Next Page 
మిస్టర్ రాంగో పేజి 1

                                      మిస్టర్ రాంగో
           

                                                                      ---చందు హర్షవర్ధన్
   
   
    తమిళనాడు రాష్ట్రం.....
   
    మద్రాస్ మెట్రోపాలిటన్ సిటీ...
   
    మైలాపూర్ లోని ఒక స్లమ్ ఏరియా!
   
    రాత్రి పన్నెండు గంటలు....
   
    చంద్రుడు కృష్ణపక్షంలో ప్రవేశించాడు. నల్ల దుప్పటి కప్పుకుని ఉలుకుపలుకు లేకుండా ముసుగుదన్ని మూలనపడి వున్న క్షయరోగిలా చిక్కని చీకటి పరుచుకుని వున్నది.
   
    అప్పటివరకూ కాళ్ళు అరిగేలా తిరిగి తిరిగి అలసిపోయి మెయిన్ రోడ్డు మీదకు వచ్చాడతను.
   
    ఉన్నట్టుండి అతని పాదాలు వాటంతట అవే ఠక్కున ఆగిపోయాయి.
   
    క్షణంలో వెయ్యవ వంతు వేగంలో అతనిలో కదలిక వచ్చింది.
   
    ఉలికిపాటుతో కూడిన అదోరకమైన జెర్క్ అతన్ని నిలువెల్లా వణికించింది.
   
    ఎదురుగా దూరంగా ఒక జీపు వేగంతో దూసుకువస్తున్నది.
   
    ఆ జీపు టాప్ పైన వెలుగుతున్న రెడ్ బల్బ్ ను చూసీ చూడడంతోనే అది పోలీసు జీప్ అని అర్ధమైందతనికి.
   
    ఆ ఆలోచనకె అతనికి వణుకుతోపాటు ముచ్చెమటలు పోశాయి. భయంతో గొంతు తడారిపోయినట్టయింది.
   
    జీప్ వేగం పుంజుకున్న విషయం స్పష్టంగానే తెలుస్తున్నది. సంధించి వదిలిన బాణంలా పరుగు పెడుతున్నాడతను.
   
    ఒక మనిషి వేగం ఎంత హెచ్చుగా వున్నా కారుతో పోటీపడి గెలవడం అసాధ్యం...
   
    "ఈ రోజుతో పోలీసులకు చిక్కడం ఖాయం..." అనుకున్నాడతను. అయినా పరుగు ఆపలేదతను.
   
    క్షణాలు భారంగా గడిచిపోతున్నాయి.
   
    ఇక తను ఎంతో దూరం పరుగెత్తలేననే విషయం అతనికి అర్ధమవుతూనే వున్నది...ఇప్పుడో, ఇంకాస్సేపటికో మద్రాసు పోలీసులకు పట్టుబడక తప్పదను కుంటుండగానే జరిగిపోయిందొక సంఘటన!
   
    తనకు ఎదురుగా వస్తున్న మారుతీవాన్ ను చూసుకోకుండానే గుద్దేశాడు అతను.
   
    ఆ అదటుకు ఎగిరి అల్లంత దూరాన పడుతుండగానే ఆ వ్యాన్ తలుపులు తెరచుకున్నాయి.
   
    మారుతీ వ్యాన్ లో నుంచి దిగిన వ్యక్తిని గుర్తించగానే....తనకు ఆ గతి పట్టించిన మహానుభావుణ్ణి నానా తిట్లు తిట్టడానికి అతను తెరిచిన నోరు తెరిచినట్టే ఉండిపోయింది.
   
    వ్యాన్ లోంచి దిగిన పెద్ద మనిషి....పడిపోయిన వ్యక్తిని సమీపించి పైకి లేపాడు.
   
    "కమాన్...."
   
    అంతకు మించి అతను మరొక్క మాట కూడా మాట్లాడలేదు.
   
    అతను కూడా ఆ సమయంలో ఇంకేమీ ఆలోచించదలుచుకోలేదు.
   
    వ్యాన్ లోకి జంప్ చేసిన వెంటనే డోర్ మూసుకున్నది.
   
    రివాల్వర్ బుల్లెట్ లా దూసుకుపోయిన మారుతీవాన్ ను ఫాలో చేయడం పోలీసు జీపుకు సాధ్యం కాలేదు.
   
    బోనులో పడబోయిన ఎలుక చిక్కినట్టే చిక్కి పారిపోవడంతో పెట్రోలింగ్ డ్యూటీ నిర్వహిస్తున్న యాంటీ గూండా స్క్వాడ్ పోలీసు ఇన్స్ పెక్టర్ తమిళంలో తిట్టుకుంటూ అతన్ని వెంటాడే ప్రయత్నాన్ని విరమించుకుని వెళ్ళిపోయాడు.
   
    పోలీసుల దృష్టిలో నుంచి తప్పించుకున్న మారుతీవ్యాన్ మెయిన్ రోడ్డు చేరుకున్నది.
   
    "హమ్మయ్య...సమయానికివచ్చి రక్షించావు సులేమాన్ భాయ్....లేకపోతే కోడంబాకం పోలీసుల చేతికి చిక్కి వాళ్ళ చేతి దెబ్బలు ఎలా వుంటాయో రుచి చూస్తూ వుండేవాణ్ని...."
   
    ఎగిరెగిరి పడుతున్న గుండెను అదిమిపెట్టుకుంటూ కృతజ్ఞతగా అన్నాడతను.
   
    మారుతీ వ్యాన్ ను డ్రయివ్ చేస్తున్న నడివయసు వ్యక్తి తలపై ఉన్న మంకీక్యాప్ ను ఒక చేత్తో సరిచేసుకుంటూ....
   
    "నువ్వింకా ఈ వీధి దొంగతనాలు వదిలిపెట్టలేదా కిట్టూ?" ప్రశ్నించాడతను.
   
    "పొట్ట నింపుకోవడానికి నాకు చేతనయిన వృత్తిని చేయడంలో తప్పేం ఉంది?"
   
    "ఈ చిల్లర దొంగతనాలతో ఎన్నాళ్ళిలా బ్రతుకుతావు?"
   
    "సాగినంతకాలం...."
   
    "యూ ఆర్ ఎ ఫూల్...తెలివైన వాడెవ్వడూ ఎప్పుడూ ఒక లాగానే ఉండాలని కోరుకోడు. నీకు డబ్బు అవసరం చాలా ఉన్నట్టుంది. నాతోపాటు కొన్ని రోజులు పనిచేస్తావా? నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇస్తానులే..." అన్నాడు సులేమాన్.
   
    'వద్దూ' అనే ఓపికా, ఆలోచనా లేదతనికి.
   
    అందుకే...తలాడించాడు కిట్టూ.
   
    మారుతీ వ్యాన్ సవేరా ఇంటర్నేషనల్ మెయిన్ గేటు దగ్గర ఆగింది.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS