TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
.png)
డిప్పల్లో నర్సింగ్ హోం....
ఉదయం 8 గంటలైంది.
రాంబాబు, చిన్నారావ్ లు ఇద్దరూ ఒకేసారి కళ్ళు తెరిచారు. ఇద్దరూ పక్కపక్క బెడ్ ల మీదున్నారు. రాంబాబు మెల్లగా తలతిప్పి ఆ ప్రక్కకి చూశాడు. అదే సమయంలో చిన్నారావ్ తల త్రిప్పి ఈ ప్రక్కకి చూశాడు. ఇద్దరి చూపులూ కలిశాయి.
“మనిద్దరం బతికే వున్నామా?” అడిగాడు రాంబాబు.
చిన్నారావ్ మళ్ళీ ఆ వైపుకి తలత్రిప్పి చూశాడు. వార్డు ఆ చివర దాకా పేషెంట్లు పడుకుని వుండడం అతనికి కనిపించింది. ఇటు తిరిగి రాంబాబుతో అన్నాడు. “బతికే వున్నామానుకుంటా...... అదిగో మనతో బాటు మిగతా పేషంట్లు కూడా వున్నారుగా?”
“అయితే ఆపరేషన్ సక్సెసేనన్నమాట!” అన్నాడు రాంబాబు.
“ఏమో మరి..... ఆ విషయం తేల్చేది మనం ఈ మంచం దిగి మామూలుగా నడిచినప్పుడు” అన్నాడు చిన్నారావ్.
ఇద్దరూ సైలెంట్ గా తలలు త్రిప్పి వార్డులోని మిగతా వారిని గమనించసాగారు. ఓ బెడ్ మీద మంచానికి అతుక్కుపోయి ఓ పేషెంట్ వున్నాడు. మాసిన గెడ్డంతో, కళ్ళు లోతుకుపోయి చాలా నీర్సంగా వున్నాడతను. అతని ప్రక్కనే కూర్చుని వున్న అతని భార్య చేతిలో బిస్కెట్ పాకెట్ వుంది. అందులోంచి ఒక్కో బిస్కెట్ తీస్కుని పరపర నమిలేయ్యసాగింది ఆమె.
ఆమె భర్త ఓ నిముషంపాటు ఆమెవంక నిశ్చలంగా చూసి తర్వాత నీర్సంగా అన్నాడు. “అప్పుడప్పుడూ నాక్కూడా ఓ బిస్కెట్ ఇవ్వవే.... అబ్బాయ్ వాటిని నా కోసం తెచ్చాడనుకుంటా.”
“వద్దు.....మీరు తినకూడదు. తింటే కక్కుకుంటారని నా భయం!” అంది ఆవిడ ఆయన మొహం చూడకుండానే. అతను ఓ సారి దీర్ఘంగా మూలిగి నీర్సంగా కళ్ళు మూస్కున్నాడు. ఆమె మాత్రం చకచకా నోట్లోకి బిస్కెట్లు ఎగరేస్తూనే వుంది. ఈటింగ్ కాంపిటీషన్ లో నిముషానికి ఎన్ని బిస్కెట్లు తింటారో అన్న పోటీలో పాల్గొన్నట్టు ఉంది ఆమె తినే పద్దతి చూస్తుంటే.
మరోప్రక్క ఒక పేషంట్ గబగబా మంచం దిగి స్కిప్పింగ్ చేస్తున్నట్టు గంతులేయ్యడం మొదలుపెట్టాడు. ఆ దృశ్యం చూసి రాంబాబు, చిన్నారావ్ లకి చచ్చేంత ఆశ్చర్యం వేసింది. “అదేంటి? ఆయనెందుకు షడన్ గా అలా గంతులెయ్యడం మొదలు పెట్టాడు....?” అడిగాడు
బెడ్ ప్రక్కనే స్టూల్ మీదు కూర్చున్న అతని భార్య. “మందుని బాగా షేక్ చేసి తాగమని డాక్టర్ గారు చెప్పారట నాయనా! ఈయన ఓ మతిమరుపు పీనుగకదా నా ప్రాణానికి.... మందుని షేక్ చెయ్యకుండా అలాగే తాగేశారట. ఇప్పుడు ఆ విషయం గుర్తొచ్చి మందు పొట్టలో బాగా కలవాలని వెర్రిగా అలా గంతులేస్తున్నారు” అందావిడ చికాకుగా.
రాంబాబు, చిన్నారావ్ లు ఇద్దరూ కిసుక్కున నవ్వారు. ఆవిడ ఇద్దర్నీ చురచురా చూసింది. అదే టైంలో కమీషనర్ లింగారావ్ పూల బొకేలతో వార్డులోకి హడావుడిగా వచ్చాడు. కమీషనర్ ని చూడగానే రాంబాబు. చిన్నారావ్ లు లేచి కూర్చోబోయారు.
“అహహ ... మీరు పడుకోండి.... పడుకోండి......” అన్నాడు కమీషనర్ లింగారావ్ రెండు మంచాల మధ్య వున్న స్టూల్ మీద కూర్చుంటూ.
“గుడ్ మార్నింగ్ సార్!” ఇద్దరూ కోరస్ గా అన్నారు.
“గుడ్ మార్నింగ్!” అని ఇద్దరి చేతుల్లో బొకేలు వుంచాడు.
“మా పాపని ప్రాణాలకి తెగించి కాపాడారు. మీ రుణం నేను జన్మలో తీర్చుకోలేను. అయినా మీకింత దైర్యసాహసాలున్నాయంటే..... నాకేంతో అద్బుతంగా వుంది. చేతిలో ఆయుధం లేకుండా గజదొంగ మంగుల్ని ఎదుర్కున్నారంటే.... ఓహ్! అయినా మీకింత దైర్యం ఎక్కడి నుండి వచ్చింది?” కుతూహలంగా అడిగాడు కమీషనర్.
“అదేంటో సార్! ఎప్పుడూ ధైర్యంగా వుండే నాకు చిన్నప్పటి నుండి అలవాటైపోయింది.....” బుర్ర గోక్కుంటూ వెర్రి నవ్వు నవ్వుతూ అన్నాడు రాంబాబు.
“నాకూ అంతే సార్.....?” చిన్నారావ్ కూడా ఓ వెర్రి నవ్వు నవ్వాడు.
పోలీస్ కమీషనర్ మరో అయిదు నిముషాలు అక్కడ కూర్చుని వాళ్ళ ఆరోగ్యం గురించి జాగ్రత్త తీస్కోమనీ, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నన్ని రోజులూ వాళ్ళకి స్పెషల్ లీవ్ గ్రాంట్ చేయిస్తాననీ, వాళ్ళకి త్వరలో ప్రమోషన్ వచ్చేలా చూస్తాననీ చెప్పి వెళ్ళిపోయాడు.
“అసలు వాడెవడో జేబుదొంగ అనుకుని మనం వెంటపడితే, చూశావా మన ఇమేజ్ ఎంతగా పెరిగిపోయిందో.....?” నవ్వుతూ అన్నాడు చిన్నారావ్.
“ఇంతకీ ఆ మంగులు గాడు కొట్టేసిన నీ పర్సులో ఎంత డబ్బుందేమిటే?”
“ఆరు రూపాయల డెబ్బై అయిదు పైసలు” చెప్పాడు రాంబాబు.
“అంతేనా?” ఆశ్చర్యపోతూ అడిగాడు చిన్నారావ్.
“మరి అంత తక్కువ డబ్బుతో బిర్యానీ, చికెన్ సిక్స్ టే ఫివ్, మందు ఇన్ని ఎలా కొనగలననుకున్నావ్?”
“నువ్వున్నావ్ గా?!” కూల్ గా సమాధానం చెప్పాడు రాంబాబు.
“ఆ!......” అంటూ నోరు తెరిచాడు చిన్నారావ్.
|
|