TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
.png)
డిప్పల్లో నర్శింగ్ హోం దగ్గర మోటార్ బైక్ ఆపాడు డేవిడ్.
“ఇదే నర్సింగ్ హోం” అన్నాడు బోర్డువంక చూస్తూ, వెనక సీట్లో కూర్చుని వున్న జాకబ్ తో. ఇద్దరూ మోటార్ బైక్ దిగారు. డేవిడ్ బైక్ కి స్టాండ్ వేసి లాక్ చేశాడు.
ఇద్దరూ డిప్పలో నర్సింగ్ హోం గుమ్మంవైపు అడుగులు చేశాడు.
“ఇంతకీ వాళ్ళిద్దరూ ఏ వార్డ్ లో వున్నారో?!” అన్నాడు జాకబ్ డేవిడ్ తో
“ముందు మనం హాస్పిటల్ లో ఎడ్మిట్ అయిపోవాలి.... ఆ తర్వాత రాంబాబు, చిన్నారావ్ లు ఎక్కడ వున్నారో ఆటోమేటిక్ గా తెల్సిపోతుంది. తర్వాత అదను చూసి ఇద్దర్నీ సఫా చేసేయ్యడమే” చెప్పాడు డేవిడ్.
“కానీ నర్సింగ్ హోం లో ఎడ్మిట్ అవడం ఎలా.....?” బుర్ర గోక్కుంటూ అన్నాడు జాకబ్.
“చెప్తాగా.... పద” అంటూ డిప్పల్లో నర్సింగ్ హోంలోకి దారితీశాడు డేవిడ్. అతన్ని అనుసరించాడు జాకబ్. డిప్పల్లో హాస్పిటల్ లోపల డాక్టర్ సింగినాధం ఎదురుగా యిద్దరు వ్యక్తులు కూర్చుని వున్నారు.
“ఆపరేషనంటే మరేం పర్లేదుకదండీ! నాకేంటో గుండె దడగా వుందండీ” అన్నాడు మొదటి వ్యక్తి.
“మా ప్రాణానికేం హాని లేదుకదండీ...! నాకూ కాళ్ళు చేతులూ ఆడడం లేదండీ” అన్నాడు రెండో వ్యక్తి.
డాక్టర్ సింగినాధం చికాకుగా మొహం పెట్టాడు. అప్పటికి అరగంట నుండీ ఇద్దరూ ఆయన మెదడ్ని తినేస్తున్నారు.
“ఏంటయ్యా బాబూ నన్ను చంపేస్తున్నారు? మీకు చేస్తున్నదేమైనా కాన్సర్ ఆపరేషనా? లేపోతే గుండెకాయ్ ఆపరేషనా? ఆప్టరాల్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్! అయిదు నిముషాలు కూడా పట్టదు....” అన్నాడు డాక్టర్ సింగినాధం వాళ్ళతో విసుగ్గా.
“అంతేనంటారా?” అన్నారు ఇద్దరూ కోరస్ గా.
“సార్! మీకోసం మెడికల్ రిప్రజెంటేటివ్ వచ్చారు” లోపలికొచ్చి చెప్పాడు వార్డ్ బోయ్.
“లోపలికి పంపు....” వార్డ్ బోయ్ తో అన్నాడు డాక్టర్ సింగినాధం. వార్డ్ బోయ్ బయటికెళ్ళాడు.
“మీరు బయట బెంచీ మీద కాస్సేపు వెయిట్ చెయ్యండి” ఇద్దరు పేషెంట్స్ తో చెప్పాడు డాక్టర్ సింగినాధం. వాళ్ళిద్దరూ లేచి నిలబడ్తుండగా మెడికల్ రిప్రజెంటేటివ్ లోపలికి అడుగు పెట్టాడు. రిసెప్షన్ లో ఉన్న వ్యక్తి డేవిడ్, జాకబ్ ల వంక విసుగ్గా చూశాడు.
“కడుపునొప్పికి నర్సింగ్ హోమ్ లో అడ్మిట్ చేస్కోరయ్యా బాబూ! ఔట్ పేషెంట్ గానే ట్రీట్ చేస్తార్.....” అన్నాడు బాధని నటిస్తున్న వాళ్ళిద్దరితో.
“ఇది మామూలు కడుపునొప్పి కాదు సార్...” పొట్ట పట్టుకుని బాధతో మెలికలు తిరుగుతూ అన్నాడు డేవిడ్,
“నా ప్రాణాలు పోయేట్టుగా వున్నాయ్!” అన్నాడు బాధగా.
“విచిత్రంగా ఇద్దరికీ ఒకేసారి తీవ్రమైన కడుపునొప్పి వచ్చిందే! అయినా మిమ్మల్ని నర్సింగ్ హోం లో అడ్మిట్ చేస్కునే అవసరం ఉందో లేదో డాక్టర్ గారే చెప్పాలి. మీరిలా లోపలికి వెళ్ళి, కారిడార్ చివరిదాకా నడిచి, లెఫ్ట్ కి తిరిగితే రెండో రూంలో డాక్టర్ సింగినాధం గారుంటారు. ఆయన్ని కలవండి” అన్నాడు రిసెప్షనిస్టు.
“ఏంటి... డాక్టర్ సింగినాధమా! హి హి హి” జాకబ్ కి నవ్వొచ్చేసింది ఆ పేరు వినగానే.
జాకబ్ వెనకనుండి అతని పిర్రని గట్టిగా గిల్లెస్తూ, మెల్లగా అన్నాడు డేవిడ్
“నీకిప్పుడు విపరీతమైన కడుపునొప్పుంది. నువ్వలా నవ్వకూడదు.” జాకబ్ నాలుక కర్చుకున్నాడు.
“ఏంటి..... డాక్టర్ సింగినాధమా?” ఈసారి బాధగా మొహం పెడుతూ అడిగాడు.
“అవును!” ఇద్దరివంకా వింతగా చూస్తూ అన్నాడు రిసెప్షనిస్ట్.
డేవిడ్, జాకబ్ అక్కడినుండి కదిలి కారిడార్ లో మెల్లగా నడవడం ప్రారంభించారు.
|
|