Previous Page Next Page 
క్రాస్ రోడ్స్ పేజి 2


    
    ఓ ఐదు నిమిషాలకు ఆ రోడ్ అంతా క్లియర్ అయింది.
    
    వ్యాన్ వేగం తిరిగి పుంజుకుంది.
    
    వ్యాన్ లో తిరిగి సంభాషణ మొదలయింది.
    
    "మన అన్వేషణ ఎంత కాలానికి పూర్తవుతుందో..."
    
    "ముందే ఇలా డీలా పడిపోతే ఎలా...?" డ్రైవర్ ఉన్నట్లుండి సడన్ బ్రేక్ తో వ్యాన్ ని ఆపేసాడు.
    
    వ్యాన్ నాలుగు టైర్లు రోడ్డుని బలంగా రాసుకున్న శబ్దం వినిపించి మాట్లాడుకుంటున్న ఇద్దరు వ్యక్తులు ఏం జరిగిందన్నట్లు తలెత్తి ముందుకు చూసారు.
    
    రోడ్డు మధ్యలో జనం గుమికూడి తీవ్రంగా ఏదో చర్చించుకుంటూ కనిపించారు.
    
    వ్యాన్ లో ఉన్న ఇద్దరు వ్యక్తుల్లోని ఒకరు అసహనంగా "డామ్ ది రోడ్స్..." అన్నాడు.
    
    "డ్రైవర్... ఏం జరిగింది...? మనం ముందుకు వెళ్ళటానికి వీలుపడదా...?" ఆతృతను కనబరుస్తూ అన్నాడతను.
    
    "ఒన్ మినిట్ సార్" అంటూ డ్రైవర్ వ్యాన్ దిగి జనంకేసి వెళ్ళాడు.
    
    వ్యాన్ లోని ఒక వ్యక్తి ప్రక్కనే సీటు మీదున్న సిగరెట్ ప్యాకెట్ అందుకొని సిగరెట్ వెలిగించాడు.
    
    రెండోవ్యక్తి లైట్ వేసి టైమ్ చూసుకొని ఉలిక్కిపడ్డాడు. "ఈపాటికి డాక్టరు పరబ్రహ్మం రికార్డ్స్ తో సిద్దంగా ఉండి వుంటాడు. మనం వెళ్ళటం ఆలస్యమైతే ఇక రాత్రికి మనం రామనుకొని ఇంటికెళ్ళిపోవచ్చు. రేపు భారత రాష్ట్రపతి ట్రీట్ మెంట్ కి అదే హాస్పిటల్ కి వస్తున్నారు.
    
    సెక్యూరిటీ సిబ్బంది అడుగడుగునా తిష్టవేస్తుంది. ట్రీట్ మెంట్ జరిగినంత కాలం మనం ఆ హాస్పిటల్ కి వెళ్ళటం ప్రమాదం..." మొదటి వ్యక్తికి అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోతే, దాని తాలూకు అసహనపు ప్రభావంతో కొన్ని గంటల వరకు ప్రతి చిన్న విషయానికి ఆవేశపడి పోతుంటాడు.
    
    "ఇదో నరకం.... జపాన్ టోక్యో అని, అమెరికా న్యూయార్క్ అని అనుకోవటమే.... కోటిమంది జనాభా ఈ ఇరుకు రోడ్లమీద ఎలా ప్రయాణించగలరు...?" చిరాకు పడ్డాడు రెండోవ్యక్తి.
    
    "హెల్ప్ కిచెన్ ఆఫ్ న్యూయార్క్.... మోకాళ్ళ లోకి జారిన మెదడుతో పనిచేసే వెధవలు.... రోడ్స్ సెన్స్ బొత్తిగా లేదు. రోడ్లని బ్లాక్ చేసి చోద్యం చూసే యూజ్ లెస్ ఫెలోస్..."
    
    అంతలో డ్రైవరు వచ్చాడు.
    
    డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటూ చిన్నగా అన్నాడు. "తలలేని మొండెం....కొద్ది నిమిషాల క్రితమే ఆ శవం రోడ్ మీదకు వచ్చినట్లుంది. రక్తం రోడ్డంతా వరదలా ప్రవహిస్తోంది. వెనక్కి వెళ్దామా...." డ్రైవరు తడారిన గొంతుకతో అడిగాడు.
    
    "ఇండక్టెడ్ మాఫియా కల్చర్.... ఛీ....ఛీ... వ్యాన్ ని వెనక్కి తిప్పి మరో రూట్ లో వెళ్ళు..." సిగరెట్ ని బయటకు విసిరేస్తూ అన్నాడా వ్యక్తి.
    
    రోడ్ మీదనే వ్యాన్ రివర్స్ అయి వచ్చిన దారినే కొంతదూరం వెళ్ళి రైట్ కి తిరిగి వేగం పుంజుకుంది.
    
    మరో ఐదునిమిషాలకు వ్యాన్ నేషనల్ హాస్పిటల్ ఆవరణలోకి వెళ్ళి మెయిన్ గేట్ ముందాగింది.
    
    అప్పుడు సమయం సరీగ్గా పన్నెండు గంటలయింది. పదహారవ అంతస్తులో రోడ్ వేపుగా ఉన్న కిటికీ దగ్గరకు క్రిందకు చూస్తున్న డాక్టర్ పరబ్రహ్మం ఓల్క్స్ వేగన్ ని గుర్తుపట్టి చిన్నగా నవ్వుకున్నాడు.
    
    ఆ ఇద్దరూ వ్యాన్ లోంచి దిగి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న లిఫ్ట్ దగ్గరకు వెళ్ళారు.
    
    ఒక వ్యక్తికి సుమారు ముఫ్ఫై సంవత్సరాల వయస్సుంటుంది.
    
    రెండో వ్యక్తికి దాదాపు యాభై యేండ్ల వయస్సుంటుంది.
    
    సడన్ గా ఎవరన్నా చూసినా ఆ ఇద్దరి మొఖాల్ని ఐడెంటిఫై చెయ్యటం అంత త్వరగా వీలుకాదు.
    
    చలిని తట్టుకొనేందుకు అన్న అభిప్రాయాన్ని చూపరులకు కలిగిస్తూ ఇద్దరూ తలకు మఫ్లర్సు కట్టుకున్నారు. ఆ పైన పొడవాటి స్వెట్టర్సు మెడ దగ్గర్నుంచి ప్రారంభమయి పొడవుగా సాగిపోయాయి. ఆ మఫ్లర్సు వారి మొఖాల్లోని ముప్పాతిక భాగాన్ని కప్పేసాయి.
    
    లిఫ్ట్ క్రిందకు వచ్చింది.
    
    ఇద్దరు లోపలకు వెళ్ళగానే లిఫ్టు తలుపులు మూసుకున్నాయి.
    
    పదహారో నెంబరు బటన్ ని ప్రెస్ చేశాడా యువకుడు.
    
    లిఫ్టు పైకి వెళ్ళిపోసాగింది వేగంగా.
    
    "1959నాటి రికార్డ్సు ఎలా వున్నాయి. ఈ హాస్పిటల్ నిర్మించింది ఇటీవల కాలంలోనేగదా?" మధ్యవయస్కుడు నిద్రలేమితో ఆవలిస్తూ అడిగాడు.
    
    "డాక్టరు అనిబిసెంట్ మెటర్నటీ నర్సింగ్ హోంని నిర్వహించిన మార్వారీకి సంతానం లేదు. ఆ మార్వారీకి హిందూజా సోదరులకు దూరపు బంధుత్వమేదో వుంది. పబ్లిక్ పరపస్ కోసం హిందూజా సోదరులు నేషనల్ హాస్పటల్ కట్టిస్తున్నారని తెలిసి తానిక ఆ వయస్సులో మెటర్నిటీ నర్సింగ్ హోంని నిర్వహించలేక నేషనల్ హాస్పటల్ లో కలిపేయతం జరిగింది. దాంతో అనిబిసెంట్ నర్సింగ్ హోం ఆస్తులు, రికార్సు అన్నీ ఈ హాస్పటల్ సొంతమయిపోయాయి. ఇప్పటికీ ఈ హాస్పిటల్ లోని మెటర్నిటివార్డును డాక్టరు అనిబిసెంట్ మెటర్నిటీ వార్డు అనే పేరుతోనే వ్యవహరించటం జరుగుతోంది" అన్నాడా యువకుడు.
    
    మరికొద్దిసేపటికి లిఫ్టు పదహారవ అంతస్తులో ఆగిపోయి డోర్సు ఓపెన్ అయ్యాయి.
    
    ఎదురుగా డాక్టర్ పరబ్రహ్మం చిరునవ్వుతో నిలబడివున్నాడు.
    
    ఇద్దరు లిఫ్ట్ లోంచి బయటకు వచ్చారు.
    
    "మీరిక ఈ రాత్రికి రారేమో అనుకుని ఆందోళన పడ్డాను" అన్నాడు పరబ్రహ్మం రికార్డ్సు రూమ్ కేసి దారితీస్తూ.
    
    "మమ్మల్ని గుర్తుపట్టేంత ప్రమాదకరమైన వ్యక్తులెవరు లేనట్లేనా?" ఆ యువకుడి కంఠం గంభీరంగా వుంది.
    
    "ఆ జాగ్రత్తలు ముందే తీసుకున్నాను" అన్నాడు పరబ్రహ్మం.
    
    వాళ్ళు నడిచివెళుతున్న లాబీ నిశ్శబ్దంగా వుంది. హాస్పటల్ సెంటర్ ఎయిర్ కండీషన్ కావటంతో అక్కడ వాతావరణం చల్లగా పెర్ ఫ్యూమ్ డ్ గా ఉంది. లాబీకి అటూ ఇటూ వున్న పేషంట్స్ గదులు క్లోజ్ చేసున్నాయి.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS