TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
.png)
గజదొంగ మంగులు డెన్.
మంగులు హుంకరిస్తూ అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు.
“బాస్... కొవ్వొత్తులు వెలిగించి తేనా బాస్?!” ఉత్సాహంగా అడిగాడు వీరూ.
“ఏంటి నా చేతులు కాల్చేయ్యడానికి నీకంత కంగారు? కాసేపు కుదురుగా నన్ను పచార్లు చేస్కోనియ్యవా?” మండిపడుతూ అన్నాడు మంగులు.
“ఏలాగూ మీరు కొవ్వొత్తి వెలిగించి పట్రమ్మని అడుగుతారు కదా మీరు అడగకముందే నేనే అడిగితే నన్ను శభాస్ అని మెచ్చుకుంటారనీ....” నసిగాడు వీరూ.
“అధిక ప్రసంగం చెయ్యకు.... నోర్ముస్కో” అంటూ మళ్ళీ పచార్లు కొనసాగించాడు మంగులు.
“బాస్!” అంటూ మరో దొంగ పిలిచాడు. మంగులు పచార్లు ఆపి ఏంటన్నట్లు వాడివంక చూశాడు.
“మీరు పాత పేపర్లు ఏరుకునేవాడి గెటప్ లో వెళ్ళడం మాకు నచ్చలేదు బాస్” అన్నాడు వాడు.
“మరి మారువేషం వేస్కోపోతే అందరూ నన్ను గుర్తుపట్టరా తొట్టినాయాలా?” చికాగ్గా మొహం పెట్టి అన్నాడు మంగులు.
“అది నిజమే బాస్! మా ఉద్దేశం అదికాదు.... మీరు చిత్తుకాగితాలు ఏరుకునే వాడిలా కాకుండా సూటూ బూటూ వేస్కుని, టై కట్టుకుని దొరబాబులా వుండే గెటప్ వేస్కుంటే బాగుండేది కద బాస్?” అన్నాడు వాడు.
“అవును బాస్.... మీరు ఎంత గొప్ప గజదొంగైతే మాత్రం ఏంటి? ఎంత సంపాదిస్తే మాత్రం ఏంటి? ఊరి చివర రాళ్ళగుట్టల మధ్య....... ఈ మురికి డెన్ లో నలిగిన బట్టలు వేస్కుని చేతులు కాల్చుకుని ఏడుస్తూ పచార్లు చెయ్యడమే కదా బాస్? కనీసం ఇలా బయటికెళ్ళేప్పుడైనా కాస్త మంచి బట్టలేస్కుని రిచ్ గెటప్ ల్ వున్న మారువేషం వేస్కుంటే బాగుంటుంది కద బాస్?” అన్నాడు ఇంకో దొంగ.
మంగులు గబగబా గోడ దగ్గరికి వెళ్ళి గోడకేసి తల కొట్టుకోడం మొదలుపెట్టాడు. వీరూ పరుగున వెళ్ళి మంగుల్ని పట్టి ఆపాడు.
“బాస్.... మీరు జీవితంలో ఇంకా కొన్ని వేలసార్లు చేతులు కాల్చికోవాలి సార్.... అలాంటిది అప్పుడే తల బద్దలు కొట్టుకుని చచ్చిపోతే ఎలా సార్?” అన్నాడు వీరూ బాధగా.
“మేం తప్పుగా అనుంటే సారీ బాస్!” అన్నాడు ఇందాక సలహా చెప్పిన దొంగ.
“తప్పు కాదురా... మీకు వచ్చిన ఈ మంచి ఆలోచన నాకు రానందుకు బాధ కలిగి తల బాదుకుంటున్నా” దీర్ఘంగా నిట్టూరుస్తూ అన్నాడు మంగులు.
“బాస్... మీ పచార్లు ఇంకా అయిపోయినట్టేనా?” అడిగాడు వీరూ.
“అయిపోయినట్టే..... ఏం?” సందేహంగా అడిగాడు మంగులు.
“ఏం లేదు బాస్.... మీరేదైనా శపథం చేసేదుంటే త్వరగా చేసెయ్యండి..... మాకు ఆకలిగా వుంది. భోంచెయ్యాలి.”
మంగులు వీరూని చికాకుగా చూసి “సరే.... కొవ్వొత్తి వెలిగించి పట్టుకురా” అన్నాడు.
వీరూ ఓ లావుపాటి కొవ్వొత్తి వెలిగించి గజదొంగ మంగులు దగ్గరికి తీస్కోచ్చాడు.
“ఆహా! మనకి మళ్ళీ కమ్మటి చీకుల వాసనొస్తుంది!” ఒక దొంగ పక్క దొంగ చెవిలో ఆనందంగా గుసగుసలాడాడు.
మంగులు కొవ్వొత్తి మీద చెయ్యిపెట్టి ఇలా ప్రతిజ్ఞ చేశాడు. “పాపని కిడ్నాప్ చేసి తీసుకొస్తుంటే అడ్డుపడి నా కిడ్నాప్ ని భంగపరిచిన ఆ రాంబాబు గాడినీ, చిన్నారావ్ గాడినీ చంపుతా.” చేత్తో కొవ్వొత్తి ఆర్పి, చెయ్యికాలి ఘొల్లుమన్నాడు మంగులు.
|
|