TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
.png)
దీపని గజదొంగ మంగులు కిడ్నాప్ చేసిన తర్వాత లోనైన షాక్ నుండి పోలీస్ కమీషనర్ లింగారావ్. శ్రీలక్ష్మిలు ఇంకా తేరుకోలేదు. భయంతో దీపని వాళ్ళు స్కూలు కి పంపడం లేదు.
కమీషనర్ లింగారావ్ గబగబా యూనిఫాం వేస్కుని, నడుంకి బెల్ట్ బిగించి షూస్ వేస్కున్నాడు. ఇంతలో శ్రీలక్ష్మి అక్కడికి వచ్చింది. “అంత హడావిడిగా ఎక్కడికి పరుగులు తీస్తున్నారు?” అడిగింది భర్తని చికాకుగా.
లింగారావ్ భార్యవంక ఆశ్చర్యంగా చూశాడు. “ఎక్కడికంటావేంటీ....? ఆఫీసుకి!” అన్నాడు.
“ఆహా....! అలాగా....?? నేనింకా మీ సెకండ్ సెటప్ దగ్గరికనుకున్నాలే” వ్యంగ్యంగా అంది శ్రీలక్ష్మి.
కమీషనర్ లింగారావ్ చాలా కంగారు పడిపోయాడు. “రామ రామ.... నాకేం పాపం తెలీదే బాబూ.... నాకేంటీ... సెకండ్ సెటప్పెంటీ....? నీకేవరో నేనంటే గిట్టనివాళ్ళు చెప్పారు...” అన్నాడు భయంగా శ్రీలక్ష్మి వంక చూస్తూ.
“నాకూ తెల్సులెండి! మీరు ఫస్టు సెటప్ కే పనికిరారు.... మీ మొహానికి సెకండ్ సెటప్ కూడానా?” అంది శ్రీలక్ష్మి చికాకుగా.
“ఆ... నువ్వట్టాగే అంటావ్.... మన పాపకి అచ్చంగా నా పోలికలే వచ్చాయ్ తెల్సా?” బుంగమూతి పెడ్తూ అన్నాడు కమీషనర్ లింగారావ్.
“ఏడ్చారులే..... ఎప్పుడో ఇక్ష్వాకుల కాలంనాటి మాటలు చెప్పకండి! ఏంటి అంత కంగారుగా ఆఫీసుకి బయలుదేరారు...... ఏం... ఈ వేళ శనివారం అని మర్చిపోయారా?”
లింగారావ్ గతుక్కుమన్నాడు. శనివారం శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామికి నిష్ఠగా పూజ చేస్తుంది. పూజయ్యాక హారతి తీర్ధ ప్రసాదాలూ తీసుకునిగాని అతను ఆఫీసుకెళ్ళడానికి వీల్లేదు.
“ఈ వేళ శనివారం అని మర్చిపోయినందుకు చెంపలేస్కోండి.....” అంది శ్రీ లక్ష్మి భర్తతో.
లింగారావ్ సందేహిస్తూ క్షణం ఆలస్యం చేశాడు. అంతలోనే కంగారుపడి శ్రీలక్ష్మి అతని చెంపలు చెళ్ళు చెళ్ళు వాయించి “నేను చెంప లేసేశానుగా... ఇంక మీరేస్కోనక్కర్లేదు లెండి....! నేను పూజ చేస్కోడానికి లోపలికెళుతున్నా.... నేను వచ్చేదాకా వుండండి” అనేసి లోపలికెళ్ళింది.
లింగారావ్ నెత్తిన ఠపా ఠపా మొట్టుకుని సోఫాలో కూలబడ్డాడు. ఓ అరగంట తర్వాత శ్రీలక్ష్మి పూజ ముగించి లోపలినుండి బైటికొచ్చింది హారతి పళ్ళెంతో. కమీషనర్ లింగారావ్ హారతి కళ్ళ కద్దుకుని తీర్ధం, ప్రసాదం తీస్కున్నాడు. సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది.
లింగారావ్ ఫోన్ తీసి “హలో!” అన్నాడు.
“హలో.... నేను మంగుల్ని....!! హ...హ...హ...” గట్టిగా నవ్వుతూ తర్వాత దగ్గొచ్చేసి దగ్గసాగాడు గజదొంగ మంగులు.
“నువ్వెంత గజదొంగవైనా మరీ అంత దగ్గొచ్చేలా నవ్వడం నాకేం నచ్చలేదు.... నువ్వు చెప్పయినా దగ్గు.... దగ్గయినా చెప్పు....” చికాకుగా అన్నాడు కమీషనర్ లింగారావ్.
“ఇంకా చెప్పేదేంటి.... నీ కూతుర్ని రక్షించుకున్నావని అనుకున్నావేమో...? కానీ నా ప్రయత్నాల్ని ఇంకా మానుకోలేదు... అది గుర్తుంచుకో!” అని ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు మంగులు.
“ఎవరండీ అది?” అడిగింది శ్రీలక్ష్మి.
కమీషనర్ లింగారావ్ మంగులు ఫోన్ గురించి చెప్పాడు.
“మన పాపని రక్షించిన రాంబాబు, చిన్నారావ్ లకే పాప సెక్యూరిటీ బాధ్యతని అప్పగించండి... లేకపోతే మీ కుడిచేయ్యో, ఎడమకాలో వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తానని మొక్కుకోవాల్సి వస్తుంది?’ భర్తకి వార్నింగ్ యిచ్చింది శ్రీలక్ష్మి.
“నేను అదే అనుకుంటున్నా!” అన్నాడు కమీషనర్ లింగారావ్.
|
|