Next Page 
కిడ్నాప్ పేజి 1

                                                                కిడ్నాప్

                                                   
                                                                  ----సూర్య దేవర రామ్ మోహన్ రావు
   
    బ్రహ్మలోకం దివ్యకాంతితో మెరిసిపోతోంది....

    పసిడిముద్దతో రమణీయమైన ఆకృతిని కల్పించి, ఆ స్వర్ణప్రతిమ వేపు కనురెప్పలార్పకుండా చూడసాగాడు సృష్టికర్త__

    "ఎవరా ప్రతిమ" మందస్మిత వదనంతో అడిగింది ఆశ్చర్యంగా సరస్వతీదేవి.

    "ఇంకా పూర్తి కాలేదు-ప్రాణప్రతిష్ట చేయాలి కదా..." దీర్ఘాలోచనుడై అన్నాడు బ్రహ్మ. సరస్వతి ఆయన చర్యల్ని గమనిస్తోంది.

    బ్రహ్మ ఒక చేత్తో, స్వర్ణకలశాన్ని అందుకుని, అందులోని అమృతంతో, మంత్రుచ్చారానా చేస్తూ, శిరసాభిషేకం చేశాడు.

    కొన్ని క్షణాల తర్వాత, ఆ పక్కనే ఉన్న చిన్నబాలుని ప్రతిమను, ఆ పెద్ద ప్రతిమ ఒడిలో పెట్టాడు.

    ఆ దృశ్యం చాలా విచిత్రంగా వుంది సరస్వతీదేవికి....

    నెమ్మదిగా ప్రతిమలలో చలనం ప్రారంభమైంది.

    ఆ పెద్ద ప్రతిమ ఒక మాతృమూర్తి_ చిన్న ప్రతిమ ఆమె ఒడిలోని ఆమె బిడ్డ...

    "అకస్మాత్తుగా మాతృమూర్తి, తనయుల్ని సృష్టించారేమిటి?!" సరస్వతీదేవి మనసులో ఏదో సందేహం.

    తల్లి ఒడిలోని ఆ బాలుడు పసిడి కాంతులీనుతూ ముద్దుగా ఉన్నాడు-ఒక్కసారి ఆ బాలుడ్ని, తన చేతుల్లోకి తీసుకొని, లాలించాలని ఆశపడిన సరస్వతీదేవి, గబుక్కున ముందుకెళ్ళి, ఆ బాలుడ్ని తన చేతుల్లోకి తీసుకుంది.

    సరిగ్గా అదే సమయంలో__

    తను సృష్టించిన జీవుల్ని, చరాచరలోకంలోకి పంపించాలనుకునే బ్రహ్మ, మాతృమూర్తి ప్రతిమను చేతితో తాకాడు మరుక్షణం ఆ ప్రతిమ అక్కడ నుంచి మాయమైపోయింది.

    అప్పుడుగానీ, బ్రహ్మ మనసులోని ఉద్దేశాన్ని తెలుసుకోకుండా, తొందరపడి, తను చేసినా తప్పిదాన్ని గుర్తించి, కలవరపాటుతో బ్రహ్మ వేపు చూసింది సరస్వతీదేవి.

    "నేను చరాచర మానవలోకంలోకి రెండు జీవుల్ని ఒకేసారి పంపాలనుకున్నాను-కానీ లలాట లిఖితం-ఆ తల్లికి అందినట్లే అందిన మాతృప్రేమ, తృటిలో చేజారి పోయింది...." అన్నాడు బ్రహ్మ.

    "అంటే...ఆమె మాత్రు ప్రేమకు దూరమై పోయినట్టేనా...?" కలవర పడుతూ, తల్లి హృదయంతో అడిగింది సరస్వతి.

    "ఆ బాలుడ్ని మానవలోకంలోకి చేర్చడమే మనపని...ఆ తర్వాత జరిగేది...అనూహ్యం...అగాధం ....రహస్యం..." అన్నాడు బ్రహ్మ.

    సరస్వతి దేవి నెమ్మదిగా తన చేతుల్లోని బాబుని జారవిడిచింది!

    అర్ధ నిమీళిత నేత్రుడై ఆ దృశ్యాన్ని వీక్షిస్తున్నాడు సృష్టికర్త బ్రహ్మ.

   
                                                   ౦    ౦    ౦

    "బాబూ" కెవ్వున అరిచిందామె.

    ఒక దుస్వప్నం నుంచి తేరుకోడానికి ఆమెకు అరక్షణం పట్టింది__గబుక్కున బెడ్ లైట్ స్విచ్ ఆన్ చేసింది__క్షణంలో మసక వెన్నెల కాంతి, ఆ విశాలమైన గదిలో వ్యాపించింది.

    వెంటనే లేచి కూర్చుందామె_నలువేపులా చూస్తూ, బెడ్ మీంచి లేచి ఆ రూమ్ లోనికి విసురుగా బయటికొచ్చి, ఆ పక్కనే ఉన్న రూమ్ తలుపును నెమ్మదిగా తోసి, లోనికి చూసింది

    గది మధ్యలో__

    చిన్ని చిన్ని బంగారు మువ్వలతో, వెండి ఉయ్యాల__ఆ ఉయ్యాలలో లోకంలో సుఖం, దుఃఖం, పగలు, రాత్రి భేదం తెలియని నెలల బాలుడు శేషునిపై నిద్రిస్తున్న బాల విష్ణువులా ఉన్నాడు.

    దగ్గరగా వెళ్ళి బాబు ముఖాన్ని తనివితీరా తడిమి, చప్పుడు చెయ్యకుండా ముద్దు పెట్టుకుని, సున్నితమైన బుగ్గను, చేతులు, అరికాళ్ళ లేత ఎరుపు మెరుపును చూస్తూ తన్మయత చెందుతోందామె...

    సరిగ్గా అదేసమయంలో నిద్రలో పక్కకు ఒరిగాడు ఆ బాలుడు__కప్పిన దుప్పటి పక్కకు జరిగింది_కుడివేపు. నడుముకు పై భాగంలో తేనెరంగులోని పెసర బద్డంత పుట్టుమచ్చ లైటుకాంతిలో మెరుస్తూ కనిపించింది. దుప్పటిని గుండెల వరకూ కప్పి, దుస్వప్నపు నీడలో అంత వరకూ కమిలిపోయిన హృదయాన్ని సేద బరచుకుంటోందామె.

    __ఏదో చిన్న చప్పుడైతే గబుక్కున తలతిప్పి చూసింది__అంతవరకూ దూరంగా నేలమీద పడుకున్న ఆయా కంగారుగా పాల సీసాతో వచ్చింది.

    "అమ్మా! ఇంత అర్దరాత్రి, మీరొచ్చారేమిటి? బాబు ఏడ్చాడా?" కంగారు పడుతూ అడిగిందామె.

    "లేదు....నిద్రపట్టలేదు...అందుకే..." తన కలవరపాటును కప్పి పుచ్చుకుంటూ అందామె.

    "మీరెళ్ళండమ్మా....నేను చూసుకుంటాను..." ఉయ్యాలను చిన్నగా ఊపుతూ అంది ఆయా.

    బాబు ముఖంలోకి ఒక్కసారి చూసి, నెమ్మదిగా వెనుదిరిగింది ఆమె__ఆమె పేరు సుదేష్టాదేవి.

    నలభై అయిదేళ్ళ సుదేష్ణాదేవి పిల్లలకోసం నోచని నోము__చేయని వ్రతం తిరగని పుణ్యక్షేత్రంలేదు_ ఇచ్చిన దానాలకు అంతులేదు__పెళ్ళయిన పాతికేళ్ళకి గాని ఆమె తల్లి కాలేకపోయింది.  మాతృత్వపు మాధుర్యాన్ని మనసారా అనుభవించగలిగే అదృష్టం అప్పటికి గాని ఆమెకు దక్కలేదు.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS