Previous Page Next Page 
కాంక్రీట్ జంగిల్  పేజి 2


    అతని మాటలకు జగపతి తొణకలేదు.

    "నా కోరిక మీ దృష్టిలో చాలా చీఫ్ గా వుండివుండవచ్చు....బట్ అది నాకు చాలా విలువయింది. మీకు కావలసింది పనికి తగిన ప్రతిఫలం. అంతేగా....ఎంతకావాలో అడగండి....మీరు అడిగినంత ఇవ్వడానికి సిద్దంగా వున్నాను"

    ఇద్దరి మధ్య ఒక నిమిషం నిశ్శబ్దం....

    "ఆల్ రైట్ వివరంగా చెప్పు"

    రాణా ఒక క్షణం ఆలోచించినమీదట అన్నాడు.

    "ఈశ్వరరావు భవంతిలోని మధ్యగదిలో ఒక భూగృహం వుంది. ఆ భూగృహంలో అతని వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమయిన ఫైల్స్ బ్లాక్ మనీ వుంటాయి. వాటిల్లో బ్లూకలర్ ఫైల్ ఒకటి వుంటుంది, ఆ ఫైల్ నాకు కావాలి"

    "ఓస్....అంతేనా?"

    "రాణా కంఠంలో చిన్న అవహేళన....

    "అవును....ఆ ఫైల్ ఈ రోజే కావాలి"

    రాణా రెండు క్షణాలు ఆలోచించి....

    "ఒకే" అన్నాడు.

    "రాణా సాబ్....ఆ ఫైల్ నాకుతెచ్చి ఇవ్వడానికి నేనిచ్చే అడ్వాన్స్ ఇది....మిగతా బాలెన్స్ పని పూర్తయ్యాక....

    బ్రీఫ్ కేసును రాణాకు అందించాడు జగపతి.

    "రాణాసాబ్....ఆ ఇంటిలో దొంగతనం జరిగినవెంటనే ముందుగా అనుమానించేది నన్నే కాబట్టి ఎలాంటి ఆధారాలు దొరకకుండా గుట్టుచప్పుడుకాకుండా పనిపూర్తి అయిపోవాలి. అసలు అ ఫైల్ దొంగిలించబడిందనే విషయమే అతనికి తెలియనంత నేర్పుగా జరగాలి. అందుకే అంతటి సమర్ధులు మీరు మాత్రమేనని మీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు అర్ధమై వుంటుందనుకుంటాను....ఈ దొంగతనానికి మిమ్మల్నే ఎందుకు ఎన్నుకున్నానో...."

    "ఈ రాణా మాట ఇస్తే యిచ్చినమాటను నిలబెట్టుకుంటాడు ఇక నువ్వు నిశ్చింతగా వెళ్ళిపోవచ్చు. ఆ ఫైల్ మరో రెండుగంటలలో నీ దగ్గర వుంటుంది" రాణా నింపాదిగా చెప్పాడు.

    జగపతి గాఢంగా ఊపిరి పీల్చి అక్కడ నుంచి బయటకు వచ్చేశాడు.

    అనుకున్న పనిని సాధించడంలో రాణా ఎలాంటి వాడో అతనికి తెలుసు.

    అందుకే ఇప్పుడు జగపతి మనసు ఆనందంతో గంతులు వేస్తున్నది.



                            *    *    *


    అర్దరాత్రి వేళ....

    ఆకాశంలోని నక్షత్రాలు సిల్కు చీరమీద తళుకుల్లా మిలమిలలాడుతున్నాయి.

    ఆ నక్షత్రాలను వెక్కిరిస్తూ సోడియమ్ లైట్స్....

    బంజారాహిల్స్ లోని ఒక బిల్డింగు గోడప్రక్కనే ఆగింది ఆ జీప్.

    అందులో వున్నది రాణా....

    ముందుగా అతడి అనుచరులు నలుగురు క్రిందకు దిగారు.

    ఆ తరువాత....

    దిగాడు ఒక బాలుడు....

    అతని పేరు....చక్రవర్తి.

    ఏడేళ్ళుంటాయి.

    ఆ బాలుడు ఎవరోకాదు....రాణా కుడిభుజం.

    నమ్మశక్యంకాని నగ్నసత్యం అది. వేటకుక్కలను సయితం ముప్పతిప్పలు పెట్టగల సామర్ధ్యం వుంది చక్రవర్తికి.

    రాణా కారులోనే ధీమాగా కూర్చున్నాడు.

    చక్రవర్తి నెమ్మదిగా మెయిన్ గేటువైపు నడిచాడు.

    ఎదురుగా నున్న ఆ భవంతివైపు పరిశీలనగా చూసాడు.

    ఎవ్వరూ మేలుకునివున్న చాయలులేవు.

    నిశ్శబ్దంగా వుంది వాతావరణం....

    మెయిన్ గేటు ముందు అటూ ఇటూ పచార్లుచేస్తున్నాడు గూర్కా. అతనొక్కడు తప్ప ఆ చుట్టుప్రక్కల పరిసరాలలో నరమానవుడు అన్నవాడెవరూ లేడు. నిర్మానుష్యంగా వుంది ఆ ప్రాంతం.

    చక్రవర్తి చూడడానికి చిన్నవాడయినా సమయాన్నిబట్టి మెరుపులాంటి ఆలోచనలను చేయగల మేధావి....చాకులాంటి కుర్రవాడు.

    గూర్జాను అక్కడనుంచి తప్పించడానికి క్షణాలమీద అతనొకప్లాన్ ఆలోచించాడు. అతని సైగను అందుకున్న వెంటనే నలుగురు అనుచరులలో ఇద్దరు ముందుకు కదిలారు. ఇద్దరిలో ఒకడు వున్నట్టుండి ఒక్కసారిగా వేగంగా పరుగుదీస్తూ గూర్కా దగ్గరకు వెళ్ళాడు.

    గూర్ఖాను లెక్కచేయకుండా ఆ భవంతిలోకి వెళ్ళడానికి ప్రయత్నించాడతను.

    "ఏయ్! ఆగరా....భాడకోవ్! ఎక్కడకురా వెళ్ళేది?" గూర్ఖా కోపంగా అరుస్తూ అతడిని పట్టుకున్నాడు.

    ఒక్క విసురుతో చెయ్యి విదిలించుకుని మళ్ళీ లోపలకు పారిపోయే ప్రయత్నం చేశాడు ఆ వ్యక్తి.

    సరిగ్గా అప్పుడు రెండోవాడు హడావుడిగా....

    "వాడ్ని వదలొద్దు గట్టిగా పట్టుకో...." అరుచుకుంటూవచ్చాడు.

    అది గమనించి మెయిన్ రోడ్ ఎక్కి పారిపోయాడు మొదటి వ్యక్తి.

    "అదేమిటయ్యా వాడ్ని అలా విడిచిపెట్టావు....వాడిని పట్టుకుంటే అయిదు లక్షలట....పేపరులో చూడలేదా?" అన్నాడు.

    స్వతహాగానే ఆశ ఎక్కువ కలిగినవాడైన ఆ గూర్కా క్షణంపాటు ఆలోచించాడు. భవంతిలోని వాళ్ళు ఆ సమయంలో ఎవరూ తనను పట్టించుకోరన్న ఉద్దేశంతో ఉన్నాడేమో తనుకూడా ప్రయత్నించి చూద్దాం అన్నట్టు పారిపోయిన వ్యక్తి వెంట పడ్డాడతను.

    అదే అదునుగా చక్రవర్తితో పాటు మిగిలిన ఇద్దరూ తిన్నగా నడుచుకుంటూ వెళ్ళి మెయిన్ గేటు ముందు నుంచి వెళ్ళి ఆ భవంత  వెనక వైపుకు చేరుకున్నారు.
 


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS