కార్తీక మాసం సందర్భంగా సోమనాథ్ గురించిన విశేషాలు

 

 

శివుడు లింగ రూపధారి. జ్యోతిస్వరూపుడు.

సౌరాష్ట్రే సోమనాథం చ, శ్రీశైలే మల్లికార్జునమ్

ఉజ్జయిన్యాం మహాకాళమ్, ఓంకారమమరేశ్వరమ్.....

 

భక్తులు ఆరాధించే (12) ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొట్టమొదటగా చెప్పేది సౌరాష్ట్రే సోమనాథం అని.   ఈ ఆలయం అరేబియన్ సముద్ర తీరాన వేరావాల్ తీరాన, ప్రభాస్ తీర్ధం లో వుంది.   సోమనాధుని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు..     అందునా ఈ కార్తిక మాసంలో ఇక్కడికి భక్తులు అధికంగా వస్తుంటారు.  ఎంతో విశేషమైన ఈ సోమనాధుని ఆలయం పురాణ కథనాల ప్రకారం చంద్రుడు కట్టించాడు అని అంటారు. చంద్రుడు అంటే సోముడు. సోముడు కట్టించాడు కనుక సోమనాధీశ్వరుడుగా కొలుస్తారు. మహా పుణ్య క్షేత్రం ఇది.

 

దక్షుడి కుమార్తెలు 27 మందిని వివాహం చేసుకున్న చంద్రుడు ఎక్కువగా రోహిణి మీదే అభిమానం చూపుతుండటం తో మిగిలిన వారు దక్షునితో విన్నవించుకోగా దానికి దక్షుడు ఆగ్రహించి చంద్రుని శపించాడుట. తనకు ప్రాప్తించిన వ్యాధి నివారణకై చంద్రుడు ఇక్కడ శివలింగాన్ని స్తాపించి శివుని పూజించి శాప విమోచనం పొందిన ప్రదేశమే ఈ ప్రభాసతీర్దం. శివుని ఆజ్ఞ మేరకు చంద్రుడు అందరినీ సమానంగా చూసుకునే వాడని చరిత్ర కథనం.   శివుడు  చంద్రుడు స్తాపించిన లింగంలో తానూ కొలువై వుంటానని మాట ఇచ్చాడుట.  అందుకే ఇక్కడి శివుడిని సోమనాధుడు అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతో నిర్మించాడని, తరువాత రావణుడు వెండితో కట్టించాడుట. అనంతరం ఈ ఆలయాన్ని శ్రీకృష్ణుడు కొయ్యతొను, భీముడు రాతితోను తిరిగి నిర్మించారని చరిత్ర కధనాలు చెబుతున్నాయి. సోమనాథ్ ఆలయం అనేక సార్లు ధ్వంసం చేయబడి పునర్నిర్మిం చబడింది.

 

 

అపారమైన సంపద ఉన్న ఈ ఆలయాన్ని 1024లో ఘజని మహమ్మద్ ధార్ ఎడారి ప్రాంతం గుండా ఇక్కడికి  చేరుకొని దండయాత్ర చేసి సంపదని కొల్లకొట్టి,  ఆలయాన్ని ధ్వంసం చేశాడు. ఈ ఆలయం తిరిగి నిర్మించారు. అయితే 1308లో అల్లాయుద్దీన్ ఖిల్జీ సైన్యంచే నాశనమయింది. ఔరంగజేబుతో సహా ముస్లిం రాజులచే ఈ ఆలయం అనేక మార్లు ధ్వంసం అయింది. ఈ ఆలయం నిర్మింప బడుతూ,  దండయాత్రలకి గురవుతూ  వుంది. మసీదును నిర్మించారు.  ప్రస్తుతమున్న ఈ ఆలయం భారత స్వాత్రంత్ర్యానంతరం  1950 తరువాత సర్దార్ వల్లభాయ్  పటేల్ చే నిర్మితమైంది.

 

సౌరాష్ట్రాలో అరేబియన్ సముద్ర తీరాన వెలసిన ఈ ఆలయం ఎంతో సుందరమైనది.

ఆలయం లోపల అంతా సువర్ణమయమై, అందమైన శిల్ప కుడ్యాలతో అలరారుతూ వుంది.

 

ఆలయం లోపల విశాలమైన మంటపం, ఎత్తైన, అందమైన గుండ్రటి గోపురం ఆలయ లోపలి నుంచి అందంగా కనిపిస్తుంది. గర్భగుడిలో శివలింగం చాలా పెద్దది.  శివలింగం వెనుక పార్వతి దేవి విగ్రహం కనిపిస్తుంది.  ద్వారానికి కుడిపక్క వినాయకుడి విగ్రహం, ఎడమ పక్క ఆంజనేయ విగ్రహం వున్నాయి.  ఆలయం లో విశాలమైన గర్భగుడి,   బంగారు గోడలు, తలుపులు, వివిధ రకాలుగా అందమైన అలంకరణలో శివుడు, సుగంధ పరిమళాల మధ్య  ధూప దీప కాంతులతో  హారతుల మధ్య, శివనామ స్మరణం తో మారుమ్రోగే ఆలయ ప్రాంగణం,  ఆలయాని తాకే సాగర కెరటాలు, ఆ వాతావరణమే ఎంతో అద్భుతం. చూడవలసిన ప్రదేశం ఈ ఆలయం.  అహ్మదాబాదు నుంచి 410  కి.మీ. దూరంలో  వుంది.

 

 

జీవితంలో ఒక్కసారైనా జ్యోతిర్లింగాలను దర్శించాలనుకునే వారికి తప్పనిసరిగా ఈ ఆలయం చూడాల్సిందే!

ఈ ఆలయం లో శివుని హారతి విశేషం. సాధారణంగా భక్తులు ఈ హారతిని చూడాలని కోరుకుంటారు. ఆ సమయం లో జన రద్దీ కూడా ఎక్కువే! సోమనాథ్ ఆలయానికి సమీపంలో పురాతనము, అసలైన  జ్యోతిర్లింగం వున్నది అని చెప్పబడుతున్న ఇంకో సోమేశ్వరుడున్న ఆలయం వుంది.  ఈ ఆలయమ  20 మెట్లు దిగి వెళ్ళాలి.  ఇక్కడి శివుడికి పాలతో అభిషేకం భక్తులే చేసుకోవచ్చు. మారేడు దళాలతోను మనచే చేయిస్తారు అక్కడి పూజారులు. ఈ ఆలయం లో చిన్న చిన్న ఆలయాలు వున్నాయి.  ఇది కుడా ప్రతి ఒక్కరు దర్శించుకునే ఆలయం. గర్భ గుడి చిన్నది కావటంతో ఎక్కువ మంది పూజ చేయటానికి వీలు కాదు.

 

 

సోమనాథ్ వున్న ఊరుని ప్రభాస తీర్థం అంటారు.  ఇక్కడ శ్రీ కృష్ణుడు నిర్యాణం చెందిన వూరు.  ఇక్కడి సముద్రం లో కపిల, హిరణ్య, సరస్వతి నదులు కలుస్తున్నాయి.  ఇక్కడి సంగమం లో స్నానం చేస్తే పుణ్య గతులు లభిస్తాయని భక్తుల విశ్వాసం. సోమనాధుని ఆలయానికి సమీపం లోనే లక్ష్మి నారాయణ ఆలయం వుంది. ఇక్కడ కూడా వసతి సత్రం వుంది.  

 
సోమనాధునికి ఇచ్చే హారతిని లైవ్ గా కుడా చూడచ్చు. ఈ లింక్ ఇదిగో

 

 

 

 

.....Mani Kopalle


More Punya Kshetralu