Previous Page Next Page 
గోరింటాకు పేజి 2


    స్కూల్ ఫైనల్ చదువుతుండగానన్నమాట రాజారావు స్నేహమయింది. తను పాస్ అవుతాడని యెవరూ అనుకోలేదు. పరీక్ష రేపనగా జ్వరం కాసింది. ఒక గంటలో ఇస్తామని స్నేహితుడొకడు ఇంగ్లీషు పుస్తకం పట్టుకుపోయి పత్తాలేడు. రాత్రంతా అతని ఇంట్లోవాళ్ళతో దెబ్బలాడుతున్నాడు. ప్రక్కమీదనుంచి కదిలినా, మరునాడు పరీక్షకు పోయినా నూతిలో దూకి చచ్చిపోతానని తల్లి బెదిరించసాగింది. వెధవపరీష ఇవ్వాళ కాకపోతే రేపయినా పాస్ కావచ్చు. మనిషికి ముఖ్యమయింది ఆరోగ్యమని తండ్రి నచ్చచెప్పసాగాడు. తాతయ్య వచ్చి ఒక్క క్షణంలో లాలనగా 'నాయనా!' అనీ, మరో క్షణంలో కోపంలో 'కుంకా' అని వెళ్ళిపోతున్నాడు.

 

    మొత్తానికి యెలా అయితేనేం, మరునాడు ప్రొద్దున్నే పరీక్ష హాల్లో కూర్చుని పేపరు నింపుతున్నాడు. కొంచెం దూరంలో రాజారావు. తాతయ్య స్కూలు అధికారుల అనుమతి సంపాదించి బయట వసారాలో ఓవల్టీను నిండివున్న ప్లాస్కుతో, మందుసీసాతో,బిస్కట్ల ప్యాకెట్ తో తచ్చాడుతున్నాడు. అరగంటకోసారి 'అబ్బిగా' అని కేకవేసేవాడు. గబగబ నోట్లో ఇంత మందు పోసి, ఇన్ని బిస్కెట్టులుకూరి, ఇంత ఓవల్టీను త్రాగించేవాడు. ముసలాళ్ళదగ్గర ఒకటి నేర్చుకోవాలి. అనవసరమైన సిగ్గూ. సంకోచం, మొహమాటం వాళ్ళకు ఉండవు. అవే నాగరికులమనుకునేవాళ్ళకు అడుగడుక్కీ దుంపతెంపుతాయి.     

 

    మొండితనంగా పరీక్షకు వెళ్లాడేగాని పాస్ కాడని అందరూ అనుకున్నారు. వచ్చే ఏటికి ఇప్పట్నుంచి ట్యూషన్ ప్రారంభించమని తల్లి పోరసాగింది. కాని పరీక్షఫలితాల్లో అతని నెంబరు చూసి అంతా దిగ్భ్రమచెందాడు, తనతో సహా.

 

    ఇంటర్మీడియట్ లోకి వచ్చాక జీవితమంటే భయం కొంచెం తగ్గింది చక్రపాణికి... కాని జీవించాలన్న ఆరాటం హెచ్చింది. ఈ భూమ్మీద రెండురకాల మనుష్యులున్నారు. ఒకరు జీవితానికి బయట దూరంగా నివసిస్తారు. మరొకరు జీవితంలో నివసిస్తారు. ఇద్దరూ పెరుగుతారు, పెద్దవాళ్ళవుతారు. ఎవరి అనుభవాలు వాళ్ళకి వుంటాయి. కాని చచ్చిపోయినాక వాళ్ళని గురించి స్మృతుల్లోగల వ్యత్యాసం మనిషికీ, జంతువుకీ వున్నంత తేడాలో వుంటుంది.

 

    ఒకరోజు మధ్యాహ్నం చక్రపాణి కాలేజీ మేడమీదనుండి దిగివస్తున్నాడు, క్రిందనుంచి వయ్యారంగా ఒక అమ్మాయి మెట్లు ఎక్కి వస్తూంది. ఎందుకో అతనికాళ్ళు వణికాయి. నలుపులో ఇంత అందముందని ఇదివరకు అతనికి తెలియదు. కళ్ళలో విచిత్రాకర్షణ విషయం కూడా. అంత విశాల నేత్రాలతో అతనివంక చూచి ఎందుకో నవ్వి వెళ్ళిపోయింది.

 

    అవి చూపులు కాదు, "బాణాలు" అన్నాడు, ఆ సాయంత్రం రాజారావుతో "పూలబాణాలు!" అని దిద్దాడు రాజారావు. "అవే, నామీద నిరంతరం పడాలి"అని గోడుపెట్టాడు చక్రపాణి.

 

    అసలంతవరకూ ఆమె ఎవరో తెలియదు. కాలేజీ అమ్మాయిల వంక పరీక్షగా, తృష్ణగా చూసింది ఎప్పుడూ లేదు. అందాన్ని గురించి నిర్వచనాలూ తెలియవు. ఆడవాళ్ళ నవ్వులో కాదుగాని, నవ్వినా పక్షంలో ఏదో మహత్తు వుండివుంటుంది. అతనికేదో జరిగింది. పాపం! కుర్రాడు, అమాయకుడు. ఎక్కడికో లాక్కుపోవటం మొదలయింది.

 

    అనుభవాలు ఎలా వుంటాయో చూడండి! మరునాడు బస్సులో కలిసింది. ఇద్దరూ ఒక్కసారే ఎక్కి అదోరకంగా కనిపించేసరికి  ఒక్కతాలూకేనని కండక్టర్ పొరబడటంలో అతని తప్పేంలేదు. ఇద్దరి టిక్కెట్లు చించి చక్రపాణికి ఇచ్చాడు. అతను మొదట కంగారుపడినా వెంటనే తేరుకొని ఉత్సాహంగా రెండణాలూ కండక్టర్ చేతిలో పెట్టేశాడు.

 

    సంగతి గ్రహించిన మాలతి సిగ్గుతో నవ్వింది. ఆమె కూర్చుని వుంది, తను నిలబడివున్నాడు. ఆమె చీరె అతనికి తగుల్తోంది. ఇప్పుడు బాగా దగ్గర్నుంచి చూశాడు. కనులు, కనురెప్పలు, బంగారంలా తళుక్కుమని మెరిసే బొట్టూ, పెదాలు, చెక్కిళ్ళు... గుండెల్లో బొమ్మ గీసుకున్నాడు.

 

    ఆమె బస్సుదిగి చేతిలో అణాకాసు పట్టుకొని సంకోచిస్తూ నిల్చుంది. అతను చూడనట్టుగా అక్కణ్నుంచి వెళ్ళిపోయాడు.

 

    మధ్యాహ్నం ఒక క్లాసునుంచి మరో క్లాసుకి పోతూంటే స్నేహితురాళ్ళతో తారసపడ్డది. అణాకాసు తీసి నవ్వుతూ ఇంద అన్నట్లుగా చూపించింది. అతను సిగ్గుపడి నవ్వుకుని వెళ్ళిపోయాడు.

 

    ఆ రాత్రి అన్నం సహించకపోతే ఎందుకోననుకున్నాడు. మరునాడుకూడా అదే జరిగేసరికి, సందేహించాడు. మూడోరోజు దృవపర్చుకున్నాడు. ఆ సాయంత్రం రాజారావుతో కృష్ణానదివైపు షికారుపోతూ విషయమిదని వెళ్ళగ్రక్కాడు.

 

    "ఈ కాలం ప్రేమకు ఆకలి నశించకూడదే" అన్నాడు రాజారావు.

 

    చక్రపాణి కొంచెం చిన్నబుచ్చుకున్నాడు. అంతవరకూ అతను ప్రేమను అంగీకరించేవాడుకాదు. అదంతా ఒట్టి మిథ్య, కల్పన, ఆత్మవంచన అని వాదించేవాడు. కాని ఇదేమిటీ విపరీతం? తననెవరో ఎక్కడికో లాక్కుపోతున్నారు.

 

    "వద్దు వద్దు రాజారావ్, నన్ను పరిహసించవద్దు. నాకెందుకో ప్రపంచంమీద ఇచ్ఛ నశిస్తోంది. ఎక్కడికో దూరతీరాలకి పారిపోదామనిపిస్తోంది. ఆ అమ్మాయిని చూచినప్పటినుంచీ నాలో మనశ్శాంతి నశించింది. నువ్వు నా పరమమిత్రుడివి. ఆమెను నాకు సంపాదించిపెట్టు" అని వాపోయాడు.

 

    "నేనా! ఇదేమిటి?" అని రాజారావు తెల్లబోయాడు.

 

    "అదేమో నాకు తెలియదు. ఆమె నాకు కావాలి. కావాలి అంతే."

 

    వీళ్ళిద్దరి స్నేహంలో ఎక్కడా కృత్రిమత్వంగాని, అస్వాభివికతగాని లేదు. స్నేహితుడిగురించి రాజారావు బాధపడ్డాడు. రకరకాల ఉపాయాలు చెప్పాడు. అవి చక్రపాణి ఆచరణలో పెట్టగలడా? మనోధైర్యం లేనివాడు ప్రేమలో పడకూడదు. ప్రయత్నించసాగాడు.

 

    ఒకనాటి మధ్యాహ్నం అతను కాలేజీ దాపులోనే ఉన్న రాజారావు గదినుంచి కాలేజీకి వెడుతున్నాడు. చెట్ల నీడలోకి వచ్చేసరికి పరధ్యానం నుంచి కోలుకుని ఎదో తోచి తల ఎత్తి చూశాడు. మాలతి! బాణాలు!


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS