Previous Page Next Page 
నీ మీద మనసాయరా పేజి 2


                                          2
    
    సిటీకి దగ్గర్లోని ఓ పల్లెటూరు ఆమెది. ఆమె తండ్రివల్లే ఆ ఊరు జిల్లాలో ప్రసిద్ది.
    
    ఆ ఊరు పేరు వినగానే ఎవరికైనా భూపతిరాజా గుర్తొస్తాడు. ఆయన పెద్ద భూస్వామి. ఆ ఊర్లోని ముప్పాతిక భూములు ఆయనవే. ఆయనంటే ఎవరికైనా భయమే. తనకు వ్యతిరేకంగా ఏం జరిగినా ఆయన చండశాసనుడే అవుతాడు.
    
    ఆ గ్రామంలో కూలీ జనం దగ్గర్నుంచి కాస్తంత మోతుబరి రైతుల వరకు ఎవరూ ఆయన ఎదురుగ్గా కూర్చోరు. బయటవాళ్ళయితే ఆయన కూర్చున్నాక అతివినయంగా కుర్చీలో ఒదిగి కూర్చుంటారు. కలెక్టర్ ఎప్పుడైనా ఎదురుపడితే ముందే తన చేతులు జోడించి నమస్కరిస్తాడు. ఎమ్మెల్యే అయితే ఒకడుగు ముందుకేసి సాదరంగా ఆహ్వానిస్తాడు. నిజమే మరి ఆయన్ని వ్యతిరేకించి మనగలగడం మహాకష్టం.
    
    ఆయన ఇంటిముందు తిన్నెమీద కూర్చుని వుంటే అటు వీధిలో నడిచెవారెవరూ చెప్పులు వేసుకోరు. చెప్పుల్ని చేతుల్లోకి తీసుకుని, ఆ ఇల్లు దాటాక తిరిగి వేసుకుంటారు. ఎడ్లబండి తోలేవాడు కూడా దిగి, ఆ వీధి దాటాక తిరిగి కూర్చుంటాడు.
    
    ఓసారి నాగులు అనేవాడు ఏదో ఏమరపాటుతో బండి దిగకుండా తోలుకెళ్ళాడు. అంతే రాగాగారు కన్నెర్రజేశారు. బండి మలుపు తిరగక ముందే ఆయన మనుషులెల్లి నాగుల్ని లాక్కొచ్చారు. చెట్టుకి కట్టేశారు. కాళ్ళమీదే ఇష్టం వచ్చినట్లు కొట్టారు. రాజాగారి ముందు కూర్చున్నవాడు ఇక శాశ్వతంగా నిలబడలేక పోయాడు- అవిటివాడై పోయాడు.
    
    అలాంటి భూపతిరాజాకి సూర్యచంద్రప్రభ ఒక్కతే కూతురు. ఆమెకి ఎప్పుడు ఏం కావాలో అన్నీ అమరిపోయేవి. టైముకి ముందే అన్నీ ముందుండడం వల్ల ఆకలి ఎలా వుంటుందో ఎప్పుడూ తెలియకుండానే పోయింది. టెన్త్ క్లాస్ పాసయినప్పుడు దేవుడికి ఉపవాసముంటానని అమ్మకి చెప్పి రాత్రి భోజనం చేయకుండా పడుకుంది.
    
    నొప్పి, బాధా, మంతా కాకుండా అదో రకంగా భరించనలివి కాకుండా వున్న ఆకలి అన్న ఫీలింగ్ ని చాలాసేపు ఎంజాయ్ చేస్తూ గడిపింది. ఇక తనవల్ల కాదని అనిపించినప్పుడు తల్లికి తెలియకుండా వెళ్ళి ఫ్రిజ్ లోని ఫ్రూట్ సలాడ్ ని లాగించింది.
    
    పదవతరగతి పాసయ్యాక ఇంటర్ సిటీలో చేరింది. రోజూ కార్లో ఊరునుంచి సిటీకి వెళ్ళి సాయంకాలానికి తిరిగివచ్చేది. ఆమె తండ్రికున్న హోదావల్ల ఆమెతో ఎవరూ కలిసేవాళ్ళు కాదు.
    
    కాలేజీలో ఎదురుపడ్డప్పుడు పలకరింపుగా నవ్వేవాళ్ళు తప్ప మనసు విప్పి మాట్లాడేవాళ్ళు కాదు. ఏదో తెలియని పొర అడ్డుగా నిలబడిపోయేది.
    
    ఊర్లోని మిగతా అమ్మాయిలు, అబ్బాయిలంతా కాలేజీకి బస్సులో వచ్చేవాళ్ళు.
    
    బస్టాప్ లో జోక్ లు, నవ్వులు, పంతాలు, పట్టింపులతో సరదాగా గడిపేవాళ్ళు.
    
    ఏ రోజు ఏం జరిగిందో అంతా తెలిసేది సూర్యాదేవికి. తనకి ఎంచక్కా బస్సులో పోవాలని వుండేది. కాని తండ్రి ఎదురుపడి మాట్లాడే ధైర్యం లేదు.
    
    ఓరోజు కాస్తంత ఆలస్యంగా ఇంటినుండి బయల్దేరింది. మెటల్ రోడ్డుదాటి కారు మెయిన్ రోడ్డులోకి మలుపు తిరిగింది. బస్టాండ్ లో ఒంటరిగా నైమిష వుండటంతో కారు ఆపింది.
    
    నైమిష కారు దగ్గరికి వచ్చింది.
    
    "ఏమిటిలా ఒంటరిగా- కాలేజీకేనా?"
    
    "ఆఁ బయల్దేరేటప్పటికి లేటయింది. నిన్న కొద్దిగా జ్వరం ఈ రోజుకి సెట్ రైట్ అయింది. వచ్చేటప్పటికి బస్సులన్నీ వెళ్ళిపోయినట్లున్నాయి."
    
    "అయితే రా! కార్లో వెళదాం"
    
    నైమిష ఎక్కగానే కారు కదిలింది.
    
    "జ్వరం అయితే సెలవు పెట్టాల్సింది"
    
    "ఈరోజుకి బాగా తగ్గినట్టే, రాత్రి మంత్రం, తంత్రం అన్నీ వేశాం" చెప్పింది.
    
    "మంత్రం తంత్రమూనా?' సూర్యచంద్రాదేవి ఆశ్చర్యపోతూ అడిగింది.
    
    "నాకు జ్వరం అని తెలియగానే సురేష్ అంజేరమ్మ తిప్పకువెళ్ళి, అమ్మవారి విభూది తెచ్చాడు, అర్ధరాత్రి గుట్టల్లో మిట్టల్లో నడిచివెళ్ళి తెచ్చి, ఓ పిల్లాడితో పంపాడు. ఆ విభూదికి కాదుగానీ అతని అభిమానానికి జ్వరం పోయిందనుకో" అన్నది నైమిష.
    
    "సురేష్ ఎవరు?" అడిగింది.
    
    "ఇల్లుదాటి బయటికి రానిదానివి కాబట్టి మన ఊరివాళ్ళు కూడా నీకు తెలియదు. సురేష్- అదే శాంతారావు టీచర్ కొడుకు- మా ఎదురిల్లే"
    
    సురేష్ కీ, నీకూ వున్న సంబంధం ఏమిటని అడగలేదు సూర్యచంద్ర ప్రభాదేవి. అర్ధమైంది. ఇక ఆ టాపిక్ ని అడగడం ఇష్టం లేకపోయింది.
    
    అందుకే నైమిష దగ్గరున్న నోట్ బుక్ ను తీసుకుని చూడడం మొదలు పెట్టింది.
    
    ఆ నోట్ బుక్కంతా రౌండ్స్ వున్నాయి. ప్రతి పేజీలోనూ పెన్సిల్ తో గీసిన వృత్తాల్ని చూసి ఆశ్చర్యపోయింది.
    
    "నైమిషా! ఏమిటీ వృత్తాలు?" అడిగింది సూర్యాదేవి.
    
    ఓ నిముషంపాటు జవాబు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్లు మౌనంగా వుండిపోయింది ఆమె. ఏమిటన్నట్లు సూర్యాదేవి కళ్ళల్లోకి చూస్తూ వుండడంతో ఇక తప్పదన్నట్లు చెప్పింది.
    
    "అవి నా గాజుతో సురేష్ గీశాడు. ఈ వృత్తంలో ఇరవైనాలుగు గంటలను గుర్తించాలి. అంటే ఇరవై నాలుగు గంటలున్న గడియారం అన్నమాట. అతను ఏ సమయంలో నాకు గుర్తొస్తే అక్కడ ఓ డాట్ పెట్టాలి. రోజుకో వృత్తంలో ఇలా గుర్తిస్తే ఎన్నిసార్లు అతన్ని తలుచుకున్నానో తెలిసిపోతుందన్న మాట ఏదో సరదాకి...."
    
    సూర్యాదేవికి జీవితంలో మొదటిసారి దిగులేసింది. తను ఏదో మిస్ అయిపోతున్నానన్న భావన గుండెల్లోని శూన్యాన్ని భర్తీ చేయడంతో బరువెక్కింది.
    
    ఇదంతా ఏమీ గమనించకుండానే నైమిష చెబుతోంది "ఏమిటో సురేష్ పిచ్చి ప్రేమ. రాత్రి నేనొక్కదాన్నే గుడిసెలో పడుకున్నాను. అమ్మానాన్న అడ్డాపింట్లో పడుకున్నారు. రాత్రి పదిగంటలప్పుడు అందరూ నిద్రపోయాక నా దగ్గరికి వచ్చాడు.
    
    ఆంజనేయదండకం చదివి వినిపిస్తే జ్వరం పోతుందని ఎవరో చెప్పారట. దాంతో దండకం పట్టుకొచ్చాడు. నేను పడుకున్న మంచం దగ్గరికి స్టూల్ లాక్కొని ఆ గుడ్డి దీపపు వెలుగులో కూడి కూడి చదవడం ప్రారంభించాడు. అతని ప్రేమకు ఏడుపొచ్చిందనుకో, వెక్కి వెక్కి ఏడ్వడం ప్రారంభించాను. ఏమిచ్చి అతన్ని సంతోషపెడదామనే నా ధ్యాసంతా. మూడుసార్లు చదివి ముగించాడు.
    
    రెండు చేతులూ పట్టుకుని ఎదకు ఆనించుకున్నాను. నిశ్చల సమాధి అంటారే అలా వుండిపోయాను. ఎక్కడ అతను చేయి తీసేస్తే ఒంటరి దాన్నయిపోతానేమోనన్న భయంతో కాబోలు అదిమి పట్టుకున్నాను ఒక విధమైన నిశ్చింత అలానే నిద్రపోయాను. ఒకవేళప్పుడు మెలకువ వచ్చింది. లేచి చూస్తే సురేష్ అలానే వున్నాడు. చప్పున చేయి వదిలేశాను. ఎంత రాత్రయిందో తెలియదు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS