Previous Page Next Page 
వెన్నెల వొణికింది పేజి 3


    'నిన్ను సుఖంగా వుండనివ్వను. ఇక్కడే వుండి నీ అంతుచూస్తాను' అనేది కసిగా. ఆ క్షణంలో యిద్దర్నీ చూస్తే ఒకరినొకరు చంపుకునేంత బద్దశత్రువుల్లా కనిపించేవారు. ఇద్దరూ ఒకరికోసం ఒకరు పుట్టినంతగా పెనవేసుకుపోయే వారు.
    
    ఈ మనుషులు, స్వభావాలు చూస్తూంటే చిన్మయికి జీవితమంటే ఒక్కోసారి భయం కలుగుతూ వుండేది.
    
                                              2
    
    ఓ రోజు ఉదయం రాజీవ్ ఆఫీసుకి వెళ్ళిపోయాక చిన్మయి యింట్లో వంటరిగా కూర్చుని వుండగా మంజుభార్గవి వచ్చింది.
    
    "రండి" అంది చిన్మయి మర్యాదగా.
    
    "ఇంట్లో ఒక్కరే ఎంతసేపని కూచుని వుంటారు? అలా షాపింగుకు వెళ్ళివద్దాం రాకూడదా?" అంది.
    
    నిజానికి చిన్మయికి కూడా బజారు వెళ్ళేపని వుంది. ఇంట్లో కొన్ని సరుకులు అయిపోయినాయి. ప్రతి చిన్నదానికీ భర్తతో బజారువెళ్ళి అతన్ని కష్టపెట్టాలంటే యిబ్బందిగానే వుంది. అతనుకూడా "చిన్మయీ! చిన్న హ్సిన్న షాపింగ్స్ అన్నీ సొంతంగా చేసుకోవాలి. సిటీస్ లో అది ఫేషన్ కూడా" అనేవాడు.
    
    "నేను ఒక్కదాన్నే ఎలా వెళ్ళను చెప్పండి" అంటే "నైబర్స్ తో కొంత సోషల్ గా వుండాలి. ఎలాంటివారితోనైనా ఎడ్జస్ట్ కాగలగాలి" అనేవాడు.
    
    అతను చెప్పినదాంట్లో కొంత నిజముందనిపించింది చిన్మయికి ప్రపంచం చాలా విశాలమైనది. రకరకాల మనస్తత్వాలు కలవారు, వింత వింత ధోరణలు కలవారు తారసపడుతూ వుంటారు. కొంతవరకూ భరించగలగటమే నాగరికత కావచ్చుననుకుంది.
    
    "ఒక్క అయిదు నిముషాలు" అంటూ లోపలకు వెళ్ళి శారీ మార్చుకుని వచ్చింది.
    
    మంజుభార్గవి ఆమెవంక పరీక్షగా చూసి "మీరు చాలా అందంగా వుంటారు" అంది.
    
    చిన్మయి సిగ్గుపడింది. "రండి" అంది బయటకు దారితీస్తూ.
    
    "ఎటు వెడదాం?" అంది.
    
    "మౌంట్ రోడ్"
    
    ఇద్దరూ బస్ ఎక్కారు. బస్ ఆగగానే గబగబ తోసుకుంటూ ఎక్కటం, యితరుల శరీరాలు దగ్గరగా వచ్చి తాకుతూ వుండటం- యీ వాతావరణానికి కొంతవరకూ అలవాటు పడింది చిన్మయి.
    
    మౌంట్ రోడ్ లో దిగాక యిద్దరూ ఫుట్ పాత్ మీద చకచక నడవసాగారు. మంజుభార్గవి చాలా షాపుల్లోకి తీసుకెళ్ళింది. ఆమె ఏవేవో చాలా సామాను కొంది. ఒకచోట సెంట్స్ వగైరాలు కొంది. ఇంకోచోట ఓ శారీ తీసుకొంది. ఇంకోచోట బ్రాసరీస్ కొంది. వేరేచోట చెవులకి పెట్టుకునే రింగులు కొంది. తర్వాత ఓ జూయలరీ షాపుకు తీసుకెళ్ళి పాతగాజులు యిచ్చి కొత్తమోడల్ చెయ్యమని ఆర్డరిచ్చి అతనితో కబుర్లుచెబుతూ దాదాపు గంటసేపు గడిపింది. ఆమెను చూస్తుంటే చిన్మయికి చాల ఆశ్చర్యమనిపించింది. ఆమెకు పరిచయస్థులు కానివారెవరూ లేరనిపించింది. అలాగే డబ్బు దుబారా చెయ్యడంలో ఓ థ్రిల్ అనుభవిస్తుందనిపించింది.
    
    జూయలరీ షాపులోంచి యిద్దరూ బయటకొచ్చారు.
    
    అప్పటికి మధ్యాహ్నం పన్నెండు దాటింది. చిన్మయికి కొంత అలసటగా వుంది. ముఖాన చిరుచెమటలు పడుతున్నాయి.
    
    అంతలో ఒక యువకుడు వాళ్ళకెదురుగా వచ్చాడు. "హాయ్! మంజూ!" అని పలకరించాడు మంజుభార్గవిని.
    
    "హాయ్ రజనీ! ఎప్పుడొచ్చావు వూరినుంచి?" అంది మంజుభార్గవి. ఆమె మొహంలో చాలా సంతోషం కనిపిస్తోంది.
    
    "పది రోజులయింది."
    
    "పది రోజులా? ఇన్నాళ్ళూ కనబడలేదేం?"
    
    "చాలా బిజీగా వున్నాను. ఎంత ట్రైచేసినా రావడం కుదరలేదు."
    
    "ఈమె నా ఫ్రెండ్ చిన్మయి. ఇతను రజనీకాంత్ మా ఫ్యామిలీ ఫ్రెండ్" అని పరిచయం చేసింది.
    
    "గ్లాట్ టు మీట్ యు" అని మంజుభార్గవివంక తిరిగి "రండి అలాగే రెస్టారెంట్ లోకి వెళ్ళి కాఫీగాని, కూల్ డ్రింక్స్ గానీ తీసుకుందాం" అన్నాడు.
    
    "అవును నాకూ ఆకలి వేస్తోంది, పద రండి చిన్మయిగారూ" అంది మంజుభార్గవి.
    
    చిన్మయికి యిరుకున పడ్డట్లుగా అయింది. ఏంచెయ్యాలో తోచలేదు. విధిలేక వాళ్ళతోబాటు అక్కడికి దగ్గర్లో వున్న ఎ.సి. రెస్టారెంట్ లోకి అడుగుపెట్టింది.
    
    "ఏం తీసుకుంటారు? మంజూ! నీకాకలేస్తోందన్నావుగా, టిఫిన్ ఏదైనా తీసుకో."
    
    మంజుభార్గవి తనకి కట్ లెట్ కావాలని చెప్పింది.
    
    "మీకేం కావాలి చిన్మయిగారూ?" అనడిగింది.
    
    "నాకేం వద్దండీ" అంది చిన్మయి చాలా మొహమాటంగా.
    
    "అదేమిటి? మిల్క్ షేక్ తీసుకోండి. ఇక్కడ చాలా బావుంటుంది" అని ఆమె అంగీకారంకోసం చూడకుండా ఆర్డర్ చేసేశాడు రజనీకాంత్.
    
    బేరర్ తిరిగివచ్చేలోగా రజనీకాంత్, మంజుభార్గవి ఎడతెరిపి లేకుండా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరిమధ్య ఎంతోచనువు, ఒకరంటే ఒకరికి ఆపేక్ష వున్నట్లు తేటతెల్లమవుతోంది. అతనే మాత్రం చిన్న జోక్ వేసినా మంజుభార్గవి మనసారా నవ్వుతోంది. మాటలమధ్యలో అతననేకసార్లు ఆమె భుజంమీద చరిచాడు. చిన్మయి యిబ్బందిగా ఫీలవుతోంది.
    
    కట్ లెట్, మిల్క్ షేక్ వగైరాలన్నీ వచ్చాయి.
    
    "చిన్మయిగారూ! తీసుకోండి" అన్నాడు రజనీకాంత్ గ్లాస్ ముందుకు జరుపుతూ.
    
    ఆ వాతావరణం, బొత్తిగా పరిచయంలేని వ్యక్తితో కూర్చుని డ్రింక్స్ అవీ త్రాగడం చిన్మయికి చాలా యిరకాటంగా వుంది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS