రామసేతుని నిర్మించిన వీరుడు – నీలుడు...!

 

రామాయణంలో రాముడు ప్రధాన పాత్రధారి కావచ్చు. మనుష్యరూపంలో సంచరించిన దేవుడే కావచ్చు. కానీ ఆ అవతారపురుషునికి కూడా వానరుల అవసరం పడింది. సీతమ్మవారి జాడని వెతికి పట్టుకోవడం దగ్గర నుంచి, రావణుని చెర నుంచి ఆమెని విడిపించడం వరకూ... అడుగడుగునా వానరసైన్యం రామునికి తోడ్పడింది. వారిలో సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు వంటి పాత్రలు మాత్రమే మనకు తెలుసు. కానీ మరో ముఖ్యమైన వానరుడు ‘నీలుడు’ గురించి చాలా తక్కువమంది విని ఉంటారు.

 

సీతమ్మ లంకలో ఉందని తెలియగానే, వానరసేనంతా దక్షిణదిక్కుగా కదిలింది. రాముని అదుపాజ్ఞలతో, సుగ్రీవుని అధికారంతో కదిలిన ఆ సేనకు నీలుడు అనే వానరుడు నాయకత్వం వహించాడు. నీలుడు అగ్నిదేవుని కుమారుడు, మహాబల సంపన్నుడు. అలాంటి నీలుని ఆధ్వర్యంలో వానరసేన సముద్రతీరానికి వచ్చి నిల్చొంది. అక్కడి నుంచి లంకకు చేరడం ఎలా అన్న మీమాంశ మొదలైంది. ఆంజనేయునితో సమానంగా నీలుడు కూడా ఆ సముద్రం మీదుగా లంక వరకూ లంఘించగలడు. కానీ మిగతా వానరుల పరిస్థితో! అందుకోసం సముద్రం మీద వారధి నిర్మించడం ఒకటే మార్గమని పెద్దలంతా నిశ్చయించారు.

 

వారధి నిర్మించాలన్న ఆలోచన బాగానే ఉంది. కానీ ఆ పనికి సారధ్యం వహించేదెవరు? దానిని సాధించేది ఎలా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. అందుకు నలుడు అనే వానరునితో కలిసి నీలుడు ముందుకు వచ్చాడు. కొన్ని రామాయణ గాథలు నల, నీలుల చిన్నతనానికి సంబంధించి ఒక కథను పేర్కొంటాయి. ఈ నల,నీలులు ఇద్దరూ చిన్నప్పుడు మహా అల్లరి చేసేవారట.

 

రుషులు తపస్సు చేసుకుంటూ ఉంటే వారి వస్తువులన్నింటినీ ఎత్తుకువెళ్లి నీటిలో పడవేసేవారట. అందుకని నల,నీలులు నీటిలో ఏం వేసినా కూడా అవి మునిగిపోవంటూ రుషులు శపించారు. ఇప్పుడు ఆ శాపాన్నే వరంగా మార్చుకుని సముద్రం మీద వారధిని నిర్మించేందుకు నల,నీలులు సిద్ధమయ్యారన్నమాట! అలా వారి ఆధ్వర్యంలో రామసేతు నిర్మాణం జరిగింది. నలుడు, నీలుడు సముద్రంలోకి విడిచిన రాళ్ల మీద రామనామం ఉండటంతో... అవన్నీ ఒక్క దరికి చేరి వారధి నిర్మితమయ్యింది.

 

వారధిని దాటి లంకలోని అడుగుపెట్టిన తరువాతైతే నీలుని పరాక్రమం వర్ణింపశక్యం కాదు. తూర్పువైపు సేనలకు నాయకత్వం వహిస్తూ లంకలో ప్రళయమే సృష్టించాడు. కుంభకర్ణుని కుమారుడైన నికుంభుని నిలువరించాడు. రావణాసురుని సేనానాయకుడైన ప్రహస్తునితో తలపడ్డాడు. శరీరమంతా రక్తం ఏరులై పారుతున్నా కూడా వెనక్కి తగ్గకుండా ప్రహస్తునితో కలియపడ్డాడు. చివరికి పెద్దబండరాతిలో ప్రహస్తుని మోదడంతో, గెలుపు నీలుని పరమైంది. ప్రహస్తుని మరణంతో రాక్షసమూకంతా చెల్లాచెదురైపోయింది. ఇక రావణాసురుడు రంగంలోకి దిగక తప్పలేదు.

 

యుద్ధంలోకి అడుగుపెట్టిన రావణాసురుని నీలుడు తెగ చిరాకుపరిచాడు. నీలుని సంహరించేందుకు రావణాసురుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించినా ఉపయోగం లేకపోయింది. నీలుడు అగ్నిదేవుని కుమారుడు కావడంతో అతని మీద ఆ అస్త్రం పనిచేయనేలేదు. ఆ తరువాత కూడా నీలుడు మహుదరుడు వంటి రాక్షస ప్రముఖులనెందరినో సంహరించాడు. మరోవైపు రాముని చేతిలో రావణాసురునికి చావు మూడటంతో యుద్ధం పరిపూర్ణమైంది. రామకథలో నీలుని పాత్ర చిరస్థాయిగా మిగిలిపోయింది.


- నిర్జర.

 


More Purana Patralu - Mythological Stories