TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
.png)
మధ్యాహ్నం ఒంటిగంటయ్యింది. రాంబాబు, చిన్నారావ్ లకి ఆకలి దంచేస్తోంది. ఆ వైపుగా వెళ్తున్న వార్డ్ బోయ్ ని పిలిచాడు రాంబాబు.
“ఏం బాబూ! మాకు భోజనం ఏర్పాట్లేమైనా వున్నాయా?” అడిగాడు వార్డ్ బాయ్ ని.
“పోలీస్ కమీషనర్ గారు హాస్పిటల్ సూపర్నెంటుకి ఫోన్ చేసి మీకు భోజనం పెట్టోద్దన్నారంట!” చెప్పాడు వార్డ్ బాయ్.
రాంబాబు, చిన్నారావ్ లు మొహమొహాలు చూస్కున్నారు. ఇద్దరి మొహాల్లో ఆశ్చర్యం! పొద్దున్నే వచ్చి పూలగుత్తులిచ్చి, తెగ పోగిడిపోయిన కమీషనర్, ఇప్పుడు తిండికూడా పెట్టొద్దని చెప్పాడేంటబ్బా!..... అనుకున్నారు.
“ఆకల్తో కడుపు మండిపోతుందయ్యా బాబూ! తిండి పెట్తోద్దంటే ఎలా? చికాకు నణుచుకుంటూ అన్నాడు చిన్నారావ్.
“అంటే మా హాస్పిటల్ భోజనం పెట్టోద్దన్నారండీ!” ఆయన ఇంటి నుండి క్యారియర్ పంపిస్తున్నరట!” అని చెప్పి అక్కడినుండి వెళ్ళిపోయాడు వార్డ్ బాయ్.
రాంబాబు, చిన్నారావ్ ల మొహాలు వెలిగిపోయాయి. పోలీస్ కమీషనర్ యింటి నుండి స్పెషల్ భోజనం!! కమీషనరే స్వయంగా చొరవ తీస్కుని పంపిస్తున్నాడు. వాళ్ళిద్దరూ కమీషనర్ అభిమానాన్ని పూర్తిగా పొందినట్టే లెక్క!
“అయితే మనకి ప్రమోషన్ రావడం ఖాయమే.....!” అన్నాడు రాంబాబు.
“అవును.... అవును!” బుర్రకాయ్ తొండలా నిలువుగా ఊపుతూ అన్నాడు చిన్నారావ్.
ఓ అయిదు నిముషాల తర్వాత మప్టీలో ఉన్న ఓ కానిస్టేబుల్ కమీషనర్ లింగారావ్ ఇంటినుండి ఇద్దరికీ క్యారియర్ తెచ్చాడు. క్యారియర్ లో రెండు రకాల స్వీట్స్, రెండు రకాల కూరలతో మంచి భోజనం వుంది. దాంతోపాటు కమలాపళ్ళు, యాపిల్ పళ్ళూ, ద్రాక్ష పళ్ళు కూడా పంపించారు పోలీస్ కమీషనర్.
ఇద్దరూ సుష్టిగా భోజనం చేశారు. వచ్చిన మనిషి క్యారియర్ తీస్కుని వెళ్ళిపోయాడు.
మరు నిముషం వాళ్ళిద్దరి దగ్గరికీ బిలబిలమంటూ నలుగురు వ్యక్తులు వచ్చారు.
“మేం ప్రెస్ నుండి వచ్చాం. నేను ఆంధ్ర దిబ్బ, ఈ ఆంధ్ర గబ్బు ఈయనేమో డైలీ మంట, ఆయనేమో న్యూసెన్స్ న్యూస్ న్యూస్ పేపర్స్ నుండి వచ్చాం” అందులో ఒక వ్యకి పరిచయం చేస్కున్నాడు.
రాంబాబు, చిన్నారావ్ లు ఉక్కిరిబిక్కిరి అయిపోతూ వాళ్ళకి నమస్కారం పెట్టాడు.
“గజదొంగ మంగుల్ని ఎదుర్కోడంలో మీరు ప్రదర్శించిన ధైర్య సాహసాలు విని చాలా అద్బుతంగా ఫీలయ్యాం. అంతేకాదు....... పోలీస్ కమీషనర్ గారి పాప ప్రాణాలను కూడా కాపాడారు. అందుకే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయ్యడానికోచ్చా” అన్నాడు రిపోర్టర్.
“చాలా సంతోషం! చేస్కోండి!” అన్నాడు రాంబాబు భయపడుతూ.
వాళ్ళెం ప్రశ్నలడుగుతారోనని చెడ్డ భయంగా వుంది ఇద్దరికీ.
“మీరు మంగుల్ని ఏ ఆయుధం లేకుండా ఎదుర్కొన్నారట కదా! మీకేం భయం కలగలేదా?” ఒక రిపోర్టర్ ప్రశ్న.
“లేదండీ! చిన్నప్పటినుండీ మా ఇద్దరికీ చాలా ధైర్యం ఎక్కువ! అదేంటోగానీ దాన్నిఎంత తగ్గించుకోవాలని ప్రయత్నించినా అది తగ్గడం లేదండీ....” సిగ్గుపడుతూ అన్నాడు చిన్నారావ్.
రాంబాబు “హిహిహి....” అని నవ్వాడు.
“మంగులు చూడ్డానికి ఎలా వున్నాడు....?” మరో రిపోర్టర్ ప్రశ్న.
“ఇంచుమించు మీలాగే వున్నాడు సార్.....!” చిన్నారావ్ సమాధానం.
పాపం! ఆ రిపోర్టర్ ఇబ్బందిగా మొహంపెట్టి “హిహిహి......” అంటూ నవ్వాడు.
“మంగుల్ని ఎదుర్కున్న సమయంలో మీరెలా ఫీలయ్యారు-?” మరో రిపోర్టర్ ప్రశ్న.
“చాలా ఆశ్చర్యంగా ఫీలయ్యాను!” రాంబాబు చెప్పాడు.
“ఆశ్చర్యంగానా....” వింతగా వుందే.....?! ఎందుకని......? అడిగాడు రిపోర్టర్.
“ఎందుకంటే మంగులు నా పర్స్ కొట్టేశాడు. దాంట్లో కేవలం ఆరు రూపాయలా డెబ్బై అయిదు పైసలున్నాయ్!” అన్నాడు రాంబాబు. ప్రెస్ రిపోర్టర్లందరూ ఆశ్చర్యంగా మొహమొహాలు చూస్కున్నారు....!
|
|