Previous Page Next Page 
పెంకుటిల్లు పేజి 2


    "చెప్పండి" అంది శారదాంబ.

    "నేనేమో ఊరికినే కూర్చున్నానని లోకులు అనుకుంటారు. చాలా రోజులదాకా నువ్వూ అనే దానివి కదా? జరిగిపోయిన రోజుల్ని కాస్త గుర్తు తెచ్చుకో, రోజూ నన్ను ఎటువంటి సూటి పోటి మాటలు అనే దానివో."

    "నిజమే పాపిష్టిదాన్ని, మిమ్మల్ని  చాలా కష్టపెట్టాను" అంది శారదాంబ గాద్గదికంగా.

    చిదంబరం వెంటనే అందుకుని "అలా అన్నావు బాగుంది. నాకేమో ఉద్యోగం చెయ్యటం ఇష్టం లేదు. డబ్బు లేకపోతే అలా చూస్తూ వూరుకుంటాను గాని ఒహడి క్రింద పని చెయ్యను. మన నారాయడిని చూస్తే అందుకే కోపం. కాని వాడు నా మాట వినడుగా. ఉద్యోగం కోసం చదువుకూడా మానేశాడు. డానికి నేనేం చెయ్యను?" అన్నాడు.

    ఈసారి శారదాంబ "మీరు చాలా తెలివిగలవారు. ఏమి చేసినా బాగా ఆలోచించి చేస్తారు" అంది.

    కాని చిదంబరం విచారంగా "ఎంత తెలివిగలవాడినైతే ఏమిలాభం? అంతా నన్ను మోసం చేయాలనే  చూస్తూ వుంటారు. ఆ రైతు అలా మోసం చేశాడా? తమ్ముడేమో......?"

    శారదాంబ అతన్ని వారిస్తూ "ఆ కబుర్లన్నీ ఇప్పుడా? పొద్దుపోయింది. పడుకోండి" అంది.

    చిదంబరం ఒప్పుకొని "అలాగే. కానీ యి మధ్య నా వంట్లో ఏమీ బాగుండటం లేదు. రేపోసారి డాక్టరుకి కబురు చెయ్యాలి.....కాస్త కాళ్ళు పడతావా?"

    "తప్పకుండా, రేపు డాక్టరుగారికి కబురు చెయ్యండి" అని శారదాంబ ఆయన పాదాల దగ్గర కూర్చుంది. "ఇవాళ మనసు చాలా ప్రశాంతంగా  వుంది. నీతో మాట్లాడితే ఎప్పుడూ అలాగే వుంటుంది." అని చిదంబరం కళ్ళు మూసుకున్నాడు. శారదాంబ దీర్ఘంగా నిట్టూర్చింది.


                        *    *    *


    రాధకు నిద్ర పట్టలేదు. పడుకుందామని చాలాసేపటి నుంచీ ప్రయత్నిస్తోంది. కాని సఫలం కాలేదు ఇంతలో పక్క గదిలోంచి తండ్రి మాటలు వినిపించడం ప్రారంభించాయి. ఆయనిలా మాట్లాడుతుంటే రాధకు శ్రద్ధగా వినాలనిపిస్తుంది. తీరా విన్నాక ఆమె హృదయం ద్రవించిపోయి "ఎందుకు విన్నాను?" అనుకుంటుంది.

    ఇవాళ కూడా అలాగే జరిగింది. నిద్ర పూర్తిగా దూరమైపోయింది. ఆలోచనలతో సమతమమైతూ పక్క మీద పడుకోవటం కూడా కష్టంగా వుంది. కొంతసేపు గడిచాక పక్కగదిలోంచి తండ్రి మాటల ధోరణి కూడా ఆగింది.

    ఏదో తోచి మెల్లగా లేచింది. ఆ కాంతిలో అక్కడ శాశ్వతంగా స్థావరం ఏర్పరచుకున్న చెత్తా చెదారం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంట్లో ఆ పాడు ప్రదేశాన్ని బాగుచేసి పరిశుభ్రంగా వుంచాలనీ, పచ్చటి చెట్లు మొలిపించాలని ప్రయత్నించేది. ఒకే ఒక వ్యక్తి కాని ఈ రాక్షసి మూక ముందు, అల్లరిపిల్లలముందు ఆమె ప్రయత్నాలు యెందుకూ కొరగాకుండా పోతున్నాయి. అప్పుడప్పుడూ చాలా కష్టపడి, కాస్త చోటుని శుభ్రం చేసి ఏవేవో విత్తనాలు జల్లేది. మరునాడు ఉదయం వచ్చి చూచేసరికి నిన్న ఆమె బాగు చేసిన ప్రదేశమే ఆచూకీ దొరికేది కాదు. ఇంట్లో పిల్లలకు ఎంత అధికారం వుందో, పరాయి పిల్లవాళ్ళకి కూడా అంతే అధికారం వుంది.

    నీళ్ళు నిండిన కళ్ళతో ఆమె అలాగే చూస్తూ నిల్చుంది. రోజూ చూసే విషయాన్ని గురించి కూడా వింత పడటం ఎందుకో ఆమె స్వభావం అయిపోయింది. ఆమెలో అలుముకుంటున్న ఆలోచనలు ఒక సరియైన స్థాయిని చేరకముందే---త్రుళ్ళిపడింది. ఆ పాడు ప్రదేశంలో ఒక మూల నుంచి ఏదో చప్పుడు వినిపించసాగింది. జాగ్రత్తగా వింది. ఎవరో ఒక మూల నేలను త్రవ్వుతున్నారు. ఒక్క క్షణం భయంగా తటస్థంగా నిలబడిపోయింది. పెద్ద చెత్తకుప్ప ప్రక్కన ఒక కుర్రవాడు చిన్న ఇనుప వస్తువుతో మట్టిని త్రవ్వుతూ కనిపించాడు.

    "ఏమిటిరా అది?"

    ఆ కుర్రవాడు కాస్త హడలిపోయి వెనక్కు తిరిగాడు. తర్వాత తేరుకుంటూ "నువ్వా రాధ వదినా?" ఈ విషయం ఎవరికీ చెప్పకుండా వుంటావా?" అన్నాడు లేచి నిలబడి బ్రతిమాలుతూ.

    "అసలు ఇక్కడ ఏమిటి చేస్తున్నావు!"

    "అబ్బా, ఒట్టువేస్తేగాని చెప్పను."

    రాధ-మట్టితో నిండిన అతని చేతిలో తన తెల్లని చేయివుంచి "చెప్పు" అంది.

    "ఎవరికీ చెప్పవుగా."

    "ఒట్టు వేశానుగా."

    కృష్ణుడు సిగ్గుపడుతూ "నిన్న వెంకటేశం చెప్పాడు. ఈ చోట్లో డబ్బున్నదని. పూర్వం ఎవరో ఇక్కడ పాతి పెట్టారట. అదేదో చూద్దామని త్రవ్వుతున్నాను" అన్నాడు.

    రాధ ఆశ్చర్యంగా "నిధా?" అంది.

    "ఊ"

    రాధ మళ్ళీ తేరుకుని "ఎవరు బాబు నీకు చెప్పింది? అయినా నీ కంత డబ్బు  వుంది కదా, అది చాలాకా?" అంది నవ్వుతూ.

    "నా కోస మేమిటి?"

    "మరి?"

    "అదేదో నీకే ఇచ్చేద్దామని."

    రాధ ఇంకా నవ్వుతూ "బాగుంది ఈ విషయం. ఉండు, అసలు ఇంత రాత్రివేళ ఎలా వచ్చావు?"

    "ఆ మాత్రం రాలేనేమిటి? నిద్రపోతున్నట్లు నటించాను; అంతా నిద్రపోగానే వచ్చేశాను."

    "భయం వెయ్యలేదా? సరే పో, పోయి పడుకో."

    కృష్ణుడు కొంత దూరంపోయి "ఎవరికీ చెప్పవుగా" అని అరిచాడు.

    "ఉష్.....అరవబోక, చెప్పనులే."

    వాడు వెళ్ళిపోయాడు. ఈ వెర్రిబాగుల అబ్బాయిని గురించి ఆలోచిస్తూ ఆమె అక్కడే ఒక క్షణం నిలబడింది. వాడి ప్రవర్తన, ఉద్దేశాలూ తలుచుకునేసరికి అప్రయత్నంగా ఆమె పెదాలమీద చిరునవ్వు అవతరించింది. కాని అలా ఎక్కువసేపు గడవకముందే తాను అక్కడ అలా నిలబడి వుండటం ఎంత ప్రమాదమో గ్రహించుకుని ఇవతలకు వచ్చేసింది.

    కాని ఆమెకు నిద్ర రావటం లేదు. ఇంకా అలానే చాలాసేపు నిలబడి పోవాలని అనుకుంది. ఇంట్లో అంతా ఏం చేస్తున్నారు? లోపలకు పోయి చూసింది తల్లీ, తండ్రి మంచి నిద్రలో వున్నారు. వాసు అవతల గదిలో నిద్రపోతున్నాడు. పెద్దన్నయ్య గదిలో లైటు వెలుగుతోంది. ఆమె ఆశ్చర్యపడింది. ఆ లైటు ఇందాకలేదు. ఇంతవరకూ అన్నగారు మేలుకుని యేం చేస్తున్నట్లు?

గది కిటికీలోంచి తొంగిచూసింది. నారాయణ డ్రాయరు ముందు కూర్చుని హరికేన్ లాంతరు వెలుగులో యేదో రాసుకుంటున్నాడు. తలుపులు తీసుకుని లోపలకు వెళ్ళింది.

    "ఇంత రాత్రివరకూ ఏం చేస్తున్నావన్నాయ్?"

    నారాయణ తలయెత్తి చూసి, "మరి నువ్వేం చేస్తున్నావు, ఇంత రాత్రివరకూ!" అని అడిగాడు.

    "ఎంతసేపటికీ నిద్రపట్టలేదు. ఇంతలో నీ గదిలో లైటు వెలుగుతూ కనిపించింది. చూద్దామని వచ్చాను."

    "నేనూ పడుకుని నిద్రరాకపోతే ఆఫీసు కాగితాలు కాస్త చూద్దామని లేచాను" అన్నాడు నారాయణ.

    "అయితే ఇంత రాత్రివేళ?" అంది ఆశ్చర్యంగా.

    నారాయణ విచారంగా నవ్వి, "ఫర్వాలేదులే రాధా. నాకు కష్టపడటమంటే సరదా" అన్నాడు.

    "అందుకే నిన్నందరూ అట్లా బాధ పెడుతున్నారు."

    "కాని నాకేం ఇది బాధ అనిపించడం లేదు."

    "నీ మాటలు ఎప్పుడూ ఇలాగే వుంటాయ్ అన్నాయ్. నేను రోజూ చూడటంలా! ఎటొచ్చీ ఈ ఇంట్లో కష్టపడేది నువ్వొక్కడివి కనిపిస్తున్నావు.

    అన్నగారు నవ్వి ఊరుకున్నాడు.

    పోనీ నేనేమైన సహాయం చేద్దామా అంటే నాకు చదువూ, సంధ్య పెద్దగా ఏమీ చదివించలేదాయె" అంది రాధ విషాదంగా.

    "ఆడవాళ్ళకు చదువు నువ్వనుకున్నంత అవసరం లేదు రాధా."

    తన విశాల నేత్రాలను ఎత్తి అతనివంక చూస్తూ "చూస్తున్నావుగా, నువ్వెప్పుడూ ఇలాగె అంటావు అన్నాయ్. ఆడవాళ్ళకి చదువు ఎందుకు అవసరంలేదు? వాళ్ళు మట్టుకు ఉద్యోగాలు చేయకూడదా?" అంది.

    అతను కొంచెంగా నవ్వి "ఇది చాలా వెర్రి అభిప్రాయం అమ్మాయి. ఈ విషయంలో నేను నీతో ఏకీభావించలేను. మొగవాళ్ళంతా కష్టపడి పనిచేస్తే వాళ్ళకు పనులు చేయాల్సిన అవసరం ఏమిటి?"

    "మరి మీ మగవాళ్ళంతా కష్టపడి పనిచేయకపోతేనో?"
   
    "నువ్వు ఈ ప్రశ్న కేవలం కొందరినే దృష్టిలో వుంచుకొని అడుగుతున్నావు. ఒకడు ఎందుకు పని చేయడు? అవసరమని తోస్తే శుభ్రంగా చేస్తాడు. అదిగాక ఆడది ఉద్యోగంలోకి పోవాల్సివచ్చినా, చూస్తూ ఊరుకునే వాడి విషయం అంటావా? అటువంటివాడిని మానవుడి క్రింద జమచేయను నేను."

    రాధ ఏమీ అనలేక "నీ సిద్ధాంతంలో నీకు చాలా నమ్మకం వుందన్నాయ్" అని అంది.

    కొంచెంసేపు గడిచాక ఆమె "నేనో విషయం అడగనా అన్నాయ్?" అంది.

    "అడుగు."

    "ప్రకాశానికి డబ్బు చాలా అవసరంగా ఉందని ఇవాళ ఉత్తరం వచ్చింది. వాడు ఎంతో అవసరం ఉంటేగాని అలా రాయడు."

    "నాకు ఎవరూ ఈ విషయం చెప్పలేదే!" అన్నాడు నారాయణ తెల్లబోతూ.

    "నాన్న విషయం నీకు తెలుసుగా--- అమ్మ నీకు చెప్పాలి. ఆయన గారు ఈ  విషయాన్ని అమ్మకు కూడా ఇప్పుడే తెలియజేశారు" అంది రాధ.

    "ఎంత పంపమన్నాడు?"

    "డెబ్బయి రూపాయలు."

    నారాయణ కొంచెంసేపు ఆలోచించి "ఈసారి డబ్బు పంపటం నాకు చాలా కష్టం అవుతుందనుకుంటాను రాధా" అన్నాడు.

    "ఎంచేత?"

    "రేపు జీతం వస్తుందనుకో. కాని వచ్చింది వచ్చినట్లే అయిపోతుంది. ఆఫీసులో ఇంటి ఖర్చుల కోసం కొందరి దగ్గిర అప్పు చేశాను. జీతం రాగానే వాళ్ళది- వాళ్ళకి ఇవ్వకపోతే ఊరుకోరు. వాసుగాడి జీతం రేపు కట్టాలి, ఇంట్లో ఎల్లుండికి వెచ్చాలు ఏమీ లేవని యిందాక అమ్మ చెప్పింది. ఇవన్నీపోతే అయిదారు రూపాయలు మిగులుతాయి. డెబ్బయి రూపాయలు ఎక్కడ్నించి వస్తాయి?"

    "కాని అవసరంగదా అన్నాయ్?"

    "నిజమే. అవసరమైనవన్నీ ఎలా లభిస్తాయి?"

    రాధ కొంచెంసేపు వూరుకొని "నిన్నో ప్రశ్న అడుగుతాను. మనస్ఫూర్తిగా ఇష్టమేనా? అని అడిగింది.

    దీనికి నారాయణ బాధగా "నన్ను అనుమానిస్తావా రాధా?" అని సమాధానం చెప్పాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS