాబు కొద్దిగా కళ్ళు తెరిచి చిన్నారావ్ వైపు చూసి “బాటిల్ తో నెత్తిమీద కొట్టుకోడం కాదుగానీ....... నా బుర్రకాయ్ దిమ్మెక్కిపోయింది” అన్నాడు.

“నా బుర్రకాయ్ కి చిన్న బొక్క పడిందేమోనని నా అనుమానం” అన్నాడు చిన్నారావ్ కళ్ళు మూస్కునే.

“నాక్కూడా అదే అనుమానం....” అన్నాడు రాంబాబు.

“మనం ఇప్పుడు మాట్లాడ్తే బాగుండదనుకుంటా......”

“అవును.... న్యాయంగా అయితే మనం మూర్ఛపోవాలి.”

“అయితే మూర్ఛపోదాం...” ఇద్దరూ కళ్ళు గట్టిగా మూస్కుని తలలు ప్రక్కకి వాల్చేశారు. కారిడార్లోని పరుగుల చప్పుడు వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చి ఆగిపోయాయి. ఓ కిరస్తానీ నర్స్ ఇద్దర్నీ చూసి గుండెల మీద చేయ్యేస్కుని

“ఓ మైగాడ్” అంది.

హిందూ నర్స్ “అయ్యో నా దేవుడా” అని నెత్తిన చేతులు పెట్టుకుంది.

ఇంకో నర్స్ గబగబా పరిగెత్తుకుని ఫోన్ దగ్గరికెళ్ళి ఓ నెంబర్ చేసింది. “హలో.... డాక్టర్ సింగినాధం గారూ..... డిప్పల్లో నర్సింగ్ హోం నుండి మాట్లాడుతున్నాను సార్... రాంబాబు, చిన్నారావ్ ల తలలు బద్దలయ్యాయ్ సార్...... వాళ్ళు చచ్చారో, బ్రతికారో కూడా మాకు తెలీడంలేదు సార్.... మీరు అర్జెంట్ గా రావాలి సార్.” డాక్టర్ సింగినాధానికి ఇన్ ఫార్మ్ చేసి ఫోన్ చేట్టేసింది నర్స్.

పావుగంటలో డాక్టర్ సింగినాధం అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆయన రాగానే ఇందాక ఫోన్ చేసిన నర్స్ పరుగున వెళ్ళి ఆయన గుండెల మీద వాలిపోయింది.

“మరేం పర్లేదు..... నేనున్నాగా?” అంటూ నర్స్ వీపు నిమరడం మొదలుపెట్టాడు సింగినాధం.

“అబ్బా! ఆవిడగారి వీపు తీరుబడిగా రుద్దుదువుగానీ.... ముందు ఆళ్ళ సంగతి చూడవయ్యా డాక్టరూ!” బాధపడుతూ అన్నాడు వార్డులోని ఓ పేషెంట్.

డాక్టర్ సింగినాధం నాలుక్కర్చుకున్నాడు. అతని మాటలు పట్టించుకోకుండా నర్స్ డాక్టర్ సింగినాధంతో ఇలా అంది. “వీపు నిమరడం ఆపి కాస్సేపు అక్కడే కాస్త గోకండి డాక్టర్........ వీపంతా చాలా దురదగా వుంది.” నర్స్ మాటలకు డాక్టర్ సింగినాధానికి చాలా చికాకు పుట్టింది.

“ఇప్పుడు నీ వీపు గోకుతూ కూర్చుంటే పేషంట్లు ఇద్దరూ హరీ అంటారు....... అప్పుడు నిన్నూ నన్నూ కలిపి జనాలు చావ బాదుతారు........” అన్నాడు.

రాంబాబు, చిన్నారావ్ లను ఆపరేషన్ ధియేటర్ లోకి తీస్కేళ్ళారు. ఆపరేషన్ ధియేటర్ లోంచి డాక్టర్ సింగినాధం, నర్స్ బయటికి వచ్చారు. డాక్టర్ సింగినాధం మొహం చాలా పరేశానీగా వుంది. అక్కడ వెయిట్ చేస్తున్న అయిదారు మందిలో ఒక వ్యక్తి సింగినాధం మొహంలోకి ఎక్స్ ప్రెషన్ చూసి ఆందోళనగా అడిగాడు “ఏంటి డాక్టర్.... ఆపరేషన్ ఫేలయిందా? పేషంట్లు టపా కట్టేశారా?”

“కాదు...... ఆపరేషన్ సక్సెస్ అయ్యింది” చెప్పాడు డాక్టర్ సింగినాధం.

“మరి మీ మొహం ఎందుకలా వుంది?” ప్రశ్నించాడు ఆ వ్యక్తి.

“ఎందుకంటే వాళ్ళిద్దరి బుర్రల మీదా చాలా చిన్న గాయమయ్యింది. కాసింత తొక్క రేగింది అంతే! అంత చిన్నగాయం నుండి అంత రక్తం ఎలా కారిందో నాకస్సలు అర్ధం కావడం లేదు.”

“అవును.... వాళ్ళ ఒళ్ళంతా రక్తంతో తడిసిపోయింది” అన్నాడు మరో వ్యక్తి.

డాక్టర్ సింగినాధం బుర్రకాయ్ గోక్కున్నాడు. “పోనీ అంత చిన్న గాయం నుండి అంతెక్కువ రక్తంకారిందే అనుకుందాం... ఒక్క బొట్టు రక్తం కూడా వాళ్ళకి ఎక్కించాల్సిన అవసరం కలగలేదు... అదే వింతగా వుంది” అన్నాడు.