Previous Page Next Page 
గోరింటాకు పేజి 3


    ఒకరిమీద నుంచి ఒకరు కళ్ళు దించకుండా ఒకరికొకరు అభిముఖంగా నడుస్తున్నారు. ఆమె వాడిచూపుల్లో కొంటెతనం కాదుగాని, కవ్వించే ఏదో గుణం. ఇంక ప్రక్కలకు తప్పుకోవల్సిన సమయం వచ్చింది. ఆ శరపరంపరలకు తప్పుకోలేక క్రిందకు కళ్ళను వాల్చింది ముందు తనే.

 

    "అబ్బ! ఏమి సుందర తరళ నయనాలు!"అని ఆశ్చర్యపోయాడు చక్రపాణి.

 

    ఒకనాడు స్నేహితులిద్దరూ కలిసి పెద్ద ఉపాయం పన్నారు. దాని ప్రకారం చక్రపాణి బజార్లో ఒక సంపెంగ, ఒక గులాబీ కొని దారిలో కాశాడు. ఆమె వచ్చే సమయం అయేసరికి గుండె గబగబ కొట్టుకోవటం ప్రారంభించింది. భయంతో, లజ్జతో ముఖమంతా ఎర్రబడసాగింది. తను పలకరించాలా ఆమెను? అమ్మో, ఆమె రాకపోతే బాగుండుననుకున్నాడు.

 

    చివరికా దుర్ఘడియ దాపురించింది. ఆకుపచ్చ చీరె కట్టుకుని వయ్యారంగా, సుతారంగా, అద్భుతంగా హంసనడకతో రానేవచ్చింది మాలతి.

 

    "మాలతీ! ఇదిగో"

 

    "నీకు గులాబీ ఇష్టమా? సంపెంగ ఇష్టమా?"

 

    "............."

 

    "చెప్పవ్ గదూ, గులాబీయే కాబోలు."

 

    "నాకుమట్టుకు సంపెంగ ఇష్టం."

 

    అతని గొంతు బిగుసుకుపోతోంది. యావచ్ఛక్తి ఉపయోగించినా నోట్లోంచి మాట బయటకు రావడంలేదు. కాళ్ళు కదలడం లేదు భూమ్మీద నుంచి. అతని ప్రక్కనుంచీ అతని వదనమండలంలోకి చూసుకుంటూ, అందంగా నవ్వుతూ వెళ్ళిపోయింది.

 

    "మాలతీ...! మా ..." అతని ఊహలు బ్రద్దలయిపోయాయి. కన్నీరు ఇంకిపోయినాక మరో ... మరో ప్రయత్నం.   

 

    అప్పటికి పరీక్షలు సమీపించాయి. చదువుకు సున్నా చుడుతున్నాడు. మనిషి కొంచెం చిక్కి నల్లబడ్డాడు. కాలేజీ చివరిరోజులు. రోజూ ఏదో ఒక క్లాసువాళ్ళవి టీపార్టీలు, మీటింగులు జరుగుతున్నాయి. ఒక సాయంత్రం కాలేజీ సోషల్ గేదరింగ్ జరిగింది. ధైర్యం చేసి బస్సులో ఆమె వెంటపడ్డాడు. దిగంగానే తనూ దిగాడు. వెనువెంటనే అనుసరించి నడవసాగాడు. దూరంగా ఆమె ఇంటికి అడ్డదారి అది. రోడ్డుకు ఇరుప్రక్కలా పాకలు, సందడి చేస్తున్న మనుషులు. ఉండి ఉండి మెడత్రిప్పి వెనక్కి చూస్తూ వేగం తగ్గించి నడుస్తోంది మాలతి. అతనికి గర్వంగా ఉంది. తాను ఒక అందమైన పిల్లను వెంటాడుతున్నాడు. మధురానుభూతితో నేను పులకరించింది.

 

    కాని ఇది ఇలా ఎంతసేపు? మబ్బులైతే గాఢంగానే పట్టాయి. కాని వర్షం పడదేం?

 

    పైగా నిమిషాలు గడిచినకొద్దీ ఆమె ఇల్లు సమీపిస్తోంది. సహనం అంతరించి, ఉత్సాహం చచ్చిపోతోంది. అతని నాలుకకు పలుకు, గుండెకు దిటవు లేకుండా సర్వాంతర్యామి ఆజ్ఞాపించాడు.

 

    ఒకవేళ ఆ సమయంలో ఈ యువకుడు ఏదో చెప్పదల్చుకుని నా వెంటపడ్డాడు. చెప్పనియ్యి, త్వరగా తెమల్చడేం? అని మాలతి అనుకునివున్నా అందులో వింత ఏమీ లేదు. అనుకున్నదనే నా ఉద్దేశం.

 

    చివరకు ఆమె ఇల్లు ఉన్నసందు వచ్చింది. మలుపు తిరిగితే చేసిన ప్రయత్నమంతా వృధా. కాని సుకుమారుడైన ఈ కుర్రవాడు నోరు మెదపకుండా, చొరవ చేయకుండా వూరుకుంటాడేం?

 

    మాలతికి భయం వేసింది, బాధా కలిగింది. హఠాత్తుగా ఆమెకో విచిత్రమైన ఆలోచన, తెగింపు అలముకున్నాయి. చప్పున ఆగి, అతని ముఖంకేసి ప్రశ్నార్థకంగా చూస్తూ "ఏమిటో చెప్పండి బాబూ! చంపక" అంది.

 

    ఇలాంటి అదృష్టం ప్రపంచంలో ఏ యువకుడికి పడుతుంది గనుక? కాని అక్కడ వున్నది చక్రపాణి అనే ఒక అవకతవక కుర్రవాడు అయివుండె.

 

    "ఏం చెప్పను?" అన్నాడు.

 

    "చెప్పేందుకేమీ లేదా?"

 

    చక్రపాణి తల అడ్డంగా ఈపాడు.

 

    "మరి నన్ను ఎందుకింతదూరం వెంటాడారు?" అని ప్రశ్నించింది మాలతి.

 

    దానికి మాటల్లో రెండు నిముషాలపాటు చక్రపాణి వాగినదాని తాత్పర్యం చూసుకుంటే "అబ్బే! నిన్ను వెంటాడానా ఏమిటి? నా పనిమీద నేను వెడుతుంటేనూ?" అని వుంది.

 

    మాలతి గాయపడిన హృదయంతో "అయితే చెప్పేందుకేంలేదూ?" అంది తీక్షణంగా. అలా అని అక్కడ ఇహ ఒక్కక్షణంకూడా ఆగకుండా వెళ్ళిపోయింది.

 

    చక్రపాణి స్థబ్ధుడై నిలబడిపోయాడు. "కాదు మాలతీ! నీతో చెప్పాల్సింది ఎంతోవుంది, ఇంకో ఛాన్సు ఇవ్వవూ?" అని బలహీనంగా అనుకున్నాడు.

 

    మలినవదనంతో గదికి వచ్చిన చక్రపాణిని చూసి రాజారావు వులిక్కిపడ్డాడు. తరిచి తరిచి అడిగి సంగతి తెలుసుకున్నాడు. ముందు స్నేహితుణ్ణి తిట్టాడు. తరువాత తనని తిట్టుకున్నాడు. తల బాదుకున్నాడు."ఇహపో వాజమ్మా! జీవితమంతా చీకటి ఛాయలు పులుముకో" అంటూ అరిచాడు.

 

                                        * * *

 

    వేసవి ఎండల్లో చక్రపాణి కన్నీరు ఇంకిపోయాయి. కాని వాటి తాలూకు చారలుమాత్రం హృదయక్షేత్రం మీదనుంచి చెరిగిపోలేదు.

 

    మిత్రులిద్దరూ రోజూ కలుసుకునేవాళ్ళు. చక్రపాణి బలహీనుడు. అనేక పన్లు చేయాలని అతని మనసు ఉవ్విళ్ళూరుతూ ఉండేది. కాని ఎప్పుడూ అనుకోవటంతోనే సరిబుచ్చుతూ వుండేవాడు. రాజారావుకు జీవితాన్ని తొలుచుకుంటూ పోదామనీ, ఏదో తెలియనివి సాధిద్దామనీ ఎప్పుడూ లేదు.

 

    అసలు శెలవులకు విజయవాడలో వుండాల్సిన పని రాజారావుకు లేదు. ఊరు పాతికమైళ్ళదూరంలోనే  వుంది. ఇక్కడ వుంటే మిత్రులతో కాలక్షేపం బాగుంటుంది. పైగా ఇంటికిపోతే చికాకులు హెచ్చు. తల్లి నిస్సహాయురాలు. అన్నలిద్దరికీ పెళ్ళిళ్ళయినాయి. వాళ్ళ స్వభావాన్ని నిర్వచించేందుకు భాషతో సాముచేయాల్సి వుంటుంది. వాళ్ళు అవసరం వస్తే ఆపేక్ష పొర్లినట్లు మాట్లాడతారు లేకపోతే అతని ఉనికిని గురించి కూడా పట్టించుకోరు. ఈ ఊరిలో అతను ఎలా వుంటున్నదీ ఎప్పుడూ ప్రశ్నించరు. కాకపోగా ఆ పల్లెటూళ్ళో వుండి ఇప్పుడతను చేసే పనేంలేదు తోటలో కూర్చొని పుస్తకాలు చదవడం తప్ప, ఇంటికి వచ్చిన చుట్టాలతో అనుభవాల్లో పొర్లటం తప్ప.

 

    చుట్టాలు...! వీళ్ళ రాకపోకలకు అంతులేదు. కుటుంబవ్యాప్తి చాలా ఎక్కువదేమో. వరుస అయినవాళ్ళు చాలామంది అన్నలు వంటింట్లో చేరి వాళ్ళతో పరాచకాలాడుతూ వుండేవాళ్ళు. తనకూ పరాచకాలాడటం, కవ్విస్తూ మాట్లాడటం చేతకాకపోలేదు. కాని ఒకళ్ళంటే ఒకళ్ళకి అనుమానాలు, అసూయలు, నిందలు. ఈ వాతావరణం అతనికి అసహ్యం.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS