LATEST NEWS
ఏపీలో ఆదివారం (నవంబర్ 1)  మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిలో తాడోపేడో తేల్చుకునేందుకు పార్టీలు, అభ్యర్ధులు సన్నద్ధమయ్యారు. తెలుగుదేశం కూటమి ఇప్పటికే పలు చోట్ల ఏకగ్రీవంగా విజయం సాధించింది. జగన్ అడ్డా పులివెందులలో కూడా అదే పరిస్థితి. అయితే జగన్ సొంత గడ్డ పులివెందుల మునిసిపాలిటీని దక్కించుకునేందుకు వైసీపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబ అడ్డా అయిన మునిసిపాలిటీలో  తెలుగుదేశం జెండా ఎగరనీయకూడదన్న పట్టుదలతో ఉన్న జగన్.. పులివెందులలోనే మకాం వేశారు. మున్సిపాలిటీని చేజిక్కించుకునేందుకు కూటమి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు స్వయంగా నడుంబిగించారు.  ఇప్పిటికే పులివెందుల మునిసిపాలిటీలోని సగం వార్డులను తెలుగుదేశం కూటమి ఏకగ్రీవంగా గెలుచుకుని సత్తా చాటింది.  మిగిలిన వాటి కోసం వైసీపీ, జగన్ పోరాడుతున్నారు.  సాధారణంగా అయితే అక్కడ ఎన్నిక జరుగుతోంది. ఓటర్లు గెలుపోటములు నిర్ణయిస్తారు. కానీ పులివెందుల మాత్రం సెపరేట్. అది జగన్ కంచుకోట.   అలింటి కంచుకోటలో తెలుగుదేశం పాగా వేస్తే.. ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా 2029 ఎన్నికలపై పడుతుందన్నది జగన్ భయం. ఇప్పటికే గంలో పులివెందుల జడ్పీటీసీకి జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డిపాజిట్ కూడా దక్కకుండా ఘోర పరాజయాన్ని చవి చూశారు. దీంతో ఎది ఏమైనా, ఏం చేసైనా పులివెందుల మునిసిపాలిటీని దక్కించుకోవాలని జగన్ పట్టుదలగా ఉన్నారు.   దీంతో పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు. మునిసిపోల్ లో ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేసే పరిస్థితి కల్పించడమే లక్ష్యంగా పోలీసులు సర్వ సన్నద్ధంగా ఉన్నారని పరిశీలకులు చెబుతున్నారు.   [Pulivendula Municipal Elections,  Jagan Pulivendula, YCP Baston Pulivendula, Andhra Pradesh Politics, Tension  Pulivendula, Telugu One]
మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుకు బేషరతుగా క్షమాపణ చెప్పారు. గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు.  అప్పట్లో  రాజకీయ పరిణామాలు, ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించే   వాతావరణంలోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని పేర్కొన్న కొండా సురేఖ  కేటీఆర్‌ను వ్యక్తిగతంగా కించపరచాలనే ఉద్దేశం గానీ, ఆయన కుటుంబ సభ్యుల మనోభావాలను దెబ్బతీయాలని కానీ తాను ఎన్నడూ భావించలేదని వివరణ ఇచ్చారు.   ఆ వ్యాఖ్యల వల్ల కేటీఆర్ కు కలిగిన మనస్తాపానికి చింతిస్తున్నాని పేర్కొన్న ఆమె  ఈ వివాదానికి పూర్తిగా ముగింపు పలకాలనే సదుద్దేశంతోనే  క్షమాపణలు చెబుతూ, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొన్నారు.  కాగా కొండా సురేఖను రేవంత్ తన కేబినెట్ నుంచి తొలగించిన తరువాత ఇప్పుడు కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు బహిరంగంగా క్షమాపణ చెప్పడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.  సరైన కారణాలు వెల్లడించకుండా, కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా రేవంత్ రెడ్డి కేబినెట్ నుంచి తొలగించడాన్ని ఆమె అప్పట్లోనే బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.  బీసీ మహిళగా తనకు జరుగుతున్న అన్యాయంపై ఆమె బహిరంగంగానే  నిరసన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో కొండా సురేఖ కేటీఆర్ కు క్షమాపణ చెప్పడం, ఆయనపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం పొలిటికల్ గా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె బీఆర్ఎస్ గూటికి చేరడానికి రెడీ అయ్యారన్న చర్చ జోరందుకుంది. ఈ చర్చకు కొండా సురేఖ భర్త కొండా మురళితో కలిసి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరే అవకాశాలున్నాయన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తం అవుతోంది.    [Konda Surekha Apologizes to KTR, Telangana Politics, Konda Surekha Murali, BRS Reentry Rumors, Telugu One]
రాను రానంటూనే  చిన్నదీ రాములోరి గుడికొచ్చే అనే పాట చందంగా రాజకీయాలలో పొత్తుల విషయంలో బీజేపీ వ్యవహరిస్తోంది. తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  ఆంధ్రప్రదేశ్ లోనూ, జాతీయ స్థాయిలోనూ జనసేన ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పార్టీయే అయినా, తెలంగాణలో మాత్రం ఆ పార్టీతో ఎటువంటి పొత్తూ ఉండదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఇప్పటికే పలుమార్లు విస్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పోటీకి జనసేన రెడీ అవుతోంది.  రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన జనసేనతో  కలిసి ముందుకు సాగాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది.  ఉమ్మడి ఖమ్మం,వరంగల్,నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో జరగనున్న ఎమ్మెల్సీ పోరులో జనసేన   అభ్యర్థిని బరిలోకి దించుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ఆ పార్టీకి అండగా నిలబడుతోందన్న అంశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికారికంగా మిత్రపక్షాలుగా కొనసాగుతున్న జనసేన,  బీజేపీలు, తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకూ ఎవరికి వారే యమునా తీరే చందంగానే వ్యవహరిస్తున్నాయి. అయితే ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికి వచ్చే సరికి తీరు మార్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని, రెండు పార్టీలూ అనివార్యంగా అవగాహనకు వచ్చాయంటున్నారు పరిశీలకులు.   జనసేన అభ్యర్థి బరిలో నిలిచే స్థానంలో బీజేపీ తన అభ్యర్థిని పోటీకి పెట్టకుండా పరోక్షంగా మద్దతు తెలిపేలా ఇరు పార్టీల మధ్య అవగాహన కుదిరిందన్న చర్చ పోలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. ఇదే జరిగితే.. ముందు ముందు జరగనున్న స్థానిక ఎన్నికలు, ఆ పై 2028 అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఈ రెండు పార్టీలూ జతకట్టే అవకాశాలు మెండుగా ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   [Jana Sena  BJP Alleance Telangana,  MLC Elections, Graduate MLC,Telangana Politics,  , Warangal Khammam Nalgonda Graduates MLC, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
ఈ శుక్రవారం ఓటీటీ ప్రేక్షకులకు రెండు కొత్త సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. టాలీవుడ్‌ యంగ్‌ హీరో శ్రీవిష్ణు నటించిన ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’, బాలీవుడ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ‘మీర్జాపూర్‌: ది మూవీ’ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ప్రారంభించాయి. ఈ రెండు సినిమాలు అక్టోబర్‌ 30 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో అందుబాటులోకి వచ్చాయి. థియేటర్లలో ఈ సినిమాలను మిస్‌ అయినవారు ఇప్పుడు ఇంట్లోనే చూసే అవకాశం వచ్చింది. ముందుగా ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ విషయానికి వస్తే.. శ్రీవిష్ణు, మహిమా నంబియార్‌ జంటగా నటించిన ఈ చిత్రానికి జనకిరామ్‌ మారెళ్ల దర్శకత్వం వహించారు. 1992 నేపథ్యంలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో కథ సాగుతుంది. ఓ చిన్న పట్టణంలో థియేటర్‌ నడుపుకునే కళ్యాణ్‌ (శ్రీవిష్ణు), సితార (మహిమా నంబియార్‌) ప్రేమలో పడతాడు. ఆమె కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను తీర్చేందుకు స్నేహితుడు దుబాయ్‌ బాబు (సత్య)తో కలిసి ఓ పథకం వేస్తాడు. అయితే ఆ ప్రయత్నంలో అతడిని నిజమైన నక్సలైట్‌ నాయకుడిగా పోలీసులు, ఇతరులు పొరబడటంతో కథ అనూహ్య మలుపులు తిరుగుతుంది. రాధికా శరత్‌కుమార్‌, షైన్‌ టామ్‌ చాకో, ఉపేంద్ర లిమాయే తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఐదు భాషల్లో ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇక ‘మీర్జాపూర్‌: ది మూవీ’ విషయానికి వస్తే.. పంకజ్‌ త్రిపాఠి, అలీ ఫజల్‌, దివ్యేందు ప్రధాన పాత్రల్లో నటించారు. గుడ్డు పండిట్‌, మున్నా త్రిపాఠి, కాలీన్‌ భయ్యా పాత్రలను మరోసారి తెరపై చూసే అవకాశం ఈ సినిమాతో దక్కింది. అయితే ఇది వెబ్‌సిరీస్‌ మూడో సీజన్‌ తర్వాత జరిగే కథ కాదు. మొదటి సీజన్‌ కాలంలో చోటుచేసుకున్న పరిణామాలను చూపించే ఇంటర్‌క్వెల్‌గా రూపొందింది. జైసల్మేర్‌కు చెందిన బబ్బన్‌ బాబువా అనే వ్యక్తి మాదకద్రవ్యాల సరుకును దొంగిలించడంతో మీర్జాపూర్‌లో అధికార పోరు మొదలవుతుంది. ఆ తర్వాత చోటుచేసుకునే హింసాత్మక పరిణామాలు, ఆధిపత్య పోరాటమే ఈ సినిమా కథ. రవికిషన్‌, రసిక దుగల్‌, శ్వేతా త్రిపాఠి, జితేంద్ర కుమార్‌, అభిషేక్‌ బెనర్జీ తదితరులు నటించారు. థియేటర్లలో వచ్చిన వెర్షన్‌ కంటే అదనపు సన్నివేశాలతో కూడిన ఎక్స్‌టెండెడ్‌ కట్‌ ఇప్పుడు ప్రైమ్‌ వీడియోలో అందుబాటులో ఉంది.     [Comrade Kalyan OTT, Mirzapur The Movie OTT, Sree Vishnu, Mahima Nambiar, Pankaj Tripathi, Ali Fazal, Divyenndu, Amazon Prime Video, New OTT Releases October 30 2026, Telugu OTT Movies]
సోషల్ మీడియాలో సెలబ్రిటీల పేరుతో ఫేక్ వీడియోలు వైరల్ కావడం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత హీరోయిన్లను టార్గెట్ చేస్తూ డీప్‌ఫేక్ వీడియోలు సృష్టిస్తున్నారు. తాజాగా నటి హన్సిక పేరు కూడా ఇలాంటి వివాదంలో వినిపిస్తోంది. ఆమెకు సంబంధించిన ప్రైవేట్ వీడియో లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు దర్శనమిస్తున్నాయి. తమిళం, తెలుగు, హిందీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హన్సిక.. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోలు, వెకేషన్ అప్‌డేట్స్‌తో అభిమానులకు టచ్‌లో ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో లీక్ అయిందంటూ కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఎక్స్, రెడ్డిట్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఈ అంశంపై చర్చ మొదలైంది. అయితే వైరల్ అవుతున్న వీడియో నిజంగా హన్సికదేనా? అనే ప్రశ్నకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవు. పైగా ఆ వీడియోలో ఉన్నది హన్సిక కాదని, ఆమెను పోలి ఉన్న మరో వ్యక్తి వీడియోను ఆమె పేరుతో ప్రచారం చేస్తున్నారని కొందరు నెటిజన్లు చెబుతున్నారు. మరికొందరేమో అది ఏఐతో క్రియేట్ చేసిన ఫేక్ వీడియో అంటున్నారు. ఇదిలా ఉంటే, గతంలోనూ పలువురు నటీమణుల పేర్లతో ఇలాంటి వీడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు అదే తరహాలో హన్సిక పేరును ఉపయోగిస్తూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కూడా చదవండి: ఆదర్శ కుటుంబం ట్విట్టర్ రివ్యూ.. త్రివిక్రమ్ అనుకున్నట్టే చేశాడు.!       [Hansika Video Leak Rumours, Hansika Motwani Video Leak, Hansika Private Video, Hansika Viral Video, Hansika Fake Video, Hansika Deepfake Video, Hansika AI Video, Hansika Motwani]  
కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ తనయుడు జేసన్‌ సంజయ్‌ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త ఇప్పుడు కోలీవుడ్‌లో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటివరకు దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకోవాలని ప్రయత్నించిన జేసన్‌.. ఇప్పుడు నటుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన హీరోగా నటించబోయే సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు ప్రముఖ దర్శకుడు అట్లీ నిర్మాతగా వ్యవహరించనున్నారనే టాక్‌ వినిపిస్తోంది. అట్లీ నిర్మాణంలో జేసన్‌ సంజయ్‌ హీరోగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు కోలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఈ చిత్రానికి ‘డ్యూడ్‌’ ఫేమ్ కీర్తీశ్వ‌ర‌న్‌ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించనున్నారనే సమాచారం కూడా వినిపిస్తోంది. అట్లీ వంటి స్టార్‌ దర్శకుడు నిర్మాణ బాధ్యతలు తీసుకుంటున్నారనే వార్తతో ఈ ప్రాజెక్టుపై మరింత ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు జేసన్‌ సంజయ్‌ దర్శకత్వం వైపే ఎక్కువగా దృష్టి పెట్టారు. సందీప్‌ కిషన్‌ హీరోగా ‘సిగ్మా’ సినిమాను తెరకెక్కించారు. లండన్‌లో స్క్రీన్‌ప్లే, టొరంటోలో ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్సులు చేసిన జేసన్‌.. తన తొలి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. అయితే ఇప్పుడు హీరోగా మారబోతున్నారనే ప్రచారం ఆయన అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తండ్రి విజయ్‌ నటుడిగా స్టార్‌డమ్‌ సంపాదించుకోగా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని జేసన్‌ ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అట్లీ విషయానికి వస్తే.. విజయ్‌తో ‘తెరి’, ‘మెర్సల్‌’, ‘బిగిల్‌’ వంటి సినిమాలు తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. షారుఖ్‌ ఖాన్‌తో ‘జవాన్‌’ సినిమాతో బాలీవుడ్‌లోనూ సత్తా చాటారు. అలాంటి అట్లీ ఇప్పుడు విజయ్‌ తనయుడి హీరో ఎంట్రీకి నిర్మాతగా వ్యవహరించనున్నారనే వార్త ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ప్రచారంలో నిజమెంత అనేది తెలియాలంటే చిత్రబృందం నుంచి స్పష్టత రావాల్సిందే.     [Jason Sanjay, Vijay Son Jason Sanjay, Atlee Producer, Jason Sanjay Hero Debut, Kirthivardhan Director, Lyca Productions, Jason Sanjay New Movie, Atlee Latest News, Tamil Cinema News]
విక్టరీ వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’ (AK47) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎన్నో అంచనాల మధ్య అక్టోబర్ 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు సోషల్ మీడియాలో మంచి స్పందనే లభిస్తోంది. వెంకటేశ్ కామెడీ టైమింగ్, సత్య నటన, ఫస్టాఫ్‌లోని సన్నివేశాలకు ప్రశంసలు దక్కుతుండగా.. సెకండాఫ్ నెమ్మదించడం, కథనంలో పట్టు తగ్గడం వంటి అంశాలపై కొందరు ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘ఆదర్శ కుటుంబం’లో వెంకటేశ్ తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని నెటిజన్లు చెబుతున్నారు. ముఖ్యంగా కుటుంబ నేపథ్యంలో వచ్చే హాస్య సన్నివేశాలు, కొన్ని కీలకమైన డైలాగులు బాగా పేలాయని అభిప్రాయపడుతున్నారు. కమెడియన్ సత్య పోషించిన ఐటీ ఉద్యోగి పాత్ర కూడా నవ్వులు పూయించిందని ప్రశంసిస్తున్నారు. విలన్ గ్యాంగ్‌కు సంబంధించిన సన్నివేశాలు, ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ఎపిసోడ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయని కొందరు ప్రేక్షకులు పేర్కొంటున్నారు. రావు రమేశ్, రఘుబాబు తమ పాత్రలతో వినోదాన్ని అందించారని అంటున్నారు. తమన్ నేపథ్య సంగీతం యాక్షన్ సన్నివేశాలకు బలాన్నిచ్చిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సినిమా ఫస్ట్  సరదాగా సాగడంతో పాటు ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కథలో కొత్తదనం పెద్దగా లేకపోయినా, కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంగేజ్ చేశాయని చెబుతున్నారు. అయితే, ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కాస్త డల్ అయిందని పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇంటర్వెల్ దగ్గర ఆసక్తిని పెంచిన కథనం ఆ తర్వాత అదే స్థాయిలో కొనసాగలేదని, కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించాయని కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్లు, కథలో భావోద్వేగాలు ఆశించిన స్థాయిలో పండకపోవడం సినిమాకు కాస్త మైనస్‌గా మారాయని అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే ‘ఆదర్శ కుటుంబం’కు సోషల్ మీడియాలో మంచి స్పందనే వస్తోంది. ముఖ్యంగా సినిమాలో త్రివిక్రమ్ మార్క్ కనిపించిందని చెబుతున్నారు. ఇది కూడా చదవండి: సంగీత ప్రపంచంలో విషాదం.. ఇళయరాజా ఆస్థాన గిటారిస్ట్‌ కన్నుమూత.!       [Aadarsha Kutumbam Twitter Review, Aadarsha Kutumbam Review, Aadarsha Kutumbam Public Talk, AK47 Movie Review, Venkatesh, Trivikram Srinivas, Srinidhi Shetty, AK47 Movie]  
టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌, డ్యాన్సర్‌ శ్రష్టి వర్మ మధ్య వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తనపై వచ్చిన ఆరోపణల గురించి జానీ మాస్టర్‌ తాజాగా ‘ఢీ’ డ్యాన్స్‌ షోలో మాట్లాడటంతో ఈ వ్యవహారం మళ్లీ చర్చనీయాంశమైంది. దీనిపై శ్రష్టి వర్మ సోషల్‌ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. తనకు ఎదురైన అనుభవాల గురించి మాట్లాడే హక్కు తనకు ఉందని, తన గొంతును ఎవరూ మూయించలేరని స్పష్టం చేశారు. ‘ఢీ’ కొత్త సీజన్‌కు జానీ మాస్టర్‌ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ప్రసారమైన ఎపిసోడ్‌లో తనపై వచ్చిన ఆరోపణలను ప్రస్తావిస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘‘నా మీద లక్ష ఆరోపణలు చేశారు. ఒక అమ్మాయి, మన డ్యాన్సరే వచ్చి ‘జానీ మాస్టర్‌ జీరో జీరో’ అని చెప్పింది. నేను కరెక్ట్‌ అయినప్పుడు అవతలివాళ్లు ఎన్ని అనుకుంటే నాకెందుకు?’’ అంటూ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో జానీ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఈ వీడియోపై శ్రష్టి వర్మ స్పందిస్తూ.. జానీ మాస్టర్‌ మాట్లాడిన క్లిప్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘‘నిజం వెలుగులోకి వచ్చినప్పుడు అపరాధభావం ఉన్న వ్యక్తి మరింత గట్టిగా మాట్లాడతాడు’’ అంటూ వ్యాఖ్యానించారు. తనను ఓ మహిళా డ్యాన్సర్‌ ‘జీరో జీరో’ అని అన్న విషయాన్ని జానీ బహిరంగ వేదికపై ప్రస్తావించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఒక మహిళ తనకు ఎదురైన అనుభవాల ఆధారంగా మాట్లాడితే, ఆమె మాటలను ప్రశ్నించడం ఎందుకని నిలదీశారు. అంతేకాదు, తనకు మద్దతుగా నిలుస్తున్నవారికి వ్యక్తిగతంగా ఫోన్‌ చేసి వారిని మాట్లాడకుండా ఆపే హక్కు జానీ మాస్టర్‌కు లేదని శ్రష్టి వర్మ పేర్కొన్నారు. ‘‘దాదాపు నాలుగేళ్లపాటు ఎన్నో కష్టాలు అనుభవించాను. ఇప్పుడు నా కాళ్లపై నేను నిలబడి, నాకు ఎదురైన అనుభవాల గురించి బహిరంగంగా మాట్లాడే స్థాయికి వచ్చాను. అలాంటప్పుడు నన్ను కానీ, నాకు మద్దతుగా నిలబడాలనుకునే వారిని కానీ అడ్డుకునే హక్కు నీకు లేదు. నా కథను నేను చెప్పుకోకుండా ఎవరూ నా నోరు మూయించలేరు’’ అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. కాగా, జానీ మాస్టర్‌ వద్ద అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన సమయంలో తనపై లైంగిక వేధింపులు జరిగాయని శ్రష్టి వర్మ గతంలో ఆరోపించారు. తాను మైనర్‌గా ఉన్నప్పటి ఘటనల గురించి ఆమె ఫిర్యాదు చేయడంతో జానీ మాస్టర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. 2024 సెప్టెంబర్‌లో ఆయన అరెస్టయ్యారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు, స్పందనలను వేర్వేరుగా చూడాల్సిన నేపథ్యంలో.. తాజాగా ‘ఢీ’ షోలో జానీ చేసిన వ్యాఖ్యలు, వాటికి శ్రష్టి ఇచ్చిన కౌంటర్‌ మరోసారి చర్చకు దారితీశాయి.     [Shrasti Verma, Jani Master, Shrasti Verma Latest News, Dhee Dance Show, Jani Master Controversy, Shrasti Verma Instagram, Jani Master Allegations, Telugu Cinema News]
విక్టరీ వెంకటేశ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్‌ నంబర్‌ 47’. దాదాపు 20 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వెంకటేశ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా విషయంలో సెంటిమెంట్ల కంటే ప్రేక్షకుల తీర్పుకే ప్రాధాన్యం ఇస్తాననే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. గతంలో త్రివిక్రమ్‌తో కలిసి ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘మల్లీశ్వరి’ వంటి విజయవంతమైన సినిమాలు చేశానని వెంకటేశ్‌ గుర్తుచేసుకున్నారు. ఇలాంటి సినిమాల తర్వాత మళ్లీ కలిసి పనిచేసేటప్పుడు ఎలాంటి కథను ఎంచుకోవాలనే విషయంలో సహజంగానే ఒత్తిడి ఉంటుందని చెప్పారు. అయితే త్రివిక్రమ్‌ ఈ సినిమా కథ చెప్పినప్పుడు అందులోని అంశాలు తనకు బాగా నచ్చాయని తెలిపారు. కేవలం కామెడీ మాత్రమే కాకుండా థ్రిల్లింగ్‌ సన్నివేశాలు, సస్పెన్స్‌, వివిధ రకాల భావోద్వేగాలు ఇందులో ఉంటాయని వివరించారు. తాను గతంలో ఎన్నో కుటుంబ కథా చిత్రాల్లో నటించినప్పటికీ ‘ఆదర్శ కుటుంబం’ ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని వెంకటేశ్‌ అన్నారు. ఇందులో తన పాత్ర పేరు చిట్టిబాబు. కుటుంబానికి ఏదైనా సమస్య ఎదురైతే దాన్ని పరిష్కరించడానికి, తన వాళ్లను కాపాడుకోవడానికి ఎంతవరకైనా వెళ్లే వ్యక్తిగా ఈ పాత్ర ఉంటుందని చెప్పారు. కుటుంబ అనుబంధాలతో పాటు ఉత్కంఠభరితమైన అంశాలు కూడా కథలో భాగమవుతాయని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. ఇక అక్టోబర్‌ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను అలరించడంతో, ఈసారి వీరిద్దరూ ఎలాంటి కథతో వస్తారనే ఆసక్తి నెలకొంది. కామెడీ, కుటుంబ భావోద్వేగాలు, సస్పెన్స్‌ కలగలిసిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రబృందం నమ్మకంగా ఉంది. అయితే సినిమా విజయం విషయంలో అంతిమ నిర్ణయం ప్రేక్షకులదే అన్నది వెంకటేశ్‌ వ్యాఖ్యల సారాంశం.     [Venkatesh, Aadarsha Kutumbam, Venkatesh Trivikram Movie, Aadarsha Kutumbam Press Meet, Trivikram Srinivas, Venkatesh Latest News, Aadarsha Kutumbam Release Date, Telugu Cinema News]
సినిమా పాట అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది సంగీత దర్శకుడు, గాయకుడు, గేయ రచయిత. కానీ ఒక పాటను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయడంలో వాయిద్య కళాకారుల పాత్ర కూడా ఎంతో ఉంటుంది. ముఖ్యంగా ఇళయరాజా సంగీతంలో గిటార్ వినిపిస్తే చాలు.. ఆ మాధుర్యాన్ని ఆస్వాదించకుండా ఉండలేం. అలాంటి ఎన్నో మధురమైన పాటలకు తన గిటార్‌తో ప్రత్యేకమైన అందాన్ని తీసుకొచ్చిన సీనియర్ సంగీత విద్వాంసుడు సదా మాస్టర్ కన్నుమూశారు. ఆయన మరణంతో సినీ సంగీత ప్రపంచంలో విషాదం నెలకొంది. ఎస్. సదానందం అలియాస్ సదా మాస్టర్ దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో ప్రముఖ గిటార్ కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్. సుదర్శనం కుమారుడైన ఆయన.. చిన్నప్పటి నుంచే సంగీత వాతావరణంలో పెరిగారు. ఇళయరాజా సంగీత బృందంలో నాలుగు దశాబ్దాలకు పైగా ప్రధాన గిటారిస్ట్‌గా పనిచేశారు. ఇళయరాజా సంగీత దర్శకుడిగా పరిచయమైన ‘అన్నకిళి’ సినిమా నుంచి ఆయనతో కలిసి ప్రయాణించారు. అలా వేలాది పాటలకు తన గిటార్ సంగీతాన్ని అందించారు. ఎన్నో పాటల్లో ప్రారంభ సంగీతం, మధ్యలో వచ్చే వాయిద్యాల బిట్స్‌ ప్రత్యేకంగా వినిపించడానికి సదా మాస్టర్ వంటి కళాకారుల ప్రతిభ కూడా ఒక కారణం. తనతో ఎన్నో ఏళ్లుగా కలిసి పనిచేసిన సదా మాస్టర్ మరణవార్తపై ఇళయరాజా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన తన తొలి రోజుల నుంచే తనతో ఉన్నారని గుర్తుచేసుకున్నారు. తనతో కలిసి జీవించినవారిని, తన జీవితంలో అంతర్భాగమైనవారిని మరణించినవారిగా చూడలేనని భావోద్వేగంగా పేర్కొన్నారు. సదానందం ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.  ఇది కూడా చదవండి: బాలయ్య vs మంచు మనోజ్.. క్లైమాక్స్‌కు వచ్చేసిన ‘దాదా’.!       [Guitarist Sada Master Passed Away, Ilaiyaraaja Guitarist Sada Master, Sada Master Passes Away, Ilaiyaraaja Guitarist, Ilaiyaraaja Music Team, Sadanandam Guitarist, Ilaiyaraaja, Sada Master]  
మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ కీర్తి సురేష్‌కు విమాన ప్రయాణంలో ఓ చేదు అనుభవం ఎదురైంది. సాధారణంగా అభిమానులతో సరదాగా మాట్లాడటం, వారితో ఫొటోలు దిగడం ఇష్టపడే కీర్తికి.. ఓ వ్యక్తి ప్రవర్తన ఇబ్బందికరంగా మారింది. మిలన్‌ నుంచి ఇండియాకు తన భర్త ఆంటోనీ తట్టిల్‌తో కలిసి విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కీర్తి సురేష్‌ ప్రయాణిస్తున్న విమానంలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చాడు. సరిగా నిలబడలేని స్థితిలో ఉన్న అతను తనతో సెల్ఫీ దిగాలని పట్టుబట్టాడు. అయితే, ఆ సమయంలో ఫొటో దిగడం సాధ్యం కాదని, కొద్దిసేపటి తర్వాత దిగుదామని కీర్తి చెప్పింది. అయినప్పటికీ ఆ వ్యక్తి ఆమె మాటలను పట్టించుకోకుండా వెంటనే సెల్ఫీ కావాలని ఒత్తిడి చేశాడు. దీంతో కీర్తి అతనికి గట్టిగా సమాధానం చెప్పాల్సి వచ్చింది. తన తరఫున నిర్ణయం తీసుకునే హక్కు అతనికి లేదని స్పష్టం చేసింది. ఈ ఘటనలో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కీర్తి భర్త ఆంటోనీ తట్టిల్‌ కూడా ఆ వ్యక్తి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేయడం. సాధారణంగా అభిమానులతో ఎంతో సౌమ్యంగా ఉండే తన భర్త గొంతు పెంచి మాట్లాడటం తాను మొదటిసారి చూశానని కీర్తి చెప్పింది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో చివరకు విమాన సిబ్బంది సహాయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది. సెలబ్రిటీలైనా సరే, తమ వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని ఈ సంఘటన ద్వారా ఆమె చెప్పకనే చెప్పారు. అయితే, విమాన ప్రయాణాల్లో అభిమానులందరి వల్ల ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయని కీర్తి అనడం లేదు. చాలామంది ఎంతో మర్యాదగా మాట్లాడతారని, కొందరైతే ఫొటో కూడా అడగకుండా ప్రయాణమంతా సరదాగా కబుర్లు చెబుతుంటారని ఆమె వివరించింది. ప్రేక్షకుల ప్రేమాభిమానాలను తాను గౌరవిస్తానని, అయితే ఎవరైనా హద్దులు దాటి ప్రవర్తించినప్పుడు మాత్రం ఇబ్బంది కలుగుతుందని తెలిపింది. సెలబ్రిటీలతో ఫొటోలు దిగాలనుకోవడం తప్పు కాకపోయినా, వారి ఇష్టాయిష్టాలను, వ్యక్తిగత పరిధిని గౌరవించడం ముఖ్యమనే విషయం ఈ ఘటనతో మరోసారి చర్చకు వచ్చింది.     [Keerthy Suresh, Keerthy Suresh Flight Incident, Keerthy Suresh Husband Antony Thattil, Keerthy Suresh Interview, Keerthy Suresh Latest News, Celebrity Fan Incident, Keerthy Suresh Selfie Incident]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
ఒంటికి చలువ చేసే, తక్షణ శక్తిని అందించే ఒక అద్భుతమైన ఆరోగ్యకరమైన పానీయం సగ్గుబియ్యం జావ. తెలుగు రాష్ట్రాల్లో ఏ కాలంలోనైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు తరచుగా తయారుచేసే ఈ జావ శరీరానికి తగిన పోషణను అందించి నీరసాన్ని ఇట్టే తగ్గిస్తుంది. సాధారణంగా జ్వరం, మోషన్స్ వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు శరీరం పూర్తిగా నీరసించిపోతుంది. ఆ సమయంలో ఎలాంటి ఘన పదార్థాలు తీసుకోలేరు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కేవలం ఒక్క గ్లాసు సగ్గుబియ్యం జావ తాగడం వల్ల త్వరగా శక్తిని పొంది వేగంగా ఉపశమనం పొందవచ్చు. సగ్గుబియ్యంలో కేలరీలతో పాటు కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్, కొవ్వులు, కాల్షియం, ఐరన్ మరియు ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరాన్ని బలంగా మార్చి రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండేలా సహాయపడతాయి. అందుకే రెగ్యులర్‌గా సగ్గుబియ్యాన్ని ఆహారంలో భాగం చేసుకోవాలని డైటీషియన్లు గట్టిగా సూచిస్తున్నారు. ఈ అద్భుతమైన రెసిపీని పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఎంతో సురక్షితంగా తీసుకోవచ్చు. ఈ జావ తయారీ కోసం అర కప్పు లేదా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకుని, ముందుగా ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి కనీసం అరగంట పాటు నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం ఎంత బాగా నానితే అంత త్వరగా, మెత్తగా ఉడుకుతాయి. అరగంట తరువాత, అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెలో ఒక కప్పు సగ్గుబియ్యానికి సుమారు 8 నుంచి 9 కప్పుల నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి మరిగించాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అందులో వేయాలి. గిన్నెపై మూత పెడితే అది త్వరగా ఉడుకుతుంది, అయితే పూర్తిగా మూయకుండా కొద్దిగా పక్కకు పెడితే పొంగిపోకుండా ఉంటుంది. సగ్గుబియ్యం త్వరగా అడుగంటుతుంది కాబట్టి మాడిపోకుండా మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూ ఉండాలి. సగ్గుబియ్యం పూర్తిగా ఉడికి పారదర్శకంగా (ట్రాన్స్‌పరెంట్‌గా) మారితే అవి సరిగ్గా ఉడికినట్లు అర్థం. చేత్తో నొక్కి చూస్తే అవి మెత్తగా ఉండాలి. ఆ తరువాత అందులో పావు కప్పు తురిమిన బెల్లం (రుచికి తగ్గట్టు సర్దుబాటు చేసుకోవచ్చు), రెండు మూడు చిటికెలు ఉప్పు, మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి వేయాలి. బెల్లం పూర్తిగా కరిగేలా బాగా కలుపుకోవాలి. బెల్లం బదులుగా పంచదార కూడా వాడవచ్చు, కానీ బెల్లం ఆరోగ్యానికి ఎంతో మంచిది. బెల్లం వేసిన తర్వాత మరొక రెండు నిమిషాల పాటు సగ్గుబియ్యాన్ని సన్నని మంటపై ఉడికించుకోవాలి. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సాధారణంగా ఈ జావలో పాలు పోయరు, ఇలాగే నీళ్లతో తయారుచేసుకుని తాగుతారు. సగ్గుబియ్యం జావ శరీరంలోని వేడిని పూర్తిగా తగ్గించి అద్భుతమైన చలువ చేస్తుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు అత్యధిక మోతాదులో ఉండటం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ముఖ్యంగా పిల్లలు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఏదీ తినడానికి ఇష్టపడరు. అలాంటి సమయాల్లో ఈ జావ వారికి ఎంతో అవసరమైన శక్తిని అందించి త్వరగా కోలుకునేలా తోడ్పడుతుంది. అలాగే ఎండకాలంలో లేదా వేసవిలో ఒంట్లో వేడిని తగ్గించడానికి ఇది నంబర్ వన్ పానీయం. ఇంట్లో ఎప్పుడూ సగ్గుబియ్యం అందుబాటులో ఉంచుకుంటే, నీరసం ఆవరించినప్పుడు లేదా అనారోగ్య వేళల్లో ఇట్టే ఈ ఆరోగ్యకరమైన జావను తయారుచేసుకోవచ్చు. ఈ సులభమైన, పోషకమైన సగ్గుబియ్యం జావను మీరు కూడా ఇంట్లో ప్రయత్నించి దాని అద్భుతమైన రుచి, ప్రయోజనాలను అనుభవించండి.     Sago Porridge Benefits, Saggubiyyam Java Recipe, Sabudana Drink For Cooling, Instant Energy Booster, Traditional Health Drinks, Digestion Improvement Foods, Summer Coolant Recipes.
మన భారతీయ వంటశాలల్లో ప్రతి రోజు ఉపయోగించే పోపు దినుసులలో కరివేపాకు ముందుంటుంది. అయితే చాలా మంది వంటల్లో రుచి కోసం వాడే కరివేపాకును పక్కన పడేస్తుంటారు. కానీ ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు జ్యూస్ లేదా ఆకులను తీసుకోవడం ద్వారా శరీరంలో ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. కేవలం 30 రోజుల పాటు ఈ చిన్న అలవాటును మీ దినచర్యలో భాగంగా మార్చుకుంటే మీ ఆరోగ్యంలో ఊహించని సానుకూల మార్పులు వస్తాయి. ముఖ్యంగా మన వంటింట్లో లభించే ఈ దివ్యౌషధం జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉదయాన్నే పరగడుపున 5 నుండి 10 తాజా కరివేపాకులను నీటిలో మరిగించి లేదా మెత్తగా గ్రైండ్ చేసి గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే జీర్ణ ఎంజైమ్‌లు ఉత్తేజితమై అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం మరియు మలబద్ధకం వంటి సమస్యలు పూర్తిగా దూరమవుతాయి. అంతేకాకుండా, ఇది శరీరంలోని జీవక్రియను (మెటబాలిజంను) వేగవంతం చేసి అదనపు బరువును మరియు కొవ్వును సులభంగా తగ్గించడంలో సహకరిస్తుంది. మధుమేహంతో బాధపడేవారికి కరివేపాకు జ్యూస్ ఒక సహజ వరంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే కార్బజోల్ ఆల్కలాయిడ్స్ మరియు యాంటీడయాబెటిక్ గుణాలు రక్తంలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచి, గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి. అలాగే శరీరంలోని LDL అనగా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతుంది. దీనివల్ల రక్తపోటు నియంత్రణలో ఉండి గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ఇక విటమిన్ ఎ, బి, సి, ఇ తో పాటు ఐరన్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల కరివేపాకు రక్తాన్ని శుద్ధి చేసి రక్తహీనత (అనేమియా) సమస్యను దూరం చేస్తుంది. రోజూ పరగడుపున ఈ పానీయాన్ని తీసుకోవడం ద్వారా శరీరం నుంచి హానికరమైన టాక్సిన్స్ బయటకు పోయి లివర్ పనితీరు మెరుగవుతుంది. అంతేకాకుండా, కరివేపాకులోని యాంటీఆక్సిడెంట్లు చర్మంపై ముడతలు, మొటిమలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి అకాలంగా జుట్టు తెల్లబడటాన్ని అరికట్టడంలోనూ ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ప్రతిరోజూ ఉదయం ఈ సహజసిద్ధమైన కరివేపాకు జ్యూస్‌తో మీ రోజును ప్రారంభించి సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.     Curry Leaves Juice Benefits, Kadi Patta Juice For Hair, Curry Leaves Water On Empty Stomach, Morning Detox Drinks, Natural Hair Growth Remedies, Weight Loss Juice Recipes, Health Benefits Of Curry Leaves.
చాలా సులభంగా, అతి తక్కువ ధరకు లభించే పోషకాల ఖజానా అయిన అరటిపండును ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మన శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా నిరంతరం 45 రోజుల పాటు రోజుకో అరటిపండు తింటూ ఉంటే మన శరీరంలో ఊహించని ఎన్నో ఆరోగ్యకరమైన మార్పులు సంభవిస్తాయని సీనియర్ డైటీషియన్లు మరియు వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. 100 గ్రాముల అరటిపండులో దాదాపు 89 కేలరీలు, 22 గ్రాముల పిండి పదార్థాలు, 2.6 గ్రాముల పీచు పదార్థం లభిస్తాయి. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఇష్టంగా తినే ఈ పండులో శరీరానికి అవసరమైన విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియం, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగై మలబద్ధకం సమస్య క్రమంగా దూరమవుతుంది. అరటిపండులో ఉండే పెక్టిన్ అనే కరిగే పీచు పదార్థం ప్రేగుల కదలికలను సక్రమంగా ఉంచి, గట్ ఆరోగ్యానికి మేలు చేసే మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది. దీనివల్ల దీర్ఘకాలిక మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి. అరటిపండ్లలో పొటాషియం పరిమాణం చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఇది రక్తపోటును అదుపులో ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలో సోడియం ప్రభావాన్ని తగ్గించి, రక్తనాళాలపై ఒత్తిడినిారించి రక్తప్రసరణ సాఫీగా సాగేలా చేస్తుంది. దీనిద్వారా గుండె కండరాల పనితీరు మెరుగై గుండెపోటు, పక్షవాతం వచ్చే రిస్క్ గణనీయంగా తగ్గుతుంది. అలాగే ఉదయం పూట అల్పాహారంగా లేదా వ్యాయామం చేసే ముందు ఒక అరటిపండు తింటే శరీరానికి సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ రూపంలో తక్షణ మరియు స్థిరమైన శక్తి లభిస్తుంది. కేవలం రెండు అరటిపండ్లు దాదాపు 90 నిమిషాలకు సరిపడా శక్తిని అందిస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో ఉండే విటమిన్ బి6 మెదడు ఆరోగ్యానికి తోడ్పడటంతో పాటు, సెరోటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని ప్రేరేపించి మానసిక ఆందోళనను, డిప్రెషన్‌ను తగ్గించి ఉల్లాసంగా ఉంచుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం రాత్రిపూట ప్రశాంతమైన, గాఢమైన నిద్ర పట్టేందుకు ఎంతగానో సహాయపడుతుంది. పురుషులలో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచి శారీరక స్టామినాని, లైంగిక సామర్థ్యాన్ని పెంపొందించడంలోనూ అరటిపండు ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. సమతుల్య ఆహారంలో భాగంగా రోజుకో అరటిపండును మితంగా తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని, నిత్య ఉత్సాహాన్ని సొంతం చేసుకోవచ్చు.     Eating Banana Daily Benefits, One Banana Everyday For 45 Days, Daily Fruit Diet Changes, Health Benefits Of Bananas, Body Transformation From Bananas, Potassium Rich Foods, Digestion And Energy Tips.
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే  ప్రతి అవయవం తన బాధ్యతను తాను సరిగ్గా నిర్వర్తించడం ఎంత ముఖ్యమో, అలాగే మనం తీసుకునే ఆహారంలో పోషకాలు సరిపడా ఉండటం కూడా అంతే అవసరం. మనం రోజూ తినే తిండి మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది. అయితే చాలామంది విటమిన్లు లేదా పోషకాలు తక్కువైతే నీరసం రావడం, రక్తం పడిపోవడం లేదా చర్మం , కళ్ళు బలహీనపడటం మాత్రమే జరుగుతుందని అనుకుంటారు. కానీ మన శరీరంలో అత్యంత కీలకమైన భాగమైన లివర్.. దీన్నే  కాలేయం అని అంటారు.  కాలేయం ఆరోగ్యం కూడా కొన్ని విటమిన్ల ఆధారంగా ఉంటుంది.  అసలు కాలేయం చేసే పని ఏమిటి? ఏ విటమిన్లు లోపిస్తే కాలేయం దెబ్బతింటుంది? వివరంగా తెలుసుకుంటే.. శరీరంలో లివర్ పాత్ర.. మన శరీరంలో లివర్ చేసే పనులు అన్నీ ఇన్నీ కావు. మనం తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయడంలో, శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలను , హానికారక పదార్థాలను బయటకు పంపడంలో, శరీరానికి కావలసిన శక్తిని నిల్వ చేయడంలో లివర్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే ఎన్నో రకాల ముఖ్యమైన ప్రొటీన్లను కూడా ఇదే తయారు చేస్తుంది. అయితే శరీరంలో కొన్ని రకాల విటమిన్ల లోపం ఏర్పడినప్పుడు అది నేరుగా లివర్ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మరోవైపు లివర్‌కు సంబంధించిన సమస్యలు ఏవైనా వస్తే, అప్పుడు శరీరం విటమిన్లను సరిగ్గా గ్రహించలేకపోతుంది. దీనివల్ల సమస్య మరింత జటిలమయ్యే అవకాశం ఉంటుంది.  ఆ విటమిన్లు ఏమిటో తెలుసుకుంటే.. విటమిన్-ఎ.. శరీరంలో విటమిన్ ఎ లోపం ఏర్పడితే అది కంటి చూపు తగ్గడం, చర్మం పొడిబారడం వంటి సమస్యలకే పరిమితం కాకుండా లివర్ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. మన శరీరంలో ఉండే మొత్తం విటమిన్ ఎ నిల్వల్లో దాదాపు ఎనబై నుంచి తొంభై శాతం వరకు లివర్‌లోనే ప్రత్యేక కణాలలో నిల్వ ఉంటుంది. కాబట్టి లివర్ పనితీరు మందగిస్తే విటమిన్ ఎ నిల్వలు కూడా దెబ్బతింటాయి. అలాగే ఎముకలు , కండరాల బలానికి ఎంతగానో ఉపయోగపడే విటమిన్ డి లోపం కూడా లివర్ సమస్యలు ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. శరీరంలో విటమిన్ డి తక్కువైతే అది లివర్‌లో వాపు రావడానికి , కణజాలం దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతుంది. విటమిన్-ఇ.. శరీరంలో కణాలను ఆక్సీడేటివ్ నష్టం నుంచి రక్షించడంలో విటమిన్ ఇ ఎంతగానో సహాయపడుతుంది. శరీరంలో కొవ్వు సరిగ్గా శోషణం కాకపోవడం లేదా కొన్ని రకాల దీర్ఘకాలిక లివర్ సమస్యలు ఉన్నప్పుడు విటమిన్ ఇ లోపం ఏర్పడే అవకాశం ఉంది. ఈ విటమిన్ తగినంత ఉంటే లివర్‌లో వచ్చే వాపును , కణాలకు జరిగే నష్టాన్ని కొంతవరకు తగ్గించడానికి వీలవుతుంది. విటమిన్-కె.. రక్తం గడ్డకట్టడానికి సహాయపడే ప్రొటీన్ల తయారీలో విటమిన్ కే ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒకవేళ ఈ విటమిన్ లోపిస్తే చిన్న గాయాలైనప్పటికీ రక్తం త్వరగా గడ్డకట్టదు. శరీరంలో పిత్తరసం సక్రమంగా ప్రవహించకపోయినా లేదా కొవ్వు పదార్థాలు సరిగ్గా ఒంటబట్టకపోయినా విటమిన్ కే లోపం తలెత్తుతుంది. మొత్తంగా చెప్పాలంటే లివర్ ఆరోగ్యంగా ఉండాలన్నా, లేదా లివర్ తన విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నా శరీరానికి అవసరమైన విటమిన్లు సరైన పాళ్ళలో అందడం చాలా ముఖ్యం. ఏ చిన్న ఆరోగ్య సమస్య కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం , అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా కాలేయాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు.                                                                                                                                               *రూపశ్రీ.
వేసవి కాలం వెళ్ళిపోయి చలికాలం వైపు అడుగులు వేస్తున్న సమయంలో మార్కెట్లోకి విరివిగా వచ్చే పండ్లలో సీతాఫలం ఒకటి. పైకి బొడిపెల్లా ఉంటూ, లోపల  గుజ్జుతో ఎంతో తియ్యగా ఉండే ఈ పండును చాలామంది ఇష్టంగా తింటారు. రుచిలోనే కాదు, ఆరోగ్య ప్రయోజనాల్లోనూ సీతాఫలం ఎంతో ముందుంటుంది. మరి ఈ సీజన్లో దొరికే సీతాఫలాలను ఎవరు తినాలి? రోజుకు ఎన్ని తినాలి? దీనివల్ల  శరీరానికి కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుంటే.. సీతాఫలం ఎవరు తినాలి? చిన్న పిల్లల నుంచి ముసలివాళ్ల వరకు అందరూ సీతాఫలాలు తినవచ్చు. ముఖ్యంగా ఎల్లప్పుడూ నీరసంగా ఉండేవాళ్లకు, త్వరగా అలసిపోయే వాళ్లకు ఇవి చాలా మంచివి. బరువు పెరగాలనుకునే వాళ్లకు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లకు ఈ పండు చక్కటి ఆహారం. అయితే షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు మాత్రం డాక్టర్ సలహా మేరకు తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. రోజుకు ఎన్ని తినాలి? ఏదైనా సరే అతిగా తింటే నష్టమే కలుగుతుంది. సీతాఫలాలు తియ్యగా, కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రోజుకు ఒకటి లేదా రెండు పండ్లు తింటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ తింటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు మితంగా తినడం చాలా ముఖ్యం. సీతాఫలాల వల్ల కలిగే బెనిఫిట్స్.. శక్తిని ఇస్తుంది.. రోజంతా పని చేసి అలసిపోయిన వాళ్లకు సీతాఫలం తింటే తక్షణ శక్తి వస్తుంది. ఇందులో ఉండే సహజమైన చక్కెరలు శరీరానికి కావాల్సిన ఎనర్జీని అందిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.. ఈ పండులో పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. గుండె జబ్బులు రాకుండా కాపాడుకోవడానికి ఇవి తోడ్పడతాయి. జీర్ణ శక్తి మెరుగుపడుతుంది.. సీతాఫలాలలో పీచు పదార్థం ఎక్కువశాతంలో ఉంటుంది. ఇది కడుపును శుభ్రం చేయడానికి, మలబద్ధకం సమస్యను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థ సాఫీగా పనిచేసేలా చేస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.. ఈ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి, సీజనల్ వ్యాధులు, జలుబు, దగ్గు వంటివి రాకుండా రక్షణ ఇస్తుంది. చర్మం, జుట్టు అందంగా ఉంటాయి.. విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల సీతాఫలాలు చర్మానికి మంచి మెరుపును ఇస్తాయి. జుట్టు రాలే సమస్యను తగ్గించి, కుదుళ్లను బలంగా ఉంచడంలో సహాయపడతాయి. ఎముకలు బలపడతాయి.. కాల్షియం, మెగ్నీషియం ఉండటం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. కీళ్ల నొప్పులతో బాధపడే వాళ్లకు సీతాఫలం మంచి ఆహారం. మొత్తానికి సీతాఫలం కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే దివ్యౌషధం. ఈ సీజన్లో దొరికే ఈ అద్భుతమైన పండును అస్సలు మిస్ కాగండి.                                                                                                                                            * రూపశ్రీ.