Next Page 
డెత్ ఛాంబర్ పేజి 1


                             డెత్ ఛాంబర్
    

                                                        ---యర్రంశెట్టిశాయి

 

                          

   
    తను పన్నిన వ్యూహం చాలా పకడ్బందీగా ఉంది. ఏ స్టేజ్ లోనూ ఫెయిలవటానికి ఆస్కారంలేదు.
    ఎవరికీ తన మీద అనుమానంకలగటానికిక్కూడా ఛాన్స్ లేదు. ఎటొచ్చీ ఒకే ఒక్క అంశంలో మాత్రం ప్లాన్ వీక్ గా ఉంది.
    సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో డబ్బు ఎలా తీసుకుంటారో తెలీదు. అంత కాష్ తీసుకుపోవటం ప్రాబ్లెమ్ అవుతుందేమో!
    ఎవరికైనా అనుమానంరావచ్చు. అయినా తప్పదు-
    ఆ మాత్రం రిస్క్ తీసుకోవలసిందే.
    టైమ్ చూసుకున్నాడు.
    పదకొండవుతుంది.
    పదకొండూ ఏడు నిముషాలకల్లా మయూరి తననుకలుసుకోవాలి.
    పదకొండూ పది నిమిషాలకు ప్రహ్లాద్ తనను కల్సుకుంటాడు.
    వాళ్ళిద్దరినీ నిముషాల విషయంలో కూడా ఖచ్చితంగా ఉండటం కోసం అలాంటిటైమింగ్స్ ని ఫాలో అవటం ట్రైనింగ్ ఇచ్చాడు. లేకపోతే తనప్లాన్ పారదు.
    ప్రతి నిమిషం- ప్రతి సెకండ్ తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయటంలో చాలా ముఖ్యం.
    టాంక్ బండ్ మీద ట్రాఫిక్ ఎడతెరిపిలేకుండా వుంది. దానికి తోడు విగ్రహాలు చూడ్డానికొచ్చేజిల్లాల జనం, స్టూడెంట్స్, టూరిస్ట్ లు, ఫారినర్స్----
    ఓ అమ్మాయి తనవంకేచూస్తూ వస్తోందిదగ్గరకు.
    డ్రస్ కొంచెం చీప్ గా వుంది.
    ప్రక్కన నిలబడి తనవేపు చూసి నవ్వింది.
    "సుదర్శన్ ధియేటర్ కి వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలి?" అడిగింది.
    "నెంబర్ సిక్స్ అనుకుంటాను. ఐనా ఆ బస్టాప్ లిబర్టీ దగ్గర ఇక్కడ కాదు-"
    "వాళ్ళెవరో ఇక్కడ అన్నారు. పదకొండుంబావుకి సినిమా"
    "ఆటోలు కూడా దొరికేట్లులేవిక్కడ"
    తనకు అర్ధమయింది. మామూలుగా కస్టమర్స్ కోసం టాంక్ బండ్ మీద తిరిగే టైపు!
    "నేను టూరిస్ట్ ని కాదు! ఇక్కడివాడినే! టూరిస్ట్ లను చూసుకో"
    "నేనెలాంటి దాన్లా కనబడుతున్నాను?"
    "చాలా మంచి అమ్మాయిలా కనబడుతున్నావ్! వెళ్ళిపో" కొంచెం సీరియస్ గా చెప్పాడు. గొంతులో సడెన్ గా కనిపించిన తీవ్రత ఆమెకుజంకు కలగజేసింది. మరో మాట లేకుండా అక్కడ్నించి వెళ్ళిపోయింది. టైమ్ చూశాడు నూతన్. పదకొండుగంటల ఆరు నిమిషాలు!
    ఇంకొక్క నిమిషం వుందిమయూరి రావటానికి.
    అతని చూపు పాతికగజాల దూరంలో నడిచివస్తున్న మయూరి మీద పడింది. కూలింగ్ గ్లాసెస్ కొంచెం ఓల్డుఫాషన్ వే అయినా చాలా ఎట్రాక్టివ్ గా అమిరాయ్. మొదటి చూపులోనే నాకౌట్ చేసే గ్లామర్ ఆమెకు వుంది.
    "గుడ్ మాణింగ్" చిర్నవుతో విష్ చేసింది.
    "గుడ్! టైమ్ ఇలామెయింటెయిన్ చేయాలి"
    "థాంక్యూ"
    "నేనిచ్చిన ప్లాన్ మొత్తం బ్రెయిన్ కెక్కించుకున్నారా?"
    "సెంట్ పర్సెంట్!"
    అతను జేబులోంచి కొన్ని వందనోట్లుతీసి ఆమెకిచ్చాడు.
    "ప్లాన్ ప్రకారం మనిద్దరికీ ఫ్లయిట్ టికెట్స్ బుక్ చేసెయ్"
    "ఓ.కే."
    డబ్బు అందుకుని బాగ్ లో వేసుకుందామె.
    "రేపు సాయంత్రం ఎయిర్ పోర్ట్ దగ్గర కల్సుకుందాం!"
    "ఓ.కే."
    "మీ ఇంట్లో మీ వాళ్ళకు చెప్పేశావా- నాలుగురోజుల వరకూ ఇంటికిరానని?"
    "చెప్పాను"
    "కారణం ఏం చెప్పావ్?"
    "మా ఫ్రెండ్ మారేజ్ కి వెళ్తున్నానని చెప్పాను. అయినా నాగురించి మా ఇంట్లో ఎవరూ పట్టించుకోరు. మా డాడీ మందూభాయ్ దేశాయ్! మా మమ్మీ తన జాబ్ తోనే సతమతమౌతుంటుంది. మా సిస్టర్, బ్రదర్ ఎవరిలోకం వాళ్ళది! ఎవరి దారిన వాళ్ళు ఎగిరిపోవడానికి చూస్తున్నారు. మా సిస్టర్ బాగా డబ్బున్నవాళ్ళ బాస్ ని పెళ్ళిచేసుకోబోతోంది. అతనికి ఇదివరకే పెళ్ళయినారెండో భార్యగా ఉండటానికి ఇష్టపడింది. మా తమ్ముడు రక రకాల ఉద్యోగాలు చేస్తున్నాడు. ఎప్పటికయినా అమెరికా వెళ్ళాలని వాడి ప్లాన్. కనుక నేనూ ఎంత త్వరగా నా లైఫ్ సెటిల్ చేసుకుని మా అమ్మ మీద బరువుతగ్గించాలని మాఅమ్మ కోరిక! అందుకే మీరిచ్చిన ఈ ఆఫర్ కి వప్పుకున్నాను. మన ప్లాన్ సక్సెస్ అయితే నాకు పదిలక్షలు ఇస్తారు కదా! అది చాలు ఎలాంటి లోటు లేకుండా నా లైఫ్ గడపటానికి."
    "తప్పకుండా మనప్లాన్ సక్సెస్ అవుతుందన్న నమ్మకం నాకుంది. దాంతోపాటు మన ముగ్గిరి లైఫ్ కూడా సెటిలయిపోతుంది."
    "లెటజ్ హోప్ సో-"
    "ఓ.కే! రేపు సాయంత్రం ఎయిర్ పోర్ట్ దగ్గర నాలుగింటికి!"
    "ఎస్! ఫోరోక్లాక్"
    ఆమె వెళ్ళిపోయింది.
    సరిగ్గా అప్పుడే ఆటో దిగాడు ప్రహ్లాద్.
    ఎర్రగా, బలిష్టంగా ఆరడుగుల ఎత్తున భల్లూకంలా వున్నాడు. అతన్ని ఎవరూ తెలుగువాడనుకోరు! నార్త్ ఇండియన్ అనుకోవలసిందే!
    "మీటర్ మీద అయిదు రూపాయలు ఎక్ స్ట్రా" అన్నాడు ఆటోవాడు.
    "ఆటోనీ, నిన్నూ ఎత్తి హుసేన్ సాగర్ లో వేస్తాను" తీవ్రంగా అన్నాడు ప్రహ్లాద్.
    ఆటోవాడు ఇంకొక్కమాట కూడా మాట్లాడలేదు. శరవేగంతో అక్కడ్నించి వెళ్ళిపోయాడు.
    "గుడ్ మాణింగ్" అన్నాడు సీరియస్ గానే.
    "గుడ్ మాణింగ్, నేనిచ్చిన ప్రోగ్రామంతా బైహార్ట్ చేశావా?"
    "చేశాను"
    "నీ డ్యూటీ ఏమిటో ఒకసారి చెప్పు!"
    "రేపు ఉదయం పది గంటలకు హోమ్ సెక్రటరీ దగ్గర కెళతాను. నేను ఢిల్లీహోమ్ మినిస్టర్ ఆఫీస్ లో స్పెషల్ సెక్యూరిటీ కమీషనర్ నని చెపుతాను. ప్రధానమంత్రి స్పెషల్ మెసెంజర్ కృష్ణకాంత్ ఆంద్రప్రదేశ్ లోని అసమ్మతివాదులతో చర్చలు జరపడానికి రహస్యంగా వస్తున్నారనీ, కనుక ఈ విషయం ముఖ్యమంత్రికికూడా తెలియకుండా రహస్యంగా వుంచి, కృష్ణకాంత్ గారికి మఫ్టీలో సెక్యూరిటీ ఏర్పాటు చేయాలనీ, ఆయన హోటల్ ఎయిర్ కాజిల్ లో ఉంటారనీ చెప్తాను."
    "గుడ్" సంతృప్తిగా అన్నాడు నూతన్.
    "ఆ తరువాత వాళ్ళవెహికల్లో ఎయిర్ కాజిల్ హోటల్ కి చేరుకుంటాను. అక్కడ ఏర్పాట్లు చూసి ఎయిర్ పోర్ట్ కొచ్చి రిసీవ్ చేసుకుంటాను!"
    "ఫైన్! ఇదిగో- ఖర్చులకు ఈ అయిదువేలూ ఉంచుకో."
    అతను డబ్బుతీసుకుని జేబులో పెట్టుకున్నాడు.
    "ఓ.కే. ఎల్లుండి కలుసుకుందాం" అన్నాడు నూతన్
    అతను చేయి కలిపివెళ్ళిపోయాడు.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS