ఇనుప పాత్రలలో వండిన పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. నాన్ స్టిక్, అల్యూమినియం తో ఇనుప పాత్రలలో వండిన ఆహారం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఇనుప పాత్రలలో వంట చేయడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, ఆహారంలో సహజంగా ఐరన్ ఉత్పన్నం అవుతుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి, రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది. అయితే ఇనుప పాత్రలలో వండే ప్రతి ఆహారం ఆరోగ్యానికి మంచి చేస్తుంది అనుకుంటే పొరపాటే. కొన్ని ఆహార పదార్థాలలో ఉండే రసాయనాలు ఐరన్ తో చర్య జరిపి, ఆహారం రుచి, రంగును మార్చడమే కాకుండా, ఫుడ్ పాయిజనింగ్, చర్మ వ్యాధుల వంటి తీవ్రమైన సమస్యలను కూడా కలిగిస్తుంది. అందువల్ల ఏ ఆహారాలను ఇనుప పాత్రలో వండకూడదు తెలుసుకోవడం ముఖ్యం.
పుల్లని ఆహారాలు..
చింతపండు, టమోటా లేదా నిమ్మకాయ వంటి పుల్లని పదార్థాలు కలిగిన గ్రేవీలను ఎప్పుడూ ఇనుప పాత్రలో ఉడికించకూడదట. ఈ పదార్థాలలో సహజ ఆమ్లాలు ఉంటాయి. ఇవి ఇనుముతో వెంటనే రియాక్ట్ అవుతాయి. ఆహారానికి ఇనుము రుచిని ఇస్తాయి. జీర్ణవ్యవస్థకు చికాకు కలిగిస్తాయి. పుల్లగా ఉండటం వల్ల ఇనుము ఆహారంలోకి ఎక్కువ మొత్తంలో లీచ్ అవుతుంది, ఇది శరీరంలో పాయిజన్ గా కూడా మారవచ్చు.
పాలు, పెరుగుతో తయారు చేసే పదార్థాలు..
పాలు, పెరుగు జోడించి తయారు చేసే ఆహారాలు, పాయసం, కస్టర్డ్ వంటి వంటకాలను ఇనుప పాత్రలలో వండటం నిల్వ చేయడం మంచిది కాదు. ఇనుప పాత్రలు చాలా వేడిని ఉత్పత్తి చేస్తాయి, దీని వలన పెరుగు లేదా పాలు విరుగుతాయి. ఇనుము పాత్ర ఈ తెల్లగా కనిపించే వంటకాలను నల్లగా లేదా నిస్తేజంగా మారుస్తాయి. దీని వలన వాటి రుచి, పోషక విలువలు రెండూ ప్రభావితం అవుతాయి.
రాజ్మా, శనగలు..
తరచుగా ఇనుప పాత్రలో రాజ్మా బీన్స్, శనగపప్పు వండుతుంటారు. ఇనుప పాత్రలు అన్ని వైపులా సమానంగా వేడెక్కవు, ఈ భారీ ధాన్యాలు కొన్ని ప్రాంతాలలో ఉడికిపోతాయి, మరికొన్ని తక్కువగా ఉడుకుతాయి. సరిగా ఉడకని బీన్స్ లేదా శనగపప్పు తినడం వల్ల తీవ్రమైన ఉబ్బరం, గ్యాస్ వస్తుంది. వాటిని ప్రెజర్ కుక్కర్ లేదా స్టెయిన్‌లెస్ స్టీల్ కుండలో ఉడికించడం ఉత్తమం.
వెనిగర్ తో చైనీస్ ఫుడ్స్..
ఈ రోజుల్లో వెనిగర్‌ను చౌ మెయిన్, పాస్తా వంటి వంటకాల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. వెనిగర్ అనేది బలమైన ఆమ్లం. ఇది నిమ్మకాయ, చింతపండు లాగా ఐరన్ తో చాలా తొందరగా రియాక్ట్ అవుతుంది. ఇలా వండే ఆహారం సేఫ్ కాదు. వెనిగర్ ఉన్న ఏదైనా వంటలకు ఐరన్ కంటే నాన్-స్టిక్ లేదా స్టీల్ పాత్రలను ఎంచుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ముఖ్యంగా బయట చైనీస్ ఫుడ్స్ తినేటప్పుడు వెనిగర్ వాడుతున్నారా, ఏ పాత్రలు వాడుతున్నారు తెలుసుకోకుండా పొరపాటున కూడా తినకండి.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...