Previous Page Next Page 
హత్య పేజి 2


    "పాలెం అయినా పల్లె అయినా దోసకాయలవరకూ కరెక్టేకదా! నేను వెళ్ళేది దోసకాయల పాడు కాదు. కైలాస గణపతి మందస్మిత వదనార విందంతో మళ్ళీ వూరి చివర అక్షరాలు మార్చి పారేస్తూ చెప్పాడు.

 

    "చూడు సామీ?" అన్నాడు వెంకట సుబ్బయ్య.

 

    "ఏమిటి?"

 

    "మీరు వెళ్ళేది దోసకాయల పల్లెకాదు అవునా?"

 

    ఓరి పిచ్చివాడా! అన్నట్టు ఓ చూపుచూసి "దోసకాయ పప్పు దోసకాయ ముక్కల పచ్చడి. దోసకాయ కాలేసిన గుజ్జు పచ్చడి. దోసకాయ కూర. దోసకాయ నరుగు. దోసావకాయ. దోసకాయ పొడికూర. దోసకాయ పులుసు. దోస వడియాలు. దోసగింజల పొడి. దోసకూటు. దోసకాయ గుళ్ళు. వాము దోసకాయ. ఇలా దోసకాయతో అరవైరకాల పదార్థాలు చేయవచ్చు. దేనికదే మధురంగా తినవచ్చు. నీవేమో దోసకాయ బంకలాగా నన్ను పట్టుకుంటివి. దోసకాయలపాడు కాదుగానీ ఆ పేరు ఎత్తితే నాకు ఎలర్జీ వచ్చేలా ఆ పేరు పట్టుకున్నావు ఏమిటి?" గడగడ మాట్లాడాడు కైలాస గణపతి.

 

    "మీరు ఏ వూరు వెళ్ళాలి?"

 

    "మళ్ళీ మొదలు. దోసకాయలపాడు కాదని చెప్పా కదా!"

 

    "చెప్పారనుకోండి. కాని.....

 

    "ఏమిటి కానీ....

 

    "దోసకాయ - "

 

    "అదిగో మళ్ళీ!"

 

    "నన్ను సాంతం మాట్లాడనివ్వండి. మీరు దోసకాయల పల్లెవైపు వెళుతూ ఆ వూరు నేవెళ్ళటం లేదు అంటం లేదు.....

 

    "ఏమిటీ?" కైలాసగణపతి కనుగుడ్లు గిర్రునతిరిగాయి.

 

    "అవును సామీ! ఈ దోవన వెళితే అయిన పల్లె వస్తుంది. ఇదో ఈదోవన వెళితే దోసకాయలపల్లె వస్తుంది"

 

    "ఇటువెళితే అయిన పల్లె అటువెళితే దోసకాయల పల్లె మరి మూడో దారి వుండాలి కదా!"

 

    "దేనికి?"

 

    "ఉరుముకొండ వెళ్ళటానికి."

 

    "చంపావ్ పోస్వామీ! మీరు వెళ్ళాల్సింది ఉరుముకొండకా! మీరు బస్సుదిగి ఇటువచ్చారు అవునా!"

 

    "అవును"

 

    "రోడ్డుకి అటుపక్క దిగి వెళితే ఉరుముకొండ వస్తుంది" అంటూ వివరించాడు వెంకటసుబ్బయ్య.

 

    "బస్సులో అడిగితే పక్కదిగి వెళ్ళండి వస్తుంది అని చెప్పారు. ఇటు దిగాను బస్సు. ఇటేపడి వచ్చాను. అక్కడ జరిగిది పొరపాటు. బస్సు ఇటు దిగినా రోడ్డుకి అటుదిగి వెళ్ళాలేమో అన్న ఆలోచన రాకపోయే. సరే వస్తాను" వెనక్కి మరలుతూ చెప్పాడు కైలాసగణపతి.

 

    "మంచిది సామీ! జాగ్రత్తగా వెళ్లండి" అన్నాడు వెంకటసుబ్బయ్య.


    
      కైలాసగణపతి మళ్ళీ వెనక్కి పదినిమిషాలు చచ్చీచెడీ నడిచిరోడ్డు ఎక్కాడు. రోడ్డుమీద రెండు నిమిషాలు నుంచుని ఆ తర్వాత రోడ్డుకి అటువైపు దిగి నడవడం మొదలు పెట్టాడు.

 

    ఈ తఫా అటుగాకుండా ఇటు దిగి నడవడం మొదలు పెట్టాడు గాబట్టి గ్యారంటీగా ఆరునూరైనా నూరుఆరైనా పోనీ నూటఆరు అయినా సరే అది ఉరుముకొండ అయి తీరాలి.

 

    అనుకుంటూ కైలాసగణపతి ముందుకు సాగాడు.


                                         2

 

    అరగంట తర్వాత -

 

    దూరంగా లేస్తున్న పొగని చూసి అది ఉరుముకొండ వూరు అయివుంటుందని గ్రహించాడు కైలాసగణపతి.

 

    అమ్మయ్య ఊరు వచ్చింది అనుకునే వేళ మళ్ళీ రెండు దారులు వచ్చాయి. చాలా చక్కగా కాలిబాట దారికి అటొకటి ఇటొకటి జెర్రిపోతుల్లా దర్శనమిచ్చాయి.

 

    కైలాసగణపతి టకీమని ఆగిపోయాడు.


    
    "పల్లెటూరి వాళ్ళకి చదువు, సంధ్య వుండదు. దారులు వేరయినప్పుడు ఏ దారి ఎటు వెళుతుందో ఊరుపేరు రాసి ఓబోర్ట్ ఇక్కడ పాతేయాలని తెలియకపోతే ఎలా?"


    "వాళ్ళు ఎలా అఘోరిస్తే నాకెందుకుగానీ ఇప్పుడు ఎలా?"

 

    "అక్కడే నుంచుని దీర్ఘాలోచనలో పడ్డాడు కైలాస గణపతి."

 

    "ముక్కు సూటిగా పోదామంటే చెట్లు అడ్డంగా వున్నాయి. పైగా అవి తుమ్మచెట్లు. ముక్కు సూటిగా వెళితే ముక్కులో ముల్లు విరగటం ఖాయం కనుక....."

 

    నిప్పులేనిదే పొగరాదు అన్న సత్యం మరువరాదు. అలాగే పొగ అంటూ వస్తే అక్కడ ఊరుగానీ, వల్ల కాడుగానీ ఉన్న లెక్క. వల్లకాడు ఎప్పుడూ ఊరికి అనుకునే వుంటుంది. కనుక అది ఉరుముకొండ. ఏ యిల్లాలో వంట చేస్తుంటే దాని తాటాకు పొగ ఆకాశం అంచులదాకా ప్రయాణిస్తున్నది" అనుకుంటూ బయలుదేరటానికి సిద్ధం అయ్యాడు కైలాసగణపతి.

 

    సరిగ్గా అప్పుడే -

 

    కైలాసగణపతి టకీమని ఆగి పక్కకి చూశాడు. పదహారేళ్ళ కుర్రాడు ముక్కు నులుముకుంటూ ఆ దోవన వస్తూ కనపడ్డాడు. ఆయనకి చాలాపెద్ద అనుమానం వచ్చింది ఊరు ఇటు అయితే వాడు అటునుంచి ఎందుకు వస్తున్నట్లు ఎందుకయినా మంచిది వాడిని అడిగి ముందుకు సాగటం మంచిది అనుకున్నాడు.

 

    ఆ అబ్బాయి మరోసారి తుమ్మి ముక్కు నులుముకుంటూ సిగ్గుతో మెలికలు తిరుగుతూ అక్కడే ఆగిపోయాడు.

 

    "అబ్బాయ్! ఇటురా" కైలాస గణపతి పిలిచాడు.

 

    అబ్బాయి సిగ్గుపడుతూ వచ్చాడు.

 

    "అబ్బాయ్! నీ పేరేంటి?" కైలాస గణపతి ఆప్యాయంగా అడిగాడు.

 

    "అబ్బాయ్ అండీ!" వినయంగా చెప్పాడు అబ్బాయి.

 

    "నీపేరు ఏమిటి అని అడుగుతున్నాను."


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS