TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
.png)
రాంబాబు, చిన్నారావ్ లు తేరుకోడానికి కొన్ని క్షణాలు పట్టింది.
“ఒరేయ్... చిన్నా..... నేను చూస్తున్నదే నువ్వు కూడా చూస్తున్నావ్ కదూ?” ఆవైపే చూస్తూ అడిగాడు రాంబాబు.
“అవును.... మనం ఇద్దరం ఒకే దృశ్యాన్ని చూస్తున్నాం.....” చెప్పాడు చిన్నారావ్ తను కూడా దృష్టిని మరల్చకుండా అటువైపే చూస్తూ.
“ఇద్దరూ వ్యక్తులకి కామన్ గా ఒకే కల రాదు కదూ?” అటే చూస్తూ అడిగాడు.
“చచ్చినా రాదు!” అన్నాడు చిన్నారావ్ కూడా అటే చూస్తూ.
“అంటే ఇప్పుడు మనిద్దరం చూస్తున్నది కల కాదన్నమాట.......!”
“ముమ్మాటికీ కాదు!”
“అయితే ఇప్పుడు చెప్పు....! నువ్వు ఎవర్ని చూస్తున్నావ్?”
“ఇద్దరు దేవతల్ని చూస్తున్నాను.”
“ఆ దేవతలు కిరీటాలూ, నగలూ ధరించి, పట్టుచీరలు కట్టుకుని వున్నారా?” అడిగాడు రాంబాబు.
“కాదు..... ఇద్దరూ సుబ్బరంగా నర్స్ ల గెటప్ లో వున్నారు.”
“అయితే నువ్వూ నేను చూస్తున్న దృశ్యం ఒకటే... కలకాదు.”
“ఆ విషయం ఇందాకే చెప్పాను.” రాంబాబు, చిన్నారావ్ లు యిద్దరూ సంతోషంగా మొహమొహాలు చూస్కుని మళ్ళీ ఆ వైపుకి చూశారు. దూరంగా వస్తున్న ఇద్దరు నర్సులు ఒక బెడ్ దగ్గర ఆగారు. ధర్మామీటర్ తీసి వెర్రిమొహం వేస్కుని చూస్తున్న ఓ పేషంట్ నోట్లో పెట్టింది ఓ నర్స్....
కొన్ని క్షణాలు ఆగి ధర్మామీటర్ తీసి చూసింది ఆమె. “ఓ మైగాడ్.... నూట నాలుగు జ్వరం వుందే” అంది ఆ నర్స్.
ఆ పేషెంట్ ప్రక్కనే వున్న అతని భార్య గుండెలు బాదుకుంటూ అంది “వామ్మోవ్..... ఇందాక ఒళ్ళు చల్లగానే వుంది నర్సమ్మా... ఇప్పుడేంటి ఇంత హీటేక్కిపోయింది?” ఆమె భర్త నర్సుల వంక చూస్తూ “హి హి హి” అని నవ్వాడు.
“మరేం కంగారు పడక్కర్లేదు..... ఓ సూది పోటు పొడుస్తాంలే” అంది మొదటి నర్స్.
రెండో నర్స్ సిరెంజిలో మందెక్కించి ఇచ్చింది. మొదటి నర్స్ అతని జబ్బలోకి కసుక్కున ఇంజక్షన్ సూది దించి ఇంజక్షన్ చేసింది. అప్పుడు కూడా అతను హి హి హి..... అని నవ్వాడు. వాళ్ళిద్దరూ అక్కడి నుండి ముందుకు కదిలారు. వాళ్ళు తమ బెడ్స్ దగ్గరికి విజిట్స్ కి వస్తారని మిగతా పేషెంట్స్ లో ఒకడు తలదువ్వుకోడం.... ఒకడు అద్దంలో మొహం చూస్కోడం..... ఒకడు ఒంట్లో ఎంత బాధగా వున్నా కులాసా నవ్వొకటి మొహం మీదికి తెచ్చుకోడం ఇలాంటి పన్లన్నీ చేశారు.
ఆ నర్సులిద్దరూ అందరి దగ్గరా ఆగి ఒకరికి బి.పి. చూడ్డం, ఒకరికి జ్వరం చూడ్డం...... ఒకరికి ఇంజక్షన్ చెయ్యడం.... ఇలా అందర్నీ అటెండ్ అవుతూ చివరికి రాంబాబు, చిన్నారావ్ ల దగ్గరికి వచ్చారు. వాళ్ళని చూడగానే సన్నగా, తెల్లగా, పొడుగ్గా వున్న నర్స్ కంగారు పడింది.
“ఇదేంటీ.....” వీళ్ళిద్దరూ యిలా కొయ్యబారిపోయారు? సీరియస్ కేసా.....?” అంది ప్రక్కనే వున్న బొద్దుగా, తెల్లగా, కాస్త పొట్టిగా వున్న నర్స్ తో.
“ఏమో....! చూడబోతే అలానే వుంది.... డ్యూటీ డాక్టర్ ని పిలుచుకురానా?” కంగారుగా అడిగింది బొద్దుగా వున్న నర్స్.
“అక్కర్లేదు....” అన్నాడు రాంబాబు కళ్ళు రేపరేపలాడిస్తూ.
“మేమిద్దరం మిమ్మల్ని చూసే కొయ్యబారిపోయాం.....” అన్నాడు చిన్నారావ్. ఇద్దరు నర్సులూ ముసిముసిగా నవ్వారు
“మేం మొన్న ఇక్కడ జాయిన్ అయ్యాం.... ఈ రెండ్రోజులూ మీరు కనబడలేదేం?” అడిగాడు రాంబాబు.
“ఒకరోజు డ్యూటీ ఆఫ్... ఇంకో రోజు లీవ్ లో వున్నాం.....” చెప్పింది బొద్దుగా వున్న నర్స్.
“ఆ నర్సులిద్దరూ రాంబాబు, చిన్నారావ్ ల కేస్ షీట్ లను చూశారు.
“ఊ... మీరింకా యిక్కడ వుండాల్సి వస్తుంది” అంది సన్నగా, పొడ్డుగా వుండే నర్స్.
“అవునా....? ఆనందంగా అన్నాడు చిన్నారావ్.
“ఇంతకీ మీ పర్లేంటో?” అడిగాడు రాంబాబు.
“ఎందుకూ...? మమ్మల్ని సిస్టర్ అని పిలిస్తే చాలు పలుకుతాం” అంది బొద్దుగా వున్న నర్స్.
రాంబాబు, చిన్నారావ్ లు బాధగా “ఆ....” అని అరిచారు.
“మీరు పేరు చెప్పకపోయినా పర్లేదు.... మిమ్మల్ని నర్స్ అని పిలుస్తాం తప్ప సిస్టర్ అని పిలవలేం” బాధగా అన్నాడు రాంబాబు.
“ప్లేజ్... మీ పేర్లు చెప్పరూ?” ప్రాధేయపడుతూ అడిగాడు చిన్నారావ్.
“నా పేరు సరోజ!” చెప్పింది సన్నగా, పొడుగ్గా వున్న నర్స్.
“నా పేరు సునీత!” అంది బొద్దుగా వున్న నర్స్.
రాంబాబు, చిన్నారావ్ ల మొహాలు ఆనందంతో వెలిగిపోయాయి. “ధాంక్స్ అండీ... మీ ఋణం ఈ జన్మలో తీర్చుకోలేం” అన్నాడు రాంబాబు ఆనందబాష్పాలు రాలుస్తూ. సరోజ,
సునీతలు అక్కడి నుండి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు.
“యాహూ!” సంతోషంతో రాంబాబు, చిన్నారావ్ లు గట్టిగా అరిచారు. వాళ్ళ అరుపుకి వార్డ్ లో బెడ్ మీద కూర్చుని బత్తాయి వల్చుకుంటున్న ఒక పేషెంట్ చేతిలోంచి ఆ బత్తాయిపండు జారి క్రింద పడిపోయింది. ఒక హార్ట్ పేషెంట్ గుండెలమీద రెండు చేతులూ పెట్టుకుని చిన్నగా మూలిగాడు. అప్పుడే మందు తాగుతున్న ఓ పేషెంట్ కి పొలమారింది. అందరూ ఇద్దరివంకా కోపంగా చూశారు. రాంబాబు, చిన్నారావ్ లు ఇబ్బందిగా నవ్వారు.
రాంబాబు, చిన్నారావ్ లు ఇద్దరూ సంతోషంగా కేకైతే పెట్టారు గానీ.... ఇద్దరి మనసులో ఓ సందేహం ఒకేసారి కలిగింది. ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూస్కున్నారు. “ఇంతకీ నీ సంతోషానికి కారణం?” భయం భయంగా చిన్నారావ్ వంక చూస్తూ అడిగాడు రాంబాబు.
“అదే ప్రశ్న నిన్ను అడిగాలని అనుకుంటున్నా” అన్నాడు చిన్నారావ్.
“నా సంగతి తర్వాత... ముందు నీ సంగతి చెప్పు..... నువ్వెవరికి లైన్ చేస్తున్నావ్?” అడిగాడు రాంబాబు.
“నేనా.... నేనూ... నేనూ... నేనూ... సందేహిస్తూ అన్నాడు చిన్నారావ్. “
నీ నాన్చుడు బేరం మండా... త్వరగా చెప్పు సస్పెన్స్ తో చస్తున్నా” అరిచాడు రాంబాబు.
“నేను సునీతకి లైనేస్తున్నా!” భయం భయంగా రాంబాబు వంక చూస్తూ చెప్పాడు చిన్నారావ్. రాంబాబు మొహంలో టెన్షన్ మొత్తం పోయింది.
వెరీగుడ్.... అయితే మన మధ్య కాంపిటీషనేమీ లేదన్నమాట....... నేను సరోజకి లైనేస్తున్నా!” సంతోషంతో కెవ్వుమని అరిచారు. మరోసారి ఇందాకటి పేషెంట్ చేతిలోని రెండో బత్తాయిపండు కూడా జారి నేలమీద పడిపోయింది. ఇంకో పేషెంట్ మళ్ళీ మందు తాగుతూ పొలమారాడు. హార్ట్ పేషెంట్ ఈసారి గట్టిగా మూలిగాడు బాధగా.
|
|