Previous Page Next Page 
పెంకుటిల్లు పేజి 3


    ఆమెకూడా వ్యధాపూరితంగా "నేను అనుమానించటంలేదు అన్నాయ్ తెలియక అడిగాను. కష్టం కలిగితే క్షమించు" అంది.

    కొంతసేపటికి అతను మాట్లాడక పోయేసరికి మళ్ళీ తనే "ప్రకాశం అన్నయ్య మనం పంపించే కొంచెం డబ్బుతో యెలా కాలం గడుపుతున్నాడో అర్థం కాదు. మా స్నేహితురాలు ఒక ఆమె అన్నగార్ని చూస్తున్నాగా, నేలకు వంద రూపాయలు పంపితే, సరిపోలేదని వారానికో ఉత్తరం" అంది రాధ.

    ఆమె మనస్సు చాలా కష్టపడుతూందని గ్రహించి నారాయణ "ఆ విషయాలన్నీ ఇప్పుడెందుకు చాలా రాత్రయింది. పోయి పడుకో" అన్నాడు.

    "ఇహ పడుకుంటాను అన్నాయ్. రేపు ఎలాగయినా డబ్బుకోసం ప్రయత్నించు" అని రాధ అక్కణ్నుంచి కదిలి మెల్లగా వెళ్ళిపోతూ" నువ్వు కూడా నిద్రపో. ఆ పనేదో రేపు చూసుకోవచ్చు" అంది.

    నారాయణకి మనసు చెదిరిపోయింది. ఇప్పుడు ఆ కాగితాలు ముందు వేసుకుని కూర్చునే ఓపిక కూడా లేదు. అతను చెల్లెలు  వెళ్ళిపోయాక దీర్ఘంగా నిట్టూర్చి దీపం ఆర్పేసి తను కూడా పడుకున్నాడు.

   
                                                          3

    మధ్యాహ్నం భోజనాలు చేశాక ప్రమీల కోసం వెళ్ళింది రాధ. వెళ్ళే సరికి ప్రమీల వీణ వాయించుకుంటూ కూర్చుంది. రాధ కూడా కూర్చుంటూ "నాకు వీణన్నా రాదు" అంది.

    "నేర్చుకుంటే ఎందుకు రాదు? నువ్వు నేర్చుకోలేదు" అంది ప్రమీల ఆ వాద్యాన్ని కొంచెం దూరంగా నెట్టింది.

    "నాకు ఒకటి వచ్చు గనక! నీలాగా చదువుకున్నానా? నీలాగా పాడుతానా?" అంది రాధ.

    "ఎందుకు దెప్పిపోడుస్తావు? వీటన్నిటికీ మించిన అందం, సుగుణం ఇవన్నీ వున్నాయి చాలదా? అంది ప్రమీల సమాధానంగా.

    "అవి నీకు మాత్రం లేనట్లు?"

    దీనికి ప్రమీల సమాధానం చెప్పేలోపలే సుభద్రగారు లోపల్నుంచి వస్తూ "ఏమిటమ్మా రాధా, ఇవాళ విశేషాలు" అంది.

    "ఏమున్నాయండీ!"

    సుభద్రమ్మగారు కూడా అక్కడే చాపమీద కూర్చుంది.

    కొంతసేపు ఆ కబుర్లు అయాక "వీణమీద ఒక పాట పాడితే వింటాను" అంది రాధ.

    "ఆయనొస్తారేమో" అంది సిగ్గుతో.

    "ఎవరు?"

    "నీకు తెలీదా? అతను నిన్న సాయంత్రం వచ్చాడు. అతనమ్మా మా ప్రమీల భర్త" అంది సుభద్రమ్మగారు.

    రాధ చిరునవ్వుతో "ఫర్వాలేదులే. వస్తే వింటారు. నీ పాత వినే హక్కు ఆయనకు లేదా యేం?" అంది.

    ప్రమీల మారుమాట్లాడకుండా వీణ అందుకుంది. చాలా కొద్దిసేపట్లో తన మధుర మంజుల గానంతో అక్కడ కూర్చున్న యిద్దర్నీ పరవశుల్ని చేసింది.

