Previous Page Next Page 
హత్య పేజి 3


    "అబ్బాయ్,"

 

    "చూడబ్బాయ్! నాకు కోపంరాదు. ఓ వేళ వస్తే నేను మనిషినన్నమాట మర్చిపోతుంటాను. నీ వయసు, ముఖము చూస్తుంటే నీవు అబ్బాయివేనన్న...."

 

    ఆ.... అ.... అ.... ఆఛ్.....

 

    ఢాం అని తుమ్మాడు అబ్బాయి. వెంటనే మెలికలు తిరిగిపోతూ సిగ్గుపడ్డాడు.

 

    మాట్లాడుతున్న కైలాసగణపతి ఉలిక్కిపడి ఆగిపోయాడు. "ఈ కుర్రాడికి ఇదేం జబ్బు! తుమ్మిం తరువాత బోలెడు సిగ్గుపడతాడేమిట! మనిషి అన్న తర్వాత తుమ్ము, దగ్గు రాక ఎలా వుంటుంది. తుమ్మిం తరువాత సిగ్గుపడే జబ్బు ఈవూరివాళ్ళకి వుందా?

 

    ఊరు అనుకోంగానే ఉరుముకొండ గుర్తుకువచ్చింది. "చూడు అబ్బాయీ! నీపేరు నాకు తెలియకపోయినా ఫరవాలేదు....."

 

    "అదేమిటండీ! నా పేరుతో నన్ను పిలుస్తూ మళ్ళా ఫరవాలేదు గిరవాలేదు అంటున్నారు......!"

 

    "నేను నీపేరుతో పిలిచానా!"

 

    "అబ్బాయీ అని పిలవలా!"

 

    "ఓరినీ ఆసాధ్యంకూలా. నీవు అబ్బాయివి పేరు అబ్బాయి ఏంటి?"

 

    "అబ్బాయికి అబ్బాయి పేరు వుండకూడదని ఎక్కడైనా వుందాండీ?"

 

    "లేదనుకో, ఏ పేరూ లేనట్లు అబ్బాయి అన్న పేరు పెట్టుకోటం..... రేపు నీకు తొంభై ఏళ్ళు వచ్చినా అబ్బాయిగానే పిలువబడటం.....!"

 

    "అవుననుకోండి. మా అమ్మకి పదకొండుమంది వరసగా పుట్టి చచ్చిపోతే నాపేరు అబ్బాయి అని పెట్టుకున్నారండి. దాంతో నేను.... ఆ ఆ ఛ..... బతికానండి." అబ్బాయి తుమ్మి మరీ చెప్పాడు తన నామథేయం తాలూకా కథని.

 

    "అదన్నమాట విషయం."

 

    "అదేనండి."

 

    "ఇప్పుడు అర్థమైంది. నీవు ఇటు ఏవూరునుంచి వస్తున్నావు అబ్బాయీ!"

 

    "ఉరుము కొండనుంచి, మావూరు అదేనండి."

 

    "ఏమిటి మళ్ళీ చెప్పు!" కైలాసగణపతి కంగారుపడి అడిగాడు. మళ్ళీ చెప్పాడు అబ్బాయి.

 

    "మరి ఇటువెళితే ఏవూరు వస్తుంది?"

 

    "ఏవూరూ రాదండి."

 

    "ఏవూరురాకుండా ఎలా వుంటుంది?"

 

    "అటు వూరులేందే ఎలా వస్తుంది?" ఎదురుప్రశ్న వేశాడు అబ్బాయి.

 

    "మరి అటు పొగరావటం చూశాను!" అనుమానంగా అడిగాడు కైలాసగణపతి. ఆ అబ్బాయి పేరు, తుమ్ముల వ్యవహారం చూస్తుంటే అనుమానాస్పదంగానే వుంది మరి.

 

    "అటు తెల్లవారుజామున గడ్డివాములు తగలబడ్డాయి. దాని తాలూకా పొగ యింకా వస్తూనే వుంది."

 

    "అదన్నమాట విషయం. అయితే యిటు వెళతాను ఉరుముకొండ రావటం ఖాయమే కదా!"

 

    "వస్తుందండీ నేను అటేకదా వచ్చాను."

 

    "ఊరు రావాలంటే ఎంత దూరం నడవాలి!"

 

    "ఏమంత నడవక్కరలేదండి. కూసింద దూరం నడిస్తే చాలు. మరివస్తానండి!" అని కుర్రాడు ఇటు బైలుదేరాడు.

 

    ఈ అబ్బాయి నిజమే చెప్పాడా! పల్లెటూరివాళ్ళు ప్రతిచిన్న విషయానికి అబద్దం ఆడరుకాబట్టి నిజమే అనుకుందాం. ఓ వేళ వాడు చెప్పింది అబద్ధం అయితే కొంతకాలం తను ఉరుముకొండలోనే వుండదలిచాడు కాబట్టి ఈ అబ్బాయిని వెతికి పట్టుకుని తుమ్మే ముక్కుని కోసిపారేస్తాడు. వాడికదే శిక్ష. తనంత పెద్దవాడితో తనంతగొప్పవాడితో హాస్యాలా! ముక్కు లేకుండా తుమ్మితే "అఅ ఆ.....ఛ....." అన్నా తుమ్మురాదు. వెధవ ఇహపై కిసిక్ కిసిక్ అని తుమ్మాల్సిందే. ఇంతకీ వాడు తుమ్మి ఎందుకు సిగ్గుపడ్డట్లు! అదేదో వాడినే అడిగితే పోలా!

 

    కైలాసగణపతి ఆగి వెనుతిరిగి చూశాడు.

 

    దరిదాపుల్లో ఎక్కడా అబ్బాయి లేడు.

 

    "వీడెవడో కంత్రీగాడే. అలా అని ఉరుముకొండకి అటువెళ్ళనా ఇటు వెళ్ళనా!"

 

    కాసేపు ఆగి ఆలోచించాడు అబ్బాయి చెప్పినవేపే వెళ్ళి తాడోపేడో తేల్చుకుందామనుకున్నాడు.

 

    కైలాసగణపతి ఆ దారి వెంట చక చకా అడుగులు వేస్తూ బైలు దేరాడు.

 

    పల్లెటూరి వాళ్ళ భాషలో చెప్పాలంటే కూతవేటు దూరంలో వూరు కనిపించింది.

 

    కైలాసగణపతి ముఖం చింకి చాటంత అయింది.


    
                                          3

 

    "అమ్మా!"

 

    కైలాస గణపతి ఓ యింటిముందు ఆగి నెమ్మదిగా పిలిచాడు.

 

    తలుపులు వేసున్న యింట్లోంచి సమాధానం రాలేదు. ఏ శబ్దాలు లేవు లోపలినుంచి. మనుషుల అలికిడి అసలేలేదు.

 

    ఈతఫా కైలాసగణపతి కంఠస్వరం కాస్తపెంచి "అమ్మా!" అంటూ కాస్త గట్టిగానే పిలిచాడు.

 

    "చేయి ఖాళీలేదు బాబూ! పై వీధికెళ్ళిరా." లోపలి నుంచి మహాఇల్లాలు గట్టిగా చెప్పింది.

 

    కైలాసగణపతి గతుక్కుమన్నాడు.

 

    "నాతల్లే. అమ్మా అని పిలిచిన వాళ్ళల్లా అడుక్కుతినేవాళ్ళేనా?" ఈమాట అడుగుదామనుకుని అదో టైమ్ వేస్ట్ ఎందుకనుకుంటూ కాస్తముందుకు సాగి ఈతఫా తలుపుతీసివున్న యింటిముందు ఆగాడు కైలాసగణపతి.

 

    పదేళ్ళ కుర్రాడు వాకిలికడ్డంగా కూర్చుని బంగారు నాయనలా మరమరాల వుండని తింటున్నాడు. ఆకుర్రాడిని చూస్తూ "చూడు నాయనా!" అన్నాడు కైలాసగణపతి.

 

    చూశాడు అంతేకాదు. "మా నాయన లేడు ఫో" అన్నాడు.

 

    "మీ నాయన కాదు నాకు కావాల్సింది." కైలాసగణపతి అన్నాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS