దసరాలో మహిషాసురమర్దినిని ఎలా పూజించాలి?

 

నవరాత్రులలో మహిషాసురమర్దిని అవతారానికి ఓ ప్రత్యేకత ఉంది. మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించింది కాబట్టే అమ్మవారికి ఆ పేరు వచ్చింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు దున్నపోతు ఆకారంలోకి మారగలిగేవాడే ఈ మహిషాసురుడు. ఒక రకంగా అతను మనలో ఉండే అజ్ఞానానికీ, మూర్ఖత్వానికీ చిహ్నం అన్నమాట. మహిషాసురమర్దిని అమ్మవారిని కనుక పూజిస్తే, మనలో ఉండే బలహీనమైన లక్షణాలన్నింటినీ ఆ తల్లి అణచివేస్తుంది. మరి నవరాత్రుల సందర్భంగా ఆ రూపాన్ని ఎలా పూజించాలో తెలుసుకుందామా...


దసరాల్లో నవమి రోజున మహిషాసురమర్దినిని పూజిస్తారు. ఈ రోజు అమ్మవారిని ముదురు ఎరుపు రంగు చీరతో అలంకరించాలి. నల్లకలువలతో ఆ తల్లిని పూజించాలి. నల్ల కలువలు దొరకని పక్షంలో ఏ రంగు పూలనైనా ఉపయోగించవచ్చు.


ఈ రోజు అమ్మవారిని ‘మహిషాసుర మర్దిని స్తోత్రం’తో పూజిస్తే ఆమె అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఆదిశంకరాచార్యల వారు రచించిన ఈ స్త్రోత్రం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అని చెబుతారు. ఒకవేళ ఈ స్తోత్రాన్ని చదవడం కుదరని పక్షంలో ‘ఓం హ్రీం శ్రీం క్లీం మహిషాసుర మర్దిన్నై నమః’ అనే మూల మంత్రాన్ని చదువుకోవాలి. ఈ రోజు అమ్మవారికి పులిహోర, గారెలు, దద్ద్యోదనం వంటి ప్రసాదాలు నివేదించాలి. ఇవేవీ కుదరని పక్షంలో పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టినా అమ్మవారు సంతోషిస్తారు. దున్నపోతు అంటే బద్ధకానికీ, జడత్వానికీ ప్రతీక. కడుపు నిండా భోజనం చేస్తే సహజంగానే ఒళ్లు బద్ధకంతో మత్తెక్కిపోతుంది. అందుకని ఈ రోజు రాత్రిపూట భోజనం చేయడాన్ని నిషేదించారు పెద్దలు.


నవరాత్రులలో తొమ్మిదవ రోజు ఇలా మహిషాసురమర్దిని పూజించి... ఎవరన్నా బ్రాహ్మణులకి- బియ్యం, కూరగాయలతో కూడిన స్వయంపాకాన్ని దానం చేస్తే ఫలితం దక్కుతుందట. ఈ రకంగా అమ్మవారిని పూజిస్తే, అమె మన వెన్నంటే ఉండి ఏ సమస్యనైనా ఎదుర్కొనే ధైర్యమూ, ఏ పనిలో అయినా విజయమూ లభించి తీరతాయని భక్తుల నమ్మకం. 


More Dasara - Navaratrulu