Rating:             Avg Rating:       729 Ratings (Avg 3.46)

End AA Kalam Selavulu

మన రాష్ట్రంలో - చలికాలం గురించి ఎక్కువ మాట్లాడుకోం మనం. అదే ఢిల్లీలో అయితే చలికాలంలో వాళ్ళు చేసే గోల అంతా ఇంతా కాదు. కంపుకొట్టే స్వెటర్లు, జంపర్ లు వేసేసి, మన ‘వాసనా పటిమ’ కు పరీక్ష పెడతారు. మనూళ్ళో ఎండాకాలం మన ఫేవరైటు టాపిక్ అనటంలో ఏమాత్రం డౌట్ లేదు. ‘ఎండలు మండి పోతున్నాయి బాబూ ఈ సంవత్సరం’, ‘రోహిణి కార్తెలో రోళ్ళు పగిలి పోతాయి సుమీ’, ‘బాబోయ్ ఈ వడగాలికి చెవుల్లోంచి పొగలొస్తున్నాయంటే నమ్ము’ – ఇలాంటి డైలాగులు ఆంధ్రప్రదేశానికే పరిమితం. కానీ అలాంటి మండుటెండల్లోనే వచ్చే సెలవులు – మదిలో ఎంతో చల్లదనాన్ని మిగిల్చే అనుభూతులు. నా బాల్యం బాపట్లలో, కౌమారం గుంటూరులో. ఈ రెండూళ్ళ ఎండల్ని గుండెల్లో దాచుకుని, బ్రతికి బట్ట కట్టాను. కాబట్టి (ఆ రోజుల్లో ఎండ దెబ్బకు బట్టలన్నీ తీసేసే వాళ్ళం – అది వేరే సంగతి) – గ్రీష్మ ఋతువు గురించి, దాని వగరు, పొగరు గురించి పత్రికా ముఖంగా రాయగల్గిన అర్హత, అదృష్టం నాకు మాత్రమే ఉన్నాయన్న సంగతి మీరు గమనించాలి.

ఆరోజుల్లో చివరి పరీక్ష హిందీ (ప్రతి క్లాస్ లోనూ). ‘ప్రశ్నాపత్రం యధాతథంగా రాస్తే, పాస్ గ్యారంటీ’ అనే సదుపాయం ఉన్నరోజులవి. హిందీ పరీక్ష అవ్వగానే ఎండకాలం సెలవులు శుభారంభం. ఆ సాయంత్రం నుండే పెళ్ళుమనే ఎండలో ఆటలు మొదలు. ఈ రోజుల్లో లాగా ఇండోర్ గేమ్స్ లేవాయే. కబడ్డీ, కుందుళ్ళు, బాడ్మింటన్, పిచ్చిబంతి, కోకో, కర్రా – బిళ్ళా గట్రా... గట్రా... మండుటెండలో ‘పగలే వెన్నెలా? జగమే ఊయలా’ అని పాడుకుంటూ ఆడుకునే వాళ్లం. ‘ఒరేయ్ వెధవా – వడదెబ్బకి Sunstroke వస్తుందిరా’ అని మొత్తుకునే వాడు మా నాన్న. నా స్ట్రోక్ సంగతేమో కానీ – నా వెర్రి తిరుగుళ్ళు – తద్వారా ఇంటికి మోసుకొచ్చిన తగాదాల వడగళ్ళు తగిలి – మా నాన్నకి నిజంగా Sunstroke వచ్చేది ప్రతి ఎండాకాలం. ఉదయాన్నే కమ్మటి పెరుగుతో చద్దన్నం తినేసి రోడ్డుమీద డ్యూటీకి తయ్యారు. మధ్యాహ్నం దాకా రోడ్డుమీద ఓకులు (సిగ్గరెట్టు ప్యాకెట్లు) ఏరుకోవడం – చాలా ఏకాగ్రతతో కూడిన పని. చార్మినార్ దొరికితే – ఓకే. బర్కిలీ దొరికితే సంతోషం. గోల్డ్ ప్లేక్ దొరికిందా ఆరోజు పండగే. బాగా గుర్తు – ఒక గోల్డ్ ప్లేక్ కి 10 చార్మినార్ లు ట్రేడ్ ఆఫ్ వుండేది అపుడు ఎక్స్ చేంజ్ రేట్. తర్వాత, మధ్యాహ్నం భోజనం – ‘ఎక్కడ చచ్చావురా ఇప్పటిదాకా – ఆ బట్టలు చూడు – మట్టి కొట్టుకుని’ అనే అమ్మ నేపథ్య సంగీతంతో. ఆ తర్వాత ఉదయం సంపాదించిన సిగరెట్టు పాక్ లన్నింటినీ ప్రేమగా ఇస్త్రీ చేసి, వేటికదే సపరేట్ చేసి – వాటికై నిర్దేశించిన అట్టపెట్టేలలో దాచి భారతదేశ ఆర్ధిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఎంత ఇదిగా ఫీల్ అవుతాడో, అంత ‘ఇదిగా ఫీల్ అయిపోవడం రివాజు. సాయంకాలం – బెల్లం, సెనక్కాయలు జేబులో వేసుకుని మళ్ళీ రెండో షిఫ్ట్ కి తయ్యారు. షిఫ్టులో పిచ్చిబంతి, కుందుళ్ళు, కోకో – వగైరా వగైరా లాంటి ఆటలతో టైమ్ పాస్. వంటి మట్టి అంతా వదిలేదాకా స్నానం – తర్వాత భోజనం. ఆ తర్వాత నిద్రమ్మ ఒడిలోకి జారుకోవడం. ఎండకాలంలో రాత్రి పక్క కూడా మేడమీద, వెన్నెలలో- ఎంత హాయిగానిద్ర పట్టేదో. మరి ఆ రోజుల్లో దోమలు తక్కువేమో- కుట్టినట్లు గుర్తు లేదు. ఆకాశం కేసి చూస్తూ చుక్కల్ని లెక్కేయడం – ఆకాశం అవతల ఏముందోనన్న ఆలోచనలతో అలా అలా నిద్రలోకి జారిపోవడం ఎన్నో మధురానుభూతులు.

వారానికోరోజు స్పెషల్ డ్యూటీ ఉండేది సెలవుల్లో, టౌన్ హాల్ టెన్నిస్ కోర్టు రోడ్డు పక్కనే ఉండేది. రోడ్డుకూ, కోర్టుకూ మధ్య ఓ ఎత్తయిన గోడ ఉండేది – బాల్స్ బయటకు ఎగరకుండా ఉండటానికి. అయినా ఏ పీట్ సాంప్రాసో, ఏ అగాస్సో కొట్టిన బంతి అడపా దడపా చెంగుమని గోడ దాటి రోడ్డుమీద పడిపోయేది. అదే - ఆ బంతి కోసమే మా స్పెషల్ డ్యూటీ వరద బాధితులకి హెలికాప్టర్ లోంచి విసిరేసిన అన్నం పాకెట్ దొరికితే ఎలా లంఘించుకుంటారో – అలా ఆ బంతిని ఆక్రమించేసి ఒకటే పరుగు. పరుగెందుకా అని మీకిక్కడ అనుమానం రావాలి. టెన్నిస్ కోర్టు బాల్ బాయ్స్ ఆ బాల్ కోసం వెంటనే రోడ్డెక్కి – మా వెనక ఊరకుక్కల్లా పడతారు కాబట్టి. ఇలా రోజంతా ఎండలో గుంటకాడ నక్కల్లా కాచుకుని ఉంటె ఒక్కో రోజు ఒక బంతి, ఒక్కోరోజు రెండు బంతులు దొరికేవి. ఎండాకాలం సెలవులు ఇంత ఆహ్లాదంగా, ఆనందంగా జరిగిపోతూ ఉండేవి. మధ్యలో, కాలవల్లో ఈతలు, నేలలో కూచుని సిన్మాలు (అపుడు సిన్మాహాల్లో నేల, బెంచి, కుర్చీ, రిజర్వ్ డు అని నాలుగు క్లాస్ లు ఉండేవి), ఐస్ ఫ్రూట్ లు (ఐస్ క్రీమ్ లు మా లెవెల్ కాదు), తాటి ముంజెలు, ఎప్పుడో ఒకసారి మామిడి ముక్కలు (ఎక్కువగా టెంకలు దొరికేవి) కొంచెం మెచ్యూర్ అయినాక (మీరేం అపార్ధాలు తీయనక్కర్లేదు) క్రికెట్ – తాటి తోపుల్లో. మొన్న – నా సుపుత్రుడు ఎ.సి. కారు దిగి ఓ నిమిషం నడిచి మళ్ళీ ఎ.సి. రూమ్ లోకి వచ్చేసరికి ‘సన్’ స్ట్రోక్ వచ్చినంత పని అయ్యి అడ్డం పడ్డాడు. నాకు వెంటనే ప్లాష్ బాక్ – నా రోజుల్లో ఎండాకాలంలో ఎండకి ఎండిపోయినట్లు గాని, వడదెబ్బకి వడలి పోయినట్లు గాని గుర్తేలేవు. మా వాడికి ఎండాకాలం సెలవుల్లో బయట తిరుగుళ్ళే లేవు. ఎంతసేపటికీ ఇంట్లో కంప్యూటర్ లో ఛాటింగ్ – లేకపోతే సొల్లు (సెల్లు) ఫోన్ లో ఎస్ఎంఎస్ లు వాడి ఔట్ డోర్ యాక్టివిటీ ఐమాక్స్ లో సిన్మా చూసి రావడం మాత్రమే. నా సెలవులే గొప్పవి. నేను చేసిందే ఎంజాయ్ మెంట్ అని నేనంటే – వాడు “నాన్నా, కాలం మారుతోంది. దాంతోపాటు మనుషులూ, పద్దతులూ, ఎంజాయ్ మెంట్ కి అర్ధాలూ మారిపోతాయి. నాకు నువ్వెలా కష్టాలు పడ్డావో ఎసి లేక, ఫ్రీజ్ లేక, కంప్యూటర్ లేక, సెల్ ఫోన్ లేక అని చాలా బాధగా ఉంది” అని క్లాస్ పీకేశాడు. నిజమేనేమో! “మనరోజులే గొప్ప. మన విలువలే గొప్ప. ప్రస్తుతం జరుగుతున్నవన్నీ తప్పు” అనుకోవడమే – పెద్ద తప్పేమో. ఏదయితేనేం – నాకు దప్పికవుతోంది. సెలవు తీసుకుంటాను. వెళ్ళి కుండలోని చల్లటి నీళ్ళు తాగాలి. నాకు ఫ్రీజ్ నీళ్ళు పడవండి బాబూ.