
త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు).. టాలీవుడ్లో ఈ కాంబినేషన్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ‘జులాయి’ నుంచి మొదలైన వీరి ప్రయాణంలో ఎన్నో విజయవంతమైన సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయంటూ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ వార్తలకు మరో ఆసక్తికరమైన అంశం కూడా తోడైంది. త్రివిక్రమ్ తదుపరి సినిమా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్లో ఉండొచ్చని, అందులో చిరంజీవి నటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
వెంకటేష్‌తో త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా నిర్మాణంలో అనుకున్న దానికంటే బడ్జెట్ పెరగడంతో పాటు, విడుదల కూడా పలుమార్లు వాయిదా పడింది. సినిమా ఫలితం, పెరిగిన ఖర్చులు, రెమ్యునరేషన్, లాభాల్లో వాటా వంటి అంశాలపై త్రివిక్రమ్, చినబాబు మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయనే ప్రచారం నడుస్తోంది.
అయితే వీరిద్దరి మధ్య నిజంగానే విభేదాలు ఉన్నాయా? ఉంటే అవి ఎంతవరకు వెళ్లాయి? అనే విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇద్దరూ ఈ ప్రచారంపై మౌనంగానే ఉన్నారు.

ఇదిలా ఉంటే, త్రివిక్రమ్‌కు తన నెక్స్ట్ మూవీని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో డీవీవీ దానయ్య నిర్మాణంలో చేసే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో మెగాస్టార్ చిరంజీవి నటించేలా చర్చలు జరుగుతున్నాయట. ఇదే నిజమైతే చిరంజీవి, త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కే తొలి సినిమా అవుతుంది.
ఇది కూడా చదవండి: హారిక హాసినితో త్రివిక్రమ్ బంధం తెగిపోనుందా?.. గాడ్ ఆఫ్ వార్ పరిస్థితి ఏంటి.?
అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ చేయాల్సిన సినిమా గురించే. ‘గాడ్ ఆఫ్ వార్’ పేరుతో ప్రచారంలో ఉన్న ఈ మైథలాజికల్ ప్రాజెక్ట్‌ను హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నట్లు ప్రకటించారు.

ఇటీవల ‘ఆదర్శ కుటుంబం’ ప్రమోషన్స్‌లో త్రివిక్రమ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పూర్తయిందని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు హారిక అండ్ హాసినితో త్రివిక్రమ్‌కు సంబంధాలు దెబ్బతిన్నాయనే వార్తలు, డీవీవీ దానయ్యతో కొత్త సినిమా చర్చలు తెరపైకి రావడంతో ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై సందేహాలు మొదలయ్యాయి.
మరి ఈ ప్రచారంలో నిజమెంత? ఎన్టీఆర్ సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.
మీకు నచ్చవచ్చు:
చేతులు మారిన జటాయు ప్రాజెక్ట్.. రోషన్ హీరోగా పాన్ ఇండియా మూవీ లాంచ్.!
23 ఏళ్ళ క్రితం జరిగింది ఇదే.. పవన్ కళ్యాణ్ వదులుకున్న తమిళ అమ్మాయి.!
[Trivikram to Direct Chiranjeevi, Trivikram DVV Entertainments, Trivikram Chiranjeevi Movie, Trivikram Next Movie, Trivikram Chinababu, Haarika And Hassine Creations, NTR God of War, DVV Entertainments, Chiranjeevi, Trivikram Srinivas]