    కాని ఎక్కువసేపు గడిచిపోకముందే యిద్దరే గాక మూడో వ్యక్తి కూడా ఆ గానామృతాన్ని ఆస్వాదించసాగాడు. ఎన్నో నిమిషాలు అలా దొర్లిపోయాక ప్రమీల పాడుతూనే ఎందుకో ముందుగదివైపు చూసి సిగ్గుపడి పాడటం ఆపేసింది.

    "ఆపేశావేం?" అనడిగింది రాధ.

    "ఎందుకే మధ్యలో ఆపేశావు?" అనడిగింది సుభద్రమ్మగారు.

    ప్రమీల జవాబు చెప్పకుండా ద్వారంవైపు ఓరగా చూసింది. రాధ గ్రహించుకుని తాల్ ఎత్తి చూసేసరికి అక్కడ ప్రమీల భర్త నిలబడి వున్నాడు. అతనే ప్రక్కకి తప్పుకున్నాడు.

    సుభద్రమ్మగారు తమాషాగా వచ్చిన పరిస్థితినంతా పరికించి అటువైపు వెడుతూ "ఎంతసేపయింది నాయనా వచ్చి?" అనడిగింది.

    "నేను వచ్చి ఎంతసేపు అయితేనేమిటిగాని నా గురించి పాత ఆపనక్కరలేదని చెప్పండి" అన్నాడతను గది లోపల్నుంచే. ఈ జవాబు విని ఒకరి ముఖం ఒకరు చూసుకొని నవ్వుకున్నారు ముసిముసిగా.

    "అయితే నే వెడతాను" అంది రాధ.

    కాని ప్రమీల వారిస్తూ "ఎందుకు వెళ్ళిపోవడం?" అనడిగంది.

    ఆ సమయంలో అక్కడ వుండటం రాధకు చాలా యిబ్బందిగా వుంది. అప్పుడు అక్కడ లేకుండావుంటే ఎంతో బావుండునని తోచింది. సుభద్రమ్మగారు అక్కడ్నుంచి లోపలకు వెళ్ళిపోయాక ప్రమీల "ఉండు ఉప్పుడే వస్తాను" అని భర్త గదిలోకి వెళ్ళింది.

    "మొగాళ్ళు యింట్లో లేనప్పుడు ఆడవాళ్ళు యింట్లో యిలా ప్రవర్తిస్తారన్నమాట" అన్నాడు భర్త.

    దీనికి ఏ భార్య మట్టుకు సమాధానం చెబుతుంది.

    "అయితే యింతసేపటికన్న మాట తీరుబాటైంది" అన్నాడు నింద మోపుతూ భర్త.

    ఆమె సిగ్గుపడి "ఉష్. అరవబోకండి, బయట రాధ వుంది" అంది మెల్లిగా.

    రాధ ఎవరో అడగవలసిన పనిలేదు ప్రమీల భర్తకు. అదివరకు చాలాసార్లు ఆమెను చూచే వున్నాడు.

    "ఆమె నీకుమల్లే గడుసుపిల్లలా లేదు. చాలా మంచి పిల్లలా వుంది"

    "అవును మహ నేనే గడుసుదాన్ని?"

    "అప్పుడే కోపం వచ్చినట్లుంది" అన్నాడతను భార్య మూతి ముడుపును కనిపెట్టి.

    ఆమె కొంచెం నవ్వుతూ "కోపమేం లేదు. నేను రాధతో మాట్లాడాలి. చాలా సేపటిదాకా మీరు వంటరిగా కూర్చోవాలి" అంటూ అతను బిక్కమొహంతో ఏదో చెప్పబోతున్నా వినిపించుకోకుండా బయటకు వచ్చేసింది.

    స్నేహితురాలు ఎంత కులాసాగా మాట్లాడుతున్నా, ఆ రోజు రాధ మనస్సు సరిగ్గాలేదు. ఆమె మనసంతా ఏవేవో ఆలోచనల్తో నిండిపోయింది. అసలు యివాళ యిక్కడకు రావడంలో ఆమె ఉద్దేశ్యం వేరు. కాని ఎంత ప్రయత్నించినా ఆమె అడగదల్చింది అడగలేకపోయింది.

    చాలాసేపు అయ్యాక "వెళతాను" అంటూ లేచింది. బయటకు వచ్చి పరధ్యానంగా నడవసాగింది. చిన్నప్పటి నుంచీ కలిసి మెలిసి తిరిగిన ప్రమీలముందు తను అసలు విషయం వెల్లడి చేయలేక ఎందుకంత సిగ్గుపడింది. తన కోరిక ప్రమీల తీర్చలేదని భయపడిందా?

    తన ప్రవర్తన తనకే అసహ్యం వేసింది. ప్రకాశం అన్నయ్య ఎంత యిబ్బందిలో లేకపోతే యిలా ఉత్తరం రాస్తాడు? డబ్బు అందక వాడెంత బాధపడుతుంటాడు?

    "వదినా?"

    తలెత్తి చూసింది. కృష్ణుడు వాళ్ళ ఇంటి వాకిట్లో నిల్చుని పిలుస్తున్నాడు.

    ఆగిపోయి "ఏమిటి?" అనడిగింది.

    "మా యింటికి రాకూడదు?"

    "ఎందుకు" కుతూహలంగా ప్రశ్నించింది.

    "మా అమ్మతో కాసేపు మాట్లాడి పోదువుగాని."

    "సరే పద" అని రెండడుగులు ముందుకు వేసి "మీ అమ్మగారేం చేస్తున్నారు?" అని అడిగింది.

    "లోపల ఏదో పనిచేస్తోంది" అని లోపలికి పరుగెత్తుకుపోయి తల్లితో రాధ వచ్చిన విషయాన్ని చెప్పాడు.

    "వస్తున్నా కూచోవమ్మా" అని లోపల్నుంచి ఆవిడ అరచింది. రాధ అక్కడున్న ఓ చాపమీద కూర్చుంది.

    కృష్ణుడు మళ్ళీ ఆమె దగ్గిరికే వచ్చి కూర్చుని "నిధి అంటే ఏమిటి వదినా?" అని అడిగాడు.

    "నిధి అంటే యేమిటో తెలియకుండానే దానికోసం నువ్వు తాపత్రయ పడుతున్నావా? అయినా అప్పుడు తెలిసినట్లు తల ఊపావుగా" అంది రాధ.

    కృష్ణుడు వాదిస్తూనే "పో, చెప్పు" అన్నాడు.

    "ఏమిటి చెప్పేది? అసలు అంత రాత్రివేళ డబ్బు కోసం ఎందుకు ఆరాటపడాల్సి వచ్చిందో కాస్త చెప్పు!"

    వాడు ఒక క్షణం  వూరుకొని "నా కోసం ఏమిటమ్మా! నీకోసం. నీకు బోలెడంత డబ్బువుంటే నాకు ఎంతో బాగుంటుంది." అన్నాడు.

    "నాకు డబ్బువుంటే నీకు బాగుండటం ఏమిట్రా?" అని అడిగింది రాధ ఆశ్చర్యంగా.

    కృష్ణుడు రెండు నిముషాలు తటపటాయించి "చెప్పనా? మరి ఎవరికీ చెప్పవు గదా?" అన్నాడు.

    వాడు ఏదో మామూలుగా అని వుంటాడని రాధ మొదట అనుకుంది. కాని ఇలా తటపటాయించే సరికి నిజంగానే యిందులో యేదో రహస్యం వున్నదని భావించి "చెప్పు. ఎవరికీ చెప్పను" అంది.

    "నీకు కూడా డబ్బు వుంటే మా అన్నయ్యకి ఇష్టం. ఎందుకని యిష్టమో నాక్కూడా తెలియదమ్మాయి. నా కంతవరకే చెప్పాడు" అని యిహ అక్కడ ఉండకుండా లోపలకు పారిపోయేడు.

    రాధ నిశ్చేష్టురాలై కూర్చుండి పోయింది. ఈ వెర్రి కుర్రాడి మాటలు ఇవాళ చాలా ఆశ్చర్యంగా వున్నాయి. ఇలా వాడు ఇంతకుముందు యెన్నడూ మాట్లాడి వుండలేదు. వీడికివున్న వెర్రి ఒకవేళ ఏమయినా ఎక్కువయిందేమోనని తలబోసింది. వాడిని పిలిచి యింకా అడుగుదామనుకుంది. కాని కంటికి కనిపించకుండా పారిపోయేడు.

    ఇంతలో లోపల్నుంచి కృష్ణునితల్లి వస్తూ "ఏమిటమ్మా, ఈ మధ్య కనబడటం మానేశావు" అంది.

    "అంతా కులాసాగా వున్నారా?"

    "ఆఁ"

    ఇటువంటి ప్రశ్నలూ, జవాబులూ రాధకు విసుగు కలిగిస్తాయి. అందులోనూ యీవిడ సంభాషణ లాంఛనప్రాయంగా వుంటుందని రాధ దృఢనమ్మకం. ఆవిడ చాలాసేపు రాధని కదలనియ్యలేదు. అవసరం వున్నవీ, అవసరం లేనివి అన్నీ చెబుతూ కూర్చుంది. ఇవాళ రాధ కనిపించింది. రాధతో కాకపోయినా సరే ఎవరితోనైనా సరే రోజూ అలా మాట్లాడుతూ కూర్చోవాల్సిందే. ఎంతసేపటికో రాధ బలవంతంగా లేచి నిలబడి "వెడతానండీ" అంది.

    "సరే నీ యిష్టం. ఒరేయి కృష్ణా, ఆ బుట్టలోని పళ్ళు తెచ్చి రెండు వదినెకియ్యరా" అంది ఆవిడ.

    కొన్ని క్షణాలు గడిచాక కృష్ణుడు రెండు బత్తాయి పళ్ళు తెచ్చి రాధ చేతిలో వుంచి పెద్దలా నిలబడ్డాడు. వస్తానని చెప్పి బయల్దేరింది. ఇవాళ జరిగిన ప్రతి విషయమూ ఆమెకు చికాకు పరుస్తోంది. కృష్ణుడు అలా యెందుకు మాట్లాడాడు? అందులో అర్ధమేమిటి? అసలు తనని వాడు 'వదినా' అని యెందుకు పిలుస్తున్నాడో చాలా రోజుల్నుంచీ అడగాలని అనుకుంటుంది. కాని మళ్ళీ నిగ్రహించుకొని "ఒక్కొక్కరి అలవాటుని బట్టి వుంటుంది" అని భావించుకుంటూ వూరుకుంది. ఇవాళ యీ ప్రశ్న వచ్చింది. తనని వదినా అని యెందుకు పిలుస్తున్నాడు?

    ఆమె యిలా ఆలోచించుకుంటూ నడుస్తూండగానే ఇల్లు వచ్చేసింది. ముందు వున్న ఖాళీ ప్రదేశములో వాసు, యిద్దరు ముగ్గురు స్నేహితులతో కలసి ఏదో హడావుడి చేస్తున్నాడు. రాధని చూసి "అక్కయ్యోయ్! ఇక్కడ బ్యాడ్ మింటన్ కోర్టు పెడుతున్నా, రేపటినుంచీ ఎలా వుంటుందో చూసుకో మరి" అన్నాడు. రాధ వాడి మాటలు వినిపించుకోకుండా లోపలకు వెళ్ళిపోయింది.

    ఛాయ ఎదురుగా వచ్చేసరికి తన చేతిలో వున్న రెండు పళ్ళూ యిచ్చేసి తల్లి దగ్గరకు వెళ్ళింది.

    "ఎక్కడకు పోయావమ్మా? అని ప్రశ్నించింది వంటింటి గుమ్మం దగ్గర చాప వేసుకుని పడుకున్న తల్లి.

    రాధ జవాబు చెప్పేలోపు లోపలనుంచి ముసలావిడ వస్తూ "ఎక్కడికే వేళాపాళా లేకుండా యీ పెత్తనాలు? ఒక అడగటమూ, పెట్టటమూ ఏమైనా వుందా?" అంది కోపంగా.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS