Previous Page Next Page 
కిడ్నాప్  పేజి 2

    శరీర తత్వం దృష్ట్యా, ఆమెకు మరిక పిల్లలు కలగడానికి ఆస్కారం లేదని డాక్టర్లు చెప్పేసారు.

    అంచేతే వరంలా పుట్టిన వాడె ఆమెకు సర్వస్వం అయిపోయాడు,

    బాబు పేరు తేజ__తేజేశ్వర ప్రసాద్ తాతగారి పేరు__ఆ పేరే వాడికి పెట్టారు.

   
                              ౦    ౦    ౦

    విశాలమైన బెడ్ రూమ్ లో బెడ్ మీద స్వర్ణ ప్రతిమలా దీర్ఘాలోచన రాలై కూర్చుంది సుదేష్ణాదేవి.

    బిజినెస్ మీటింగ్ కోసం బొంబాయి వెళ్ళిన భర్త కాళేశ్వరప్రసాద్ ఫోన్ కోసం రాత్రి నిద్రపోయే వరకూ ఎదురు చూసిందామె.

    ఎక్కడున్నా సరే, ప్రతి మూడుగంటల కొకసారి ఫోన్ చేసి, కొడుకు యోగక్షేమాలడిగి, ఆ చిన్ని నవ్వును ఫోన్ ద్వారా వినే ఆ భర్త కాళేశ్వరప్రసాద్, రెండ్రోజులుగా ఒక్క ఫోనైనా ఎందుకు చెయ్యలేదు?

    రూమ్ లో నెమ్మదిగా ప్రవహిస్తున్న ఏ.సి. చప్పుడు__ఎక్కడో గోడగడియారం కొట్టిన గంటల చప్పుడు....

    మూడు గంటలు...

    ఎప్పుడూ చిన్నారి తేజ నవ్వు, నడక, అల్లరి కల్లోకి వచ్చే ఆమెకు మొట్ట మొదటిసారి తన ఒడిలోనించి కిందకు అగాధంలోకి జారి పోయిన కల__ఆ కళను మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడానికి కూడా ఆమెకు భయంగా ఉంది.

    కుడివేపు గోడకు నిలువెత్తు షిర్డీసాయిబాబా చిత్రపటం___ఆ చిత్ర పటం ఎదురుగా నిలబడి చేతులు ముకుళించిందామె.

    తండ్రీ....నోచిన నోములకు వరప్రసాదంలా, అపురూప కానుకగా ఇచ్చిన నా చిన్నారి తేజను, నా నుంచి ఎత్తి పరిస్థితుల్లోనూ దూరం చేయకు...ఆ గుండె కోతను నేను భరించలేను....మాతృత్వపు మమతతో నిండుతున్న ఈ మనసు అమృత భాండాన్ని విచ్చిన్నం చేయకు తండ్రీ....లిప్తకాలం కూడా వాడికి దూరంగా నేను బతకలేను....వాడ్ని దూరం చేసి నన్ను జీవచ్చవంలా మిగల్చకు తండ్రీ...మనసారా వేడుకుంది సుదేష్ణాదేవి.
   
    అప్పటికి గానీ, ఆమె మనసు కుదుట పడలేదు__

    అయినా, చిన్న కలకు తనెందుకు ఇంతగా భయపడుతోంది...?అకస్మాత్తుగా అంకురించిన ప్రశ్న__ఆ ప్రశ్నకు జవాబును తల్లి హృదయం మాత్రమే చెప్పగలదు.

    తన మమతను పంచడానికి, ప్రతి చోటుకు వెళ్ళలేక, తల్లిని సృస్టించిన దేవుడు....

    ఆ తల్లి హృదయానికి గాయం చేస్తాడా? ఆ ఆలోచన సుదేష్ణాదేవికి చాలా ఓర్పుగా ఉంది.

    అంతవరకూ మనసు పొరల్లోకి చేదులా ప్రాకిన బాధ, ఒక్కసారిగా తొలగి పోయింది.

    కళ్ళెదురుగా చిన్నారి తేజ! మెరిసే పాల బుగ్గల్తో, విరిసే పాల నవ్వుల్తో...వాడు తన గుండెలమీద చప్పుడు చెయ్యకుండా నడుస్తున్నపుడు హృదయంలో పడిన__

    అనురాగముద్రలు...ఆత్మీయ స్పర్శ...

    నెమ్మదిగా సుదేష్ణాదేవి, కనురెప్పల మీదకి నిద్ర తెరలా వాలింది.

   
                                                                          ౦    ౦    ౦

    అయ్యయ్యో! చేతిలో డబ్బులు పోయెనే!

    అయ్యయ్యో! జేబులు ఖాళీ ఆయనే, దూరంగా టీ షాపులోంచి పెద్ద సౌండ్ తో విన్పిస్తోందా పాట.

    ఒక ఆటో ఝుమ్మంటూ, సీరియస్ గా వచ్చి కాచిగూడ పోలీస్ స్టేషన్ ముందు ఆగింది.

    "ఇస్టేషన్ కి వచ్చినయ్ బిడ్డా...దిగుండ్రీ.." యాభై ఏళ్ల ఆటో వాలా చెప్పాడు. ఆటో వెనక సీట్లో__ముగ్గురు వ్యక్తులు కిక్కిరిసి కూర్చున్నారు__అందులో ఒకడు తలవొంచి చూద్దామానుకున్నా వీలు కావడంలేదు...

    "ఒరే సేతురాజు అందుకే అడ్డవై నగడ్డీ తినొద్దనేది__చూడు__ఇనప డ్రమ్ము కూలబడినట్టు కూలబడ్డావ్ ...రేయ్...కాలు ముందుకు జరపరా...నీ కాలు కింద నా వేలు పడిపోయింది..." కీచుమంటూ అన్నాడు పోతురాజు.

    "లేకపోతే మీలా గాలికి ఊగిపోయే జండా కర్రలా ఉండాలంట్రా...? స్టేషనొచ్చింది...మళ్ళీ ట్రైన్ వెళ్ళిపోతుంది...డబ్బు లిచ్చెయ్యండి..." అన్నాడు సేతురాజు.

    "మైడియర్ మాడ్ బ్రదర్స్...దిసీజ్ నాట్ రైల్వే స్టేషన్__దిసీజ్ పోలీస్ స్టేషన్__ఒరేయ్ ఆటో యంగ్ డ్రైవర్ బ్రదర్...ఇక్కడకు తీసుకొచ్చావేంటీ..." కంగారు పడుతూ అడిగాడు వీర్రాజు.

    "కాచిగూడ స్టేషన్ అన్నారా లేదా...మీ మొహాలూ చూడగానే అర్ధమైపోయింది...ఏ స్టేషనో__ దిగండి... దిగండి..." ఆటో డ్రైవర్ జవాబిచ్చాడు చికాగ్గా.

    "ఒరేయ్ ఆటోరావుడూ, అర్జంటుగా మమ్మల్నిక్కడ్నించి తోలుకెళ్ళిపోరా....అసలే నాకు పోలీస్ స్టేషనంటే చిరాకు" బ్రతిమాలుతున్నట్లుగా అన్నాడు పోతురాజు.

    "ఇక్కడ నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్ కి తీసికెళ్ళాలంటే, పది రూపాయలు ఎగస్ట్రా అవుతుంది__ తీసుకెళ్ళనా?"

    "పదా!" దీర్ఘం తీశాడు సేతురాజు.

    "ఇక్కడికి శానా దూరం అది.." చెప్పాడు ఆటో డ్రైవర్.

    "వాడితో గొడవెందుకు, ముందు మనం ఇక్కడ నుంచి పోదాం...పోనీ యంగ్ బ్రదర్..." సామరస్యంగా అన్నాడు పోతురాజు.

    ఆటోడ్రైవర్ చిద్విలాసంగా నవ్వాడు.

    పక్కనే ఉన్న రైల్వే స్టేషన్ కనబడకుండా, గేరుమార్చి కుమార్ థియేటర్ వేపు ఆటోను తిప్పి స్పీడ్ పెంచాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS